Thursday, October 31, 2024

555. నేను

 

నేను



నేను చాలా అందంగా ఉంటానని అందరూ అంటారు.  అనడం ఏమిటి,   నిజం గానే చాలా అందంగా,  నాజుగ్గా,   ఆకర్షణీయంగా ఉంటాను. ఈ మాట ,  చిన్న తనం నుంచి  అందరూ  అనేదే.  నన్ను చూసిన వారు మరలా మరలా  నా వైపే  చూస్తూ ఉంటారు.  అందుకేనేమో  నాకు  ఒకింత గర్వంగా అనిపిస్తుంది.


• నాకు ఇప్పుడు 42 సంవత్సరాలు.  రోజులు, కాలం చాలా సంతోషంగా గడుస్తున్నాయి.  జీవితంలో నేను అనుకున్నవి  అన్నీ  నెరవేర్చుకుంటున్నాను, చెప్పాలంటే  నేను  సాధిస్తున్నాను.  ఎందుకంటే, నా అందం,  నా రూపం ,  నామాట   వలన   నేను ఎక్కడికెళ్లినా,  ఎంతమంది లో  ఎవరితో  ఉన్నా సరే అసాధ్యం  అనుకునేవి  కూడా,   నాకు అనుకూలంగా మారుతాయి.   నేను అనుకున్న పని సులభంగా జరుగుతుంది.   నా అందం వలన  బంధువులు, స్నేహితులు  నాతో  ఎక్కువ  సమయం  చూస్తూ మాట్లాడుతూ  ఉండాలి , అని నా చుట్టూ చేరుతూ ఉంటారు.


• ఒకరోజు ఉదయం లేచి చూసే సరికి,  నా రెండు చేతులు  మణికట్టు నుండి భుజాల  వరకు నల్లటి మచ్చలు  వచ్చాయి.  ఒక్కసారి గా కంగారు పడి, వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాను.  డాక్టర్ దగ్గరకు వెళ్తున్నాను   కానీ  నా లో ఏదో భయం,  ఇంత తెల్లని శరీరం పైన  వికారం గా ఉన్న  ఈ మచ్చలు   ఎలా వచ్చాయి.  ఇవి తగ్గుతాయా లేదా అని  చాలా ఆందోళన గా   ఉంది.


• డాక్టర్ చూసి ,  ఏం పరవాలేదు అవి  ఎలర్జీ మచ్చలు మందులు  వాడితే సరిపోతుంది,  అంటూ  పది రకాల మందులిచ్ఛారు.  కానీ  నాకు  చాలా టెన్షన్ గా ఉంది. నా చేతుల మీద  మచ్చలు  బయటకు కనపడితే ,  నా అందం ఏం కాను.   నేను నలుగురి లో ఎలా తిరగగలను.  ఇవే  నా ఆలోచనలు.


రోజూ మందులు వాడుతున్నాను.  మెడికేటడ్ సబ్బుతో  రోజు కి  పదిసార్లు  చేతులు శుభ్రంగా కడుగుతున్నాను.   ఈ చేతులపై మచ్చలు కనపడకుండా,  పూర్తిగా కవర్ అయ్యేలా  బట్టలు తొడుక్కుంటూ ….  హమ్మయ్య ,  పైకి కనపడడం  లేదు లే   అనుకుంటు  రోజులు  గడుపుతున్నాను.  ఈ మచ్చలు  తగ్గడం లేదు  సరికదా  నెమ్మదిగా ఛాతీ, వీపు పై  రావడం  ఆరంభించాయి.  ఇది వరకు  లేని నొప్పి,  చర్మం పై కలుగుతుంది.  డాక్టర్ కి చెపితే మందులు మార్చారు.   అయినా ఫలితం లేదు.    నాలో మాత్రం ,  విపరీతమైన ఆందోళన,   డాక్టర్ని మార్చినా,   ట్రీట్మెంట్ మారినా ఫలితం లేదు.    ఒకరోజు కళ్లు తిరుగతూ ఉంటే,  డాక్టర్ కి  చూపిస్తే బి.పి. చెక్ చేసి ,  మీకు బి.పి వచ్చింది  అని మందులు ఇచ్చి జాగ్రత్తలు చెప్పారు.


• ఈ మధ్య నేను  మాటిమాటికీ  అద్దం ముందు నిలబడి నన్ను చూసుకుంటున్నాను .  నేను వేసుకునే వస్త్రాలు,  మచ్చలు  ఉన్న  ప్రదేశాలు   కవర్ చేస్తున్నాయి.  కానీ ఇవి ముఖం పై వస్తే,  నా పరిస్థితి ఏంటి?.  ఆలోచనల వలన రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు.


ఇది వరలా బయట  ఫంక్షన్స్ గాని,  నలుగురిలోకి వెళ్లినా   ఫ్రీ గా  ఉండలేక పోతున్నాను.  చాలామంది నా ప్రవర్తన లో  తేడా గమనించి,  ఏమైంది అని అడుగుతున్నా  సరే ,   పాలిష్ గా  నవ్వుతూ ఏమిలేదు  అని  క్యాజువల్ గా   చెపుతూ  పైకి నటిస్తున్నాను.   నా ముందు  ఎవరైనా   కొంచెం అందంగా,   నవ్వుతూ  కనిపిస్తుంటే  తట్టుకోలేక పోతున్నాను.  తెలియకుండా  ఈర్ష్య,  ద్వేషం వచ్చేస్తున్నాయి.  నేను నిత్యం  చేసుకునే   పనులు సరి గా చేయలేక పోతున్నాను.   కుటుంబం,   పిల్లల తో   ఉంటున్నా  సరే  వారిని  ఇది వరలా  చూడలేక పోతున్నాను.

నేను చిన్నప్పుటి  నుంచి,  నా అందం,  నా శరీరాన్నే ఒక ఆస్తి గా  భావించాను.  ఎందుకంటే  అందరూ, నన్ను  అలాగే  పొగిడే వారు.…


• ఇక  ఇక్కడ  లాభం లేదు …  ఏది ఏమైనా,  నా ముఖం పై  ఈ మచ్చల కు   శాశ్వత పరిష్కారం దొరుకుతుందని  హైదరాబాద్ లో,  సూపర్ స్పెషాలిటీ స్కిన్  కాస్మెటిక్స్  హాస్పిటల్ కి వెళ్లాను.  అక్కడ వారు, ఏవేవో పరీక్షలు  చేసి  ఎడ్వాన్సడ్  ట్రీట్మెంట్  చేసారు. రోజు రోజుకు  చాలా డబ్బు  విపరీతంగా  ఖర్చు అవుతుంది.


• కాలం గడుస్తుంది,  కానీ  సమస్య అలాగే ఉంది.  ఇది వరకు లాగ  ఈ ప్రపంచం  అందంగా,  మంచిగా కనిపించడం లేదు నాకు.    దీనితో పాటు,  నాకు రోజు రోజుకు కోపం,  చిరాకు  పెరుగుతుంది.  ఇంటిలో అందరిపై   విసుక్కుంటున్నాను.   స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు  వాళ్లు  నన్ను ఎక్కడ  హేళన చేస్తారో,  అని ముందుగా  నేనే  డామినేటింగ్ గా మాట్లాడడం,  వాళ్లలో   లేని  లోపాలను  కూడా చతురంగా  పాయింట్ చేయడం మొదలు పెట్టాను.      ఈ గుణాలు  ఇంతకు  ముందు  నేను  ఎవరిపై ప్రదర్శించక  పోయినా ,  ఇవే  నాకు ఇప్పుడు  రక్షణ అవుతున్నాయి .  ఒంటరిగా ఉన్న  సమయంలో ఎక్కువ గా,  ఏడుస్తున్నాను.


రోజులు గడుస్తున్నాయి.  ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు.  నాకు  ఈ చర్మం పై  వచ్చిన  మచ్చలు సమస్య  3 సంవత్సరాలు అయింది.  ముఖం పై విస్తరించ  లేదు కానీ,   కాళ్ల పై కూడా వచ్చాయి.    ప్రతీ రోజు   నా శరీరాన్ని  శుభ్రం చేయని  క్షణం లేదు. ఈ మధ్యనే  నాకు నిజం తెలిసింది,  నాకు  చర్మ కాన్సర్ అని.  ఇక ఎన్నో రోజులు  జీవించనని.

నాకు  అంతా చీకటి మయం గా  ఉంది.  నేను ఆ విషయం  విని  తట్టుకోలేక పోతున్నాను.    నా చుట్టూ ఉన్న  మనుషులందరూ  నన్ను  వెక్కిరిస్తూ  ఉన్నట్లు అనిపిస్తుంది.  తలపోటు గా ఉంది.   కోపం నీరసం వస్తున్నాయి.  భయం వెంటాడుతుంది.


ఒకరోజు ఉదయం  ….  నేను లేవాలి  అన్నా సరే, లేవలేక   పోతున్నాను.   చుట్టూ  నా ఇంట్లో వారు, బంధువులు  చేరి   ఏడుస్తున్నారు.  కొంత  సమయం తరువాత  వారంతా కలిసి,  నన్ను  ఎక్కడికో తీసుకువెళ్ళి ,  పుల్లల పై పడుకోపెట్టి  కాల్చెస్తున్నారు. 

అయ్యో … అయ్యో…. నా శరీరం… నా శరీరం … నా అందం….నా అందం…నా ముఖం…. నా ముఖం … అని  రోదిస్తున్నాను.


• ఇంతలో   ఎవరో వచ్చి,   నన్ను  తీసుకు వెళుతున్నారు.  వాళ్లు అంటున్నారు,  నేను  నా శరీరం వదిలేసానంట.  ఇంకా ఎందుకు ఇక్కడ,  పద పద … డ్రామా లో,   నీ పాత్ర  అయిపోయింది.

 ఇంకా, వారు  నాతో  ఇలా అంటున్నారు ….


వారు :   జీవించి ఉన్నంత  కాలం  అందం … అందం అని   శరీరాన్ని   లెక్కలేనన్ని  సార్లు    శుభ్రం చేసావు. కానీ ,  ఏ నాడయినా   నీ శరీరం లోపలి   నీ ఆత్మ ను ,   నీ ఆత్మ లోని  మలిన గుణాలను   శుభ్రం చేశావా? …  ఏనాడైనా భగవంతుని స్మరించావా? … ఎవరికైనా సహాయం,  దానం,  ధర్మం ,  పుణ్యం  ఆచరించావా? పైకి  కనపడే  శరీరం  శుభ్రం చేసావు.   కానీ, నీ లోపల పేరుకు పోయిన  వ్యర్దగుణాలను   శుభ్రం  చేసావా?.


నేను :   ఆత్మా ? ….  ఆత్మ  అంటే ఏమిటి.  నా పేరు ఆత్మ కాదే ?


వారు :   కాసేపు ,  నా వైపు చూస్తూ నవ్వుకున్నారు.


వారు :  ఆత్మ అంటే నువ్వే .…. చూశావుగా  ఇందాకే నీది  అనుకున్న  శరీరాన్ని ,    నీ అనుకునే వారంతా కలిసి కాల్చేశారు .  నీ శరీరం బూడిద అయిపోయింది.


నేను : అప్పుడు  …  నాకు తెలిసింది,  నేను ఒక ఆత్మ అని.  అప్పుడు  నాకు జ్ఞానోదయం అయింది.   నేను  మోహం తో  నా  శరీరాన్ని   ప్రేమించాను.  కానీ,  నా లో లోపల   ఆత్మ లో  ఉన్న  మలిన గుణాలను    బ్రతికి ఉండగా  శుభ్రం  చేసుకోలేక పోయాను.    మాయ వలన ,   నేను  ఆత్మ  అనే సత్యం గ్రహించలేక,   జన్మ అంతా వృధా  చేసుకున్నాను.  నేను  ఇప్పుడు  నా ఆత్మ ను  శుభ్రం చేసుకోవాలను  కుంటున్నాను. 

కానీ …. కానీ … నాకు ఇప్పుడు శరీరం లేదు.


నేను :   వారితో  ,  నన్ను భగవంతుడు వద్దకు తీసుకు వెళుతున్నారా ? 

వారు :  లేదు ... నువ్వు భగవంతుని చేరాలంటే, నీ ఆత్మ పావనం గా, శుద్ధి గా కావాలి.   నీ ఆత్మ లో చాలా దుర్గుణాలు ఉన్నాయి.  నువ్వు చేసిన కర్మలను బట్టి,  ఇప్పుడు  నీకు మరలా  జన్మ  ఇవ్వడం జరుగుతుంది. 

నేను :  మరలా జన్మించడమా ? .... వద్ధు... వద్ధు... ఆ బాధలు,  దుఃఖం, నరక యాతన  నేను  అనుభవించ లేను.

వారు :  బాధలు, దుఃఖం  అనుభవిస్తేనే , నువ్వు చేసిన చెడు కర్మలు నశిస్తాయి.  నీ ఆత్మ శ్రేష్టం అవుతుంది. తద్వారా  నీ ఆత్మ   భగవంతుని తెలుసుకో గలిగి మరణానంతరం పరమాత్మ  సన్నిధి కి చేరుతావు.



  నేను  = శరీరం (అశాశ్వతం) + ఆత్మ (శాశ్వతం)

  శరీరం =  పంచ కర్మేంద్రియాలు.

  ఆత్మ =  మనసు + బుద్ధి + సంస్కారం


ఆత్మ లో ఉండే మనసు ఆలోచనలు కలిగిస్తూ, బుద్ధి నిర్ణయాల (మంచి, చెడు) తో కర్మలు చేస్తూ సంస్కారం తయారవుతుంది .

 ఆత్మ నాశనం లేనిది.  ఒక జన్మలో చేసిన కర్మల ఫలితాలు పాప పుణ్యాలు గా , మనసు బుద్ధి సంస్కారం లో రికార్డు అయి, శరీరం వదిలేసిన తరువాత తదుపరి జన్మకు ఆత్మ ద్వారా తప్పకుండా వస్తాయి.


  నేటి ఈ జన్మ …. గత జన్మ కర్మల ఫలితం.

  నేటి ఈ కర్మలు …. తదుపరి  జన్మ కి ఆధారం.

  ఇది  జనన మరణ  చక్రం …  జగన్నాటకం.

  ఇదే  సృష్టి  రహస్యం.


  సత్కర్మలు చేయండి ….

హేళన,  వ్యంగం చేస్తూ  ఎవరికి  దుఃఖం  ఇవ్వకండి. వ్యర్థమైన మాటలతో ఎవరిని నిందించకండి. అవసరాల కోసం  అబద్ధాలు,  మాయ మాటలు మాట్లాడకండి  …. ఏది చేస్తే అదే తిరిగి పొందాలి. నరకం, స్వర్గం ఎక్కడో లేవు .....  నీ  లో  నే ,  నీ తో నే ఉన్నాయి.


• శివుని స్మృతి  చేస్తూ ఉంటే   ....... మంచి మరణం      తో  పాటు,   శ్రేష్టమైన  జన్మ పొందగలరు.


ఇది  రాసింది  ఒక  ఆత్మ …. 

రాయించింది  మాత్రం  పరమాత్మ.


 ఓం నమఃశివాయ 🙏


రాసిన శరీరం పేరు :  యడ్ల శ్రీనివాసరావు 

31 October 2024, 7:00 PM … On Diwali .




Wednesday, October 30, 2024

554. భక్తి – అను రక్తి

 

 భక్తి – అను రక్తి


        శివుడు నిరాకారుడు. జ్యోతి బిందు స్వరూపం. పరమాత్మను  దేవాలయాలలో  లింగాకారంలో చూపిస్తారు. 
బ్రహ్మ విష్ణు శంకరులు లో ..... శంకరుడు ఒక దేవత,  ధ్యాన ముద్రలో  ఉంటాడు.  ఈ సృష్టిని లయం చేసే సమయంలో  మాత్రమే శంకరుని  పాత్ర ఉంటుంది.

  భక్తి మార్గం లో  శివుడు,  శంకరుడు ఒక్కటే  అనే అజ్ఞానం తో  ఉంటారు.  ఈ చిత్రంలో గమనిస్తే శంకరుడు  కూడా శివుని  స్మృతి చేయడం గమనార్హం దేవతలు వేరు, శివుడు వేరు ...... 
యధార్థ అవగాహన  కోసం మాత్రమే. 



• లాలి పాట తో    లావణ్యముగ 

  యెటుల   జోల  పాడెద    నిను ,

  నా వెర్రి  గాని …


• మలయ మారుతం    నీపై   వీచే

  వింజామరలు   తెచ్చి

  నే    వెర్రినయితి ….


• సగము కనులతో    సాకారమగు  నీ చూపు

  నిదురా!   మెలకువా!

  పోల్చ   ఎవరి  తరమో!


• కొప్పులోన  గంగమ్మ   సిగలోన   సందురుడు 

  సెమటెక్కడట్టేను

  సల్లని    నా సాంబునికి.


• ఆకలిగొన్న వని

  ఆదరాబాదరా      అన్నమట్టుకొచ్ఛెను

  కడుపునింప    నీకు.

• అన్నపూర్ణ    పెనిమిటి  వని   

  మరచి    పొరబడితి

  అఖిలాండమునకు   అన్నమెట్టే   నా   సామీ.


• ఒంటిగా  ఉన్నావని     జంట చేరి

  నీకు  రేయి పగలు    కొలిచే

  నా  మనసూరుకోక. 


• నంది నాగ ప్రమధులు  చుట్టూతా  లెక్క లేరు

  ఎప్పుడు  విడువరు  నిను

  రుద్ర  శివగణములు.


• సావు పుట్టుకల  నడుమ  సాకేటి బతుకుకి 

  వచ్చినపుడు     ఏముంది

  పోయినప్పుడు    ఏముంటుందని

  సెప్పకనే   సెప్పావు     నా దిగంబరా.


🙏ఓం నమః శివాయః.


Sunday, October 27, 2024

553. పరమాత్మ ప్రేమ

 

పరమాత్మ ప్రేమ



• ప్రేమ కై    పరితపించే   ఓ పసివాడు.

  కాల మే   కనికరించే    ఈనాడు.


• ఆ పసి   మనసును   చూశాడు 

   పరమాత్మ     నేడు.

• ఆత్మీక    ప్రేమ తో 

   తన  ఒడికి    చేరదీశాడు.


• దేహపు      ప్రేమ     కర్మ  బుణమని 

  దేవుని        ప్రేమ    కర్మాతీతమన్నాడు.


• బంధాల    ప్రేమ    అశాశ్వతమని 

  పరమాత్మ   ప్రేమ   శాశ్వతమని   అర్దం   చేశాడు.


• ప్రేమ కై     పరితపించే    పసివాడు.

  కాల మే    కనికరించే     ఈనాడు.


• ఆ పసి   మనసు   ఆలన   విన్నాడు.

  పరమాత్మ  యే      పాలన   చేశాడు.


• దేహపు    ప్రేమ    భ్రాంతి  అని

  దేవుని      ప్రేమ    మోక్షం  అన్నాడు.


• పసివాడి    భాగ్యానికి   ప్రకృతి   పరవశించెను 

  తన   జతలో   తోడుగా   చోటు   ఇచ్చేను.


• ప్రేమ కై    పరితపించే    పసివాడు.

  కాల మే    కనికరించే     ఈనాడు.



ఆలన = రోదన, మొర

పాలన = రక్షణ


యడ్ల శ్రీనివాసరావు 28 Oct 2024 , 5:30 AM.


Saturday, October 26, 2024

552. సతో రజో తమో

 

సతో రజో తమో 



• జీవిత గమనం లో మానవుడు  సత్య   సాధన , శోధన చేసినపుడు  అంతిమంగా,  తాను  ఒక ఆత్మ తన  తండ్రి శివుడు  పరమాత్మ   అనే విషయం తప్పని సరిగా తెలుసుకో  గలుగుతాడు.   అదే విధంగా  ఎన్నో జన్మ జన్మల  నుండి   మానవుడు తనను తాను  ఒక దేహం గా భావించి,   కర్మలు చేస్తూ ఉంటాడు.  ఇందులో మంచి,  చెడు  కర్మల వ్యత్యాసం తన  స్పృహ కి  సూక్ష్మ స్థాయిలో  తెలియకుండా నే కర్మలు ఆచరిస్తాడు.  ఎందుకంటే  ఈ లోకం   పూర్తిగా మాయ ఆధీనంలో   పరిపాలన  జరుగుతుంది. అందుకే ద్వాపరయుగం  నుంచి  నేటి కలియుగం వరకు    ప్రతీ ఒక్కరూ   భగవంతుడు  కోసం  భక్తి, ప్రార్థన , పూజలు చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే అన్వేషిస్తూ ఉంటారు.  సత్య  త్రేతా యుగాలలో భగవంతుని  అవసరం ఎవరికీ ఉండదు, అందుకే ఎవరూ  వెతకరు.


• మనిషి తాను దేహం అనే భావనతో ఉన్నప్పుడు, పంచ ఇంద్రియాల సహాయంతో కర్మలు చేస్తాడు. ఇంద్రియాలు అంటే  నేత్రం,   చర్మం,  చెవి,    నాలుక, నాసిక.  మానవునికి   మనసు లో  వచ్చిన ఆలోచనలకు , బుద్ధి (మంచి , చెడు) నిర్ణయం తీసుకున్న తర్వాత,  ఆచరణాత్మక సంస్కారం (కర్మ) చేయడం అనేది  దృష్టి, స్పర్శ, శబ్దం, రుచి, వాసనల ద్వారా  జరుగుతుంది.  ఇవే  పంచేంద్రియాలు.

• ఈ భౌతిక ఇంద్రియాలకు   పోషణ జరిగే విధానం బట్టి,   అంటే మానవుడు  తీసుకునే  ఆహారం బట్టి ఇంద్రియాల  పని తీరు ఉంటుంది.

• ఇందుకు మొదటి ఉదాహరణ  శాఖాహారం, పండ్లు తీసుకొవడం   వలన సాత్వికత ,   అంటే  అలజడి లేకుండా  జీర్ణాశయం లోని  జీవన క్రియలు సహజంగా జరుగుతాయి.  శరీరం పై  ఏ ఒత్తిడి  ఉండదు. తద్వారా,  మనసు లో కలిగే ఆలోచనలు శాంతంగా ఉండి, ఆరోగ్యం చేకూరుతుంది.  ఆలోచనలు శాంతం అయినపుడు ,  బుద్ధి తీసుకునే నిర్ణయాలు  మంచివి అయి,  తద్వారా  పంచేంద్రియాలు   సత్కర్మలు చేస్తాయి. దీనినే  సతో ప్రధానం, సాత్వికం, సతో గుణం అంటారు.

 సాత్వికత వలన మాట,  స్వరం   మృదుత్వం తో ఉండి,  అష్ట శక్తులలో  ఒకటైన  వాక్ సిద్ధి సంభవిస్తుంది.  ఆయుష్షు  పెరుగుతుంది.

 సత్య, త్రేతా యుగాలలో  150 సంవత్సరాల పైబడి జీవిస్తూ  అందరూ  సతో ప్రధానం గా  ఉంటారు.  ప్రేమ, త్యాగం, ఆరాధన, దివ్యత్వం , సఫలత , సహయోగం   వంటి  లక్షణాలు   సతో ప్రధాన స్థితి లో ఉంటాయి.

మానవుడు సతో  ప్రధానమైనపుడు  దైవ గుణాలు కలిగి, దేవతగా పూజింపబడతాడు. 


 ☘️☘️☘️☘️☘️☘️☘️


• రెండవది  శాఖాహారం లో    రుచి కోసం ఉల్లి,   గరం మసాలాలు, ఉప్పు, కారం, దినుసులు, తీపి, పులుపు వంటివి అధికం గా  కలిపి స్వీకరించడం   వలన జీర్ణక్రియలలో  వేగం పెరిగి   ఉద్రేకం,  ఆవేశం,  కోపం , అసహనం  వంటి లక్షణాలు  మనసు లో   ప్రేరేపితం అవుతాయి.  దీనినే  రజో తత్వం అంటారు.  ఇక్కడ బుద్ధి తీసుకునే  నిర్ణయాలు   ఉద్రేక భరితం గా, నిలకడ  లేకుండా  అయి దుఃఖం  అనుభవించే లేదా ఇతరులకు కలుగ చేసే కర్మలు  పంచేంద్రియాల ద్వారా జరుగుతాయి.  ఇది రజోగుణం.    కామం, క్రోధం, మోహం, ఈర్ష్య, అసూయ, స్వార్థం వంటివి ఈ రజో తత్వ స్థితి లో ఉంటాయి.

మానవుడు రజో తత్వం కలిగినపుడు  ఆత్మ విశ్వాసం కోల్పోయి   దుఃఖం తో ఉంటూ అందరికీ దుఃఖం పంచుతాడు. ద్వాపర యుగం నుంచి రజో తత్వం ఆరంభం అయింది.


 ☘️☘️☘️☘️☘️☘️


• మూడవది మాంసాహారం తో, ఇంద్రియాల కు పోషణ జరగడం వలన  జీర్ణక్రియలు  పూర్తిగా అసంబద్ధంగా  తయారు అయి,  జీవన క్రియలు మందగిస్తాయి. తద్వారా మనసు లో ఆలోచనలు బుద్ధి,   విచక్షణ  జ్ఞానం కోల్పోయి  పంచేంద్రియాలు హింసాత్మక,  అసాంఘిక చర్యలు  చేయడం ప్రారంభింస్తాయి.   ఇది తమో తత్వం ,  తమో గుణం. ఇక్కడ కర్మలు క్రోధం , హింసతో  వినాశనాన్ని  ప్రేరేపిస్తాయి.  ఇది పూర్తిగా రాక్షసత్వం కలిగి ఉండడం. మానవుడు కలియుగంలో పూర్తిగా తమోగుణాలనే కలిగి ఉంటాడు . ఇక్కడ హింస ప్రధానం గా రాజ్యమేలుతూ వినాశనం తో కూడిన కర్మలు ఆచరిస్తాడు. మానవుడు  ఈ దశలో పూర్తిగా రాక్షసుని వలే ప్రవర్తించడం జరుగుతుంది.


☘️☘️☘️☘️☘️☘️


 సాధారణంగా మానవులు, జంతువులు, పశువులు ఇలా అనేక జీవులు ఈ భూమి పై నివసిస్తూ, శరీర పోషణ కోసం ఆహారం తీసుకుంటాయి.

 పశువులు మాంసాహారం భుజించవు. పకృతి లో దొరికే గడ్డి, నీరుతో నివసిస్తాయి. ఉదాహరణకు ఆవు, మేక, గొర్రె, కోడి. ….. కొన్ని జంతువులు మరియు మానవుడు ఈ పశువులను ఆహారంగా భుజిస్తాడు.

  జంతువుల లో కొన్ని మాంసాహారం భుజిస్తాయి. కొన్ని జంతువులు మాత్రం వంటివి మాంసాహారం భుజించవు.

 మానవుడు మాత్రం పశువులను, జంతువులను ఆహారం గా తీసుకుంటూ ఆయా జీవుల లక్షణాలు నేడు పొందుతూ ఉన్నాడు. అందుకే తమో గుణాలు కలిగి ఉంటున్నాడు.

 ఆహారం అనేది శరీర పోషణ తో పాటు, ప్రధానమైన గుణాలు, వ్యక్తిత్వ రూపకల్పన కు చాలా దోహదం అవుతుంది.

  శివుని త్రిశూలం ద్వారా అర్దం చేయించేది సతో, రజో, తమో గుణాలనే.



 యడ్ల శ్రీనివాసరావు, 27 Oct 2025, 10:00 AM.


Thursday, October 24, 2024

551. గోదావరి గలగలలు

 

గోదావరి గలగలలు



గోదావరి లో  ఏముందో …. ఏ అందం ఉందో గాని, ఈరోజు  ఉదయం 6 గంటలకు  వెళ్లి గోదావరి ఒడ్డున కూర్చుని  ప్రశాంతంగా చూస్తుంటే  …  అప్పటి వరకు ఉన్న  స్థితి  మరిచిపోయి,  ఏదో  తెలియని  సంతోషం నెమ్మదిగా  మనసు లో  ఆరంభం అయి,  లోలోపలే చిరునవ్వు   మొదలైంది.


ఒకవైపు   మంచు   తెరలు తెరలుగా  సన్నగా గోదావరి పై   కురుస్తుంటే,   ఆ చల్లని   గాలి   శ్వాస లోకి  వెళుతూ   ఉంటే   శరీరం  అంతా   గాలి లో తేలిపోతుంది.  కొంత సమయం  తరువాత,   లేత ఎరుపు రంగులో  సూర్యుడు  మంచు చాటున ఉదయిస్తుంటే  నున్నని  వెచ్చదనం  శరీరం  తాకుతూ ఉంది …. శరీరం లోపలి శ్వాస అతి చల్లగా, వెలుపల నుని వెచ్చగా ఉంది … ఇది అనుభవిస్తూ ఉంటే , ఈ సమయం నా కోసమే నా … ఇలా అన్నట్లు అనిపించింది.


ఎదురుగా  గోదావరి అలలు,  చిన్నగా  శబ్దం చేసుకుంటూ,  ఒకదాని పై   మరొకటి తొణికిసలాడుతూ  ఉంటే ,   అప్పుడే  పుట్టిన  చిన్ని చిన్ని  కోడి పిల్లలు   పెద్ద గుంపులో  ఒకదాని మీద ఒకటి  పడుతూ   లేస్తున్నట్లు   సంతోషంగా అనిపించింది.  ఆ చిన్న చిన్న  అలలు ఒడ్డు కి చేరుతున్న   ప్రతి క్షణం   నా మనసు  వేగం   శూన్యం అయిపోయింది  ….. ఒడ్డున ఉన్న నీటిలో ,   చిన్న చిన్న  చేప పిల్లలు  వేగం గా    అటు ఇటు, అటు ఇటు ,  ఏ దిశలో   వెళ్లాలో   తెలియదన్నట్లు  కంగారు కంగారుగా  ఈదుతూ ఉంటే …  పాపం అమాయకమైన  చేప పిల్లలు  అనిపించింది.


ఇంతలో   టక్ ... టక్ ...  టక్ ... అని  ఇంజన్ శబ్దం చేసుకుంటూ   గోదావరి నది లో  దూరంగా  నాటు పడవ,   ఇసుక తీసుకుని వెళుతుంది.   ఆ మోటారు పడవ శబ్దం  నా సమీపాన్ని  దాటి  దూరం  గా వెళుతుంటే ,  ఆ సమయంలో  అంత  ప్రశాంతత లోను   ఆ ఇంజన్ శబ్దం ,  ఏదో  లయకారం లా అనిపించింది.


ఆకాశం అంతా  నీలిమయం ,  అక్కడక్కడా  తెల్లని మేఘాలు.  ఒకవైపు మంచు,  మరోవైపు  సూర్యుడు. ఆ సమయంలో   ఎక్కడి నుంచి  వచ్చాయో తెలియదు,   ఒక తెల్లని పక్షుల గుంపు    “ < “ ఆకారంలో   వరుస  తప్పకుండా  గోదావరి  మీద ఎగురుతూ  వెళుతున్నాయి. అదంతా  చూస్తుంటే  ఏదో సంతోషం.   వెలకట్టలేని  అనుభూతి .


ఇంతలో   నాకేం  తక్కువ,   నేను  ఈ ప్రకృతిలో భాగమై   ఉన్నాను  అన్నట్లు  …  ఒక రైలు కూత వేసుకుంటూ  రోడ్ రైలు వంతెన  మీదుగా వెళుతుంది.


ఇదంతా,   నా కళ్లు చూస్తున్నాయో   లేక  మనసు చూస్తుందో  తెలియడం  లేదు  కానీ  చాలా సమయం వరకు  , నా శరీరం  నా ఆధీనంలో   మాత్రం లేదు. గోదావరి ని  చూస్తున్నంత  సేపు,  గోదావరి  ఏదో చెప్పడానికి   ఉవ్విళ్లూరుతున్నట్లు   అనిపించింది. బహుశా  ,  అది  గోదావరి లో  నేను  కలిసి పోయాకే  నాకు  వినపడుతుంది  అనుకుంటూ ….


సుమారు  ఒక అరగంట  సమయం  తరువాత నెమ్మదిగా  చినుకులు పడుతూ,  నన్ను తట్టి  లేపాయి.   వర్షం మొదలైంది .  ఘాట్ లో  మెట్ల పై కూర్చున్న  నేను  పైకి లేచి ,  అక్కడే నిర్మాణం లో  ఉన్న  దేవాలయం షెల్టర్ లో,   ఇసుక పోగు  మీద కూర్చున్నాను .  వర్షం బాగా వస్తుంది.  అప్పుడు అనిపించింది  ….  ఈ సమయం నాది.  ఏక  కాలంలో ప్రకృతి    నా  కోసమే,  ఇంత   అద్భుతమైన అందాలను   చూపిస్తుంది.  బహుశా,  ప్రకృతి కూడా తాను  ఇష్టపడిన   వారికే    సాక్షాత్కరిస్తుంది అనుకుంటా  ….  పురి విప్పిన నెమలి లా.


కాసేపటికి  వర్షం తగ్గింది.  నెమ్మదిగా  అడుగులు వేసుకుంటూ  ….  భగవంతుడు  సృష్టించిన  ఈ ప్రకృతి    ఎంత    అందమైనది .  ఈ ప్రకృతిలో  శాశ్వతం గా   ఒదిగి పోవాలంటే   ఇంకా   ఎంత సమయం  వేచి చూడాలో,  ఆ అదృష్టం ఎప్పడో …. అనుకుంటూ  వెను తిరుగాను.


యడ్ల శ్రీనివాసరావు.

24 Oct 2024 7:00 AM. Saraswati Ghat.




Monday, October 21, 2024

550. మరణ శాసనం

 

మరణ శాసనం


• ఏ  ఊపిరి  ఎన్నాళ్ళో.

  ఏ  జీవం    ఎన్నేళ్ళో.


• విలువ లేని    ప్రాణాలు 

  ఊచకోత    అవుతుంటే  ...

• నిలువ లేని     బ్రతుకుల కి

  ఏ  క్షణం     ఏమవుతుందో.


• ఇక   గడిచే    ప్రతి నిమిషం

  నీది   కాదంటుంది   కాలం.

• భవిత     ఎక్కడికో

  తెలుసు  కోమంటుంది   గమ్యం.


• ఏ  ఊపిరి  ఎన్నాళ్ళో.

  ఏ  జీవం    ఎన్నేళ్ళో.


• సూర్యుడు  ఉదయించక  మానడు.

  చంద్రుడు    చిగురించక    ఆగడు.


• నీదనుకున్న    లోకం లో

  నీవు   లేకున్నా …

• నీ దైన      జీవితం

  మరెక్కడో   ఉంటుంది  లే.


• నీ    అడుగుల   జాడలో

  నీ రూపం    లేకున్నా

• నీ వైన     భావాలు

  నీ తో     పయనించును లే.


• జననం   తిరిగి రాక   మానదు.

  మరణం     ఆగి    నిలువదు.


• ఏ  ఊపిరి   ఎన్నాళ్ళో.

  ఏ  జీవం     ఎన్నేళ్ళో.


• తెరిచిన    మనసు  లో 

  ఇక   ఏమి  మిగిలి   ఉంటుంది.

• కాల మిచ్చిన     సమయం

  ఇక   కొంతే    మిగిలి    ఉంది.


• ఏ  ఊపిరి  ఎన్నాళ్ళో.

  ఏ   జీవం    ఎన్నేళ్ళో.


యడ్ల శ్రీనివాసరావు 21 Oct 2024. 11:00 AM.



Tuesday, October 15, 2024

549. ఏక బిల్వం శివార్పణం

 

ఏక బిల్వం  శివార్పణం



• ఏమి  నీ"దయ" శివా ! … ఏమి  నీ"దయ"

  ఏది   నాదయా  హరా! … ఏది    నాదయా


• మారేడు   దళ మంటి     నా  మనసు ని

  నీటి        బిందు వంటి    నా   ఆత్మ తో

  నిను   కొలచు     ప్రతి  క్షణం

  నను   నీ దరి   చేర్చు  అనుగ్రహం.


• నీ  ఆలింగ   అనుభూతి  నే

  సద్గుణములు    కలుగు   కారుణ్య  మూర్తివే.


• ఏమి   నీ"దయ" శివా! … ఏమి  నీ"దయ"

‌  ఏది   నాదయా  హరా! … ఏది  నాదయా


• నా మది      పుష్పమై     నీ స్మృతి న

  వికసించు    వరమివ్వు    విశ్వేశ్వర.


• జన్మ   సార్థకతకు    అచల ధృడత  నే

  సోపాన    మివ్వు     సోమేశ్వరా.



• ఏమి  నీ"దయ"  శివా!   … ఏమి   నీ"దయ"

  ఏది   నాదయా   హరా!  … ఏది    నాదయా


• తుది  శ్వాస లో    వేడి "వై"

  కొండెక్కు   నా   ప్రాణాన …

• తుది  మాటలో   శబ్ద "మై"

  బరువెక్కు   గుండె లయ   తీరు వే.


• మట్టిలో   పుట్టి    మట్టిలో   కలిసే

  ఒట్టి  చేతుల     ఈ చిట్టి   జీవితం   

  ఎన్నడూ   బెట్టు   చేయదు …

• గట్టిగా    వడిపట్టి  "న"  మణికట్టుకి 

 ఏమివ్వగల   నీకు   ఈశ్వరా!

 నిత్యమూ   నను వీడని    అభయంకర.



యడ్ల శ్రీనివాసరావు 16 Oct 2024, 11:00 AM.


Monday, October 14, 2024

548. నా లోని గుణాలు

 

నా లోని గుణాలు



నా లో చాలా మంచి గుణాలు ఉన్నాయి. అవును, చాలా చాలా  మంచి  గుణాలు  ఉన్నాయి.  వాటి గురించి ఆలోచిస్తే  చాలా  సంతోషంగా అనిపిస్తుంది. నాపై నాకు   నమ్మకం  పెరుగుతుంది.   గర్వంగా అనిపిస్తుంది.  ఈ గుణాల  గురించి ఆలోచించుకుంటూ,   నేను చాలా అదృష్టవంతుడివి అని,  నా మనసు తో  చెపుతూ  ఉంటాను. సంతోషపడిపోతూ  ఉంటాను . ఈ మంచి గుణాలు గురించి ఆలోచిస్తూ,   నేను చేసే  ప్రతి పని,  ప్రతి ఆలోచనలో  నేను   చాలా  కరెక్ట్  అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే  ఈ గుణాల  ద్వారా వృద్ధి చెందిన ఆలోచనలు, నాతో అలా చెపుతూ ఉంటాయి.


• నేను బాగా కష్టపడతాను ,   విశ్రాంతి లేకుండా ఉద్యోగం ,  వ్యాపారం  చేస్తాను.  ధనం విపరీతంగా సంపాదిస్తాను .  ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంటి పని, వంట , పిల్లల కారేజీ  అన్నీ  బాధ్యత గా చేస్తాను. అప్పుడప్పుడు  గుడికి వెళ్ళి నప్పుడు  యాచకులకు బిచ్చం వేస్తూ,  నాలో  దాన గుణానికి  మురిసి పోతుంటాను.

ఇంకా, నేను నా భార్య అవసరాలు / నా భర్త అవసరాలు  మరియు కుటుంబ అవసరాలు తీరుస్తూ, పిల్లల్ని   బాధ్యత   చక్కగా చూసుకుంటాను. ఎందుకంటే నేను చాలా మంచి వ్యక్తి ని.  పైగా  నాలో చాలా మంచి విశేష గుణాలు ఉన్నాయి.

నాకు దైవ భక్తి ఎక్కువ. నేను నిత్యం దేవుని పూజ చేయనిదే , గడప దాటను. ….

వీటన్నింటి వలన నాకు  నేనే సాటి  అని  ఫీల్ అవుతూ  ఉంటాను. ఇందులో తప్పు ఏముంది. అనుకుంటాను.


 కానీ  అసలు  విషయం  ఏమిటంటే….


ఇవన్నీ  చేయడానికి  … నేను లోపల ఎంతో శ్రమ పడవలసి వస్తుంది  ….. ష్… ష్… ష్…అబ్బా… ఎందుకంటే  ఇవన్నీ  చేసే  ముందు  నేను చాలా ఆలోచించి  ప్రవర్తించ వలసి వస్తుంది.  నేను బయట వారందరికీ  ఇలాగే కనపడాలి.  అలా కనపడితే  నే కదా,  నాకు  గౌరవం లభిస్తుంది.  ఈ గుణాలు  చూసే కదా, చుట్టూ ఉన్న వారు నాకు విలువ ఇస్తారు.


అదేంటో తెలియదు కానీ …. నాలో చెడు గుణాలు లేవా? … అని ఆలోచిస్తే అసలు మచ్చుకైనా , ఏమీ లేనట్లు అనిపిస్తాయి.  ఎందుకంటే నేను మంచి గా కనిపించడానికి,  నిరూపించు కోవడం  కోసం   చేసే ప్రయత్నం లో,   ఆ సాధన లో  నాకు  నాలో ఏ చెడు కనిపించదు,   నా స్పృహ కి కూడా తెలియదు. సమస్తం నాకు,  నాలో ఉన్నవన్నీ మంచి గుణాల లాగే అనిపిస్తాయి.

నేను  కుటుంబంతో,  సమాజం తో,  బంధువులతో, మిత్రులతో,   నేను ఎప్పుడూ మాట్లాడినా,  చాలా గొప్ప గా,  అద్బుతం గా,  నవ్వుతూ ,  వాళ్లని మురిపిస్తూ మాట్లాడుతాను.  అప్పుడు కూడా సాధ్యం అయినంత  వరకు మంచి  నడవడిక  చూపించడానికి శ్రమిస్తూ ఉంటాను.


నేను  వ్యాపారం చేసేటప్పుడు,  నిరంతరం అధిక లాభాలు   ఎలా అర్జించాలో  ఆలోచిస్తూనే , వస్తువులలో ఎవరూ గుర్తు పట్టకుండా సహజంగా నే , కల్తీ చేస్తుంటాను.  ఎందుకంటే  ఇది  నా వ్యాపార ధర్మం .   వ్యాపారం  బాగా పెరగాలని  నిత్యం  నా షాపులో  దేవుడికి  కొబ్బరికాయ   కొడతాను…. ఎందుకంటే నేను చాలా నిజాయితీ పరుడిని, సత్య వంతుడిని.


• నేను ఉద్యోగం చేస్తూ,  బిల్లులు పాస్ చేసేందుకు సహజంగా నే కమీషన్లు తీసుకుంటాను. లేకపోతే నా ఇంద్ర భవనం అప్పులు తీరడం కష్టం ….. ఆఫీస్ లో పని చేసి  బాగా అలసి పోయినప్పుడు  ఉపశమనం కోసం బార్ కి,  కొన్ని సార్లు మసాజ్ పార్లర్ కి కూడా వెళతాను.  లేకపోతే ఒత్తిడిని భరించలేను …. నేను స్వతహాగా ఏమంత  స్వార్దపరుడిని ,  కామభోగి ని  కాదు.


• రాత్రి  వరకు  సంపాదన లో  అలసి పోయి ఇంటికి రాగానే ,  తూటాల్లాంటి మాటలు , వ్యంగమైన మాటలు వింటుంటే, ఇంకా ఎంతకాలం భరించాలి ఈ చండాలం ,  శుభ్రంగా పైకి పోతే బాగుణ్ణు నాకు పట్టిన దరిద్రం వదులుతుంది. ఏంటో, అనుకోకుండా నే ఈ మాటలు నిత్యం మాములుగా  వస్తుంటాయి. …. నాకు సహనశీలత,   ఓర్పు  సహజం గా ఉంటాయి.


• అబ్బబ్బా …  రోజు   ఈ వంట చేయడం నా వల్ల కాదు.  వండి పెడితే శుభ్రంగా తింటూ, పేర్లు  పెడతారు.  వంట చేస్తే తెలుస్తుంది  ఈ కష్టం ఏంటో.  నేను కాబట్టి   ఇంకా  ఈ మాత్రం  అయినా  చేసి పెడుతున్నాను .….. భార్యను సరిగా చూసుకోవడం చేతకాదు గాని,  నీతులు చెపుతారు .…. 

కాసేపు పక్కింటి లో కుటుంబ విశేషాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. కొంచెం మనసు కి హాయి గా ఉంటుంది .….. 

కుతూహలం తో, స్నేహితులకు ఫోన్ చేద్దాం,  ఎవరొకరి గురించి,  ఏమైనా ఆసక్తి కరమైన విషయాలు తెలుస్తాయి .… 

అమ్మో,   టైం  7 అయిపోతుంది, టి.వి. సీరియల్ చూడాలి,  మిస్ అయితే   ఇంటింటి చీకటి బాగోతాలు  చూసే  అవకాశం  ఉండదు. …. 

నాకు అసలు ఈ  వ్యర్ద విషయాల  పట్ల  ఆసక్తి అసలు ఉండదు.  ఎదో కొంత  కాలక్షేపం కోసం  ఇరుగు పొరుగు తో,  అలా .. అలా...అంతే .….   నాకు కుటుంబ విలువలు అంటే ఎనలేని గౌరవం.


• ఏంటో గాని … దేవుని ముందు కూర్చుని పూజ చేస్తుంటే, నగలు, పట్టుచీరలు కనిపిస్తున్నాయి. దేవుడు కి ఇవంటే చాలా  ఇష్టం, అందుకే ఇవి నా కళ్లకు  కనిపించే లా  చేస్తున్నాడు.  వెంటనే అప్పు చేసైనా సరే  కొనాలి … నాకు పెద్ధ కోరికలు అంటూ ఏమీ ఉండవు. అసలు ఏం ఉన్నా లేకపోయినా చాలా సింపుల్ గా నే ఉంటాను.


• నేను చాలా మంచి వ్యక్తి ని ఎందుకంటే,  నేను  చాలా మందిని చూస్తుంటాను,   వాళ్లతో మాట్లాడుతుంటాను.   నేను  ఎప్పుడూ  నిజమే మాట్లాడుతూ ఉంటాను.  కాకపోతే  మనిషి ని బట్టి ఒకో విధంగా,  వాళ్లకు అనుకూలంగా ఉండేలా మాట్లాడుతూ ఉంటాను. అసలు చాలా మంది కి ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో కూడా తెలియదు.


ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కదా…. నేను ఒక ఆత్మ.  శరీరం ధరించిన  ప్రతీ   స్త్రీ,  పురుషుడు,  ఈ రెండు కానీ  వారిలో కూడా నేను ఉంటాను.  ఈ మాయ లోకం లో ,  నాకు సంబంధించినంత  వరకు నాలో  ఉన్నవన్నీ మంచి గుణాలే.   ఎందుకంటే, నేను ఏవిధంగా,  ఎలా ఉన్నా సరే,  నాలో చెడు ఉండదు . అదేంటో  తెలియదు  నాకు ఇతరులలో  చెడు మాత్రం తెలుస్తుంది.


🌹🌹🌹🌹🌹

 దసరా :  దస్ హరా

పది వికారీ గుణాలు    సంహరించడం



• సత్య, త్రేతా యుగాలు    రామ రాజ్య  పాలన ఉండేది.   ఇక్కడ రాముడు అంటే  అర్దం దైవీ గుణాలు,  మంచి తనం.   ప్రతి జీవుని లో   దైవీ  గుణాలు కలిగి ,  ఓర్పు,  సహనం,   ప్రేమ,  దివ్య దృష్టి,   ధారణా ,  రాజయోగం  వంటి ఎన్నో  అతీతమైన  దైవ శక్తులు  ఈ యుగంలోని  వారికి ఉంటాయి.   వీరు అన్ని  వేళలా సంతోషం తో ఉంటారు. వీరికి అసలు దుఃఖం అంటే ఏమిటో కనీసం తెలియదు.  ఈ యుగాలలో   జీవించిన   వారిని దేవతలు  అంటారు.   ముక్కోటి  దేవతలు అంటే  సత్య త్రేతా యుగంలో నివసించిన వారు.   వీరిని  దేవాత్మలు అంటారు .  నేడు   గ్రామ  దేవతలు గా  వీరినే  పూజిస్తున్నాము.


• ద్వాపర , కలియుగాల లో    రావణాసురుడి రాజ్యపాలన ఉంటుంది. రావణాసురుడు అంటే రాక్షస గుణాలు అయిన ఈర్ష, అసూయా, మోసం, అసత్యం, మోహం, కామం , అహం,  ద్రోహం  వంటి గుణాలతో  జీవులు ఉంటారు.  అసుర అంటే రాక్షస.   పాపాలు చేయటం  వలన  వీరిని పాపాత్ములు అంటారు.  వీరు నిత్యం ఈ యుగంలో దుఃఖం అనుభవిస్తూ ఉంటారు.


ప్రతీ  ఆత్మ   సృష్టి కల్పం (5000 సంవత్సరాలు) లో జన్మిస్తూ,   మరణిస్తూ   మొత్తం  84 జన్మలు తీసుకుంటుంది.  ఒకప్పుడు సత్య త్రేతా యుగాలలో దేవతలుగా ఉన్న దేవుని సంతానం గా ఉన్న ఆత్మలే (మనమే) జన్మలు  తీసుకుంటూ, తీసుకుంటూ బలహీనపడి   మన ఆత్మలోని   దైవ గుణాలు  శక్తిని పూర్తిగా కోల్పోయి …. ద్వాపర, కలియుగాలు  వచ్చేసరికి  వికారాలకు వశం అయి  రావణాసుర సంతానంగా మారి , తిరిగి జన్మించి  పరమాత్మ ను  పూర్తిగా  మరచి దుఃఖం తో  జీవిస్తూ ఉంటాం.

• రావణాసురుడు కి పది తలలు చూపిస్తారు. దాని అర్థం ఈర్ష్య, ద్వేషం, కామం, క్రోధం మోహం, లోభం, అహం, అసూయ, స్వార్థం, ప్రతీకారం . ఇవి కలియుగంలో  మనుషులలో రాను రాను పెరిగి వినాశనం మొదలవుతుంది (ప్రస్తుత కాలం). దీనికి గుర్తుగా దసరా ఆఖరి రోజున మైసూర్ లో పది తలల రావణాసురుడు బొమ్మ ను , ప్రతీ ఏడాది ఒక అడుగు చొప్పున పెంచుతూ బాణాసంచా తో దహనం చేస్తారు. ఇదంతా చప్పట్లు కొడుతూ వేడుకగా చూస్తారు గాని, ఇందులో సూక్ష్మం,   రాను రాను మానవుల లో వికారాలు పెరుగుతూనే ఉంటాయి, అనే విషయం శివుడు తన జ్ఞానం ద్వారా చెప్పే వరకు ఎవరికీ తెలియదు.

• ఒకప్పుడు దేవతలు గా ఉండే మనమే ఇప్పుడు అసురీ గుణాలతో జీవిస్తున్నాం. చెప్పాలంటే, నాటి మన  దేవతా  స్వరూపాలను  విగ్రహాలు గా  చేసి  తిరిగి  మనమే  నేడు ఆరాధన  చేస్తున్నాం. అంటే ఆత్మల మైన  మనం  శక్తి కోల్పోతూ  కోల్పోతూ దిగజారిపోయాం. 

అందుకే  ఒకప్పుడు మన ఆత్మలో ఉన్న పాత సంస్కారాలు అయిన దేవతా గుణాలు నేడు కూడా మనలో  ఉన్నాయి  అనుకుంటూ , భ్రమతో    చెడు సంస్కారాలతో,   మనల్ని మనం  మోసం చేసుకొని జీవిస్తున్నాం.


• ఇది మనం అంగీకరించిన, అంగీకరించ పోయినా  మన మూలాల లో  దాగి ఉన్న  పరమ సత్యం ఇది .


యడ్ల శ్రీనివాసరావు 14 Oct 2024, 9:00 pm






Thursday, October 10, 2024

547. రూప “అంతరం”

 

రూప  “అంతరం”


• ఓ   మనిషి    తెలుసా …

  ఇది   నీకు  తెలుసా.

• భావన లో     బలము      ఉంది.

  భావన లో     బలహీనత  ఉంది.

  బుద్ధి  లో నే    భావం     దాగుంది.


• ఓ   మనిషి    తెలుసా …

  ఇది  నీకు  తెలుసా.

• ఆలోచన లే      బుద్ధి కి    మూలం.

  ఆచరణ లే       తెలివి కి    సాక్ష్యం.

  ఆస్వాదన లే     కర్మ కు     ఫలితం.


• ఓ   మనిషి    తెలుసా …

  ఇది  నీకు  తెలుసా.

  తెలిసీ   తెలియ  కున్నావా.

• వేసే  ప్రతి  అడుగు

  నీ  ఉనికి కి   ప్రతి  బింబం.

• చేసే  ప్రతి   కార్యం

  నీ   జీవాని కి   నిదర్శనం.


• నిన్ను   నీవు    ఎరుగకున్నా 

  దైవం     నిను   ఎరుగును లే .

• నీవు    ఎంత     దూరమేగినా 

  కర్మ     నిను      విడువదు లే.


• ఓ   మనిషి    తెలుసా …

  ఇది  నీకు  తెలుసా.

• భావన లో     బలము     ఉంది

  భావన లో     బలహీనత  ఉంది.

  బుద్ధి లో నే    భావం    దాగుంది.


• ఓ  మనిషి    తెలుసా …

  ఇది  నీకు  తెలుసా.

• ఆలోచన  లే     బుద్ధి కి     మూలం.

  ఆచరణ   లే      తెలివి కి   సాక్ష్యం.

  ఆస్వాదన లే    కర్మ కు      ఫలితం.


• ఓ    మనిషి    తెలుసా …

  ఇది  నీకు     తెలుసా.

  తెలిసీ   తెలియ  కున్నావా.

• బుద్ధి     ఎంత      స్వచ్ఛం

  బ్రతుకు  అంత      సత్యం.

• జన్మ జన్మల   నుడికారం   సంస్కారం.

   ఆత్మ శక్తి కి     శ్రీకారం      పరివర్తనం.


• కాలం లో    సమసిపోతుంది   దేహం.

   రాత ల్లో     నిలిచిపోతుంది    జీవం.



నుడికారం = రచన, లిఖించబడినది.

యడ్ల శ్రీనివాసరావు 10 Oct 2024 , 8:00 PM






Wednesday, October 9, 2024

546. నీ జీవితం నీకు ఉపయోగపడుతుందా ?

 

 నీ జీవితం నీకు ఉపయోగపడుతుందా?


• అవును.  నిజమే ...

• నీ జీవితం నీకు ఉపయోగకరంగా ఉందా?  లేదా

• ఏదో జీవించాలి కాబట్టి జీవిస్తున్నా …  అని     అనిపిస్తుందా?

• నీ జీవితం నీకు ఉపయోగకరంగా లేకపోయినా   ఇతరులకు ఉపయోగకరంగా ఉందా?


• ఈ ప్రశ్నలు  అంతరంగం లో  ఒకటి  రెండు  సార్లు మననం చేయడం వలన , మన స్థితి  అదే విధంగా  మనసు స్థితి ఎలా  ఉందో  స్పష్టం  అవుతుంది.


🌹🌹🌹🌹🌹

నీ జీవితం నీకు ఉపయోగకరంగా ఉందా? 

 అనగానే , సమాధానం ఉవ్విళ్లూరుతూ … అవును … అని నీ అంతరాత్మ,  ఏ అరమరిక  లేకుండా  నిజాయితీ గా , సమాధానం  చెప్పినట్లు అయితే   నీవు  చాలా భాగ్యవంతుడివి.   ఈ సమాధానం నీకు నువ్వు చెప్పుకోవడం లో,    ఏ ఒక్క విషయం  లోనూ  సంకోచం లేకుండా ,  రాజీ పడకుండా  చెప్పగలగాలి. ఎందుకంటే ఇది  నీ లో  ఒక అనంతమైన సంతోషానికి నిదర్శనం అవుతుంది. ఇక్కడ, నువ్వు మానసికంగా ఇంకా ఉన్నత స్థితి పొందడానికి , నీ జీవితం నీకు చాలా సహాయం చేస్తుంది.  ఈ స్థితి లో మనసు కి సుఖం, శాంతి, సంతోషం,  సంతృప్తి నిరంతరం దొరుకుతున్నాయి అని అర్దం.   ఈ స్థితి ద్వారా మనతో  ఉన్న వస్తువులు, ధనం , మనుషులతో ఉన్న సంబంధాలు, భౌతిక పరిగణలను  దాటి   మన మనసు  పొందవలసినవి  పొందుతూ ఉంటుంది.  ఇది ఒక అద్భుతమైన యోగం.


🌹🌹🌹🌹🌹

• ఏదో జీవించాలి కాబట్టి జీవిస్తున్నా … 

 అనగానే  మనసు లో ఒక మూల  నిట్టూర్పు.  ఇందులో   సగం సంతోషం,  సగం దుఃఖం ఉందని అర్దం.  ఇంకా నెరవేర  వలసిన కోరికలు, అవసరాలు మిగిలి ఉన్నాయి.  మరియు  ఉన్నదానితో  సంతృప్తి కానరాని  స్థితి ఇది.   ఇక్కడ  సంతోషం తో పాటు. నిరాశ, నిస్పృహ లు   సమాన స్థాయిలో ఉంటాయి.

ఇక్కడ   మనసు  తన స్థితి లో  ప్రతి క్షణం   రాజీ పడుతుంది.  అది అనుకున్నది  సాధించలేక కనిపించని  వెలితితో ఉంటుంది.  ఇక్కడ   జీవితం లో అనుకున్నది  ఒకటయితే  జరుగుతున్నది మరొకటి . కానీ రాజీ పడాలి కదా అనిపిస్తుంది.  ఈ స్థితిలో బయటకు మాములుగా   కనిపిస్తూ ఉన్నా మనసు తపనతో ఇంకా ఏదో ఏదో  కావాలని  వెతుకుతూనే ఉంటుంది.   ఈ దశలో  మనసు కి  కేవలం   విశ్రాంతి మాత్రమే దొరుకుతుంది. విశ్రాంతి అనేది తాత్కాలిక ఉపశమనం.   ఈ స్థితి లో మనసు కి వస్తువులు , మనుషులు , భౌతిక అంశాల పట్ల ఆనురక్తి  ఇంకా కొంత శాతం మిగిలి ఉంది అని అర్దం.


🌹🌹🌹🌹🌹

• నీ జీవితం నీకు ఉపయోగకరంగా లేకపోయినా ఇతరులకు ఉపయోగకరంగా ఉంది.

ఇది ఒక విధంగా  కరెక్ట్ కాదు.   

కానీ మరో విధంగా చాలా కరెక్ట్.

ఎలాగో చూద్దాం...


మొదట  ఇది ఏ విధంగా కరెక్ట్ కాదు…

ఈ స్థితి లో జీవితాన త్యాగం, వైరాగ్యం, నిర్లిప్తత, నిస్సహయత కనిపిస్తాయి. నా జీవితం నాకు ఎందుకూ ఉపయోగపడలేదు కనీసం ఇతరులకైనా ఉపయోగకారి గా, సహాయకారి గా ఉన్నాను అని అనుకోవడం లో  , ఏమీ సాధించలేక తనలో తాను పూర్తిగా రాజీపడి జీవించడం అవుతుంది.

• నీకు నువ్వు ఉపయోగపడకుండా ఇతరులకు ఉపయోగకరంగా ఉంటే అది నీలో నిస్సత్తువని , అసంతృప్తిని నిరంతరం నీలో అంతర్లీనంగా ప్రస్పుటం అవుతుంది .  ఇది చాలా సహజం. ఇతరులకు నువ్వు ఎంత సహాయకారిగా ఉన్నా, నీ లో ముమ్మాటికీ ఒక లోటు  ఉంటుంది.

నీ పై  నీకు  స్వ ప్రయోజనం (స్వార్థం కాదు) ఉంటేనే నీ మనసులో సంతోషం, పరిపూర్ణత సిద్ధిస్తుంది.

నువ్వు మంచి వాడిగా ఉండాలి,  కాని మంచి వాడి గా నిరూపించుకోనవసరం ఏ మాత్రం లేదు. ఎప్పుడైతే నీకు నువ్వు ఉపయయోగ కారి గా అవుతావో, అప్పుడు  నీలో మంచితనం   ఉన్నట్లయితే,  సహజంగా నే  అది  ఎలాంటి మంచి అయినా  సరే ఇతరులకు   పంచుతావు.

• ఇతరులకు  నువ్వు ఉపయోగి కారి గా అయ్యే ముందు  నీకు నువ్వు ఉపయయోగ కారిగా, సంతోషంగా,   సంతృప్తి కరం గా  ఉండడం చాలా చాలా అవసరం.....  సంతోషం,  సంతృప్తి అనే భావనలు నీలో నిండుగా ఉన్నప్పుడు మాత్రమే, నీలో నిరంతరం మంచి శక్తి  ఉద్భవించడం  జరుగుతుంది. లేదంటే  ఒకరోజు సంతోషం,  మరో రోజు నిస్సత్తువ గా ఉండడం  వలన నీకు నువ్వు  ప్రయోజనకారి కాలేవు. ప్రయోజనకారి , ఉపయోగకారి   అంటే నువ్వు చేసే చర్యలు, కార్యక్రమాలు ద్వారా సంతోషం పొందుతూ, నాకు  ఏ వెలితి లేదు  అనే  సంతోషం  మనసు లో భావించడం.

నీకు నువ్వు ఉపయయోగ పడుతుంటే, అంటే నిన్ను నువ్వు  ఉద్ధరించు కుంటుంటే,  సహజం గానే ఇతరులకు ,  తోటి వారి అవసరాలకు నువ్వు ఉపయోగకారి గా కాగలవు. “తనకు మాలిన ధర్మం చెడ్డది” అనే సామెత కి నిదర్శనం ఈ స్థితి .


• నీకు నువ్వు ఉపయయోగకరం     కాక పోయినా ఇతరులకు  సేవ చేయడం.  రెండవ విధంగా , నువ్వు చాలా చాలా కరెక్ట్. …..

నీకు నువ్వు సంపూర్ణంగా గా అయినపుడు, అంటే కోరికలకు అతీతంగా అయినపుడు,  ప్రత్యేకంగా నీ కోసం అంటూ ఏమీ సాధించ వలసిన అవసరం లేదు అనే పరిపక్వత కలిగినప్పుడు, నీకు నువ్వు ఉపయోగకారి గా కానవసరం లేదు.  నీ కోసం నువ్వు పొందవలసినవి అన్నీ పొంది, గతంలో అనుభవించేసి ఉంటావు. ఇక ఇప్పుడు నువ్వు ఉన్నది,  జీవిస్తున్నది ఇతరుల కోసం, ఇతరులకు సేవ చేయడం కోసం. ఈ స్థితి లో నీకు నీ గురించి అణువంత వెలితి కూడా నీ మనసు లో ఉండదు, సరికదా నీ సంతోషం అంతా పరోపకారం లోనే ఉంటుంది. చెప్పాలంటే ఇది దైవిక గుణం.  

నువ్వు పరోపకారి గా అయ్యావు అంటే, నీకు నువ్వు అనంతమైన పుణ్యం జమ చేసుకోవడం ద్వారా చాలా మరింత  ప్రయోజనకారివి అవుతున్నావు అని అర్దం. ఇక్కడ బాహ్య సంపదలు, ధనం, ఆస్తులు ఉండకపోవచ్చు కానీ అంతకు మించినవి నీలో జమ అవుతూ ఉంటాయి. దీనిని సహజ రాజయోగ స్థితి అంటారు.


🌹🌹🌹🌹🌹

నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ముందు నీ మానసిక సంతోషం ముఖ్యం. ఇది అంత సులభం గా దొరికేది కాదు. నిన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకుంటూ, సరి చేసుకుంటూ ఉంటేనే,  నీకు  కొన్ని సాధ్యం. అప్పుడు నీకు నువ్వు సమాధానం ధైర్యం గా,  నిజాయితీగా చెప్పుకోవచ్చు. 


నువ్వు ఎప్పుడూ  ఇతరులను మోసం చేయడం చాలా చాలా సులభం. కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోవడం అంతకంటే  చాలా సులభం.  ఎందుకంటే నిన్ను నువ్వు మోసం చేసుకోవడం లో  బాగా ఆరితేరినపుడే  ఇతరులను  సులభంగా  మోసం చేయగలవు. అంటే దీని అర్థం,  ఇతరులను  మోసం చేయడం  వలన  నీకు పడే శిక్ష కంటే,   నిన్ను నువ్వు మోసం చేసుకోవడం ద్వారా పడే శిక్ష అధికం మరియు అది వర్ణనాతీతం.  ఈ శిక్ష   భగవంతుడు కానీ ఇంకొకరు  ఎవరో గాని  మనకు వేయరు.  ఎవరికి వారే వేసుకుంటారు.  మరణం పొందే లోపు తప్పనిసరిగా ఈ విషయం అర్దం అవుతుంది.


• జీవితం లో సమయాన్నీ   వృధా గా  కాలయాపన చేయడం కంటే,  మనన చింతన చేయడం ఉత్తమం. నేడు నీ గతి స్థితి మార్చి , నిన్ను పాతాళం లోకి నెట్టి వేయడానికి ఎన్నో సాధనాలు, సామాగ్రి , వికారాలు   నీ చుట్టూ తక్షణం అందుబాటులో ఉన్నాయి. నువ్వు చేసేది తప్పో ఒప్పో కూడా నీ స్పృహ కి అర్దం కానటువంటి   మాధ్యమాలలో   నేటి   నీ జీవనం గడుస్తుంది.


మనిషి అనే వాడు .... తనను తాను తెలుసుకునే ప్రక్రియ లో  ఇదంతా ఒక భాగం. ... 

ఇదంతా రాస్తూ ఉన్న వాడు యొక్క ఆలోచన మాత్రమే ఇది,  ఈ రాసేవాడు కూడా  ఇవన్నీ తెలుసుకోవడానికి,  నేర్చుకోవడానికి  దేనికీ  అతీతుడు కాడు. 


యడ్ల శ్రీనివాసరావు 10 Oct 2024, 9:30 AM.



Friday, October 4, 2024

545. శివుని తో మనువు

 

శివుని తో  మనువు



• మాటాడి  చూడు

  శివుని తో     ప్రేమ గా

  మాటాడి  చూడు.

• మనువాడి   చూడు

  శివుని తో   మనసు న

  మనువాడి   చూడు


• లీలలు చూపిస్తాడు.      లీనం చేస్తాడు.

  ఊహించని   లోకాన్ని   ప్రత్యక్షం  చేస్తాడు.


• శివుడే     ప్రియుడైతే    స్వర్గం   నీ సొంతం.

  హరుడే    హితుడైతే     జన్మం    సార్థకం.


• పరమేశుని తో   పయనం   ప్రతి క్షణం   రాజసం.

  కాలుని   కొలువు తో  మది మలినాలు  మాయం.


• మాటాడి   చూడు

  శివుని తో    ప్రేమ గా

  మాటాడి   చూడు.

• మనువాడి   చూడు

  శివుని తో   మనసు న

  మనువాడి   చూడు.


• మహిమని   చూపిస్తాడు.   మైకం తొలగిస్తాడు.

  నీవంటూ     ఏమిటో    నీకే  చూపిస్తాడు.


• పురారి    పాశం   అమరం.

  యుగ యుగాలుగా  అది  అమరాలయం.


• మురారి     గీతం    బంధనం.

  తర తరాలుగా    అది    అజరామరం.


• మాటాడి   చూడు

  శివుని తో   ప్రేమ గా

  మాటాడి  చూడు.

• మనువాడి   చూడు

  శివుని తో    మనసు న

  మనువాడి   చూడు.



పురారి =శివుడు

పాశం = బంధం

అమరం = మరణం లేనిది.

అమరాలయం= శాశ్వత స్వర్గం.

మురారి = శ్రీ కృష్ణుడు

గీతం = గీతా జ్ఞానం

బంధనం = ముడిపెట్టు, కట్టిపెట్టు.

అజరామరం = శాశ్వతం, స్థిరం.


యడ్ల శ్రీనివాసరావు 5 Oct 2024 , 9:00 AM.






Thursday, October 3, 2024

544. శివుని మర్మం

 

శివుని మర్మం 


• మీరు  చనిపోవడానికి  పుట్టారు.   ఇది సత్యం. అందులో   ఏ సందేహం  లేదు.   మరణానంతరం కూడా  నీ కర్మలే  నిన్ను తిరిగి  జన్మించే లా  చేస్తాయి. మీరు  గత జన్మలలో  చేసిన కర్మల   అనుసారంగా, ముందు గానే    మీ విధి  వ్రాయబడి ఉంది .  అదే నేడు తిరిగి  మీరు  అనుభవించడం జరుగుతుంది.


మీ త్యాగనిరతి  మరియు  దయాళుత్వం  సమ్మేళనం కావడం  ద్వారా    పవిత్రమైన  జీవన విధానం   కలిగి మీరు  సంపూర్ణ మనిషి గా  ఆవిష్కరింప బడతారు. మీ  వివేకం  మరియు   సృజనాత్మకత  మానవజాతి అవసరాలకు  అనుగుణంగా  ఉపయోగపడేలా ఉండాలి.


మీ స్వీయ ఆలోచన  అంచనాలను  నిలుపుదల  లేదా నిరోధించడం ,  స్వాధీనతను  వాయిదా  వేయడం వలన    మీ  "అంతరంగం"   మీ లోని  గుసగుసలను తగ్గించదు.   సర్వశక్తిమంతుడైన  “శివుడు”  రక్షకుడు. మీ  జీవితం లోని  అన్ని బాధలను  అణచివేస్తాడు. “శివం”  అంతిమ “దైవం”. ఆ పై నమ్మకం తో ఉండండి.


🌹🌹🌹🌹


• పుణ్యం  పురుషార్ధం  అనేవి  తరచూ  వినిపిస్తాయి. పుణ్యం  అంటే  సత్కర్మల  ఆచరణ  ద్వారా  జమ అయ్యే  భాగ్యం.    పురుషార్ధం ,   పురుష్ + అర్ద్. పురుష్  అనగా  ఆత్మ.  మానవుడు  తన  ఆత్మను గ్రహించి ,  అర్దం చేసుకొని,  ఆత్మ కు  అవసరమైన ఉన్నత  స్థితిని   వృద్ధి  చేసుకోవడమే   పురుషార్ధం.


☘️☘️☘️☘️


కొవ్వొత్తి    దాని మొత్తం   ఇంధనంతో కాలిపోయినట్లు  అనిపిస్తుంది.  అయితే   వాస్తవం ఏమిటంటే  చుట్టూ  ఉన్న  వాతావరణంలోని ఆక్సిజన్ ద్వారా మాత్రమే అలా సాధ్యమవుతుంది.

అదే విధంగా,  మీరు జీవిస్తున్నది   కేవలం   మీ అవయవ  పనితీరు  వల్ల  మాత్రమే కాదు.   మిమ్మల్ని చుట్టుముట్టిన , ఆవహించిన   ఒక  లోతైన   శక్తి మిమ్మల్ని    జీవించేలా  చేస్తుంది.   ఆ శక్తికి   మీరు భగవంతుడు  అని పేరు  పెట్టవచ్చు.   ఆకారం మరియు  రంగు  ఏదైనా సరే ,  ఆ  నిర్దిష్ట శక్తి  గురించి మీరు  మీ మనస్సులో  కరుణను ఊహించుకుంటారు. అది  దైవికమైనది  మరియు  అది మీ  జీవిత వృద్ధి ని పెంపొందిస్తుంది.


దేవుని  అద్భుతమైన   శక్తితో   మిమ్మల్ని చుట్టుముట్టిన ప్రాకృతిక  శక్తి  పట్ల  గొప్పగా ఉండండి.  ఆ శక్తికి   నేను  పరమ శివుడు   అని పేరు పెడతాను. ఇది  మీ మనస్సు  మరియు  శరీరానికి    టీకాలు వేయడానికి  మరియు  మిమ్మల్ని  ఎల్లప్పుడూ తాజాగా  ఉంచడానికి  సిరల  ద్వారా దూసుకుపోతుంది.


యడ్ల శ్రీనివాసరావు  3 Oct  2024  12:00 AM.




Wednesday, October 2, 2024

543. శివుని ఎక్కడ వెతకాలి

 

శివుని  ఎక్కడ  వెతకాలి 



"శివుని   కోసం వెదుకులాట" .....

అవును నిజమే కదా!  శివుడెక్కడ  ఎక్కడెక్కడ  అని కొన్ని వేల  సంవత్సరాలుగా  మానవాళి  వెదుకుతూ వెదుకుతూ  ఉండగా  మన అమ్మమ్మలు  నానమ్మలు చెప్పిన   చిట్టి పొట్టి  కథలు   జ్ఞాపకం వస్తాయి.


శివుడు   భక్త కన్నప్ప కు   మార్కండేయుడు కు ఆదిశంకరుల కు  ఇలా   కొంతమందికి సాక్షాత్కరించెనని   చెప్పగా విన్నాము.  భక్తి  ఒక్కొక్కరి లో   ఒక్కోలా  ప్రకటితమౌతూ  ఉంటుంది. మరి  నాకు  నీకు  ఆ మహానుభావులంత  జిజ్ఞాస ఆర్ద్రత  సమతుల్యత   ఉందా ?.  ఒక వేళ అంతటి గొప్పవాళ్ళకి  తప్ప  శివుడు   మరెవ్వరికీ   దర్శనం ఇవ్వడా!   అంటే  తప్పక ఇస్తాడు.


• శివుడు   సకల  జనరంజకుడు.  సర్వేశ్వర సాన్నిధ్యము    సకలజనులకు  సాధ్యమే.  మనో సంకల్పం ఉంటే    నీ దినచర్య లందు,   నీ కర్మలను ఆచరిస్తూ కూడా  నువ్వు  శివుని  చూడగలుగుతావు.

 అది కనిపెట్టే తీరిక,  కనిపెట్టాలనే  బలమైన కోరిక నీకు సిద్దించాలి.  అందుకు  నీ మనసు లో  పవిత్రత, బుద్ధి లో స్వచ్ఛత,   నిరంతర  శివ స్మృతి   కలిగి ఉండాలి.  నీవు కేవలం శరీరం కాదు,  నీ లో ఉన్నది ఆత్మ  అనే   స్పృహ ఎరిగినపుడు   శివ పరమాత్మకు నీవు  దగ్గర  అవుతావు.


• శివుడు   రాయి రప్పల్లోను,   చెట్టు పుట్ట ల్లో ను , నదుల్లోను,    పర్వతాల లోను,    మనుషుల లోను,  నీ లోను,  నా లోను  ఉండడు.  కాకపోతే  ఇవి అన్నియు  శివుని చే  ఈ విశ్వం లో    సృష్టించబడినాయి.  కాబట్టి  వీటన్నింటిలో  శివుడు ఉంటాడని   అమాయకత్వం తో ,  భక్తి తో అనుకుంటాం.    ఒకవేళ  శివుడు  నీలో,  నాలో, లేదా ప్రతి మనిషి లో  ఉన్నాడు  అనుకుంటే .....

అనగా భగవంతుడు  స్వయం గా  మనిషి లో  కొలువై ఉన్నాడు  అనుకుంటే   కనుక    అమాయకత్వం అవుతుంది …. ఎందుకంటే , మనలో ఎంత పవిత్రత నిండి ఉంది? … మనం ఈర్ష్య, ద్వేషం, అసూయ, కామం, అహం, క్రోధం , స్వార్థం వంటి గుణాలకు అతీతంగా ఉన్నామా? … మన ఆలోచనలు శివుని తో అనుసంధానం  అయి  ఉన్నాయా? …. అదే విధంగా మనం నిత్యం చేసే కర్మలు, క్రియలు శివుడే  చేయిస్తూ ఉంటాడా? అలా చేయిస్తే మనం చేసే పాప కర్మలకు శివుడే  బాధ్యుడా ?….. 


ఒకసారి ఇదంతా మననం చేస్తే తెలుస్తుంది, శివుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడా లేదా అనే విషయం. …. కలియుగంలో   జన్మించిన   ఏ  మానవుడు  పవిత్రుడు కాడు.  ఎందుకంటే  మానవుడు జన్మ తీసుకున్న  విధానమైన కర్మ   పవిత్రత తో  కూడినది కాదు.   అది  కామచితి  అంశం.  

మానవుని  శరీరం  అపవిత్రం.   దేహం ఎన్నటికీ  శుద్ధి గావింపబడదు  ...... కానీ శరీరం లో  ఉన్న  ఆత్మ ను  దైవ సాధనతో,  మంచి బుద్ధి , సంస్కారాలతో,  వికారాలు ,  అవగుణాలు  తొలగించు కోవడం ద్వారా  పవిత్రం గా  ఆత్మ ను తయారు చేసుకోగలం. యోగులు,  మహర్షులు  సాధన తో  చేసేది  ఇదే.


• అదే విధంగా,   శివుడు విశ్వ  సృష్టి కర్త అని మనకు తెలుసు. మరి సృష్టి చేసిన శివుడు  భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు,  ఉప్పెనలు అంటూ ఈ సృష్టిని, మానవాళి ని, సమస్త జీవకోటి ని తానే స్వయంగా వినాశనం చేస్తాడా?

 ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి ….


• శివుడు  పరమాత్మ.  ఇది జగమెరిగిన  సత్యం.   పరం + ఆత్మ  అంటే  పరలోకం లో  ఉండే  ఆత్మ యే పరమాత్మ.


స్థూల లోకం, సూక్ష్మ లోకం, పరలోకం అనే మూడు లోకాలు ఉన్నాయి.   మనం  ఉండేది  స్థూల లోకం, మన శరీరం  స్థూల తత్వం.    ఆ పైన ఉండేది సూక్ష్మ లోకం , ఇందు బ్రహ్మ విష్ణు శంకర దేవతలు ఉంటారు . ఆ పైన ఉండేది మూల వతనం ఇదే పరలోకం, ఇందు పరమాత్మ అయిన శివుడు జ్యోతి బిందు స్వరూపం తో అనంతమైన తేజోవంతంగా   ఈ సృష్టి కి  శక్తి ఇస్తూ ఉంటాడు. ఆత్మ ల యొక్క నివాసం కూడా ఇక్కడే.  శివుని కి  శరీరం  ఉండదు.   నిరాకారుడు.  ఆయన  యొక్క అతి చిన్న జ్యోతిబిందు  స్వరూపాన్నే    మన దేవాలయాల్లో లింగ  ఆకారంలో చూపిస్తారు.


• మనిషి లో ఉండేది ఆత్మ.  ఆత్మ  దేహం  ధరించి ఇహలోకంలో  అంటే  స్థూల లోకం లో   కర్మలు ఆచరిస్తుంది.   మనిషి  తాను  దేహం  అనే  స్థితి లో  ఉన్నప్పుడు, కంటికి ఈ భౌతిక లోకం మాత్రమే కనిపిస్తుంది  ..... అదే  మనిషి  ధ్యాన యోగ  సాధన  ద్వారా సంపూర్ణ  ఆత్మ  స్థితి  పొందినప్పుడు   సూక్ష్మ లోకం  మరియు  పరలోకం   సాక్షాత్కారం అవుతుంది.  తద్వారా  పరమాత్మ అయిన శివుని అనంతమైన  తేజోమయ  స్వరూపం  అనుభవం అవుతుంది.


• మరి శివుని ఎలా చూడాలి ? …. శివుని ని  చూడలేం   కానీ   శివుని ని  అనుభూతి,  అనుభవం పొందగలం.   ఎలా అంటే ,   ఉదాహరణకు గాలి ని చూడలేం,  కానీ  గాలి తాకినప్పుడు మనం అనుభవం పొందుతాం.  అంటే గాలి ఉందని  అర్దం .… అదే విధంగా  ఈ విశ్వం లో సూర్యుడు  కొలవలేనంత దూరం లో  ఎక్కడో ఉన్నాడు, సూర్యుడిని చూడగలం కానీ తాకలేం .   కానీ సూర్యుని  ఉష్ణ  శక్తిని అనుభవిస్తాం.  అంత మాత్రాన సూర్యుడు, గాలి మనలో  ఉంటాయి   అనడం  అజ్ఞానం.

అదే విధంగా భగవంతుడు ఉన్నాడు.  కానీ చూడలేం, తాకలేం.  కానీ భగవంతుని అనుభవం చేయగలం. ఆయన శక్తి పొందగలం.


• శివుడు  చిదానందుడు. చిత్+ ఆనందం అంటే ఆత్మ కు ఆనందం కలిగించు వాడు. ఒక ఆత్మ (మనిషి ) అమితమైన ఆనందాన్ని, విశ్వ శక్తి ని కలిగి ఉంది అంటే  శివుడు అనుభవం అవుతాడు.

 విశ్వ సృష్టి  చేసిన  శివుడు, బ్రహ్మ విష్ణు శంకరులను సృష్టించాడు.   వీరు సూక్ష్మ లోకం లో  ఉంటారు.  బ్రహ్మ   సృష్టి రచన చేశాడు. రచన అంటే సృష్టిలో ప్రతీ అంశం ఏ విధంగా నడవబడాలి  అనేది బ్రహ్మచే రచించ బడింది ….  విష్ణువు చేత పాలన …. అదే విధంగా శంకరుడు చేత వినాశనం  జరుగుతుంది.    ఇవి   బ్రహ్మ విష్ణు శంకరులు  నిర్వర్తించే   ధర్మాలు.


కలియుగంలో  ధర్మం   దారి  తప్పినపుడు వినాశనం ఆరంభం అవుతుంది.  అవే ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు.   వినాశనం అయితేనే  మరలా  తాజాగా కొత్త సృష్టి   జరుగుతుంది. … ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే  శివుడు వేరు,  శంకరుడు వేరు.  శివుని కర్తవ్యం  సృష్టి.   శంకరుని  కర్తవ్యం వినాశనం.    కానీ మానవులు శివుడు, శంకరుడు ఒకటే అనుకుంటారు.  సూక్ష్మంగా గమనిస్తే  శంకరుడు శివలింగాన్ని  పూజిస్తున్నట్లు  చాలా   చిత్రపటాలలో  ఉంటుంది .

• ఎన్నో జన్మలుగా  చేస్తున్న  భక్తి   సంపూర్ణం  అయిన జీవికి,  సద్గురువు ద్వారా  ధ్యాన  జ్ఞాన మార్గం అనే ద్వారం  తెరవబడుతుంది.  ఎప్పుడైతే  జ్ఞానం తెలుసు కొని  ఆచరించడం  జరుగుతుందో  అప్పుడు సహజ రాజయోగ స్థితి ద్వారా,  జీవుని కి  జన్మాంతరాలలో  మధ్యస్థంగా  మిగిలి పోయిన  కర్మలు  ( peding karmas ) ,   వాటి  కారణాలు  సాక్షాత్కారం  అవుతూ  అవి  సహేతుకంగా  తొలగింపతాయి.  తద్వారా  జీవి  కర్మ యోగి గా  అయి శివుని తత్వం  ఆకళింపు  చేసుకోవడం సాధ్యం  అవుతుంది


 సూర్య గ్రహణం సమయాన  ...

 శివుని ఆశీస్సులతో

 ఓం నమఃశివాయ 🙏

 ఓం శాంతి 🙏

 సర్వే జనా సుఖినోభవంతు.


యడ్ల శ్రీనివాసరావు 3 October 2024, 12:05 AM




Tuesday, October 1, 2024

542. ప్రేమ నిరతి

 

ప్రేమ నిరతి



• చిరునవ్వుతో     చిన్నారి  లా

  సిగపువ్వుతో      సింగారి  లా

  వన్నె   తగ్గని      వయ్యారి లా

  వెన్న  పూసిన     వరూధిని లా


• వలపే       చాచావే     పిల్లా

  వయసే    తుంచావే   మళ్లా.

• సొగసే       దాచావే    పిల్లా

  పరువం     పెంచావే   మళ్లా.


• నీ    కళ్ల   లోని    కోమలం తో

  గుండె లోన     గుబులవుతుంది.

• నీ   మాట లోని      రాగం తో

  శృంగారం    సంబర  పడుతుంది .


• నీ    అధరం    మకరంద    కోశం.

  నీ    వదనం    ప్రవరునికి   పాశం.

  నీ   నయనం    తామర   తంత్రం.

  నీ   చుబుకం    గారాల   సరసం.


• చిరునవ్వుతో     చిన్నారి  లా

  సిగపువ్వుతో      సింగారి  లా

  వన్నె   తగ్గని     వయ్యారి  లా

  వెన్న    పూసిన    వరూధిని  లా


• వలపే       చాచావే     పిల్లా

  వయసే    తుంచావే    మళ్లా.

• సొగసే      దాచావే     పిల్లా

  పరువం     పెంచావే   మళ్లా.


• నీ   బాహువుల  బంధం   తో

  కౌగిలి      కలకల మవుతుంది.

• నీ    నాభి     శ్రావ్యం   తో

  తపనలు     తడబడుతున్నాయి.


• నీ   రూపం   అజంతా   శిల్పం

  నీ   దర్పం    ఎల్లోరా    రాజసం

  నీ   భోగం     అప్సర    సంభోగం

  నీ   ప్రేమం     మౌన    కుసుమం.


• చిరునవ్వుతో      చిన్నారి లా

  సిగపువ్వుతో       సింగారి లా

  వన్నె   తగ్గని       వయ్యారి లా

  వెన్న   పూసిన     వరూధిని లా


• వలపే        చాచావే      పిల్లా

  వయసే     తుంచావే    మళ్లా.

• సొగసే        దాచావే     పిల్లా

  పరువం      పెంచావే    మళ్లా.



  నిరతి   =  మిక్కిలి  ఆసక్తి, ఇష్టం 

  తుంచు = ఛేదించు , అధిగమించు

  కలకలం = సందడి.


యడ్ల శ్రీనివాసరావు  22 Sep 2024 , 10:00 pm


613. పద - నది

  పద - నది • పదమే     ఈ   పదమే   నదమై   ఓ     నదమై    చేరెను    చెలి    సదనము. • ఈ  అలల  కావ్యాలు   తరంగాలు    తాకుతునే    ఉన్నాయి      ఎన్న...