Wednesday, May 3, 2023

353. ఒంటరి తనం - ఏకాంతం

 

ఒంటరి తనం – ఏకాంతం


• ఒంటరి తనం , ఏకాంతం ఈ రెెండు ఒకేలా అనిపిస్తూ ఉంటాయి చాలా మంది కి. కాని రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది.


ఒంటరి తనం

• ఒంటరి తనం లో మనిషి కి , మనసుకు ఒక విధమైన అపరిపక్వత ఉంటుంది. ఇందులో మనిషి ఏదో తెలియని దుఃఖం అనుక్షణం అనుభవిస్తాడు. విధి తన పట్ల వక్రించినట్లు, కాలం తనకు అన్యాయం చేసినట్లు, కేవలం ఒక వ్యక్తి  తనలో   తాను మాత్రమే ఆ స్థితి అనుభవిస్తున్న భావన అంతరంగం లో స్థితమై ఉండి పోతుంది.

• ఈ దశలో మనిషి తను మినహా, తన కుటుంబం లో కాని, పరిసరాలలో కాని, సమాజం లో కాని ఉన్న ప్రతీ ఒక్కరూ సంతోషం గా ఉన్నారని భావిస్తాడు. ఇందులో మనిషి తనకే తెలియని ఒక ఆత్మన్యూనతా భావం (డిప్రెషన్)  లోకి జారిపోతాడు.  ప్రతి క్షణం తాను ఒంటరిని , తనకంటూ ఎవరూ లేరని   లేదా  అందరికీ అన్నీ ఉన్నాయి తనకు మాత్రమే ఏమీ లేవు అనే ఆలోచనలు నిరంతరం వేధిస్తూ ఉంటాయి. అందువలన ఎవరితోనూ కలవక ఒంటరి గా ఉండడం అలవాటు చేసుకుని నిమ్న తత్వం తో ఉండడం జరుగుతుంది.

• ఇది చాలా సహజంగా ఎక్కువ శాతం చిన్న పిల్లల్లో, విద్యార్థి దశలో మరియు కొందరు పెద్ద వారిలో కనిపిస్తుంది. దీనికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉంటాయి. అవి చదువు లో ఏకాగ్రత లేక పోవడం, కుటుంబంలో ప్రేమ లభించక పోవడం, అనుకున్నది సాధించలేక వెనకబడడడం, అపజయాలు కలగడం, జీవితం పట్ల సానుకూలత లేకపోవడం. ఇలాంటి వి అనేక కారణాలు కలిసి మనిషి కి తన లో ఉన్న మానసిక శక్తి బలహీనం గా అయి పోతుంది. నిజానికి ఈ దశలో మనిషి మనసు కి తన చుట్టూ ఎంత మంది ఉన్నా ఒంటరి గా అనిపిస్తుంది, వేదన మిగులుతుంది.


• కానీ వాస్తవానికి ఈ ఒంటరితనాన్ని మనిషి కాస్త సరిగా అర్థం చేసుకుంటూ పాజిటివ్ గా ఆలోచిస్తే , నిజానికి దానంత అదృష్టం మరొకటి లేదు. ఈ సృష్టిలో ప్రతీ మనిషి ఏకైక తత్వం (uniqueness) తో నే ఉంటాడు

• అంటే ఒకరి తత్వం మరొకరి తత్వం తో అనుసంధానించబడి ఉండదు అనేది వాస్తవం. కాని మనిషి భౌతిక జీవన అవసరాలు తీర్చుకునేందుకు మరొక మనిషి తత్వం తో అనుసంధానం కావాలని ఏర్పరచుకుంటాడు. ఇది సూక్ష్మంగా ఆలోచిస్తే మనిషి మనసు ఎప్పుడూ ఒంటరే. కాని బుద్ది ఈ విషయం గ్రహించక పోవడం వలన , ఒంటరి తనం ఒక శాపం గా భావిస్తూ , తన మానసిక బలం కోల్పోతూ బాధ అనుభవిస్తుంటాడు. ఒంటరి తనం లో ఉన్న అసలైన బలం గ్రహించిన నాడు, ఈ భౌతిక ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుని , తన లక్ష్యాలను అలవోకగా సాధిస్తాడు.

• మహానుభావులు, చరిత్ర సృష్టించిన వారు జీవిత లోతుల్లోకి వెళ్లి చూస్తే వారు తప్పని సరిగా ఒంటరి తనం వలన ఒక దశలో విపరీతం గా బాధపడి, ఆ బాధలో నుంచి తమ బలాన్ని గ్రహించిన వారే. ఒంటరితనం భగవంతుడు మనిషికి కల్పించిన ఒక గొప్ప అద్భుతమైన స్థితి. నీకు నువ్వు ఎవరు అని తెలుసు కో గలిగే అవకాశం కల్పించే ఎంతో ఉన్నతమైన స్థితి. అంతేకానీ ఒంటరి తనం అంటే శాపం అని, అపజయాలు కలిగినప్పుడు ఆత్మహత్య లు చేసుకోవడం వంటివి అజ్ఞానం తో కూడుకున్నవి. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి తన ఒంటరి తనాన్ని ఒక బలం , ఆయుధం గా భావిస్తాడో అప్పుడు తను జీవితం లో నటిస్తూ బ్రతకడు. నిజాయితీ గా బ్రతకడం అలవాటు చేసుకోగలుగుతాడు. అప్పుడు ఆ మనిషి కి ప్రకృతి, పంచభూతాలు కూడా సహకరిస్తాయి. ఎందుకంటే నిజాయితీ లో మాలిన్యం ఉండదు కాబట్టి.


ఏకాంతం

• ఈ స్థితి లోకి మనిషి రావాలంటే ఒక నిర్లిప్తత, వైరాగ్యం తోనే సాధ్యం అవుతుంది. వైరాగ్యం అంటే సత్యాన్వేషణ కోసం చేసే సాధన మార్గం. వైరాగ్యం అంటే విరక్తి కాదు.

• ఏకాంతం ద్వారా మనిషి పరిపక్వత ను అనుభవం చేసుకొని పరిపూర్ణత సాధించగలుగుతాడు. మనిషి ఎంత ఎక్కువ ఏకాంతంగా గడిపితే అంతగా తనను తాను మరియు ప్రకృతిని ప్రేమించగలుగుతాడు. ఏకాంత స్థితి లో మనసు కి  ఏ విధమైన అలజడులు ఉండవు. అర్దం లేని విపరీత కోరికలు  ఉండవు. ప్రశాంతంగా మనసును ఎలా ఉంచుకోవాలో తెలుసుకొని , మంచి ఆరోగ్యం గా ఉంటాడు. తన సమస్యలను తానే పరిష్కారించుకో గలడు. ఇది పూర్తిగా ఒక ఉన్నత మైన స్థితి. వ్యర్థమైన ఆలోచనలు కలుగవు.

• ఏకాంతం అంటే మనిషి తన మనసు లోని ఆలోచనలను కేవలం తనపై మాత్రమే ఒక వివేకం తో దృష్టి పెట్టుకొని నిశితంగా, ఏ అలజడులు లేకుండా గమనిస్తూ స్థిత ప్రజ్ఞత కలిగివుండటం. ఇదంతా స్పృహ లోనే ఉంటూ , జన జీవనం లోనే ఉంటూ మనిషి తను మనసును isolate చేసుకునే ప్రక్రియ.

• ఏకాంత స్థితి అనుభవిస్తున్న మనిషి అంతరంగం మరోక frequency స్థాయి లో ఉంటుంది. అంటే ఈ స్థితి లో మనచుట్టూ మనుషుల తో ఉన్నా సరే, మరెవరి యొక్క ఆలోచనల frequency ప్రభావం ఈ మనిషి పై పడదు.

• ఎందుకంటే ఏకాంతం లో ఉన్నప్పుడు ప్రకృతి మనసు తో మాట్లాడడం మొదలుపెడుతుంది. కాలం సహకరించడం మొదలు పెడుతుంది. మనిషి పంచభూతాల ప్రకృతి మిళితం. ఎప్పుడైతే మనిషి ఏకాంతం అనుభవిస్తూ ఉంటాడో , తన చుట్టూ ఉన్న ఆరా (వలయం) తెరుచుకొని ప్రకృతి ని అనుసంధానం చేస్తుంది. ఈ స్థితి లో మనిషి ఆలోచనలు ఏ కల్మషం లేకుండా ఉన్నతంగా అవుతాయి. ఇది మనిషి తనను తాను ప్రేమించుకునే మంచి స్థితి. అప్పుడు సహజంగా నే మనిషి ప్రతీ ఒక్కరిని ప్రేమించడం మొదలు పెడతాడు.

• నేటి కాలంలో సమాజం లో ఒంటరి తనం, ఏకాంతం అంటే, అవగాహన లేని వారు అనుకునేది ఏమంటే…. అన్నీ కోల్పోయిన వారు  మాత్రమే అనుభవించే స్థితి అనుకొని పొరపడతారు. ఇక్కడ ఒకటి గమనించండి, అన్నీ ఉన్నాయి అనుకున్న వారి మనసే  ఇంకా ఏదో ఏదో వెలితితో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది.

• అంటే జీవితం లో  అన్నీ ఉన్నా సరే వాటికి అనుసంధానం కాకుండా, ప్రలోభ పడకుండా సంతోషం గా జీవించే స్థితి మనసు కి రావాలంటే ప్రతీ మనిషి తన జీవిత కాలంలో ఏదొక దశలో ఒంటరి తనం, ఏకాంతాన్ని చవి చూడాల్సిందే.


చివరి గా ఒక మాట

• నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతు, బాధ పెడుతు, దుఃఖం ఇస్తున్నారో వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసు కో. ఎందుకంటే వారు నీ లో కర్మ ను తొలిగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నీ లో జన్మాంతరం గా నిక్షిప్తమైన వి(చెడు)కర్మ ను స్వీకరిస్తున్నారు లేదా వారితో నీకు వారితో బుణం క్రమేపి తీరిపోయి వారినుంచి విముక్తి పొందుతున్నావని అర్దం. నిజం గా ఇది చాలా అదృష్టం. ఈ సూక్ష్మం ఎరుగక వారిని నిందించడం, దూషించడం వంటివి చేయకూడదు.

• అదే విధంగా నీకు సంతోషం ఇచ్చిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండి, ఆ సంతోషం మరో పదిమంది కి పంచడం నేర్చుకో. సంతోషం అంటే భౌతిక విలాసాలను పంచడం , వ్యర్థ కబుర్లు చెప్పడం, కాలక్షేపం చెయ్యడం కాదు. ఎదుటి వారి మనసుకు సంతోషం కలిగించే విధంగా ధర్మ యుక్తం గా ప్రవర్తించడం, మంచి మాటలు, చెప్పడం, స్పూర్తి , ధైర్యం నింపడం, దుఃఖం తొలిగేందుకు చేతనైన సహాయం చెయ్యడం….. తోచినంత లో ఇది కూడా చాలా ఉన్నతమైన సేవే.


యడ్ల శ్రీనివాసరావు 4 May 2023 10:00 AM














No comments:

Post a Comment

489. నేను ఉండలేను

నేను ఉండలేను • నేను ఉండలేను   నిను విడిచి    నేను  ఉండలేను.   శివ   నేను  ఉండలేను   నిను విడిచి    నేను ఉండలేను. • తలపు లో      కొలువైనాక ...