జీవిత కొరత
కొరత అంటే వెలితి చెప్పాడానికి , రాయడానికి చాలా చిన్న మూడు అక్షరాల పదం. కాని నిలువెత్తు మనిషి ని శాసించి, హింసించి లేదా బ్రతకడానికి ఆశ కలిగించే పదం…. అంటే ఒక మనిషి జీవితాన్ని మంచి చెడు ఎటైనా సరే నడిపించ గల పదం “కొరత” , “వెలితి” , “లోటు”.
• ప్రశాంతంగా ఆలోచిస్తే తెలుస్తుంది నిజమో కాదో… ఎందుకంటే ఉదాహరణకు
• ఒక ఇంటర్ విద్యార్థి బాగా చదువుకుని ఎంసెట్ లో మంచి ఎంసెట్ ర్యాంకు తెచ్చుకొని ఉన్నత మైన చదువులు చదవాలని ఉంటుంది. ప్రయత్న లోపం లేకుండా బాగా కష్టపడి చదివినా సరే మంచి ర్యాంకు సంపాదించలేక పోవడం తో, ఒక ఏడాది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని ఎంసెట్ రాసిన మరలా మంచి ర్యాంకు రాక మరలా మరో సంవత్సరం ఇదే విధంగా అహర్నిశలు కష్టపడి చదివినా సరే చివరికి సీటు దొరకక పోవడం తో, డొనేషన్లు తో ప్రైవేటు కళాశాలల్లో చదివే స్తోమత లేకపోవడంతో మనసు కి నచ్ఛిన చదువు , చదువుకోలేక రాజీ పడి తన కలను చంపుకొని డిగ్రీ చదువుతాడు. ఇది ఆ విద్యార్థి కి తన జీవితంలో పూరించ లేని వెలితి.
• ఒక యువతి తన ప్రాణం లా ఒక యువకుడి ని ప్రేమిస్తుంది. ఆమెకు ఆ అబ్బాయి కేవలం తన కోసమే పుట్టాడు అని అనిపించేంత గా ఉంటుంది తన ప్రేమ . ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. చావు అయినా బ్రతుకు అయినా కలిసే ఉండాలని అనుకుంటారు. కాని ఆ యువతి తల్లి తండ్రులు బలవంతంగా వారిని విడదీసి ఆ అమ్మాయి కి మరో మనిషి తో వివాహం చేస్తారు. విధి లేక తన ప్రేమను చంపుకొని జీవితాంతం ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన కొరత తో మరజీవి లా జీవించడం అలవాటు చేసుకుంటుంది. ఇది ఆ యువతి జీవితం లో పూరించలేని కొరత, లోటు, వెలితి.
• ఒక పన్నెండు సంవత్సరాల అబ్బాయి కి అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ముల ఎవరు లేరు. తండ్రి ఎవరో కూడా తెలియదు. ఆ అబ్బాయి కి తన తల్లే సర్వస్వం. ఒకరోజు ఆ చిన్న వయసు లో ఉండగా నే , అనారోగ్యం తో తన తల్లి చనిపోయింది. తనకంటూ ఎవరూ లేని అనాధగా ఆ పిల్ల వాడు కుమిలి పోతూ ఉంటాడు. తనకు తల్లిదండ్రులు, బంధువులు ఎవరు లేరని నిత్యం ఒక బాధతో చిన్న తనం నుంచే అలవాటు పడి, జీవిస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి కి రక్త సంబంధాలు అనేవి పూరించ లేని కొరత, లోటు, వెలితి.
• ఒక వ్యక్తి బాగా చదువుకుని మంచి ఉద్యోగం, జీతం తో కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ జీవించాలి అనుకుంటాడు. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా, తన జీవిత కాలంలో ఎప్పుడూ ఎక్కడా, తన స్థాయికి తగిన ఉద్యోగం , జీతం సంపాదించలేక రాజీ పడి తన లక్ష్యాన్ని సాధించుకోలేక అల్ప జీతం, ఉద్యోగం తోనే తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇది ఆ వ్యక్తి జీవితంలో పూరించలేని కొరత, లోటు, వెలితి.
• ఒక చిన్న వ్యాపారి తన వ్యాపారం తో అహర్నిశలు కష్టపడి అభివృద్ధి చెంది , బాగా ధనం సంపాదించాడు. ఆ ధనం తో ఒక చిట్ ఫండ్ కంపెనీ, మరియు వడ్డీ వ్యాపారం చేస్తాడు. తన దగ్గర అప్పులు తీసుకున్న వారు, చిట్ లు వేసిన వారు కొంత కాలానికి పూర్తి గా ఎగేసి తిరిగి చెల్లించక పోవడం తో ఆ వ్యాపారి పూర్తిగా దివాళా తీస్తాడు. వీధిన పడతాడు. ఈ స్థితి తన జీవితానికి ఒక పెద్ద వెలితి.
• ఇప్పుడు ఆలోచిస్తే, తాను అనుకున్న చదువు చదువు కోలేని విద్యార్థి, తాను ప్రేమించిన వ్యక్తితో జీవితం గడపలేని యువతి, ఏ బంధాలు ప్రేమ కు నోచుకోలేని పిల్లవాడు, అనుకున్న ఉద్యోగం సాధించలేని ఒక వ్యక్తి, సర్వం కోల్పోయిన వ్యాపారి……వీరందరికీ జీవితం లో వెలితి ఒకో విధంగా ఉంది.
• వీరికే కాదు ఈ సృష్టిలో పుట్టిన ప్రతీ మనిషి కి ఏదో ఒక వెలితి తప్పకుండా ఉంటుంది. నా జీవితం లో మాత్రమే ఇలాంటి వెలితి ఉంది అని ఎవరైనా అనుకుంటే అది ఒక అజ్ఞానం.
• సరే…. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఆలోచించ వలసిన విషయం ఏమిటంటే, ఇలాంటి కొరతలు జీవితం లో ఉన్నప్పుడు ఏం చేయాలి. అలా బాధపడుతూ సరిపెట్టుకుని, రాజీ పడి జీవించ వలసిందే నా అంటే, ముమ్మాటికీ కాదు. ఇక్కడ ఏ మనిషి కైనా మొదట సరియైన ఆలోచన విధానం ముఖ్యం. అదే జీవితాన్ని సంతోషంగా నడిపించ గలదు. తరువాత స్థితి లో మనిషి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి.
• ఇప్పుడు ఇక్కడ ఈ స్థితిలో ఆలోచన ఎలా చెయ్యాలి…. అంటే , ఒక మనిషి బలంగా లేదా ధృడంగా ఒక కోరిక , లక్ష్యం అనుకొని జీవితం లో ముందుకు వెళుతున్నప్పుడు…. అది సాధించ లేకపోయినప్పడు , ఆ మనిషి తెలుసుకోవలసిన నిజాలు, పరమ సత్యం ఏమిటంటే
• 1. అతను ఈ జన్మలో తను ప్రస్తుతం అనుకున్న లక్ష్యం నెరవేర్చు కోవడం కాదు జన్మ తీసుకుంది. తాను ఎంత ధర్మబద్ధంగా ప్రయత్నించినా , ఫలితం, విజయం రావడం లేదు అంటే నిజానికి అతను ఆ లక్ష్యం లేదా ఆ కోరిక తీర్చుకునేందుకు పుట్టలేదు అని అర్థం. అది కాకుండా వేరే ఏదో purpose ఉంది అని అర్దం. ఎందుకంటే ప్రతీ మనిషి జన్మ తీసుకోవడం లో ఒక రహస్యం దాగి ఉంటుంది.
• 2. అతను ఇది వరకే అంటే గత జన్మలలో ఆ లక్ష్యం పూర్తి చేసేసాడు, కాబట్టి ఇప్పడు నెరవేర్చు కోవలసిన అవసరం లేదు. అందుకే ఈ జన్మలో తిరిగి ఆ కోరిక , లక్ష్యం నెరవేరడం లేదు అని అర్దం.
• 3. లక్ష్యం సాధించటం లో ప్రయత్న లోపం ఉందని అర్దం. అది గ్రహించ లేక పోవడం వలన , అనుకున్నది సాధించలేక పోయాడు అని అర్దం.
• మనిషి తన ఆలోచనలను సావధాన పరచుకుంటే ప్రతీ అంశం, ప్రతీ విషయం లో దాగి ఉన్న కారకత్వం, రహస్యం తెలుస్తుంది. ఆ సమాధానం తెలిసుకోగలిగినపుడు మనిషి తాను అనుకున్నది సాధించలేక పోయినా సహేతుకమైన కారణం తెలియడం వలన జీవితం లో ఏ వెలితి ఉండదు. మనిషి వెలితి తో, వెలితి కోసం జీవించడానికి కాదు పుట్టేది.
• ఆ విద్యార్థి ఉన్నత చదువులు ఇదివరకే చదివేసాడు కాబట్టి ఎంత ప్రయత్నించినా తాను అనుకున్నది చదవలేక పోయాడు. ఈ విషయం ఆ విద్యార్థి గ్రహిస్తే సంతోషం జీవిస్తాడు.
• ఆ యువతి గత జన్మలో ఒకరిని ప్రేమించి మోసం చేసింది కాబట్టి , నేడు ఆ ప్రేమ లభించక బాధపడుతుంది.
• ఆ పిల్ల వాడు గత జన్మలో మంచి కుటుంబం లో పుట్టి , రక్త సంబంధాలకు విలువ ఇవ్వకుండా అందరి క్షోభకు కారణం అయ్యాడు కాబట్టి, నేడు తాను చిన్న తనం లో అందరినీ కోల్పోయి దుఃఖం అనుభవిస్తున్నాడు.
• ఆ వ్యక్తి గత జన్మలో ఇది వరకే చాలా బాధ్యత లతో కూడిన ఉన్నత మైన ఉద్యోగం చేసి పరిపూర్ణం అయ్యాడు కాబట్టి నేడు ఆ స్థాయి అవసరం లేదు.
• ఆ వ్యాపారి నేడు మంచివాడు అయినా సరే గత జన్మలో ఎందరి దగ్గరో అప్పులు తీసుకుని తిరిగి ఇవ్వలేదు కాబట్టి, నేడు సంపాదించిన దంతా వడ్డీ తో సైతం తిరిగి వారికే చెల్లించాడు.
• ఈ విధంగా ప్రతీ మనిషి తన జీవిత కర్మలను తెలుసుకొని, అర్దం చేసుకొని వాటి నివృత్తి మార్గం ఆచరిస్తే ఏ కొరత, వెలితి, లోటు ఉండదు సరికదా…. ఉన్న స్థితిలో సంపూర్ణ మైన ఆనందం లభిస్తుంది. జీవితం మనది. జీవించేది మనం. ఆలోచనల లో లోపాలు కూడా తెలుసుకోవలసినది మనమే , కానీ మన గురించి ఎవరూ ఆలోచించరు, ఎవరు కూడా మన బాధలను నయం చెయ్యలేరు.
• ప్రతీ మనిషి ఒక కారణం తోనే జన్మ తీసుకుంటాడు. ఆ కారణం లోనే జన్మ రహస్యం దాగి ఉంటుంది. అది తెలుసు కో గలగడం దైవ బలం, ఆశీర్వాదం తో నే సాధ్యం.
ఈ సూక్ష్మం ఎరుగక పోతే జీవితం లో కొరత , లోటు, వెలితి జన్మ జన్మలు వెంటాడుతూనే ఉంటుంది.
ప్రతీ విషయం లో ముందుకు(భవిష్యత్తు) ఆలోచించాలి అంటారు. కాని వెనుకకి ఆలోచిస్తే నే కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే వెనుక (భూత కాలం) దాటే మనము వచ్చాం అని గ్రహించాలి. భూత కాలం లో శేషం ఎక్కడ ఉందో వెతుక్కుంటేనే వర్తమానం లో నడవడిక , ఆచరించే పనివలన భవిష్యత్తు బాగుంటుంది.
ఓం నమఃశివాయ 🙏
ఓం శాంతి 🙏
యడ్ల శ్రీనివాసరావు 12 May 2023, 12:10 pm.
No comments:
Post a Comment