Sunday, September 14, 2025

689. క్రమశిక్షణ

 

క్రమశిక్షణ


• ఈ పదం , అర్దం నేటి తరం పిల్లలు కి తెలుసా?

  అంటే . . .  సమాధానం 

 మనం అందరం కూడా చాలా చాలా ఆలోచించ   వలసిన  విషయం.

  ఎందుకంటే . . .

 నేటి తరానికి తల్లి తండ్రుల మైన మనమే బహుశా ఈ పదాన్ని పూర్తిగా మరచి పోయాం. ఎప్పడో  మన చిన్నతనం లో మనకు మరియు మన ముందు తరాలు వారికి మాత్రమే బాగా అర్దం తెలిసిన పదం ఈ క్రమశిక్షణ . అవునన్నా కాదన్నా ఇదే నిజం .


• నేడు తల్లి తండ్రులం అయిన మనం, మన పిల్లలను ఎన్నో సందర్భాల్లో తిడుతూ ఉంటాం, వారి చేష్టల వలన బాధ పడుతూ ఉంటాం.

  వీడికి పద్దతి లేదు, నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నాడు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రవర్తిస్తున్నాడు. గౌరవం ఇవ్వడం లేదు. క్రమశిక్షణ లేదు, వంటి మాటలు తరచూ నిత్యం ప్రతి ఇంటి లో సర్వసాధారణంగా చూస్తున్నాం, వింటున్నాం, అనుభవిస్తున్నాం. 

 కాదనగలమా ? . . ‌. ఆలోచించండి .


• దీనికి కారణం మనమే , మన పెంపకం లో లోపం  అనే విషయం ఏనాడైనా మనం గమనించామా ?  ఆలోచించామా ? . . . 

లేదు . . ‌. 

ఎందుకంటే నేడు మనకు అంత తీరిక  సమయం లేదు కాబట్టి , ఈ విషయం అసలు మన స్పృహ లో లేదు .


• మనం క్రమశిక్షణ తో  పిల్లలను పెంచలేనపుడు , సందర్భాల అనుసారంగా  కనీసం  చిన్న తనం నుంచే  అలవాటు చేయునపుడు పిల్లల నుంచి క్రమశిక్షణ  ఎలా  ఆశించగలం . 

 మనకు కావలసింది దక్కలేదు అని పిల్లలను నిందిస్తాం . కానీ అసలు పిల్లల వ్యక్తిత్వానికి , మనో వికాసానికి కావలసినది మనం ఇవ్వలేదని గ్రహించం . ఫీజులు కడుతున్నాం , చదివిస్తున్నాం ఇంతకు మించి ఏం చేయగలం అనే స్థితికి నేడు తల్లి తండ్రులం ఉన్నారు .  చెప్పాలంటే ఇదొక మాయావి  లక్షణం .


• పూర్వం, మన తల్లిదండ్రులు భయభక్తులతో క్రమశిక్షణ తో పెరిగారు కాబట్టి అవే మనకు మన చిన్నతనం నుంచి అలవాటు చేసి పెంచారు . కానీ నేడు మన ఆర్థిక స్వేచ్ఛ పెరిగి, స్థితి గతులు , సౌఖ్యాలు పెరిగే టప్పటికి మనం అన్నింటినీ సడలించుకుంటూ ఉండడం వలన , ముందు మనలోనే  క్రమశిక్షణ పూర్తిగా కనుమరుగు అయింది అనే విషయం వాస్తవం. 

నేడు క్రమశిక్షణ కోల్పోయాం కాబట్టి , ఆ దిశలో పిల్లలను శిక్షణాత్మకంగా  పెంచలేదు. వారు అడిగినది  ప్రతీదీ  ఇస్తూ ఉన్నాం . వాళ్లు ముద్దుగా  ఫ్యాషన్ వస్త్రాలు ధరిస్తూ , ఇంగ్లీష్ మీడియం చదువుతూ పెరగడం చూసి, అందులో మనల్ని చూసుకుంటూ మనలో మనం మురిసి పోయాం. ఎందుకంటే మన బాల్యం ముమ్మాటికీ వారి లా జరగలేదు కాబట్టి .


• వాస్తవానికి నేటి తరం పిల్లలు చాలా తెలివైన వారు, సుకుమారులు . వారికి పుట్టినప్పటి నుంచి అన్నీ అందుబాటులో ఉన్నాయి . విద్యా బోధన లోని పెను మార్పుల వలన సౌఖ్యం గా ఉన్నత చదువులు చదువుతున్నారు . 

కానీ వారు వ్యక్తిత్వ విలువల లోను , మానసిక దృఢత్వం , పరిపక్వత లోను   క్రమశిక్షణా రాహిత్యం వలన  చాలా  బలహీనంగా ఉంటున్నారు . ఇదే భవిష్యత్తులో  వారి కుటుంబ జీవన  వ్యవస్థలకు , మానవ సంబంధాల కు అతి పెద్ద ముప్పు .


• మనం తరచూ అనేక మంది తల్లి తండ్రుల నుంచి ఒక మాట  వింటుంటాం, “మా వాడు నా మాట వినడు” అని .


• నేటి కాలంలో, పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎన్నో  విషయాలలో   స్వేచ్చ  స్వాతంత్ర్యం సమృద్ధిగా లభిస్తుంది . లభించడం అనేదాని కంటే స్వయంగా  తీసుకుంటున్నాం అని అనడం సబబు . ఇది మితిమీరడం  వలన ,  ప్రభావం సమాజం లో  ప్రతిబింబిస్తుంది అనడానికి నిదర్శనం,  నేడు నిత్యం జరుగుతున్న ఘోరాతి ఘోరమైన దారుణాలను టి వి, మాధ్యమాల వార్తల లో   నిత్యం చూస్తూ ఉన్నాం . 

ఇందులో  ప్రధానంగా  పిల్లలు పెద్దలు అనే భేదం లేకుండా ఉంది.  మరి దీనంతటికీ పెంపకాల లో  , క్రమశిక్షణా రాహిత్యం ఒక కారణం అయితే . స్వేచ్ఛ స్వాతంత్ర్యాల విచ్చల విడి తనం మరో కారణం .

కాదని అనగలమా ?  . . . ఆలోచించండి.


• మంచి బుద్ధి , విలువలు అనేవి ఇంటర్నెట్ లో , మార్కెట్లో దొరకవు . మనం పెరుగుతున్న కుటుంబం లోని తల్లి తండ్రుల ద్వారా  విలువలు ఆచరించడం , పెద్ద వారిని గౌరవించడం మరియు చదువుకుంటున్న  స్కూలు ఉపాధ్యాయుల ద్వారా క్రమశిక్షణ లభిస్తుంది .

  పూర్వం పాఠశాల ఉపాధ్యాయులు  భయం, క్రమశిక్షణ  నేర్పించే వారు. ఎందుకంటే భయం ఉండడం వలన కోతి లాంటి మనసు , కుక్క తోక లాంటి బుద్ధి ఆధీనంలో ఉంటాయి అని ,తద్వారా వికృత చేష్టలకు అలవాటు పడరు అని . 

 కానీ నేటి తరం పిల్లలకు ఈ భయం, క్రమశిక్షణ లేవు. ఒకవేళ టీచర్స్ మంచి కోరి అలా చేస్తే , తల్లి తండ్రులే  టీచర్స్ పై తిరగబడే దుస్థితి దాపురించింది. అందుకే నేటి తరం పిల్లలు ముఖ్యం గా తల్లి తండ్రుల మాట వినరు సరికదా ఒక వయసు వచ్చాక తిరగబడినా ఆశ్చర్యం లేదు. 

అన్నింటికీ మనమే సిద్దం అయి ఉండాలి.


• మొక్కై వంగనిది మ్రానై వంగునా అంటారు. క్రమశిక్షణ బాల్యం నుంచి లేనిది తరువాత రాదు. క్రమశిక్షణ వలన జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడ వచ్చు అనే విషయం పిల్లలకు బాల్యం లోనే తెలియచేయాలి . పిల్లల పాలన లో (పెంపకం లో) క్రమశిక్షణ ఒక భాగం అయినట్లయితే, వారి జీవితానికి సద్గతి లభిస్తుంది. ఇది పిల్లల కే కాదు మనిషి అనే ప్రతీ ఒక్కరికీ అవసరం.


• నేటి కాలంలో  మనిషి తరచూ  చెప్పే సమాధానం ఒక్కటే, కాలం మారింది, కాలానికి అనుగుణంగా మారాలి అని. ఇది తనను తాను సంతృప్తి పరచుకోవడం కోసం చెప్పే సమాధానం .

  కాలం ఏనాడూ మారలేదు. అదే భూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఎండ వాన చలి, పగలు , రాత్రి , తిధులు, వారాలు, రోజులు అన్నీ అవే.  కానీ, మారిందల్లా  ఒకటే మనిషి వయసు , మనిషి బుద్ధి. అది పూర్తిగా మాయకు (బలహీనతలకు , విలాసాలకు, సుఖాలకు ) వశం అయిపోవడం వలన మనిషి తన అంతరంగాన్ని తాను మోసగించుకుంటూ జీవించడానికి అలవాటు పడి పోయాడు .


• మనం మన గతం యొక్క మూలాలను ,  భూత కాలాన్ని  (past life, pastence) గుర్తుంచుకొని   జీవిస్తే వర్తమానం, భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే భవిష్యత్తు తరువాత తిరిగి మనం భూత కాలం లోకే  తప్పకుండా వెళ్లాలి, వెళ్తాం.


 గమనిక :  ఈ రచన ,  నేడు  నానాటికీ దిగజారుతున్న కుటుంబ విలువల కోసం . మన గత మూలాల్లో  ఉన్న   జీవన విధానం , సమాజానికి మానవ మనుగడకు చాలా శ్రేష్టమైనదని   ఒకసారి గుర్తు చేయడం కోసం మాత్రమే . మరచి పోయిన మన మూలాలు తిరిగి ఏనాడైనా  జీవితాలను  మార్చవచ్చు.


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 14 Sep 2025  10:00 PM.


No comments:

Post a Comment

689. క్రమశిక్షణ

  క్రమశిక్షణ • ఈ పదం , అర్దం నేటి తరం పిల్లలు కి తెలుసా?   అంటే . . .  సమాధానం   మనం అందరం కూడా చాలా చాలా ఆలోచించ   వలసిన  విషయం.   ఎందు...