Saturday, September 20, 2025

691.ప్రతి అడుగులో విలువలు

 

  ప్రతి  అడుగులో విలువలు 



• మనం  ఉన్నతిని పొందాలంటే , ఎక్కువ సంపాదించాల్సిన  అవసరం లేదు . కానీ మనకు ఉన్న వాటిని మరియు మన విశేషతలను కోల్పోకుండా చూసుకోవాలి. 

సాధారణంగా  మన ప్రవర్తన ఎప్పుడూ కూడా , మనతో ఎవరైనా ప్రవర్తించే  విధానాన్ని  బట్టి ప్రతిబింబిస్తుంది. వాళ్ళు మనతో బాగుంటే మనం బాగుంటాము . లేకపోతే మనం వారి పట్ల ప్రతికూలంగా మారతాము . కానీ వారి చర్యలను కాపీ చేయడం వలన, మన స్వంత విశేషతలు  మాత్రం  ఎన్నడూ మసకబారకూడదు .

• నేడు  ప్రపంచంలో  క్షీణిస్తున్న  నైతిక విలువల వల్ల  మీరు  తరచుగా  నిరుత్సాహానికి గురవుతున్నారా? 

• మీరు మీ సుగుణాలతో  ఎవరితోనైనా మాట్లాడితే , ఆ వ్యక్తి ఏ మాత్రం సానుకూలంగా స్పందించనప్పుడు , మీరు వారి ప్రవర్తనను కాపీ చేయాలని భావిస్తున్నారా?  

• మీ  చుట్టూ ఉన్న  వ్యక్తులు ఏదైనా విలువను పాటించనందున మీరు వారిని వదులుకున్నారా? 

మనమందరం మనకు వీలైనంత మంచిగా మరియు దయతో ఉండటానికి ప్రయత్నిస్తాము. సమస్య ఏమిటంటే అవతలి వ్యక్తి అంతే మంచిగా (లేదా ఇంకా మెరుగ్గా) ఉండాలని మనం ఆశిస్తాము . అంతకన్నా పెద్ద సమస్య ఏమిటంటే, ఆ వ్యక్తి మనతో సరిగ్గా లేకపోతే, మనము వారి ప్రవర్తనను కాపీ చేస్తాము. 

మనం ఒకరి తప్పుడు ప్రవర్తనను కాపీ చేసిన ప్రతిసారీ,  మనం మన సుగుణాలకు  దూరంగా అవుతాము. చివరికి మనం మనలో ఉన్న విశేషతలను వదులుకుంటాము  .  

అందువలన వారి ప్రవర్తనను కాపీ  చేయడం అనేదాని  కంటే  కూడా  వారికి  కామా పెట్టి  చూద్దాం  ,  పరిస్థితి ఇంకా అలాగే  కొనసాగితే  శాశ్వతం గా  వారికి  బిందువు (పుల్ స్టాప్) పెడదాం .


• మీ చుట్టూ ఉన్న వారి పై ,  మీరు నమ్మకం కోల్పోయారా ?

ప్రవర్తన లలో  సమానతలు  లోపించి నపుడు మాత్రమే  నమ్మకం సడలుతుంది . అది మీ భాగ్యం . తరచూ మోసపోవడం అనే విష కోరల నుంచి విముక్తి పొందారు .  అందుకు ఎవరిని  నిందించకూడదు , వీలైతే వారికి మనసు ద్వారా కృతజ్ఞతలు తెలియచేయాలి .  ఇక  మీ ఆలోచనలు మరింత మెరుగు అయ్యే సమయం ఆసన్నమైంది. ప్రతీ సంఘటన  వెనుక  శ్రేయస్సు  ఉంటుంది . సాధారణంగా మనం నమ్మిన వారికే , మనల్ని  మోసం చేసే హక్కును  ధైర్యం  కలిగి ఉంటారు. అటువంటి వారి నుంచి విముక్తి లభించడం అదృష్టంగా భావించాలి.


• ప్రశంసలను  ఆస్వాదన  చేద్దాం .  కానీ ఆకళింపు చేసుకోవద్దు .  ప్రశంసలు కురిపించే వారు, తమ మానసిక స్థితి తో  భావోద్వేగాలను ఎన్నో విధాలుగా  ప్రదర్శిస్తూ ఉంటారు . వాటిని  కొన్ని   క్షణాలు ఆస్వాదించి వదిలివేయాలి. వాటిని ఆకళింపు చేసుకోవడం  వలన  నైతిక  పతనం ఆరంభం అవుతుంది . 


• మన విలువలు , సుగుణాలు , సూత్రాలు  మరియు నైతికత  మన శక్తి అని , మనం వాటికి కట్టుబడి  ఉందాము .  మన చుట్టుపక్కల ఉన్నవారెవరూ  వాటిని  ఉపయోగించక పోయినా ,   ఇతరులు . . .  మానవ విలువలు పని చేయవు అని భావించినా , మనం వాటిని వదులుకోవద్దు .  ఇతర వ్యక్తులు పూర్తిగా మీకు భిన్నమైన  గుణాలను కలిగి ఉండవచ్చు , అవి మీలో  లోపించవచ్చు . 

ప్రతిసారీ, మీ లో ని  విలువలను తప్పకుండా ప్రతి  ఒక్కరితో  ఉపయోగించాలని నిర్ధారించుకోండి . అందుకు సరియైన  ప్రవర్తనా  మార్గం ఎంచుకోండి . ఇతరుల  కాలక్షేపాలకు  మనం  సమిధ గా  అవడం కంటే , అందరి కాలక్షేమాలకు జ్యోతి గా  అవడం  పుణ్యం .


• మీకు మీరు గుర్తు చేసుకోండి – నేను ఎల్లపుడూ పరిస్థితులు మరియు చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధం లేకుండా అందరితో నా సద్గుణాలను నా పరిధి లో  ఉపయోగిస్తాను  . నా విలువలు నా శక్తివంతమైన  వ్యక్తిత్వాన్ని  ప్రతిబింబిస్తాయి.

• మీలోని  ఏ విశేషతనైనా  మీ జీవితంలో వేసే ప్రతి అడుగులో , అది మీ నుండి ప్రతి ఒక్కరికి , ప్రతి పరిస్థితిలో ప్రవహించేలా చూసుకోవడం ప్రారంభించండి.  ఇతరులలో  ఆ విశేషత  ఉండాలని ఆశించకూడదు. కేవలం అది వారిలో లేదని మీరు మీ  విశేషతను  వదులుకోకూడదు. 

మీకు మీరే గుర్తు చేసుకోండి – నా సుగుణాలు నా ఆస్తులు . నేను వాటిని అన్ని సమయాలలో ప్రసరిస్తాను . వ్యక్తులు మరియు పరిస్థితులతో సంబంధం లేకుండా నా విలువలు  నాతోను  తప్పక  ఉంటాయి . అదే " నేను " . . .   నేను  ఒక  ఆత్మ ను .   

ముందు మీరు మీ కోసమే ఉన్నారు . . . ఆ తరువాత ఇతరుల కోసం . మార్గాన్ని  అవలంభించ లేని వారు ,  దారి చూపలేరు . ముందుకు సాగాలి అంటే వెను తిరగకూడదు .

మీరు మీ మార్పు కోసమే జన్మించారు , కానీ  ఏ  ఒక్కరి మార్పు కోసం కాదు .  మీలోని  మార్పు  సహజంగా నే  మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. 

మంచి మార్పు , నిరంతరం నిజాయితీతో  కూడిన  ఆత్మ విమర్శ  తోనే  సాధ్యం. 

ఇవన్నీ  మనస్సాక్షి తో  జరగవలసిన  ప్రక్రియలు .  


యడ్ల శ్రీనివాసరావు 18 Sep 2025 , 10:00 AM.



No comments:

Post a Comment

691.ప్రతి అడుగులో విలువలు

    ప్రతి  అడుగులో విలువలు  • మనం  ఉన్నతిని పొందాలంటే , ఎక్కువ సంపాదించాల్సిన  అవసరం లేదు . కానీ మనకు ఉన్న వాటిని మరియు మన విశేషతలను కోల్పోక...