శివుని ఎక్కడ వెతకాలి
• "శివుని కోసం వెదుకులాట" .....
అవును నిజమే కదా! శివుడెక్కడ ఎక్కడెక్కడ అని కొన్ని వేల సంవత్సరాలుగా మానవాళి వెదుకుతూ వెదుకుతూ ఉండగా మన అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన చిట్టి పొట్టి కథలు జ్ఞాపకం వస్తాయి.
శివుడు భక్త కన్నప్ప కు మార్కండేయుడు కు ఆదిశంకరుల కు ఇలా కొంతమందికి సాక్షాత్కరించెనని చెప్పగా విన్నాము. భక్తి ఒక్కొక్కరి లో ఒక్కోలా ప్రకటితమౌతూ ఉంటుంది. మరి నాకు నీకు ఆ మహానుభావులంత జిజ్ఞాస ఆర్ద్రత సమతుల్యత ఉందా ?. ఒక వేళ అంతటి గొప్పవాళ్ళకి తప్ప శివుడు మరెవ్వరికీ దర్శనం ఇవ్వడా! అంటే తప్పక ఇస్తాడు.
• శివుడు సకల జనరంజకుడు. సర్వేశ్వర సాన్నిధ్యము సకలజనులకు సాధ్యమే. మనో సంకల్పం ఉంటే నీ దినచర్య లందు, నీ కర్మలను ఆచరిస్తూ కూడా నువ్వు శివుని చూడగలుగుతావు.
అది కనిపెట్టే తీరిక, కనిపెట్టాలనే బలమైన కోరిక నీకు సిద్దించాలి. అందుకు నీ మనసు లో పవిత్రత, బుద్ధి లో స్వచ్ఛత, నిరంతర శివ స్మృతి కలిగి ఉండాలి. నీవు కేవలం శరీరం కాదు, నీ లో ఉన్నది ఆత్మ అనే స్పృహ ఎరిగినపుడు శివ పరమాత్మకు నీవు దగ్గర అవుతావు.
• శివుడు రాయి రప్పల్లోను, చెట్టు పుట్ట ల్లో ను , నదుల్లోను, పర్వతాల లోను, మనుషుల లోను, నీ లోను, నా లోను ఉండడు. కాకపోతే ఇవి అన్నియు శివుని చే ఈ విశ్వం లో సృష్టించబడినాయి. కాబట్టి వీటన్నింటిలో శివుడు ఉంటాడని అమాయకత్వం తో , భక్తి తో అనుకుంటాం. ఒకవేళ శివుడు నీలో, నాలో, లేదా ప్రతి మనిషి లో ఉన్నాడు అనుకుంటే .....
అనగా భగవంతుడు స్వయం గా మనిషి లో కొలువై ఉన్నాడు అనుకుంటే కనుక అమాయకత్వం అవుతుంది …. ఎందుకంటే , మనలో ఎంత పవిత్రత నిండి ఉంది? … మనం ఈర్ష్య, ద్వేషం, అసూయ, కామం, అహం, క్రోధం , స్వార్థం వంటి గుణాలకు అతీతంగా ఉన్నామా? … మన ఆలోచనలు శివుని తో అనుసంధానం అయి ఉన్నాయా? …. అదే విధంగా మనం నిత్యం చేసే కర్మలు, క్రియలు శివుడే చేయిస్తూ ఉంటాడా? అలా చేయిస్తే మనం చేసే పాప కర్మలకు శివుడే బాధ్యుడా ?…..
ఒకసారి ఇదంతా మననం చేస్తే తెలుస్తుంది, శివుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడా లేదా అనే విషయం. …. కలియుగంలో జన్మించిన ఏ మానవుడు పవిత్రుడు కాడు. ఎందుకంటే మానవుడు జన్మ తీసుకున్న విధానమైన కర్మ పవిత్రత తో కూడినది కాదు. అది కామచితి అంశం.
మానవుని శరీరం అపవిత్రం. దేహం ఎన్నటికీ శుద్ధి గావింపబడదు ...... కానీ శరీరం లో ఉన్న ఆత్మ ను దైవ సాధనతో, మంచి బుద్ధి , సంస్కారాలతో, వికారాలు , అవగుణాలు తొలగించు కోవడం ద్వారా పవిత్రం గా ఆత్మ ను తయారు చేసుకోగలం. యోగులు, మహర్షులు సాధన తో చేసేది ఇదే.
• అదే విధంగా, శివుడు విశ్వ సృష్టి కర్త అని మనకు తెలుసు. మరి సృష్టి చేసిన శివుడు భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఉప్పెనలు అంటూ ఈ సృష్టిని, మానవాళి ని, సమస్త జీవకోటి ని తానే స్వయంగా వినాశనం చేస్తాడా?
ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి ….
• శివుడు పరమాత్మ. ఇది జగమెరిగిన సత్యం. పరం + ఆత్మ అంటే పరలోకం లో ఉండే ఆత్మ యే పరమాత్మ.
స్థూల లోకం, సూక్ష్మ లోకం, పరలోకం అనే మూడు లోకాలు ఉన్నాయి. మనం ఉండేది స్థూల లోకం, మన శరీరం స్థూల తత్వం. ఆ పైన ఉండేది సూక్ష్మ లోకం , ఇందు బ్రహ్మ విష్ణు శంకర దేవతలు ఉంటారు . ఆ పైన ఉండేది మూల వతనం ఇదే పరలోకం, ఇందు పరమాత్మ అయిన శివుడు జ్యోతి బిందు స్వరూపం తో అనంతమైన తేజోవంతంగా ఈ సృష్టి కి శక్తి ఇస్తూ ఉంటాడు. ఆత్మ ల యొక్క నివాసం కూడా ఇక్కడే. శివుని కి శరీరం ఉండదు. నిరాకారుడు. ఆయన యొక్క అతి చిన్న జ్యోతిబిందు స్వరూపాన్నే మన దేవాలయాల్లో లింగ ఆకారంలో చూపిస్తారు.
• మనిషి లో ఉండేది ఆత్మ. ఆత్మ దేహం ధరించి ఇహలోకంలో అంటే స్థూల లోకం లో కర్మలు ఆచరిస్తుంది. మనిషి తాను దేహం అనే స్థితి లో ఉన్నప్పుడు, కంటికి ఈ భౌతిక లోకం మాత్రమే కనిపిస్తుంది ..... అదే మనిషి ధ్యాన యోగ సాధన ద్వారా సంపూర్ణ ఆత్మ స్థితి పొందినప్పుడు సూక్ష్మ లోకం మరియు పరలోకం సాక్షాత్కారం అవుతుంది. తద్వారా పరమాత్మ అయిన శివుని అనంతమైన తేజోమయ స్వరూపం అనుభవం అవుతుంది.
• మరి శివుని ఎలా చూడాలి ? …. శివుని ని చూడలేం కానీ శివుని ని అనుభూతి, అనుభవం పొందగలం. ఎలా అంటే , ఉదాహరణకు గాలి ని చూడలేం, కానీ గాలి తాకినప్పుడు మనం అనుభవం పొందుతాం. అంటే గాలి ఉందని అర్దం .… అదే విధంగా ఈ విశ్వం లో సూర్యుడు కొలవలేనంత దూరం లో ఎక్కడో ఉన్నాడు, సూర్యుడిని చూడగలం కానీ తాకలేం . కానీ సూర్యుని ఉష్ణ శక్తిని అనుభవిస్తాం. అంత మాత్రాన సూర్యుడు, గాలి మనలో ఉంటాయి అనడం అజ్ఞానం.
అదే విధంగా భగవంతుడు ఉన్నాడు. కానీ చూడలేం, తాకలేం. కానీ భగవంతుని అనుభవం చేయగలం. ఆయన శక్తి పొందగలం.
• శివుడు చిదానందుడు. చిత్+ ఆనందం అంటే ఆత్మ కు ఆనందం కలిగించు వాడు. ఒక ఆత్మ (మనిషి ) అమితమైన ఆనందాన్ని, విశ్వ శక్తి ని కలిగి ఉంది అంటే శివుడు అనుభవం అవుతాడు.
విశ్వ సృష్టి చేసిన శివుడు, బ్రహ్మ విష్ణు శంకరులను సృష్టించాడు. వీరు సూక్ష్మ లోకం లో ఉంటారు. బ్రహ్మ సృష్టి రచన చేశాడు. రచన అంటే సృష్టిలో ప్రతీ అంశం ఏ విధంగా నడవబడాలి అనేది బ్రహ్మచే రచించ బడింది …. విష్ణువు చేత పాలన …. అదే విధంగా శంకరుడు చేత వినాశనం జరుగుతుంది. ఇవి బ్రహ్మ విష్ణు శంకరులు నిర్వర్తించే ధర్మాలు.
కలియుగంలో ధర్మం దారి తప్పినపుడు వినాశనం ఆరంభం అవుతుంది. అవే ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు. వినాశనం అయితేనే మరలా తాజాగా కొత్త సృష్టి జరుగుతుంది. … ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే శివుడు వేరు, శంకరుడు వేరు. శివుని కర్తవ్యం సృష్టి. శంకరుని కర్తవ్యం వినాశనం. కానీ మానవులు శివుడు, శంకరుడు ఒకటే అనుకుంటారు. సూక్ష్మంగా గమనిస్తే శంకరుడు శివలింగాన్ని పూజిస్తున్నట్లు చాలా చిత్రపటాలలో ఉంటుంది .
• ఎన్నో జన్మలుగా చేస్తున్న భక్తి సంపూర్ణం అయిన జీవికి, సద్గురువు ద్వారా ధ్యాన జ్ఞాన మార్గం అనే ద్వారం తెరవబడుతుంది. ఎప్పుడైతే జ్ఞానం తెలుసు కొని ఆచరించడం జరుగుతుందో అప్పుడు సహజ రాజయోగ స్థితి ద్వారా, జీవుని కి జన్మాంతరాలలో మధ్యస్థంగా మిగిలి పోయిన కర్మలు ( peding karmas ) , వాటి కారణాలు సాక్షాత్కారం అవుతూ అవి సహేతుకంగా తొలగింపతాయి. తద్వారా జీవి కర్మ యోగి గా అయి శివుని తత్వం ఆకళింపు చేసుకోవడం సాధ్యం అవుతుంది
సూర్య గ్రహణం సమయాన ...
శివుని ఆశీస్సులతో
ఓం నమఃశివాయ 🙏
ఓం శాంతి 🙏
సర్వే జనా సుఖినోభవంతు.
యడ్ల శ్రీనివాసరావు 3 October 2024, 12:05 AM
No comments:
Post a Comment