Monday, August 1, 2022

223. అధమోత్తమ జీవులు


అధమోత్తమ జీవులు• చాలా కాలం నుంచి, అంటే చిన్న నాటి నుండి మనసును వేధిస్తున్న విపరీతమైన ఆలోచన ఇది.


• బజారులో రోడ్డు మీద వెళుతున్నప్పుడు పుట్ పాత్ మీద, నడిరోడ్డు మధ్యలో, రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవాలయాల బయట తరుచుగా ప్రతీ ఒక్కరికీ కనిపించే సన్నివేశం చిన్న పిల్లలు, వృద్ధులు, అంధులు, అంగవైకల్యం తో బాధపడే వికలాంగ యాచకులు కనిపిస్తూనే ఉంటారు. వారిని చూసినప్పుడు కొన్ని సార్లు దానం చేస్తాం, కొన్ని సార్లు ముఖం పక్కకు తిప్పుకుంటాం, కొన్ని సార్లు చిరాకు గా పొమ్మని విసుక్కుంటూ ఉంటాం. ఆ క్షణం ఆ ఆలోచన వదిలేసి మరొక పనిలో నిమగ్నమవుతుంటాం. ఇదంతా విచిత్రం ఏమీ కాదు. సహజంగా ప్రతీ ఊరిలో ప్రతీ చోట ప్రతీ ఒక్కరి కళ్ల ఎదుట జరిగే సహజమైన నిరంతర ప్రక్రియ.


• ఇది 1991 సంవత్సరం లో జరిగిన చిన్న సంఘటన. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. నేను నెల్లూరు ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కి వెళుతున్నాను. రాజమండ్రిలో సర్కార్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ సాయింత్రం 5 గంటలకు ఎక్కడానికి రైల్వే స్టేషన్ కు వచ్చాను. నాతో పాటు నా ఇంటర్ లో బెస్ట్ ఫ్రెండ్ సురేంద్ర బెంగుళూరు లో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ లో జాయిన్ అయ్యాడు, వాడు మద్రాసు వరకు ఆ టైన్ లో వస్తున్నాడు. ఇద్దరం ఒకేసారి రిజర్వేషన్ చేయించుకోవడం వలన ఒకే చోట బెర్త్ లు వచ్చాయి. రైలు ఇంకా రాలేదు. రైల్వే ప్లాట్ ఫాం మీద కూర్చుని ఉన్నాము ఇద్దరం. నాకు రాత్రి తినడానికి చికెన్ పలావ్ పేకెట్ పార్శిల్ చేసి పెట్టింది మా అమ్మ. అలాగే నాకు బాగా ఇష్టం అని పాపిడి స్వీట్లు (12 కలిపి ఒక పాకెట్ ఉంటుంది) కూడా తెచ్చుకున్నాను.


• రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం బెంచ్ మీద కూర్చుని నేను, సురేంద్ర మాట్లాడుతూ ఉండగా , ఎదురుగా రైల్వే పట్టాలమీద ఒక చిన్న పిల్ల వాడు, చింపిరి జుత్తు చిరిగిన పొడవైన చొక్కా తో, కాళ్లకి చెప్పులు లేకుండా , గోనె సంచి వీపున వేసుకుని ప్లాస్టిక్ కవర్ లు , కాగితాలు ఏరుకుంటూ ఉన్నాడు.


• ఆ పిల్ల వాడిని చూస్తుంటే ఉండలేక పోతున్నాను. ఏదో అలజడి మనసు లో మొదలైంది. నేను సురేంద్ర తో అన్నాను , చూడరా చిన్న పిల్లోడు , పాపం అని బాధపడ్డాను. సురేంద్ర నా వైపు చూసి అదోలా నవ్వాడు. నాకు తెలియకుండానే కళ్లల్లో నీళ్లు వచ్చేసాయి. వెంటనే ఉండలేక నా బాగ్ లో నుంచి పాపిడి స్వీట్లు పాకేట్ తీసి ఆ చిన్న పిల్లాడికి ఇచ్చేసాను. ఆ పిల్ల వాడు సంతోషంగా తీసుకుని వెళ్లి పోయాడు. సురేంద్ర కి ఏమీ అర్ధం కాలేదు. ఏరా నీకు పిచ్చా ఏంటీ, నీకు స్వీట్లు బాగా ఇష్టం కదా, నువ్వు తినడానికి తెచ్చినవి ఆ పిల్లాడి కి ఇచ్చేసావు ఎందుకు అన్నాడు. ఏమో రా నాకు తెలియదు ఆ పిల్లాడి ని చూడలేకపోయాను, జాలేసింది అన్నాను. చాలు చాలు దానకర్ణుడువి బయలు దేరావు అని సరదాగా హేళన చేశాడు.


• ఇంతలో ట్రైన్ వచ్చింది, ఇద్దరం ఎక్కి కూర్చున్నాము. ట్రైన్ లో వెళ్తున్నా సరే నేను ఆ సంఘటన నేను మరచి పోయినా , సురేంద్ర నన్ను ఆట పట్టిస్తూనే ఉన్నాడు చాలా సేపు. బహుశా ఆ టీనేజ్ అలాంటిది. ఇంతలో ట్రైన్ విజయవాడ వచ్చింది. మేము ఇంకా భోజనం చెయ్యలేదు . భోజనం తిందామని రెడీ అవుతున్నాం. కరెక్ట్ గా మా భోగి లో, మేము కిటికీ పక్కన కూర్చుని ఉన్నాము. ఫ్లాట్ ఫాం మీద ఒక ముసలి వ్యక్తి కి కాళ్లు లేవు, మెట్లు ఎక్కే ఫ్లై ఓవర్ కింద కూర్చుని మా వైపు చూస్తున్నాడు. నాకు చాలా జాలేసింది. మేము ఫుడ్ తినడానికి రెడీ అయ్యాము. అప్పుడు సురేంద్ర “ఏరా కొంపదీసి చికెన్ పలావ్ ఆ అడుక్కునే వాడికి ఇచ్చేస్తావా ఏంటీ” అని అనడం పూర్తికాకుండానే, నేను టైన్ దిగి వెళ్లి ఇచ్చేసాను. ఎందుకో కారణం తెలియదు మనసు మీద కొన్ని అంత ప్రభావం చూపిస్తాయనుకుంటా. ఆ తర్వాత సురేంద్ర ఫుడ్ షేర్ చే‌సుకుని తిన్నాం…..ఈ రెండు సంఘటనలు నేను ఆలోచించి కావాలని చేసినవి కావు. అవి ఎవరో బై ఫోర్స్ తో అలా జరిగాయి. ఎందుకంటే నాకు ఫుడ్ , స్వీట్స్, పలావ్ అంటే విపరీతమైన ఇష్టం. అసలు ఎవరు అడిగినా పెట్టను. ఇది జరిగి 30 సంవత్సరాలు అయినా అప్పుడప్పుడూ ఎందుకో గుర్తు వస్తూనే ఉంటుంది నేటి వరకు.


• ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే , ప్రతీ మనిషి లోను ప్రేమ, కోపం, ఇష్టం లాంటి గుణాలతో పాటు జాలి, దయ, కరుణ అనేవి కూడా సహజంగా ఉంటాయి. కానీ మన పరిస్థితుల వలన, స్వభావం వలన కొన్ని బయటకు వ్యక్త పరుస్తాం, కొన్ని మనసులోనే దాచుకుంటాము. కానీ మంచి గుణాలను ఎప్పుడూ దాచుకోవడం వలన ఉపయోగం ఉండదు సరికదా చివరికి ఆత్మ సంతృప్తి కూడా ఉండదు. అందుకే సాధ్యం అయినంత వరకు మంచి గుణాలను, లక్షణాలను బయటకు ఆచరించడం వలన పెండింగ్ లో ఉన్న కర్మలు తీరుతాయి.


• నేను ముఖ్యం గా చెప్పాలనుకున్నది ఏంటంటే…నాకు తరచూ పైన నేను పేర్కొన్న కొంతమంది విపరీతమైన అంగవైకల్యంతో, అంధత్వం తో, నేలమీద పాకుతూ, రైలు భోగీలలో కింద తుడుస్తూ జీవనం గడిపే యాచకుల ను చూసినప్పుడు చాలా తెలియని బాధ, గుండె కోతగా అనిపిస్తుంది. బయటకు రాని కన్నీళ్లు లోపల దిగమింగే వాడిని(may be my sensitiveness). ఆ సమయంలో వారి కోసం ఏదైనా చెయ్యాలని మనసు లో అనిపిస్తుంది కానీ ఏం చెయ్యాలో కూడా అర్దం కాదు, ఏదో డబ్బులు దానం చెయ్యడం తప్ప. కానీ వారిని చూసి నప్పుడు మాత్రం ఎవరికైనా నోటినుండి వచ్చే మాట “ అయ్యొ పాపం” అని తెలియకుండా నే అంటారు.


• ఒకోసారి మాత్రం వాళ్లని చూసినప్పుడు నేను ఎంతో అదృష్టవంతుడిని అనిపిస్తుంది….. కానీ వాళ్ళు ఎందుకు ఇలా పుడతారు, ఇంత దయనీయమైన పరిస్థితిలో ఎందుకు జీవిస్తారు, చావలేక బ్రతుకుతూ ఎందుకు ఇలాంటి జన్మ అనుభవిస్తారు. అని పదే పదే పదే విపరీతమైన ప్రశ్నలు చాలా సార్లు వస్తాయి. కానీ ఈ మధ్య ఒకసారి గట్టిగా భగవంతుని ముందు ఈ ప్రశ్న ను ఉంచాను.


• సరిగ్గా రెండు రోజుల తరువాత పరమాత్మ శివుని నుండి ధ్యానం లో నాకు వచ్చిన సమాధానం ఇది…. అంగవైకల్యం గల యాచకులు, అంధులు, మతిస్థిమితం లేని వారు, ఇలా విపరీతమైన స్థితులలో ఉన్న వారిని చూసి జాలిపడడం, బాధపడడం కాదు కావలసింది. వారి నుంచి మీరు చాలా నేర్చు కోవాలి…. వారు ఈ లోకానికి, సమాజానికి , మిగిలిన మానవాళిని ఉద్ధరించడానికి, సందేశం ఇవ్వడానికి జన్మించారు. అదేంటంటే వారు గత జన్మలలో ఎన్నో నీచమైన, ఘోరమైన చెడు కర్మలు, అకృత్యాలు చేసి నేడు ఈ ధీనమైన జన్మ తీసుకుని ఫలితాన్ని ఈ విధంగా అనుభవిస్తున్నారు. అది నేడు మీ మానవాళికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వాళ్లను ఆ ధీన స్థితి నుంచి ఎవరూ శాశ్వతం గా తప్పించలేరు . ఎందుకంటే వారు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం గా వారి ఆత్మలు ఈ జన్మ ఈవిధంగా తీసుకున్నాయి. వారు గత జన్మలలో ఎప్పుడో  పాపాత్ములు. పాపం చేసిన ఆత్మలు. వారిని ఆదర్శంగా తీసుకుని చెడు కర్మలు చేయకండి. లేదంటే అటువంటి జన్మ ఎవరికైనా రావచ్చును.


•  నాకు అనిపిస్తుంది…. మనం చూడగలిగితే, అర్దం చేసుకోగలిగితే, సమాధానం వెతుక్కోవడం మెదలు పెడితే ఈ ప్రపంచంలో ప్రతీ ఒక్కరి నుండి , మనకు మంచి చేసినవారు, చెడు చేసిన వారు, మోసం చేసిన వారు, మనతో ఉంటూ వంచించి నటించే వారు, దుఃఖం కలిగించే వారి వలన కూడా,  జాగ్రత్త గా గమనిస్తే  ఏదో ఒక మంచి సందేశం మనకి తెలియవస్తుంది.


• జాలి దయ కరుణ అనేవి సాటి జీవులపై చూపడం వలన జీవుడిలో ఉన్న అంతర్గత రాక్షస గుణాలు నశించబడి ఉద్ధరించబడతాడు , తత్ఫలితంగా ఉత్తమమైన జన్మము పొంది విముక్తుడవుతాడు.


• ఇవన్నీ చాలా మంది కి తెలిసిన విషయాలే అయినా, ఎందుకో శివుని ద్వారా వచ్చిన ఆలోచనలు రాయించాయి.


యడ్ల శ్రీనివాసరావు 2 Aug 2022 , 12:15 AM.

No comments:

Post a Comment