నేను
• నేను చాలా అందంగా ఉంటానని అందరూ అంటారు. అనడం ఏమిటి, నిజం గానే చాలా అందంగా, నాజుగ్గా, ఆకర్షణీయంగా ఉంటాను. ఈ మాట , చిన్న తనం నుంచి అందరూ అనేదే. నన్ను చూసిన వారు మరలా మరలా నా వైపే చూస్తూ ఉంటారు. అందుకేనేమో నాకు ఒకింత గర్వంగా అనిపిస్తుంది.
• నాకు ఇప్పుడు 42 సంవత్సరాలు. రోజులు, కాలం చాలా సంతోషంగా గడుస్తున్నాయి. జీవితంలో నేను అనుకున్నవి అన్నీ నెరవేర్చుకుంటున్నాను, చెప్పాలంటే నేను సాధిస్తున్నాను. ఎందుకంటే, నా అందం, నా రూపం , నామాట వలన నేను ఎక్కడికెళ్లినా, ఎంతమంది లో ఎవరితో ఉన్నా సరే అసాధ్యం అనుకునేవి కూడా, నాకు అనుకూలంగా మారుతాయి. నేను అనుకున్న పని సులభంగా జరుగుతుంది. నా అందం వలన బంధువులు, స్నేహితులు నాతో ఎక్కువ సమయం చూస్తూ మాట్లాడుతూ ఉండాలి , అని నా చుట్టూ చేరుతూ ఉంటారు.
• ఒకరోజు ఉదయం లేచి చూసే సరికి, నా రెండు చేతులు మణికట్టు నుండి భుజాల వరకు నల్లటి మచ్చలు వచ్చాయి. ఒక్కసారి గా కంగారు పడి, వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. డాక్టర్ దగ్గరకు వెళ్తున్నాను కానీ నా లో ఏదో భయం, ఇంత తెల్లని శరీరం పైన వికారం గా ఉన్న ఈ మచ్చలు ఎలా వచ్చాయి. ఇవి తగ్గుతాయా లేదా అని చాలా ఆందోళన గా ఉంది.
• డాక్టర్ చూసి , ఏం పరవాలేదు అవి ఎలర్జీ మచ్చలు మందులు వాడితే సరిపోతుంది, అంటూ పది రకాల మందులిచ్ఛారు. కానీ నాకు చాలా టెన్షన్ గా ఉంది. నా చేతుల మీద మచ్చలు బయటకు కనపడితే , నా అందం ఏం కాను. నేను నలుగురి లో ఎలా తిరగగలను. ఇవే నా ఆలోచనలు.
• రోజూ మందులు వాడుతున్నాను. మెడికేటడ్ సబ్బుతో రోజు కి పదిసార్లు చేతులు శుభ్రంగా కడుగుతున్నాను. ఈ చేతులపై మచ్చలు కనపడకుండా, పూర్తిగా కవర్ అయ్యేలా బట్టలు తొడుక్కుంటూ …. హమ్మయ్య , పైకి కనపడడం లేదు లే అనుకుంటు రోజులు గడుపుతున్నాను. ఈ మచ్చలు తగ్గడం లేదు సరికదా నెమ్మదిగా ఛాతీ, వీపు పై రావడం ఆరంభించాయి. ఇది వరకు లేని నొప్పి, చర్మం పై కలుగుతుంది. డాక్టర్ కి చెపితే మందులు మార్చారు. అయినా ఫలితం లేదు. నాలో మాత్రం , విపరీతమైన ఆందోళన, డాక్టర్ని మార్చినా, ట్రీట్మెంట్ మారినా ఫలితం లేదు. ఒకరోజు కళ్లు తిరుగతూ ఉంటే, డాక్టర్ కి చూపిస్తే బి.పి. చెక్ చేసి , మీకు బి.పి వచ్చింది అని మందులు ఇచ్చి జాగ్రత్తలు చెప్పారు.
• ఈ మధ్య నేను మాటిమాటికీ అద్దం ముందు నిలబడి నన్ను చూసుకుంటున్నాను . నేను వేసుకునే వస్త్రాలు, మచ్చలు ఉన్న ప్రదేశాలు కవర్ చేస్తున్నాయి. కానీ ఇవి ముఖం పై వస్తే, నా పరిస్థితి ఏంటి?. ఆలోచనల వలన రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు.
• ఇది వరలా బయట ఫంక్షన్స్ గాని, నలుగురిలోకి వెళ్లినా ఫ్రీ గా ఉండలేక పోతున్నాను. చాలామంది నా ప్రవర్తన లో తేడా గమనించి, ఏమైంది అని అడుగుతున్నా సరే , పాలిష్ గా నవ్వుతూ ఏమిలేదు అని క్యాజువల్ గా చెపుతూ పైకి నటిస్తున్నాను. నా ముందు ఎవరైనా కొంచెం అందంగా, నవ్వుతూ కనిపిస్తుంటే తట్టుకోలేక పోతున్నాను. తెలియకుండా ఈర్ష్య, ద్వేషం వచ్చేస్తున్నాయి. నేను నిత్యం చేసుకునే పనులు సరి గా చేయలేక పోతున్నాను. కుటుంబం, పిల్లల తో ఉంటున్నా సరే వారిని ఇది వరలా చూడలేక పోతున్నాను.
నేను చిన్నప్పుటి నుంచి, నా అందం, నా శరీరాన్నే ఒక ఆస్తి గా భావించాను. ఎందుకంటే అందరూ, నన్ను అలాగే పొగిడే వారు.…
• ఇక ఇక్కడ లాభం లేదు … ఏది ఏమైనా, నా ముఖం పై ఈ మచ్చల కు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని హైదరాబాద్ లో, సూపర్ స్పెషాలిటీ స్కిన్ కాస్మెటిక్స్ హాస్పిటల్ కి వెళ్లాను. అక్కడ వారు, ఏవేవో పరీక్షలు చేసి ఎడ్వాన్సడ్ ట్రీట్మెంట్ చేసారు. రోజు రోజుకు చాలా డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది.
• కాలం గడుస్తుంది, కానీ సమస్య అలాగే ఉంది. ఇది వరకు లాగ ఈ ప్రపంచం అందంగా, మంచిగా కనిపించడం లేదు నాకు. దీనితో పాటు, నాకు రోజు రోజుకు కోపం, చిరాకు పెరుగుతుంది. ఇంటిలో అందరిపై విసుక్కుంటున్నాను. స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లు నన్ను ఎక్కడ హేళన చేస్తారో, అని ముందుగా నేనే డామినేటింగ్ గా మాట్లాడడం, వాళ్లలో లేని లోపాలను కూడా చతురంగా పాయింట్ చేయడం మొదలు పెట్టాను. ఈ గుణాలు ఇంతకు ముందు నేను ఎవరిపై ప్రదర్శించక పోయినా , ఇవే నాకు ఇప్పుడు రక్షణ అవుతున్నాయి . ఒంటరిగా ఉన్న సమయంలో ఎక్కువ గా, ఏడుస్తున్నాను.
• రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. నాకు ఈ చర్మం పై వచ్చిన మచ్చలు సమస్య 3 సంవత్సరాలు అయింది. ముఖం పై విస్తరించ లేదు కానీ, కాళ్ల పై కూడా వచ్చాయి. ప్రతీ రోజు నా శరీరాన్ని శుభ్రం చేయని క్షణం లేదు. ఈ మధ్యనే నాకు నిజం తెలిసింది, నాకు చర్మ కాన్సర్ అని. ఇక ఎన్నో రోజులు జీవించనని.
నాకు అంతా చీకటి మయం గా ఉంది. నేను ఆ విషయం విని తట్టుకోలేక పోతున్నాను. నా చుట్టూ ఉన్న మనుషులందరూ నన్ను వెక్కిరిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. తలపోటు గా ఉంది. కోపం నీరసం వస్తున్నాయి. భయం వెంటాడుతుంది.
• ఒకరోజు ఉదయం …. నేను లేవాలి అన్నా సరే, లేవలేక పోతున్నాను. చుట్టూ నా ఇంట్లో వారు, బంధువులు చేరి ఏడుస్తున్నారు. కొంత సమయం తరువాత వారంతా కలిసి, నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళి , పుల్లల పై పడుకోపెట్టి కాల్చెస్తున్నారు.
అయ్యో … అయ్యో…. నా శరీరం… నా శరీరం … నా అందం….నా అందం…నా ముఖం…. నా ముఖం … అని రోదిస్తున్నాను.
• ఇంతలో ఎవరో వచ్చి, నన్ను తీసుకు వెళుతున్నారు. వాళ్లు అంటున్నారు, నేను నా శరీరం వదిలేసానంట. ఇంకా ఎందుకు ఇక్కడ, పద పద … డ్రామా లో, నీ పాత్ర అయిపోయింది.
ఇంకా, వారు నాతో ఇలా అంటున్నారు ….
వారు : జీవించి ఉన్నంత కాలం అందం … అందం అని శరీరాన్ని లెక్కలేనన్ని సార్లు శుభ్రం చేసావు. కానీ , ఏ నాడయినా నీ శరీరం లోపలి నీ ఆత్మ ను , నీ ఆత్మ లోని మలిన గుణాలను శుభ్రం చేశావా? … ఏనాడైనా భగవంతుని స్మరించావా? … ఎవరికైనా సహాయం, దానం, ధర్మం , పుణ్యం ఆచరించావా? పైకి కనపడే శరీరం శుభ్రం చేసావు. కానీ, నీ లోపల పేరుకు పోయిన వ్యర్దగుణాలను శుభ్రం చేసావా?.
నేను : ఆత్మా ? …. ఆత్మ అంటే ఏమిటి. నా పేరు ఆత్మ కాదే ?
వారు : కాసేపు , నా వైపు చూస్తూ నవ్వుకున్నారు.
వారు : ఆత్మ అంటే నువ్వే .…. చూశావుగా ఇందాకే నీది అనుకున్న శరీరాన్ని , నీ అనుకునే వారంతా కలిసి కాల్చేశారు . నీ శరీరం బూడిద అయిపోయింది.
నేను : అప్పుడు … నాకు తెలిసింది, నేను ఒక ఆత్మ అని. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. నేను మోహం తో నా శరీరాన్ని ప్రేమించాను. కానీ, నా లో లోపల ఆత్మ లో ఉన్న మలిన గుణాలను బ్రతికి ఉండగా శుభ్రం చేసుకోలేక పోయాను. మాయ వలన , నేను ఆత్మ అనే సత్యం గ్రహించలేక, జన్మ అంతా వృధా చేసుకున్నాను. నేను ఇప్పుడు నా ఆత్మ ను శుభ్రం చేసుకోవాలను కుంటున్నాను.
కానీ …. కానీ … నాకు ఇప్పుడు శరీరం లేదు.
నేను : వారితో , నన్ను భగవంతుడు వద్దకు తీసుకు వెళుతున్నారా ?
వారు : లేదు ... నువ్వు భగవంతుని చేరాలంటే, నీ ఆత్మ పావనం గా, శుద్ధి గా కావాలి. నీ ఆత్మ లో చాలా దుర్గుణాలు ఉన్నాయి. నువ్వు చేసిన కర్మలను బట్టి, ఇప్పుడు నీకు మరలా జన్మ ఇవ్వడం జరుగుతుంది.
నేను : మరలా జన్మించడమా ? .... వద్ధు... వద్ధు... ఆ బాధలు, దుఃఖం, నరక యాతన నేను అనుభవించ లేను.
వారు : బాధలు, దుఃఖం అనుభవిస్తేనే , నువ్వు చేసిన చెడు కర్మలు నశిస్తాయి. నీ ఆత్మ శ్రేష్టం అవుతుంది. తద్వారా నీ ఆత్మ భగవంతుని తెలుసుకో గలిగి మరణానంతరం పరమాత్మ సన్నిధి కి చేరుతావు.
నేను = శరీరం (అశాశ్వతం) + ఆత్మ (శాశ్వతం)
శరీరం = పంచ కర్మేంద్రియాలు.
ఆత్మ = మనసు + బుద్ధి + సంస్కారం
• ఆత్మ లో ఉండే మనసు ఆలోచనలు కలిగిస్తూ, బుద్ధి నిర్ణయాల (మంచి, చెడు) తో కర్మలు చేస్తూ సంస్కారం తయారవుతుంది .
ఆత్మ నాశనం లేనిది. ఒక జన్మలో చేసిన కర్మల ఫలితాలు పాప పుణ్యాలు గా , మనసు బుద్ధి సంస్కారం లో రికార్డు అయి, శరీరం వదిలేసిన తరువాత తదుపరి జన్మకు ఆత్మ ద్వారా తప్పకుండా వస్తాయి.
నేటి ఈ జన్మ …. గత జన్మ కర్మల ఫలితం.
నేటి ఈ కర్మలు …. తదుపరి జన్మ కి ఆధారం.
ఇది జనన మరణ చక్రం … జగన్నాటకం.
ఇదే సృష్టి రహస్యం.
సత్కర్మలు చేయండి ….
హేళన, వ్యంగం చేస్తూ ఎవరికి దుఃఖం ఇవ్వకండి. వ్యర్థమైన మాటలతో ఎవరిని నిందించకండి. అవసరాల కోసం అబద్ధాలు, మాయ మాటలు మాట్లాడకండి …. ఏది చేస్తే అదే తిరిగి పొందాలి. నరకం, స్వర్గం ఎక్కడో లేవు ..... నీ లో నే , నీ తో నే ఉన్నాయి.
• శివుని స్మృతి చేస్తూ ఉంటే ....... మంచి మరణం తో పాటు, శ్రేష్టమైన జన్మ పొందగలరు.
ఇది రాసింది ఒక ఆత్మ ….
రాయించింది మాత్రం పరమాత్మ.
ఓం నమఃశివాయ 🙏
రాసిన శరీరం పేరు : యడ్ల శ్రీనివాసరావు
31 October 2024, 7:00 PM … On Diwali .
No comments:
Post a Comment