Thursday, October 24, 2024

551. గోదావరి గలగలలు

 

గోదావరి గలగలలు



గోదావరి లో  ఏముందో …. ఏ అందం ఉందో గాని, ఈరోజు  ఉదయం 6 గంటలకు  వెళ్లి గోదావరి ఒడ్డున కూర్చుని  ప్రశాంతంగా చూస్తుంటే  …  అప్పటి వరకు ఉన్న  స్థితి  మరిచిపోయి,  ఏదో  తెలియని  సంతోషం నెమ్మదిగా  మనసు లో  ఆరంభం అయి,  లోలోపలే చిరునవ్వు   మొదలైంది.


ఒకవైపు   మంచు   తెరలు తెరలుగా  సన్నగా గోదావరి పై   కురుస్తుంటే,   ఆ చల్లని   గాలి   శ్వాస లోకి  వెళుతూ   ఉంటే   శరీరం  అంతా   గాలి లో తేలిపోతుంది.  కొంత సమయం  తరువాత,   లేత ఎరుపు రంగులో  సూర్యుడు  మంచు చాటున ఉదయిస్తుంటే  నున్నని  వెచ్చదనం  శరీరం  తాకుతూ ఉంది …. శరీరం లోపలి శ్వాస అతి చల్లగా, వెలుపల నుని వెచ్చగా ఉంది … ఇది అనుభవిస్తూ ఉంటే , ఈ సమయం నా కోసమే నా … ఇలా అన్నట్లు అనిపించింది.


ఎదురుగా  గోదావరి అలలు,  చిన్నగా  శబ్దం చేసుకుంటూ,  ఒకదాని పై   మరొకటి తొణికిసలాడుతూ  ఉంటే ,   అప్పుడే  పుట్టిన  చిన్ని చిన్ని  కోడి పిల్లలు   పెద్ద గుంపులో  ఒకదాని మీద ఒకటి  పడుతూ   లేస్తున్నట్లు   సంతోషంగా అనిపించింది.  ఆ చిన్న చిన్న  అలలు ఒడ్డు కి చేరుతున్న   ప్రతి క్షణం   నా మనసు  వేగం   శూన్యం అయిపోయింది  ….. ఒడ్డున ఉన్న నీటిలో ,   చిన్న చిన్న  చేప పిల్లలు  వేగం గా    అటు ఇటు, అటు ఇటు ,  ఏ దిశలో   వెళ్లాలో   తెలియదన్నట్లు  కంగారు కంగారుగా  ఈదుతూ ఉంటే …  పాపం అమాయకమైన  చేప పిల్లలు  అనిపించింది.


ఇంతలో   టక్ ... టక్ ...  టక్ ... అని  ఇంజన్ శబ్దం చేసుకుంటూ   గోదావరి నది లో  దూరంగా  నాటు పడవ,   ఇసుక తీసుకుని వెళుతుంది.   ఆ మోటారు పడవ శబ్దం  నా సమీపాన్ని  దాటి  దూరం  గా వెళుతుంటే ,  ఆ సమయంలో  అంత  ప్రశాంతత లోను   ఆ ఇంజన్ శబ్దం ,  ఏదో  లయకారం లా అనిపించింది.


ఆకాశం అంతా  నీలిమయం ,  అక్కడక్కడా  తెల్లని మేఘాలు.  ఒకవైపు మంచు,  మరోవైపు  సూర్యుడు. ఆ సమయంలో   ఎక్కడి నుంచి  వచ్చాయో తెలియదు,   ఒక తెల్లని పక్షుల గుంపు    “ < “ ఆకారంలో   వరుస  తప్పకుండా  గోదావరి  మీద ఎగురుతూ  వెళుతున్నాయి. అదంతా  చూస్తుంటే  ఏదో సంతోషం.   వెలకట్టలేని  అనుభూతి .


ఇంతలో   నాకేం  తక్కువ,   నేను  ఈ ప్రకృతిలో భాగమై   ఉన్నాను  అన్నట్లు  …  ఒక రైలు కూత వేసుకుంటూ  రోడ్ రైలు వంతెన  మీదుగా వెళుతుంది.


ఇదంతా,   నా కళ్లు చూస్తున్నాయో   లేక  మనసు చూస్తుందో  తెలియడం  లేదు  కానీ  చాలా సమయం వరకు  , నా శరీరం  నా ఆధీనంలో   మాత్రం లేదు. గోదావరి ని  చూస్తున్నంత  సేపు,  గోదావరి  ఏదో చెప్పడానికి   ఉవ్విళ్లూరుతున్నట్లు   అనిపించింది. బహుశా  ,  అది  గోదావరి లో  నేను  కలిసి పోయాకే  నాకు  వినపడుతుంది  అనుకుంటూ ….


సుమారు  ఒక అరగంట  సమయం  తరువాత నెమ్మదిగా  చినుకులు పడుతూ,  నన్ను తట్టి  లేపాయి.   వర్షం మొదలైంది .  ఘాట్ లో  మెట్ల పై కూర్చున్న  నేను  పైకి లేచి ,  అక్కడే నిర్మాణం లో  ఉన్న  దేవాలయం షెల్టర్ లో,   ఇసుక పోగు  మీద కూర్చున్నాను .  వర్షం బాగా వస్తుంది.  అప్పుడు అనిపించింది  ….  ఈ సమయం నాది.  ఏక  కాలంలో ప్రకృతి    నా  కోసమే,  ఇంత   అద్భుతమైన అందాలను   చూపిస్తుంది.  బహుశా,  ప్రకృతి కూడా తాను  ఇష్టపడిన   వారికే    సాక్షాత్కరిస్తుంది అనుకుంటా  ….  పురి విప్పిన నెమలి లా.


కాసేపటికి  వర్షం తగ్గింది.  నెమ్మదిగా  అడుగులు వేసుకుంటూ  ….  భగవంతుడు  సృష్టించిన  ఈ ప్రకృతి    ఎంత    అందమైనది .  ఈ ప్రకృతిలో  శాశ్వతం గా   ఒదిగి పోవాలంటే   ఇంకా   ఎంత సమయం  వేచి చూడాలో,  ఆ అదృష్టం ఎప్పడో …. అనుకుంటూ  వెను తిరుగాను.


యడ్ల శ్రీనివాసరావు.

24 Oct 2024 7:00 AM. Saraswati Ghat.




No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...