Monday, September 29, 2025

694 . తలెత్తుకు జీవిద్ధాం

 

తలెత్తుకు జీవిద్ధాం 





• మనం ఈ భూమి మీద జీవించడానికి జన్మించాం. మన పాదాల కింద భూమి (నేల) ఉంది , తల పైన ఆకాశం ఉంది. మధ్యలో మనం ఉన్నాం . ఇది  అందరికీ  తెలిసిన విషయం .

• అయితే ఇక్కడ విశేషత ఏమంటే, ఉత్తములైన పెద్దలు, అనుభవజ్ఞులైన యోగ్యుల నుంచి ఒక మాట  వింటుంటాం, అది ఏంటంటే  " మనం జీవించినంత కాలం తలెత్తుకు బ్రతకాలి , తల దించుకుని కాదు "  అని.

దీని అర్థం , సమాజం లో అందరి చేత శెభాష్ అని  అనిపించుకునే లా  గౌరవం గా బ్రతకాలి  అని  అనుకుంటాం . తప్పులేదు . ఇది చాలా మంచి విషయం.

కానీ ఇందులో ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉందని  మనకు తెలియదు .


• మానవుని  మూలాల లోకి వెళితే,  ప్రతి మనిషి కి (ఆత్మ కి) తప్పకుండా భగవంతుని తో (పరమాత్మ తో) , తండ్రి పిల్లల సంబంధం ఉంది. కానీ మనం నేడు ఈ మాయా లోకం లో జీవిస్తూ ఉండడం వలన మన మూలమైన యధార్థ సంబంధాన్ని పూర్తిగా మర్చిపోయాం. భగవంతుడు అంటే వేరు, అని అనుకొని భక్తి తో  పూజిస్తాం .  కానీ భగవంతుని తో మనకు ఉన్న గత సంబంధం వలనే (తండ్రి, పిల్లలు) మనం కొలుస్తున్నాం  అనే విషయం పూర్తిగా మర్చిపోయాం .


• మరి భగవంతుడు (పరమాత్మ ,తండ్రి ) ఎక్కడ ఉన్నారు? అంటే . . . ఆకాశం , ఆ పై సూక్ష్మ లోకం దాటి ఉన్న పరంధామం లో. (కొందరు దీనినే పరలోకం అంటారు). ఇదంతా యధార్థ మైన సత్యం అని మన ఆత్మ కి  ముందే  పూర్తిగా తెలుసు .

అందుకు  నిదర్శనం , మనం ఏ కులము , ఏ మతము , ఏ వర్ణము , ఏ జాతి వారిమైన  సరే , భగవంతుని తలంచు కునేటపుడు , తలని పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఓ భగవంతుడా అని తలచుకుంటాం . ఇంకా . . .  భగవంతుడు పైన ఉన్నాడు అన్నీ చూస్తుంటాడు అనే మాట కూడా అంటుంటాం . ( అవునా ? . . .  కాదా ? ఒకసారి ఆలోచించండి. ) కానీ ఈ రెండు చర్యలు , మన శరీర స్పృహ ద్వారా జరగవు. మన ఆత్మ స్పృహ తో జరుగుతాయి. ఎందుకంటే ఆత్మ కి మాత్రమే మన మూలం తెలుసు.  కానీ , నేడు మన లోని ఆత్మ స్పృహ కి , శరీర స్పృహ కి మధ్య అనుసంధానం (కనెక్షన్) లేకపోవడం వలన శరీర స్పృహ కి తెలియకుండా నే , మన ఆత్మ చాలా చర్యలు చేస్తూ ఉంటుంది.   

ఇందుకు ఉదాహరణ  కొన్నిసార్లు  అసాధారణం అనుకున్న పనులు ,  శక్తి కి మించిన పనులు చాలా సులభంగా   చేసేసి   ఆశ్చర్యం తో అంటుంటాం  . . . 

" ఏమో నాకే తెలియకుండా అంతా అలా చేసేశాను ,  

నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు అసలు తెలియదు.  కానీ , అలా ఎలా చెప్పానో నాకు అర్దం కావడం లేదు.

నాకు ఆ సమయంలో శక్తి ఎలా వచ్చిందో తెలియదు . కానీ ఆ శక్తి, నిత్యం నాతో ఉండేది మాత్రం కాదు.

ఇది  ఇదివరకే  ఎప్పుడో  అచ్చం  ఇలాగే జరిగినట్లు అనిపిస్తుంది .

ఇదంతా నాకు తెలుసు,  నేను ఇదంతా ఎప్పడో చూశాను. నాకు ఈ ప్రదేశం కొత్త గా అనిపించడం లేదు . 

నేనే ఇదంతా చేశానా ? నమ్మలేకున్నాను " 

అని  మనలో మనం ఇలా రకరకాలుగా వివిధ సందర్భాలలో  అనుకోవడం జరుగుతుంది. ఇదే  ఆత్మ శక్తి .


☘️  ☘️ ☘️ ☘️ ☘️ ☘️

ఇక  మొదటి  విషయానికి  వస్తే . . . 

• భగవంతుడు , పరమాత్మ శివుడు నివసించే స్థానం  పరంధామం ,  ఇదే మన (ఆత్మల) స్వస్థానం .  ఇహ లోకంలో  మనం శరీరం విడిచిన (చనిపోయిన ) 13 రోజుల తరువాత ,  తండ్రియైన పరమాత్మ  శివుని వైపు మన ఆత్మ చూస్తుంది . శివుని వద్దకు మరియు  ఆత్మ  స్వస్థానం అయిన పరంధామం వెళ్ళడానికి  ఆత్మ  ప్రయత్నం చేస్తుంది .   

కానీ , అనేక జన్మలు గా  భూమి పై ఆత్మ చేసిన కర్మలు లెక్కలు  ఇంకా పెండింగ్ ఉండడం , బుణానుబంధాలు లెక్కలు  పెండింగ్  ఇంకా భూమి పై  మిగిలి ఉండడం వలన  , మరియు ఆత్మ  పూర్తిగా  సంపూర్ణ పవిత్రత శక్తి  సాధించ లేకపోవడం వలన  తిరిగి శరీరం తీసుకొని జన్మిస్తుంది.  ఆత్మ కి శరీరం ఉంటేనే  కర్మలు  లెక్కాచారం  పూర్తి చేసుకోవడానికి సాధ్యం అవుతుంది .  ఇదే  మనిషి  జనన మరణ చక్రం లోని  సూక్ష్మ రహస్యం .


• తలెత్తుకుని బ్రతకాలి అని ఎందుకు అంటారు . అంటే  ,  ఏనాడైతే  పైన  ఉన్న పరమాత్మ ను మరువకుండా  నిత్యం మనసు తో  చూస్తూ ధ్యానిస్తూ  స్మృతి  చేస్తూ  ఉంటావో,   నీలో అణగారిపోయిన  నీ మూల స్వభావాలు , సంస్కారాలు అయిన  . . . 

ప్రేమ - శాంతి , పవిత్రత ‌- జ్ఞానం , సుఖం - ఆనందం , శక్తి  అయిన ఏడు దివ్య గుణాలు  తిరిగి నీ  ఆత్మలో నిండు కుంటాయి .

ఈ గుణాలు నీ లో  నిండి ఉన్న నాడు ఈ భూమి పై దుఃఖం లేకుండా, పవిత్రం గా, ధర్మం గా, సంతోషంగా , గౌరవం గా జీవించిన నాడు శివుని వద్దకు  వెళ్తావని , తలెత్తుకు బ్రతకాలి అంటారు . ఇదే  ఇందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం .


• అంతేకానీ అందరూ ఊహించినట్లు  ధనం , ఉద్యోగం,  పేరు,  హోదా,  కీర్తి  సంపాదిస్తే తలెత్తుకుని జీవించడం అని అనుకోవడం చాలా  అమాయకత్వం.  ఎందుకంటే  ఇవన్నీ తాత్కాలికం .  ఇందుకు నిదర్శనంగా ఎన్నో  ఉదాహరణలు చెప్పుకోవచ్చు .  దేశానికి అధినేతలు గా చలామణి అవుతున్న వారికి సర్వ సౌఖ్యాలు, ధనం , కీర్తి , పేరు అన్నీ ఉన్నా  చాలా నీచాతి నీచంగా  ప్రవర్తిస్తూ బహిరంగంగా బ్రతుకు తున్నారు (అమెరికా , పాకిస్థాన్ అధ్యక్షులు  . . .  ఇంకా మరెందరో  నిత్యం  మన  కళ్ళ ముందు ఉన్న వారు కూడా . . . )

అందుకే  ధనం , అధికారం , కీర్తి  , పేరు సంపాదించిందిన   మనిషి    ,  ఎంతటి  స్థాయి వారైనా సరే  బుద్ధి  సరిగా లేకపోతే , పవిత్రత శక్తి లేకపోతే  సుఖం  శాంతి  లేక , నిత్యం ఒత్తిడి తో నిద్ర లేక , మానసిక హింస అనుభవిస్తూ , అందరిని  హింసిస్తూ , బయటకు చెప్పుకోలేక  నరక యాతన తో జీవించ  వలసి వస్తుంది . ప్రస్తుతం నేడు , ఈ లోకంలో ఇదే జరుగుతోంది . 


• ఇక రెండో విషయం . . .

తలదించుకునేలా జీవించ వద్దు అని ఎందుకు అంటారు ?  . . . తల దించుకుంటే కనిపించేది నేల, భూమి, భౌతిక ప్రపంచం . ఇందులో శరీర భారం, మాయ , దుఃఖం , విలాసాలు , కామ వికారాలతో  పాటు  ఈ నేల మీద ధర్మాన్ని అతిక్రమించేవి  ఎన్నో పుష్కలంగా ఉన్నాయి .  ఇవి మన పాదాల కింద  ఉన్న ఈ భూమి మీద మాయా రూపం లో  ఉంటాయి .  వీటన్నింటి  వలన సంతోషం ఆనందం లభిస్తున్నాయి అని అనుకుంటాం , కానీ  అవి నీటి బుడగలా  అల్పకాలికం మాత్రమే ఉంటాయి .  ఇవి మనిషి ని  ఆకర్షిస్తూ తలదించుకొనేలా చేసి  పతనం చేస్తాయని,  క్రమేపీ బలహీనుడి గా  అయి  , మనిషి ( ఆత్మ ) మరింత క్షోభకు గురవుతాడని  అని సూక్ష్మార్థం .

ఇవన్నీ మనిషి మనసు వెనుక జరిగే  నిత్య సత్యాలు  .


మనిషి జీవించడానికి  ధనం,  ఆహారం , గృహం , ఆరోగ్యం,  వసతుల  సౌఖ్యం , మంచి  మానవ సంబంధాలు  అత్యంత అవసరం . వీటి సంపాదన కోసం  మనిషి  మంచి బుద్ధి తో కృషి చేయడం అవసరం. 

కానీ ,  వీటి   కోసం  మాత్రమే  కేవలం మనిషి జన్మించినట్లు , యాంత్రికంగా  తనను  తాను మరచి , అర్దం లేకుండా  జీవించడం వలన  చివరికి  ఆత్మ కి మిగిలేది  క్షోభే .  ఎందుకంటే  శరీరం ఎలాగో బూడిద అవుతుంది. ఆత్మ కి మరణం లేదు. ఆత్మ  మరలా ఇవే స్వభావ సంస్కారాల తో  తిరిగి మరో  జన్మ ఎత్తుతుంది .  


మనిషి కి   అంతరం లో   ఉండే  బలమైన ఆధ్యాత్మిక శక్తి    మాత్రమే   బాహ్య  ప్రపంచంలో  సజావుగా   జీవించడానికి కావలసిన   భౌతిక శక్తి ని  సమతుల్యం చేస్తుంది .   లేనిచో , నేటి  ప్రపంచంలో  విస్తరించిన  మాయకు (బలహీనత లకు) మనిషి  లోని  భౌతిక శక్తి  పెరుగుతూ ఉన్నట్లుగా అనిపించినా చివరకు పూర్తిగా నిర్వీర్యం అయిపోతాడు .

మనిషి  ఈ విషయం  స్వయంగా  తాను అనుభవ పూర్వకంగా  గ్రహించడానికి  కొన్నిసార్లు ,  అనేక జన్మలు కూడా పట్టవచ్చును.


• తలెత్తుకుని జీవిద్ధాం . మన మూలాల లో ఉన్న శివ పరమాత్ముని బుద్ధి తో స్పృశిద్ధాం.  మానసిక బలవంతులు గా అయి  భౌతిక జీవనం లో  ఉండే  మాయా బలహీనతలను  జయిద్ధాం .  

ఇదే మనిషి తనపై  తాను విజయం సాధించడం .  తలెత్తుకు తిరగడం.


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏.

యడ్ల శ్రీనివాసరావు 29 Sep 2025 1:00 PM


No comments:

Post a Comment

694 . తలెత్తుకు జీవిద్ధాం

  తలెత్తుకు జీవిద్ధాం  • మనం ఈ భూమి మీద జీవించడానికి జన్మించాం. మన పాదాల కింద భూమి (నేల) ఉంది , తల పైన ఆకాశం ఉంది. మధ్యలో మనం ఉన్నాం . ఇది  ...