Monday, January 15, 2024

451. మనో శతకం - 3

 

మనో శతకం - 3




దైవంబు  నెరిగినా   సత్యంబు  నెరుగున్.
సజ్జనుండెన్నడు    నిష్కల్మషంబున
ఖ్యాతి  నొసంగక   పురుషార్ధుడై 
నడుగులు  వేయు   స్వర్గ మార్గంబున.
మాయా లోలుడు   ఇంద్రియ  బానిసై
వికారంబులే   స్వర్గంబని   తలచెన్.
సుందరగుణేశ్వరా!     సంపన్నేశ్వరా!     |7|



భావం 
దైవాన్ని   తెలుసుకున్న వాడు,   సత్యాన్ని తెలుసుకుంటాడు .  ఇతరుల కు మంచి చేయువాడు , ఏ విధమైన కల్మషం లేకుండా,    కీర్తి ఆశించకుండా సేవ చేయుచు ,   అదే స్వర్గానికి దారి అనుకుంటూ నడుస్తాడు …. 
మాయకు వశమైన వాడు  కర్మేంద్రియాలకు  బానిస గా మారి ,  శారీరక వికారాలు  స్వర్గమని   తలుస్తూ ఉంటాడు.    సుందరమైన  గుణములు  కలిగిన ఈశ్వరా!    సంపన్నుడైన  ఈశ్వరా!


🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️



కలుపు   దీయువాడెన్నడు    కబోది  కాడు
కండ్లు లేకున్నా   కడకు   పండ్లు  పండించున్.
నేల  విస్తారంబు    గాదు   సారంబెరిగినోడు
కబోదైతే    నేమి?    కాపైతే  నేమి?
సుందరగుణేశ్వరా!    సంపన్నేశ్వరా!      |8|


భావం

పంటలో కలుపు  మొక్కలు  తీయువాడు  ఎన్నడూ చూపు లేని  వాడు కాడు.   ఒకవేళ కళ్లు లేకపోయినా చివరికి  ఫలాలు  పండిస్తాడు.   నేల ఎంత ఎక్కువ ఉన్నది   అనే దాని కంటే    ఆ నేలలో  ఎంత సారం ఉన్నదో   తెలుసుకున్న వాడు,  గుడ్డివాడు అయితే ఏంటి?    పండించే    రైతు అయితే  ఏంటి?

అదే విధంగా…

సమాజం లో చెడును  రూపుమాపేవాడు  ఎన్నడూ ముందు  చూపు లేని  వాడు కాడు.   ఎవరూ తోడు లేకున్నా  చివరికి  మంచిని   నెలకొల్పుతాడు.  సమాజం ఎంత పెద్దది  అన్నది  ముఖ్యం కాదు. సమాజం నాడి  పట్టినోడు  ముందు చూపు   లేనోడైతే ఏంటి?  నాయకుడైతే   ఏంటి?   సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా!  సంపన్నుడైన ఈశ్వరా!


🔱 🔱 🔱 🔱 🔱 🔱



బుణపాశంబు  నొసంగక   వేషధారి  వేదికెక్కున్.
పోషణకై   క్షణమొక   వర్ణంబుతో    పాత్రనెక్కినా 
రక్తి గమనించు   దార్శనికుండు    బేరీజు తో
ఫలితంబిచ్చు   కర్మమే  సుఖదుఃఖఃబుల  ఆరా.
సుందరగుణేశ్వరా!   సంపన్నేశ్వరా!       |9|

భావం

బుణానుబంధం  అనేది  బిగిసిన తాడు  అని తెలియక    జీవితం అనే  నాటక  వేదిక పైకి   మనిషి పాత్ర తో వస్తాడు.   జీవితం గడపడం కోసం  ప్రతి క్షణం  రక రకాల  ఆలోచన లనే   రంగులు మారుస్తూ వేషధారణ తో   పాత్రలు  వేస్తుంటాడు.
….
మనిషి పాత్ర  యెక్క  రక్తిని   గమనించు వాడు  దర్శకుడైన శివుడు.   ఆయన ప్రతి క్షణం లెక్కలు వేస్తూ,  ఇచ్చే కర్మల ఫలితాలు   సుఖ దుఃఖాలు గా  మనిషి కి   వలయం  అవుతాయి.   సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా!    సంపన్నుడైన ఈశ్వరా!


యడ్ల శ్రీనివాసరావు 16 Jan 2024 9:00 am .


No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...