Monday, September 8, 2025

687. అలంకరణలు - ఆకర్షణలు

 

  అలంకరణలు - ఆకర్షణలు 


• మనిషి కి ఆకర్షణ అలంకారమా ?

  ఇదేం ప్రశ్న వింతగా , అసలు ఆకర్షణ లేకపోతే మనిషి ఎలా జీవించ గలడు ?  ఈ సృష్టి ఎలా నడుస్తుంది ?

  అవును కదా . . . భూమి ఒక అయస్కాంతం . గురుత్వాకర్షణ శక్తి వలనే స్థిరంగా ఒక కక్ష్యలో తన చుట్టూ తాను తిరుగుతూ చంద్రుడు చుట్టూ తిరుగుతూ ఉంది అనేది మనకు తెలిసిన విషయం .   

భూమి పై ఉన్న మనిషి కూడా  విశ్వంలోని  ఆకర్షణ  శక్తి  ప్రభావం వలన  జీవం కొనసాగిస్తూ ఉన్నాడు . అంటే విశ్వ  ఆకర్షణ ,  ప్రతి భౌతికత లో (mass) , సహజసిద్ధంగా  ఏర్పడి  జీవనానికి మనుగడకు  ఆధారభూతం (depend) అయి ఉంది   అనేది స్పష్టం.


  మనిషి భౌతిక జీవి (Mass Body) కాబట్టి, విశ్వ శక్తి సిద్ధాంతం ప్రకారం మనిషి కూడా సహజ సిద్ధంగా ఆకర్షణను కలిగి ఉంటాడు . మనిషి తన శక్తి తో ఆకర్షణ ను క్రియేట్ చేయగలడు , ఎమర్జ్ చేయగలడు అనగా  ఇతరులను ఆకర్షించుకునేలా చేయగలడు. అదే విధంగా ఇతరుల పట్ల ఆకర్షితం ఇవ్వగలడు .


• మనిషి యొక్క  ఆకర్షణ అనేది రెండు రకాలు. ఒకటి  సహజసిద్ధం  , రెండవది కృత్రిమం .

  మనిషి తన శరీరాన్ని వస్త్రాలు , ఆభరణాలు, సౌందర్య సాధనాలు , సుగంధ ద్రవ్యాలు వంటివాటితో అనేక విధాలుగా కృత్రిమంగా అలంకరిస్తాడు . ఈ బాహ్య అలంకరణ తో చుట్టూ ఒక ఆకర్షణ వలయం తయారవుతుంది . ఈ ఆకర్షణ కి చేరువై చుట్టూ చేరేవారు కొందరు ఉంటారు. ఇదే తన సౌందర్యం గా భావిస్తాడు అమాయకపు మనిషి.

  ఇక్కడ ఒక ఆకర్షణ ను క్రియేట్ చేయడం, దానికి ఇతరులను ఆకర్షింప బడేలా చేయడం రెండూ కూడా మనిషి యొక్క స్వభావం సంస్కారం మీద ఆధారపడి అనేక రకాలుగా ఉంటాయి .


• శరీర అలంకరణ కోసం చేసే ప్రతి చర్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం సందర్భానుసారంగా ముందు గా నే మనిషి స్పృహ లో తప్పని సరిగా మననం (plan of action) జరుగుతూ ఉంటుంది. ఇది చాలా సూక్ష్మం గా , స్పష్టంగా ఉండి అంతరంగం లో ఉంటుంది .

 ఈ శరీర అలంకరణ తో కూడిన ఆకర్షణ స్వభావం , మనిషి కి సామాజిక కార్యక్రమాల లోను, శుభ కార్యాల లోను , మరియు గ్రూపు సాంగత్యాలలో అనగా  బాహ్య  ప్రపంచంలో  ఉండేటప్పుడు అధికం గా ప్రత్యేకం గా ఉంటుంది.

 ఒంటరిగా , ఏకాంతం గా ఉన్నప్పుడు ఈ శరీర అలంకరణ , ఆకర్షణ పై ఆసక్తి  అనేది సహజం గానే  ఉండదు . ఎందుకంటే చుట్టూ గమనించే వారు ఎవరూ ఉండరు కాబట్టి.


• మరికొందరు తమ మాటలు , హావభావాల తో ఆకర్షించే శక్తి కలిగి ఉంటారు . ఆ మాటలకు , ఉచ్చారణకు ,  పలుకులకు ఇతరులు దాసోహం అయి  ఆకర్షించబడతారు .

ఈ ఆకర్షణ అనేది సహజ సిద్ధమైన స్వభావం అనగా జన్మతః  ఉన్న  సంస్కారం అయినంత వరకు కర్మలు  సహజంగా  సజావుగా సాగుతాయి. 

 అలా కాకుండా కృత్రిమంగా ఉద్దేశ్యపూర్వకంగా , పదిమంది లో గుర్తింపు కోసం, ప్రయత్న పూర్వకంగా, ఉద్దేశ్యం తో చేసిన నాడు ఆది లో బాగానే ఉంటుంది,  కానీ కాలం గడిచే కొద్దీ అదే శాపం గా మారుతుంది .  ఎందుకంటే కృత్రిమ మైన  ఆకర్షణ ఎండకు ఎండి, వానకు తడిసి వెలవెల పోతుంది . అదే విధంగా ఉద్దేశ్యపూర్వకంగా చేసే అలంకరణ ఆకర్షణ కేవలం కొద్ది సమయం, కాలం మాత్రమే మనిషి వద్ద నిలబడతాయి. ఇవి ఏ రోజు అయితే తొలగి పోతాయో, అసలు స్వరూపం బయటకు కనిపించడం తో , ఆకర్షించబడి చుట్టూ చేరిన వారే దూరంగా వెళ్లి పోతారు . 


• మనిషి ప్రకృతి జీవి. ప్రకృతి వలే సహజత్వం తో , ఏ మెరుగులు మెరుపులు అలంకరణలు లేకుండా ఉండగలడో అప్పుడు ఉండే సహజసిద్ధమైన ఆకర్షణ శాశ్వతం. ఇందులో భాషా ఉచ్చారణ, మాట తీరు , నడవడిక , వేషధారణ  చాలా ముఖ్యం .

• పాశ్చాత్య సంస్కృతి ప్రభావం తో , అవసరం లేకపోయినా మాతృభాష ను మార్చి వంకర గా  మాట్లాడే తీరు , వంకరగా రాగాలు పలికే తీరు , ఎద్దు లా పెరిగినా ముద్దు గా మాటలు రానట్లు  మాటను పలికే తీరు శరీరం లోని పైత్యానికి, అనారోగ్యానికి సంకేతం గా భావించాలి. వస్త్రధారణ వేషాలు  ఇలా ఇతరులను  ఆకర్షించడం కోసం చేసే చర్యలు వికృతమై  , ఏదొక రోజు వికటించి తమపై తమకే అసహ్యం విరక్తి కలుగుతుంది అనేది వాస్తవం . ఎందుకంటే ఇది వికృత చేష్ట కాబట్టి . . . మనిషి కి జన్మతః  కలిగి ఉన్న  స్వాభావిక త యే సహజ అలంకరణ, ఆకర్షణ.


• ఓ మనిషి  . ‌. . నీ  బుద్ధి లో ఉండే గుణాలను సహజత్వం తో , సరళత తో , సత్ప్రవర్తనతో ఉంచుకోగలిగిన నాడు నువ్వు విశ్వం చేత ఆకర్షించబడి , విశ్వం ద్వారా లభించే ప్రకాశం, చైతన్యం నీ ముఖం లో, మాటలో, నడవడిక లో ప్రస్పుటంగా గా కనిపిస్తాయి . ఇదే నీకు శాశ్వతమైన అలంకారం తో కూడిన ఆకర్షణ . అప్పుడు నువ్వు దేనికి ,  దేనిని ఆకర్షించే ప్రయత్నం చేయవలసిన అవసరం ఉండదు. అన్నింటిచే  నువ్వే ఒక పరిమళమైన పూవు వలే ఆకర్షించ బడుతూ ఉంటావు .


• మనిషి కి శరీర శుభ్రం, శుభ్రత ఉండాలి.‌ ఇది ఆరోగ్యం కోసం అవసరం . శుభ్రత కి అతీతమైనది అలంకారం, ఆకర్షణ . వీటికి అత్యంత ప్రాధాన్యత సంతరించడం అనేది ఒక మాయావి లక్షణం. మనుషులు చాలా మంది దేహ సౌందర్యమే , తమ ఆత్మ సౌందర్యం గా భావిస్తూ ఉంటారు. ఇది ఒక అమాయకత్వం . వయసు మీరుతున్నా కృత్రిమ అలంకారాల తో ఆకర్షితమవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు . కానీ విశ్వం తో అనుసంధానం అయి విశ్వ సౌందర్యాన్ని  తమ కు  ఆపాదన చేసుకోలేరు .


• రమణ మహర్షి, యోగి వేమన, ముమ్మిడివరం బాలయోగి , ప్రజాపిత బ్రహ్మ బాబా (దాదా లేఖరాజ్) , పరమ హంస యోగానంద, మదర్ థెరిస్సా ఇటువంటి వారు ఇంకా ఎందరో ఎందరో ఉన్నారు . 

మరి వీరిలో ఉన్నది దేహ సౌందర్య  అలంకారం తో కూడిన ఆకర్షణా ?  లేక  ఆత్మ సౌందర్యం తో నిండిన అలంకార ఆకర్షణా ?  . . . దేనిని చూసి వీరి పట్ల సర్వ మానవాళి ఆకర్షితులయ్యారు ? వీరి శరీరాలు నేడు లేకపోయినా సరే, ఇంకా వీరు నేటి మానవాళిని ఎందుకని ఆకర్షిస్తూ ఉన్నారు ? ఎందుకు అంటే వీరు ఈ సృష్టి , విశ్వ శక్తి లో ఉన్న సౌందర్యాన్ని తమ సౌందర్యం గా మరల్చుకొని ఉన్నారు. అందుకే విశ్వం ఉన్నంత వరకు వీరు జీవించే ఉంటారు .


• ఇది మానవుని యొక్క జన్మ మరియు జీవిత మూలం లో కప్పబడి పోయిన ఒక విషయం . అవగాహన కోసం మాత్రమే ఈ రచన యొక్క ప్రయత్నం .


యడ్ల శ్రీనివాసరావు 8 Sep 2025 , 12:30 PM.



No comments:

Post a Comment

687. అలంకరణలు - ఆకర్షణలు

    అలంకరణలు - ఆకర్షణలు  • మనిషి కి ఆకర్షణ అలంకారమా ?   ఇదేం ప్రశ్న వింతగా , అసలు ఆకర్షణ లేకపోతే మనిషి ఎలా జీవించ గలడు ?  ఈ సృష్టి ఎలా ...