Tuesday, September 23, 2025

692.స్వభావం - హద్దులు - గౌరవం


స్వభావం - హద్దులు - గౌరవం


• మనిషి జన్మతః , ఒక స్వభావం  సంస్కారం కలిగి ఉంటాడు. ఇది సహజంగా గత జన్మల కర్మల అనుసారం వచ్చేది . జన్మతః  కలిగి ఉన్న స్వభావ సంస్కారాలు  ఉన్నతి  తో  అన్ని వేళలా  స్థిరత్వం గా  ఉండడం  మనిషి అభ్యున్నతికి అత్యంత అవసరం

కానీ , ఈ  ఉన్నతిని  మన   స్వభావం  మరియు సంస్కారాలలో  యదార్థ రీతిలో కలిగి ఉన్నాము అని  నిర్ధారణ చేసుకోవడం  అత్యంత అవసరం .

దీనికి నిదర్శనం , స్వభావ సంస్కారాల లో  ఉన్నతి   కలిగి  ఉంటే  పరిస్థితులు ఎలా ఉన్నా, నిర్లిప్తత , వేదన ,  నిరాశ , అసంతృప్తి , దుఃఖం  అనే  అంశాల పట్ల  మనం అంతర్గతంగా  కూడా ప్రభావితం  చెందము .   ఇవి  మన ద్వారా  ఇతరులకు  కలిగేలా  ప్రవర్తించము .  

ఈ యధార్థం గమనించని  మనం , అహం తో  మన స్వభావం  సంస్కారాలు చాలా  గొప్పవి గా భావిస్తాం .

 

• అనేక సార్లు,  మన  స్వభావ  సంస్కారాల శైలి వలన  మన జీవనం లో  వైఫల్యాలు పొందడం , సంతోషం కోల్పోవడం ,  సమస్యలు సృష్టించు కోవడం వంటివి  తరచుగా  జరుగుతూ ఉన్నా సరే  వాటిని  మార్చుకోవడానికి  సిద్ధపడం , అంగీకరించం, ఇష్టపడం . 

దీనికి కారణం . . . ఒకటి  స్వభావ సంస్కారాల లోనే  మన బలహీనతలు దాగి ఉన్నాయి  అని గ్రహించలేక పోవడం. 

రెండవది అవి మన నేచర్ , అనగా మన సహజ తత్వం  అని భావించడం. 

మూడవది వాటిలో  మాయ , భ్రమ  బలంగా ఇమిడి ఉంది అనే విషయం మన స్పృహ లో లేక పోవడం .  అనగా సత్యాన్ని , వాస్తవాన్ని సంగ్రహించుకొని , నిర్దారించుకునే శక్తి మనలో లేకపోవడం .


☘️ ☘️ ☘️ ☘️ ☘️


• ఈ  భూమి పై  మనం పుట్టింది , కోరికలు తీర్చుకోవడాని కే  అనుకుంటాం కానీ . . .  మన కర్మలను  పూర్తి చేసుకోవడం కోసం అని గాని , మన అంతర్గత  స్థితి ని  ఉన్నతి గా తీర్చి దిద్ది కోవడం కోసం అని గ్రహించం . 

ఈ విషయాలన్నీ ,  మనకు ముఖ్యం గా ఆఖరి రోజుల్లో  కదలలేని స్థితిలో ,  మరణం పొందడానికి  కొన్ని రోజులు , గంటలు , నిమిషాల ముందు కళ్ళ ఎదుట  మన ఈ జన్మ యధార్థ స్థితి ని భగవంతుడు  ప్రత్యక్షం చేయిస్తాడు .(దీనికి కారణం  . . .   మన ఆత్మ , జన్మ తీసుకునే ముందు భగవంతుడి ని  శరీరం కావాలని ప్రాధేయ పడుతుంది .  నేను ఏ పాప కర్మలు చేయను , భూమి పై  పెండింగ్ ఉండిపోయిన కర్మలను పూర్తి చేసుకుని , పావనం గా అయి పవిత్రత తో   తిరిగి వస్తానని  భగవంతుని కి మాట ఇస్తుంది.  భగవంతుడి అంగీకారం తో మన ఆత్మ , నేటి  ఈ  శరీరం ధరించడం జరుగుతుంది.  కానీ , తల్లి గర్భం నుంచి  బయట పడే  మూడు నెలల  ముందు నుంచి ఆత్మ నేత్రం ముసుకు పోవడం తో  ఇవేమీ  ఈ లోకం లోనికి వచ్చాక  మనకు జ్ఞాపకం ఉండవు.  మనం శరీర స్పృహ తోనే మన జీవన ప్రయాణం కొత్తగా మొదలు పెడతాం.)  కానీ మనల్ని మనం మార్చుకోవడానికి అప్పుడు సమయం మిగిలి ఉండదు . భగవంతుని కి ఇచ్చిన మాట తప్పడం జరుగుతుంది . శిక్షల భారం పెరుగుతుంది.


☘️ ☘️ ☘️ ☘️ ☘️


• మనలో ఎవరి స్వభావ సంస్కారాలు ఎప్పుడు ఎవరితో  ఎలా ఉంటాయి అనేది  వర్ణించలేం . కానీ  వీటిలో మన కోరికలు సాధించుకోవడం . . . మన అవసరాలకు అనుగుణంగా  భావోద్వేగాలు ప్రదర్శించడం  , అమాయకత్వాన్ని చూపించడం , అనుభవజ్ఞులు గా  వాక్ చాతుర్యం ప్రదర్శించడం ,  మితిమీరిన పరిణితి తో  వ్యవహరించడం  వంటివి అనేకం జరుగుతుంటాయి .  నేటి కాలంలో  మన ప్రదర్శన ఇలా ఉంటేనే  మన  కార్యాలు  రూపం దాలుస్తాయి  అని భావిస్తాం.


దీనికి  ప్రధాన కారణం మన హద్ధులను  మనం అతిక్రమించడం .  ఒక మనిషి తన ఆలోచనల  హద్దులను  అతిక్రమించి   ఇతరుల ఆలోచనల లోనికి   చొరబడడం అనేది  మొదట  చిన్న గా సూక్ష్మం గా  ఆరంభం అయి తదుపరి  వట వృక్షం వలే  వృద్ధి  అవుతుంది .

ఈ క్రమంలో   ఇతరుల పై   మనకు  ఉన్నది  హక్కు , స్వతంత్రం  ,  స్నేహం  అని భావిస్తాం .  కాని ఎదుటి  వారికి  ఇది  ఏమైనా  అసౌకర్యం కలుగుతుందా  అనేది ఊహించం .  ఎందుకంటే  మన స్వభావం తో  చేసే ప్రతి ఆలోచనా  ధోరణి  సహజమైనది సమంజసమైనది అని బలంగా సమర్థించుకుంటాం . 

విచిత్రం ఏమిటంటే ,  మన వ్యక్తిగత , వ్యక్తిత్వ  జీవన  స్వేచ్ఛ స్వాతంత్ర్యాలలో ఇతరులను ,  ఎవరిని ఎంత దూరం లో ఉంచాలో  అలా ఉంచగలుగుతాం . ఇది మన మేధస్సు లో ఒక భాగం .

• నేటి సమాజంలో ,  సాంగత్యాలలో సహృదయంతో   నిండిన    ఆరోగ్యకరమైన వాతావరణం , సన్ని "హిత" తత్వం , మనుషుల మధ్య   కుటుంబ వ్యవస్థ ల మధ్య  సుస్థిరంగా , దీర్ఘ కాలం   ఉంటుందా ?  అని  ప్రశ్నిస్తే ,  ఉంటున్నట్లు అనిపిస్తుంది . కానీ  ఒక దశలో ఈ సఖ్యతలు  పూర్తిగా విఫలం అవుతున్నాయి  అనేది  నిజం .

నేడు   ఒక  నాటకీయత తో   మాత్రమే మన జీవన ప్రయాణం   నడుస్తూ  ఉంది   అనేది వాస్తవం .  దీనికి  ప్రధాన  కారణం మన అంతరంగం లోని   ఆలోచనలు  మనతో  ఉండే వారి పట్ల హద్దులు దాటడం . ఇవి దాటినప్పుడు  కుటుంబం లోని , సమాజం లోని  మనుషుల తో సహృద్బావం  ఉండదు ,  గౌరవం కొల్పోవడం జరుగుతుంది .  ఇది ప్రధానంగా మొదట కమ్యునికేషన్  భాష ,  పిలుపు ,  సంభోధన లోని   లోపాల తో  ఆరంభం  అవుతుంది . పిదప వివాదాలు తలెత్తుతాయి .


•  మనం , సహచరుల మధ్య  సాన్నిహిత్యం తో  స్వేచ్చ ,  స్వాతంత్ర్యం  అతిగా ఫీల్ అయినపుడు హద్దులు మీరడం  జరిగి ,   ఉపయోగించే కమ్యూనికేషన్ భాష   పిలుపు  సంభోధన లను  వారి పై  హక్కుగా  భావించి , అధికారం చెలాయించడం లేదా వ్యంగ్యాస్త్రాలు విసరడం , నవ్వుతూ  అతి తెలివి చూపించడం, మనలోని వికారాలను  తెలివిగా ,  వారికి చెందినవి గా ప్రోజెక్ట్  చేయడం వంటివి సహజంగా ఆరంభం అవుతాయి .  

ఇదే ,  ఒకానొక దశలో మనుషుల మధ్య సంబంధాలు పూర్తిగా బీటలు వారి సమస్యలు ఆరంభం అవడానికి , అగాధాలు  ఏర్పడడానికి ప్రధాన కారణం .  విచిత్రం ఏమిటంటే  ఈ యొక్క   ప్రతీ దశలో  మనం చేసేది  అంతా కరెక్ట్  అనుకుంటాం కాని , ఆ సంబంధాలు పూర్తిగా బీటలు వారిన తరువాత మాత్రమే తెలుస్తుంది, నేను ఎంత హద్దు మీరి ప్రవర్తించాను అని. దీనినే మాయ ప్రభావం చేత  మన  కళ్లు కప్పబడి ఉండడం  అంటారు.

దీనంతటిని  ఆధీనం లో ఉంచుకోవాలి అంటే , ఒకటి మనం హద్దు లో ఉండగలగాలి . రెండవది పరివర్తన చేసుకోవలసింది కమ్యూనికేషన్ భాష , పిలుపు , సంభోధన తో కూడిన  స్వభావం  మరియు  సంస్కారం .

సహృదయ మైన    ప్రేమ తో , శాంతియుత వాతావరణం తో ,  సహచర  సంబంధాలన్నీ  సఖ్యత గా  ఆనందం గా  ఉండాలి , అంటే  నిజాయితీ తో   పాటు  స్వభావాలు సంస్కారాలు  మిళితం  కావాలి .  అందుకు  స్వయం  పరివర్తన  చాలా  అవసరం


హద్దు యొక్క విశేషత : 

• మన   ప్రవర్తన  సమర్థవంతంగా తయారు కావాలంటే  మొదట ఆలోచనలు హద్ధులో ఉండాలి. హద్ధు లోని  ఆలోచనల పై ఎప్పుడూ ఒక అవగాహన ,  స్పష్టత కలిగిఉంటాం . దీని ద్వారా మన ఆలోచనలు ధర్మబద్ధమైనవా (ఆమోద యోగ్యమైన వా)  కాదా అనే స్పృహ కలిగి ఉండడం జరుగుతుంది.

ఒకసారి నిష్ణాతులైన తరువాత,  హద్దులను విస్తారం చేసుకుంటూ వెళ్లాలి.  అప్పటికే, ఆలోచనలు సమర్థవంతంగా అయి ఉండడం వలన , మన ప్రవర్తన వలన ఎవరికీ నష్టం ఇబ్బంది  జరగదు. 

• హద్దులు లేకపోతే ఆలోచనలు ఇష్టానుసారం గా రాజ్యమేలి , ప్రవర్తన కు నష్టం కలిగిస్తుంది. ఇది నైతిక మానసిక పతననాలకు దారితీస్తుంది.


☘️ ☘️ ☘️ ☘️ ☘️

దీనంతటికీ చక్కటి  వాస్తవిక ఉదాహరణ :

• కొందరు తమకు ఎంత వయసు వచ్చినా సరే తండ్రిని “ నాన్నగారండి ” అని బహువచనం తో పిలుస్తారు . ఇంకొందరు మాత్రం “నాన్న” అని ఏకవచనం తో పిలవడం చూస్తుంటాం .

నాన్నగారండి  అనే పిలుపు లో   ప్రేమతో పాటు , మన జీవితం లో  ప్రతీ దశలో  , ఆయన గౌరవం కాపాడే  విధంగా ఉండడం జరుగుతుంది. ఇది హద్ధు తో  కూడిన కమ్యూనికేషన్ భాష పిలుపు సంభోధన . . . 

అదే విధంగా  " నాన్న " అని ఏకవచనం తో స్వతంత్రంగా పిలిచే పిలుపులో ప్రేమతో పాటు హక్కు , అధికారం ఉంటుంది . ఇది హద్ధు ను అతిక్రమించిన కమ్యూనికేషన్ భాష పిలుపు సంభోధన.  ఈ హక్కు అధికారం అనేవి మన పరిస్థితులు మారినప్పుడు ఏనాటికైనా తండ్రి తో ఉన్న బంధం లో  సఖ్యత   బీటలు వారే లా చేస్తుంది . ఎందుకంటే  హక్కు ,  అధికారాల కు మనసు లోని  ప్రేమ బదులుగా   మనిషి లోని అహంకారం  నాయకత్వం వహిస్తుంది.


• మన యుక్త వయసు బాహ్య  సాంగత్యాలలో, నువ్వు , నీవు అనే ఏకవచన పిలుపుకు బదులు , బహు వచనంతో  మీరు , అండి , గారు అని సంబోధించడం వలన నష్టం ఏమైనా ఉంటుందా ?  అంటే లేదు, సరికదా  మనం గౌరవం ఇవ్వడం తో పాటు ఇతరుల నుండి సహజంగా గౌరవం పొందవచ్చు . 

దీని వలన మనం మన హద్దు ని అతిక్రమించ కుండా ఇతరులతో ఎంత వరకూ ఎలా ఉండాలి అనే విషయం , మన స్పృహ నిత్యం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది . తద్వారా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరితో ఏ సమస్యలు తలెత్తవు .

• వస్త్రాలు ధరించినపుడు , అవి మన శరీరాన్ని బహిర్గతం కాకుండా సంరక్షిస్తూ ఉంటాయి. అయినప్పటికీ మనం సమాజం లో కార్యక్రమాలకు వెళ్లి నప్పుడు తరచూ మనం ధరించిన వస్త్రాలు పదిసార్లు , అవసరం ఉన్నా లేకపోయినా సరి చేసుకుంటూనే ఉంటాం . ఎందుకంటే , ఒకవేళ పొరపాటున వస్త్రం జారినా, చిరిగినా అభాసుపాలు అవుతాం అనే  విషయం , స్పృహ లో అలెర్ట్ గా ఉంటుంది కాబట్టి .

మరి అదే విధంగా, మన నేచర్ ను   స్వభావ సంస్కారాలను వయసు తో పాటు తరచూ చెక్ చేసుకోవటం,  సరి చేసుకోవడం వలన కూడా మన గౌరవాన్ని సంరక్షించు  కోవచ్చు . ఎటువంటి పరిస్థితి లోను  అభాసుపాలు కాకుండా  ధైర్యం గా  సంతోషంగా  జీవించవచ్చు .


మన  స్వభావ సంస్కారాల  ఉన్నతి , మేలు కోరే భగవంతుడు మనకు సహాయకారిగా ఉంటూ , ఏదో విధంగా  మనల్ని సరిదిద్దుతూనే  ఉంటాడు. అది ఆయన భాధ్యత. ఎందుకంటే భగవంతుడు మన తండ్రి . . .  కానీ  మనమే అది గ్రహించ లేక మాయ వైపు  పరిగెడతాం ,  చివరికి  దుఃఖం పొందుతూ ఉంటాం .


ఓం శాంతి 🙏.

ఓం నమఃశివాయ 🙏 .

యడ్ల శ్రీనివాసరావు  23 Sep 2025, 5:00 PM .


No comments:

Post a Comment

692.స్వభావం - హద్దులు - గౌరవం

స్వభావం - హద్దులు - గౌరవం • మనిషి జన్మతః , ఒక స్వభావం  సంస్కారం కలిగి ఉంటాడు. ఇది సహజంగా గత జన్మల కర్మల అనుసారం వచ్చేది . జన్మతః  కలిగి ఉన్...