దృఢత్వం మరియు సానుకూలత
• మన జీవితంలో వేసే ప్రతి అడుగులో మనం ఎంత దృఢంగా ఉంటున్నాము, ఆ దృఢత శక్తిని ఉపయోగించి అనేక ఆటంకాలను ఎలా అధిగమిస్తున్నాము అన్నది చాలా ముఖ్యమైన మరియు ప్రభావ వంతమైన విషయం.
అయితే కొన్నిసార్లు మనం ఈ విషయానికి సరైన ప్రాముఖ్యతను ఇవ్వము. విశ్వాసం పర్వతాలను కదిలించగలదు , విశ్వాసం అంటే జీవితంలోని ప్రతి అడుగులో దృఢమైన సంకల్పం అని అంటారు. నెగెటివ్ నుండి , అనవసరమైన ఆలోచనల నుండి నేను దూరంగా ఉంటాను అని మీతో మీరు చెప్పుకోవడమే విశ్వాసం.
అలాగే , ప్రతి పరిస్థితిలో, కష్టాలను అధిగమించే సమయాలలో అవసరమైన సానుకూల ఆలోచనలను మనసులో నింపుకుని విజయాన్ని సాధించడమే విశ్వాసం.
• ప్రతికూల పరిస్థితుల గాలులు ఎంత తీవ్రంగా ఉన్నాగానీ , బాహ్య పరిస్థితి కన్నా , నా ఆంతరిక మానసిక స్థితి గొప్పది అన్న నమ్మకంతో బలంగా ఉండటమే దృఢత.
మనం దృఢం గా ఉంటే, పరిస్థితి బలహీనపడి తక్కువ సమయంలోనే అది వెళ్ళిపోతుంది. కనుక , పరిస్థితితో ఎన్ని రకాలుగా పోరాడాలి అన్నది ముఖ్యం కాదు , మీ ఆత్మ బలంతో , మీరు కోరుకున్న విధంగా కష్టంలో వచ్చే దృశ్యాలను మార్చడం ముఖ్యం.
చాలాసార్లు మనం కోరుకున్నట్లుగా పరిస్థితులు ఉండవు, మనకు కావలసిన విధంగా మరల్చుకోవడానికి మనం ముందుగా బాహ్యంగా పోరాడుతుంటాం . ఒక్కోసారి మనం గెలవవచ్చు , ఒక్కోసారి గెలవకపోవచ్చు , ఇందుకు కారణం మనకు సరిపడేంత ఆత్మ బలం లేకపోవడమే. ఇందుకు మరో ముఖ్య కారణం, మన ఆంతరిక స్థితి, మనలో దృఢత బలంగా లేకపోవడమే . అందువలన , స్వయాన్ని శక్తివంతమైన స్థితిలోకి తీసుకురావాలి.
శక్తి అంటే బాహ్య శక్తి కాదు. ఆంతరిక శక్తితో మనసును శక్తివంతంగా చేసుకుని కష్టాల ప్రభావానికి మనసును దూరంగా ఉంచాలి. బాహు బలం కన్నా , ఆయుధ బలం కన్నా , హోదా బలం కన్నా మనో బలం చాలా గొప్పది. మనో బలం కష్టాలను అనతి కాలంలోనే మార్చివేసి వాటిని సానుకూలంగా మార్చగలదు.
ఏదైనా చిన్న పెద్ద సమస్య వచ్చినప్పుడు , అది సమస్య కాదు , ముందుకు వెళ్ళేందుకు పరీక్ష . ఆధ్యాత్మిక శక్తి మనసు కి తోడైతే ఆ సమస్య ను ఆట బొమ్మ వలే ఆడుకోవచ్చు .
☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️
• దృఢత్వం ఒక మానసిక బలం , ఇది ఎంతోకొంత మనందరిలో ఉంటుంది . దీనిని మనం ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు . ముందుగా, నేను దృఢంగా అవ్వాలి, నేను ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలి, నేను నా ఆంతరిక వ్యక్తిత్వాన్ని దోహదపరుచుకోవాలి , నేను జీవితంలో ప్రతి క్షేత్రంలో విజయాన్ని పొందాలి అని గుర్తించాలి.
దృఢత్వం ఏకాంతాన్ని (Isolation) ఇష్టపడుతుంది , ఒంటరితనాన్ని (Aloneness) కాదు . ఏకాంతం ద్వారా పంచభూతాలతో మమేకమై విశ్వ శక్తి తో అనుసంధాన క్రియ సూక్ష్మ స్థితిలో జరుగుతుంది .
వీటితోపాటు జీవితంలో ఉండవలసిన ఇతర ఉద్దేశాలు – అందరితో ప్రేమ , గౌరవం తో ఉండటం , అందరి గురించి మంచిగా ఆలోచించడం , నా బంధాలను మరింత చక్కగా, శాంతియుతంగా మరియు ఆనందమయంగా చేసుకోవడం , మంచి వృత్తిని ఏర్పరచుకోవడం . నా జీవిత పాత్రను మరింత సానుకూలంగా మలచు కోవడం వంటివి.
ఇవి మన జీవితంలోని వివిధ దశలలో ఉండవలసిన వివిధ లక్ష్యాలు మరియు ఉద్దేశాలు. వీటిని సాధించడానికి భౌతికంగా ఏదో ఒకటి చేయడంతో పాటు ముందుగా మన లోపల బలమైన దృఢమైన సంకల్పం ఉండటం అవసరం .
• మానసిక దృఢత్వం లేకుండా , బాహ్యంగా మనం ఎన్ని చేసినా ఆశించిన లక్ష్యాన్ని విజయవంతంగా సాధించలేము . ఎందుకంటే , మన లక్ష్యాన్ని సాధించే దిశలో చేసే ప్రయాణ మార్గంలో మనకు ఆటంకాలు ఎదురవుతాయి . ఆటంకాన్ని చూసిన మరుక్షణం దానిని దాటగలిగే ఆత్మ శక్తి మనలో లేకపోవచ్చు . ఆశ , ఓర్పు , దృఢత్వం నిండిన ఆత్మ శక్తి మనసులో ఆలోచనలుగా , భావాలుగా ఉండాలి.
కనుక, ధృఢత ప్రారంభం అనేది మన మనసులో జరగాలి . దృఢత్వం కఠినత్వం గా ఇనుము వలే కాకుండా మృదుత్వం తో రబ్బరు ఉండాలి . చాలా చాలా జాగ్రత్తగా, దృఢత్వం వైపుగా మన అడుగులు పడాలి, దృఢత్వం మన కర్మలలో కనిపించాలి. అప్పుడు ఈ దృఢత్వం క్రొత్త అవకాశాలను తెరిచేందుకు తాళం చెవి అవుతుంది, ఇది మీరు ఆశించిన విజయ గమ్యానికి తీసుకువెళ్తుంది .
దృఢత్వం లోని పరిణితి . . . మౌనం , ఏకాంతం , స్థిరత్వం , శాంతి , సుఖాలను ఆహ్వానిస్తుంది . మనసు లో వ్యర్థాలను , మలినాలను , అంతర్గత శత్రువులను శాశ్వతం గా తొలగిస్తుంది .
దృఢత్వం అనేది ఒక కారణ భూతం గా (Purposeful ) , యోగదాయకం గా (Fruitfulness) , ప్రాప్తుల ఖజానా గా (Beneficial) ఉండాలి . అంతే కానీ మూర్ఖత్వం , మొండితనం (Rudeness) గా కారాదు .
ధృడంగా ఉండడం వలన స్వీయ రక్షణ కలిగి ఉంటాం . సంబంధ సంపర్కాలలో బలహీనత నొంది ఉన్న వారికి మన ద్వారా సహయత , రక్షణ చేకూరుతుంది .
కానీ దృఢత్వం లోపించిన నాడు , మనలోని బలహీనతల తో పాటు గా , సహచరుల బలహీనతలు మరియు నెగెటివ్ ఎనర్జీ ప్రభావం మనం అనుభవిస్తాం .
ద్వేషము తో ఎవరినీ జయించలేము . మౌనం, శాంతి ప్రేమ తో ప్రపంచాన్ని జయించవచ్చు . అందుకు నిదర్శనం రమణుల వంటి ఎందరో భారత యోగులు .
జీవితం అనే సాగరం లో , సత్యమైన నావ తుఫానుల ఆటుపోట్ల కు ఒడిదుడుకులకు లోను కావచ్చు , కానీ మునగదు . తీరం తప్పకుండా చేరుతుంది . అదే , సత్యమైన నావ కలిగి ఉండే దృఢత్వం లో మహత్యం.
గులాబి మొగ్గ పిందె గా ఉన్నప్పుడు కంటే ఎదుగు తూ . . . ఉన్న సమయం లో, సమీపంలో ఉన్న ప్రతి ముల్లు పదే పదే గుచ్చుతూ హింసిస్తాయి . ఒకసారి ఆ మొగ్గ పువ్వుగా వికసించిన మరుక్షణం , చుట్టూ ఉన్న అవే ముల్లులు గులాబీ యొక్క సౌందర్యం ఆస్వాదిస్తూ రక్షణ అవుతాయి.
ప్రతి మనిషికి తెలియని , తన యధార్థ స్వరూపాన్ని తెలియచేసేది కేవలం శివుడు మాత్రమే . ఎక్కడైతే ఈశ్వరుడు ఆరాధించ బడుతూ ఉంటాడో అక్కడ శుభం ఉంటుంది .
యడ్ల శ్రీనివాసరావు 26 Sep 2025 , 11:00 pm .
No comments:
Post a Comment