Wednesday, September 17, 2025

690. భగవంతుడు నీ కోరికలు తీరుస్తాడా ?

 

 భగవంతుడు నీ కోరికలు తీరుస్తాడా ?


కర్మ సిద్ధాంతం 


• భరత భూమి కర్మ భూమి. అనగా ఈ నేల మీద మనిషి తాను చేసే కర్మల అనుసారం ఫలితం లభిస్తుంది అనే శివుని సత్య జ్ఞానం , శ్రీకృష్ణుని చే భగవద్గీత లో చెప్పబడింది.  మనిషి కర్మ జీవి , ఏ కర్మను అయితే ఆచరిస్తాడో  దానిని బట్టి ఫలితం జన్మాంతరాల పయనం లో తప్పని సరిగా తిరిగి పొందుతాడు. అది మంచి కి మంచి, చెడు కి చెడు ఏదైనా కావచ్చు. ఇదే కర్మ సిద్ధాంతం .


• సోము తన అవసరార్థం, తన మిత్రుడు రాము వద్ద 1000 రూపాయలు అప్పుగా అడిగి తీసుకున్నాడు . నెల గడిచింది, సంవత్సరం గడిచింది సోము తిరిగి ఇవ్వలేదు సరికదా . . .  సోము ఈ విషయం లో చాలా నిర్లక్ష్యం గా వ్యవహరించే వాడు . తన వద్ద డబ్బు ఉన్నా, ఎందుకు తిరిగి రాముకి ఇవ్వాలి ? అనే ధోరణి తో ఉండేవాడు.  ఇది గమనించి  రాము పలుమార్లు సోము ని అడిగి , చేసేది ఏమీ లేక ఊరుకున్నాడు .

ఒకరోజు సోము ఆకస్మికంగా మరణించాడు .  రాము తన ధనం పోయినందుకు చింతించాడు. కొన్నాళ్ళ   అనంతరం రాము  కూడా చనిపోయాడు . కానీ ఆ ఆలోచన రాము మనసులో ఉండి పోయింది . 


• కాలాంతరాలలో  జన్మలు గడుస్తున్నాయి . సోము అప్పు తీసుకున్న కర్మ ,  కాలం లో  సాక్షి గా  అలాగే నిలిచి ఉంది. 

సోము నుంచి తిరిగి , తాను ధనం పొందలేదు అనే రాము ఆలోచన తో నిండిన కర్మ కూడా కాలంలో  సాక్షి గా అలాగే నిలిచి ఉంది .


• కొన్ని సంవత్సరాల కాలం తరువాత. . .

 ఒక ఊరిలో గీత అనే అనాధ అమ్మాయి అనాధ శరణాలయం లో పెరిగి, యుక్త వయసు వచ్చిన తరువాత శరీర పోషణార్దం ఒక సంస్థ యజమాని వద్ద ఆఫీసులో ఉద్యోగం చేసేది. ఆ యజమాని పేరు రాజారాం . గీత  ప్రతిభ , పనితనం వలన ప్రతీ సంవత్సరం అందరి కంటే కొంచెం ఎక్కువ జీతం పెంచేవాడు రాజారాం .   జీతం తన అవసరాలకు మించి పెరగడం తో ,  ప్రతి నెల కొంత  డబ్బు  రాజారాం వద్ద  గీత దాచుకుంటూ ఉండేది . 

ఒకనాడు  రాజారాం ,  గీతను పిలిచి దాదాపు పది సంవత్సరాలు నుంచి దాచిన  జీతం డబ్బు అయిదు లక్షల వరకు అయిందని,  చెప్పాడు. అప్పుడు గీత,  తాను ఇంకొక రెండు నెలల తర్వాత తీసుకుంటాను అని  రాజారాం తో చెప్పింది. 

ఇంతలో ఒక రోజు గీత తన ఆఫీసు కి వస్తుండగా యాక్సిడెంట్  అయి చనిపోయింది . గీత అనాధ, ఎవరూ లేక పోవడం తో ఆఫీస్ వారే దహనకాండ జరిపించారు. గీత దాచిన ధనం మొత్తం రాజారాం  ఆశించకుండా నే  తన  సొంతం అయింది.

• గీత ఎవరో కాదు గత జన్మలో ధనం ఎగవేసిన సోము .   సోము మరణం తర్వాత తన ఆత్మ తిరిగి  స్త్రీ శరీరం ధరించి  గీత అనే పేరుతో జీవినం సాగిస్తుంది . . . రాజారాం కూడా ఎవరో కాదు ,   రాము మరణించిన తరువాత తిరిగి జన్మించి  రాజారాం  అనే పేరు తో జీవనం సాగిస్తున్నాడు . ఆ రోజు సోము చేసిన అప్పు 1000 రూపాయలు నేడు గీత రూపం లో వడ్డీ తో కలిపి 5 లక్షలు రాము కి (రాజారాం కి ) చెల్లించి వెళ్లిపోయాడు . సోము అప్పు తీరిపోయింది. కర్మ కరిగిపోయింది. ఇదే కర్మ సిద్ధాంతం .


• ఆత్మ ,  జన్మలు  మారినప్పుడు ఏ శరీరం ధరించినా సరే , అనగా  రూపం, లింగం, పేరు, పోషించే పాత్ర ఏదైనా సరే . . . తప్పనిసరిగా గత జన్మల లో చేసిన  కర్మలను  అనుసరించి‌  ప్రస్తుతం జీవించడం జరుగుతుంది . అవే నేటి బుణాను బందాలు . కాకపోతే , మనిషి కి అనుభవపూర్వకంగా ఈ  సూక్ష్మ జ్ఞాన విషయం తెలుసుకోవడానికి  అనేక జన్మలు పట్టవచ్చు . అందుకు శివుని యదార్థం తెలుసుకుని  అనుసంధానం  కావాలి . 

ఇది ఒక కల్పిత కథ అనుకుంటే అమాయకత్వం . ఇందులో వాస్తవిక సూక్ష్మం అర్దం చేసుకుంటే గుప్తమైన  శివుని సత్య జ్ఞానం ఉందని తెలుస్తుంది.  

కర్మల  గతి  అతి రహస్యం 

చేసిన  వికర్మలను తప్పించుకోవడం సాధారణ స్థితితో  ఉన్న  మానవుని కి  సాధ్యం కాదు.  అందుకే దుఃఖం రూపేణా అనుభవిస్తూ ఉంటాడు.

కానీ దానికీ ఒక విధానం ఉంది. 

అదే  స్వయం పరమాత్మ చెప్పిన రాజయోగం.  యోగాగ్ని ద్వారా వికర్మలను దగ్దం చేసుకోవడం . పరమాత్మ అయిన శివుని తో  కలిసి  ధ్యాన యోగం  అమృత వేళలో (తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల వరకు)  ప్రతిరోజూ  చేయడం వలన  ఆత్మ లో అగ్ని  చైతన్యం ఉత్పన్నం  అవుతుంది.  ఎన్నో జన్మల నుండి ఆత్మ లో పేరుకుపోయి ఉన్న వికారాలు , దుఃఖం , పాప కర్మల లెక్కాచారం అంతా క్రమేపీ  యోగాగ్నిలో    దహించుకు పోయి, చేసిన వికర్మలు భస్మం అవుతాయి .  ఆత్మ లో దుఃఖం తొలగి  ,  త్రికాల దర్శనం జరిగి  పతితమై ఉన్న ఆత్మ  పావనం గా  అవుతుంది.  

అంతే గానీ  దాన ధర్మాలు చేయడం వలన ఇంతవరకు చేసిన పాపాలు  తొలగి పోవు.  దాన ధర్మాలు వలన పుణ్యం జమ అవుతుంది.  పుణ్యం వలన పుణ్య ఖాతా  ప్రారబ్దం గా తదుపరి జన్మ కు భాగ్యం తయారవుతుంది . కానీ ఈపాటికే  చేసిన పాపాల వలన దుఃఖం  అనుభవించక  తప్పదు .   

కొందరు మనుషులు అనుకుంటారు , నేను పుట్టిన దగ్గర నుంచి ఏనాడూ పాపం చేయలేదు అని, ఈ జన్మ లో చేసి ఉండకపోవచ్చు కానీ గత జన్మల ఖాతా అనేది  ఒకటి ఉంది కదా.

అందుకే  మంచి బుద్ధి తో  శ్రేష్టమైన కర్మలు చేయాలి .  ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు. ఎవరినైనా వ్యంగ్య మాటలతో , దూషణతో,  మనసు బాధ పెట్టేలా ప్రవర్తిస్తే  , ఊహించని నరకం అనుభవించ వలసి వస్తుంది. ఇది గరుడ పురాణం లో  కూడా చెప్పబడి ఉంది.  

కానీ , ఈ కలియుగంలో ప్రతి మనిషి  అత్యంత మహ పాపం నోటి తోనే  చేస్తాడు . 

అందుకు  నిదర్శనం . . . తపస్సు ద్వారా అభయం  పొందిన  కలిపురుషుడు ,  బ్రహ్మ  సభలో కి  వస్తూ  తన నోరు తెరిచి నాలుక బయటకు చాచి ,  తన మర్మాంగాన్ని  బహిరంగంగా  సభలో  ప్రదర్శిస్తూ ,   విచ్చల విడి వికారితనంతో   ఈ కలియుగ కాలాన్నీ ఇలాగే పాలిస్తాను అంటాడు  .  అనగా కలియుగం లో  మానవులు (ఆత్మలు) అంతా కామ వికారాలు తో  బహిరంగ  భ్రష్టు లై , పూర్తి అపవిత్రం గా తయారై ,   అసత్యాలు మాట్లాడుతూ తమను తాము మోసం చేసుకుంటూ,  ఆహర నియమం లేకుండా తినకూడనివి   తింటూ అనారోగ్యాల పాలై ,  సాటి మనిషి ని  నోటి  దూషణ లతో హింసిస్తూ  చివరికి తమను తాము నాశనం చేసుకుంటారు ,  అని కలిపురుషుడు అంటాడు. 

ఇదంతా నిజమా కాదా  అనే విషయం , నేటి  ప్రపంచం తీరు  బట్టి  ఒకసారి ఆలోచించండి .


☘️ ☘️ ☘️ ☘️ ☘️


భగవంతుడు నీ కోరికలు తీరుస్తాడా ?


• ఇక అసలు విషయానికి వస్తే . . . నేడు మనుషుల లో చాలామంది భగవంతుడిని  ఇల్లు ,  కారు , బంగారం ,  వృత్తి  ఉద్యోగ వ్యాపార వృద్ధి , ఆరోగ్యం, సుఖం ,  వివాహం  వంటివి కావాలని పెద్ద పెద్ద కోరికలు కోరుతారు . ఈ కోరికల కి హద్దు అంటూ ఉండదు. మనిషి తనకు ఉన్న సమస్యల చిట్టా ,  నిత్యం భగవంతుని ముందు ఏకరువు పెడుతూనే ఉంటాడు. తన కోరికలు తీరితే భగవంతుని కి ముడుపు ఇస్తాను అని  అంటాడు  . ఈ కలికాలం లో ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది .


ఇప్పుడు చెప్పండి . . . 

మరి కర్మ సిద్ధాంతం ప్రకారం ,  ఒకరికి మనం ఏదైనా ఇస్తేనే , తిరిగి అది పొందే నైతిక హక్కు కలిగి ఉంటాం . 

మరి నువ్వు,  నేడు గాని గత జన్మలలో గాని . . . 

భగవంతుని కి  ఏనాడైనా  ఒక మందిరం , ఒక ఆశ్రమం (ఇల్లు) కట్టించి ఇచ్చావా  ?  

భగవంతుని ఊరేగింపు కి ఏనాడైనా  రధం గాని , పల్లకి  గాని  (కారు)   ఇచ్చావా ?

భగవంతుని అలంకరణ కి  ఏనాడైనా స్వర్ణం వెండి ఆభరణాలు (బంగారం, సిరులు)  చేయించి ఇచ్చావా ?

భగవంతునికి  ధనం (వృత్తి ఉద్యోగ వ్యాపార వృద్ధి) వెచ్చించి సేవా కార్యక్రమాలు గాని , లోక కళ్యాణార్దం గాని భగవంతుని గురించి తెలియని వారికి  ప్రచారం చేశావా ?

నీవు ఏనాడైనా అనారోగ్యంతో ఉన్న వారికి  సేవ సహాయం చేశావా ?  ఔవధ సేవ చేశావా ? (ఆరోగ్యం).

నీవు ఏనాడైనా  నీ మనసారా  ఇతరులకు మనో ధైర్యం , మంచి  మాటతో  సుఖం శాంతి కలుగ చేశావా ? (సుఖం, శాంతి) .

ఒకసారి ఇదంతా ఆలోచించు . . .

ఈ , నీ  కోరికలు  అన్నింటినీ  తీర్చడానికి  భగవంతుడు   నేడు , నీకు బుణపడి ఉన్నాడా ? ఒకసారి  ప్రశ్నించు కో ?

• నువ్వు కోరుకుంటున్న  అన్ని వస్తువుల నిల్వల గొడౌన్ భగవంతుని దగ్గర ఏమైనా  ఉందా ? అడిగిన వెంటనే  తీసి  నీకు  ఇవ్వడానికి . . .

• నువ్వు అసలు భగవంతుని  కి   ఏమి ఇచ్చావని . . . నేడు నీ అవసరం కోసం  కోరికలతో  భగవంతుడుని  అడుగ గలుగు తున్నావు  ? 

నీది  అన్నది  ఏదైనా  ఒకరికి ఇస్తే నే , కదా  తిరిగి నీ అవసరానికి వారి నుండి  అడగడానికి  హక్కు అధికారం ఉంటుంది  .  ఈ చిన్న లాజిక్ మరచి పోతే ఎలా ? 

ముందు  ఏదైనా  ఇవ్వడం నేర్చుకుంటే . . .  తరువాత వాటంతట అవే  సహజంగా తిరిగి వస్తాయి. 

మనం మన ఇష్టానుసారానికి  ధర్మం, నీతి, నిజాయితీ,  సత్బుద్ధి,  సేవ , ధైర్యం , సహాయం , ప్రేమ వంటి గుణాలను  విస్మరించి  ఈర్ష్య స్వార్దం అసూయ, కామ వికారాలు,  అహం, క్రోధం ,హింస , మోసం  వంటి  రావణాసురుడి గుణాలతో జీవిస్తూ  ఉన్నప్పుడు ,  ఫలితం గా కలిగిన  దుఃఖం అనుభవించే  సమయం లో  లేదా  తీరని  కోరికలు కోసం మాత్రమే భగవంతుడి వైపు  దృష్టి సారించడం  ఎంత వరకు సబబు  . . . ఆలోచించండి.


☘️ ☘️ ☘️ ☘️ ☘️ 


• ఓ మనిషి . . . నువ్వు  పాప  కర్మలు చేసేటప్పుడు ఎవరూ చూడడం లేదని అనుకొని సంతోషంగా, ఆనందం గా చేస్తావు .   తరువాత హాయిగా  ఆ  కర్మ ను  మరచి పోతావు . కొన్నాళ్ళ తరువాత ఆ పాప కర్మ ఫలితం దుఃఖం , విఘ్నం , నష్టం , సమస్య  రూపం లో   నిన్ను వెంటాడుతూ ఉంటే  ,  తట్టుకోలేక  భగవంతుని చుట్టూ తిరుగుతావు .  అప్పుడు కూడా , భగవంతుడా !  నేను అమాయకుడిని , నాకు ఏ పాపం తెలియదు  అంటావు . అంతే కానీ చేసిన పాపం అంగీకరించవు  . . . ఎందుకంటే మరచి పోయి ఉంటావు కదా .  ఇదే విధంగా నేటి  కలి మాయా కాలం లో  ప్రతి మనిషి తలపైన ,  అనేక జన్మల  పాప కర్మల భారం చాలా  ఉంది  అనేది పరమ సత్యం .


• మనిషి చేసిన పాపాన్ని , భగవంతుడు ఏనాడూ డైరెక్ట్ గా తొలగించడు . ఎందుకంటే ఇది కర్మ సిద్ధాంతానికి విరుద్ధం. కాకపోతే భగవంతుని ప్రార్ధించి  , శివుని జ్ఞానం తెలుసు కోవడం వలన పాపాన్ని  తేలికదనం తో  నీకు నీవుగా  తొలగించుకొనే మార్గం చూపిస్తాడు . ఎందుకంటే భగవంతుని కి తన పిల్లల పై  కరుణ ఉంటుంది కాబట్టి.


• భగవంతుని కి  సత్యమైన  ప్రేమ కావాలి. అది ఏనాడైనా నీ మనసు తో ఆయనకు ఇచ్చావా ? 

• భగవంతునికి    విశాలమైన సత్బుద్ధి కావాలి .  అది  నీలో సమృద్ధిగా ఉందా ? 

• భగవంతుని కి   సేవ , సహాయం , నిజాయితీ , ధర్మాచరణ వంటి లక్షణాలు, గుణాలు కావాలి . అవి నీలో పుష్కలంగా ఉన్నాయా ?

• భగవంతుని కి   సత్కర్మలు మాత్రమే ఆచరించడం కావాలి ? . . . మరి నీ యొక్క కర్మలు అన్ని వేళలా మంచివి గానే ఉంటున్నాయా ?


• ఒకవేళ నువ్వు భగవంతుడుని సత్యమైన ప్రేమ తో కొలిచి , నీ లో సత్బుద్ధి ఉండి  , మంచి కర్మలు చేస్తున్న   యెడల ,      భగవంతుని యొక్క అనంతమైన ప్రేమ , భగవంతుని లో ఉండే దివ్య గుణాలు, శక్తులు అనేకం పొందుతావు.  వాటి ద్వారా  నీ శక్తి పెరిగి, ఈ భౌతిక ప్రపంచంలో  నీకు నువ్వు గా  ధర్మ యుక్తంగా ధనార్జన చేసుకునే మార్గం  ఏర్పడుతుంది .  పిదప నీవు కోరుకున్న భౌతిక సాధనాలతో ఆనందం గా ఉండ గలవు . . . 

అంతే గానీ భగవంతుడు నీకు అడిగిందల్లా డైరెక్ట్ గా ఇవ్వడు. ఒక వేళ పూర్వ జన్మ లో నీ పుణ్య కర్మల భాగ్యం మిగిలి ఉంటే దాని ఫలితం ద్వారా కొన్ని లభిస్తాయి . 


మనిషి  ఎప్పుడైనా , ఎంతటి  వాడైనా కేవలం  నిమిత్తమాత్రుడు  మాత్రమే .  మనిషి కి సర్వం ఇచ్చేది భగవంతుడు మాత్రమే  .

భగవంతుడు మనిషి కి  ఇచ్చేది  శక్తి రూపం లో అందుతుంది. దానిని మనిషి , తనకు కావలసిన విధంగా మార్చుకుంటాడు . 


• భగవంతుడు దగ్గర  ఉండేవి , సత్యమైన ప్రేమ , అనంతమైన జ్ఞానం , మానసిక సుఖం, విశ్వ శాంతి, దివ్య గుణాలు , దివ్య శక్తులు, సత్కర్మల జ్ఞానం  ,  దయ , కరుణ , నిజాయితీ . 

వీటిని  మనిషి  భగవంతుని స్మృతి తో అనుక్షణం ఆచరిస్తూ జీవిస్తే  రెట్టింపు స్థాయిలో తిరిగి పొందడం జరుగుతుంది. తద్వారా  మనిషి తన భౌతిక ప్రపంచంలో వ్యాపారం, సాధనాలు, ఉద్యోగం వంటివి సహజంగా తన  బుద్ధి ని ఉపయోగించి సమకూర్చుకుంటాడు .

భగవంతుడు  శక్తి శాలి . ఆ శక్తి పొందాలి అంటే ధ్యానం , యోగం , జ్ఞానం , సేవ , పవిత్రత వంటి ఎన్నో అంశాలపై  సాధన  చేయాలి .


భగవంతుడు ఒక్కడే అతడే శివుడు . 

శివుడే పరమాత్ముడు . 

కర్మ సిద్ధాంతానికి  లోబడే  శివుడు తన కర్తవ్యం ఈ సృష్టిలో  నిర్వర్తిస్తాడు . 

శివుని యధార్థం , మూలం  తెలుసుకోనంత  వరకు  మనిషి కి  అన్నీ ఉన్నా  వంద శాతం  అశాంతి , అంధకారమే . ‌

అసలు  నీవు ఎవరు  అనే నీ మూలాన్ని, నీకు అర్థం చేయించేది కూడా భగవంతుడే .

• భగవంతుడు చెప్పేది ఒక్కటే . . . నువ్వు నన్ను యధార్థ రీతిలో గుర్తించి, నేను చెప్పిన విధంగా ధర్మాచరణ చేస్తూ జీవించిన నాడు , నీ పూర్తి బాధ్యత నాది .


మనిషి కి  భగవంతుని కి మధ్యలో మాయ ఉంది అనే సత్యం గ్రహించాలి. మాయ అంటే బలహీనతలు మరియు భ్రమ . ఇది  మనిషి మస్తిష్కం లోనే  చాలా శక్తి వంతంగా ఉంటుంది. ఇది మనిషి ని అంత సహజంగా విడిచి పెట్టదు .  అందుకే, అన్ని కార్యక్రమాలు యధావిధిగా చేసుకుంటూనే  భగవంతుని నిరంతర స్మృతి, సాధన అనేది మనసు లో ప్రతి క్షణం ఉండాలి. 


• భగవంతుని  భక్తి శ్రద్ధలతో  పూజించాలి , పూజించడం అవసరం కూడా . కానీ  అది  తుచ్ఛమైన  కోరికలు తీర్చు కునేందుకు  కాకూడదు.   

నిస్వార్థంగా భగవంతుడిని , తల్లి తండ్రి వలే మనసు తో  ప్రేమించిన నాడు, భగవంతుని నుంచి లభించేది కనీసం  మన ఊహకు కూడా అందదు . ఇది పరమ సత్యం . 


 ఓం శాంతి 🙏

 ఓం నమఃశివాయ 🙏 .

యడ్ల శ్రీనివాసరావు 17 Sep 2025 9:30 PM.



No comments:

Post a Comment

690. భగవంతుడు నీ కోరికలు తీరుస్తాడా ?

   భగవంతుడు నీ కోరికలు తీరుస్తాడా ? కర్మ సిద్ధాంతం  • భరత భూమి కర్మ భూమి. అనగా ఈ నేల మీద మనిషి తాను చేసే కర్మల అనుసారం ఫలితం లభిస్తుంది ...