Monday, October 14, 2024

548. నా లోని గుణాలు

 

నా లోని గుణాలు



నా లో చాలా మంచి గుణాలు ఉన్నాయి. అవును, చాలా చాలా  మంచి  గుణాలు  ఉన్నాయి.  వాటి గురించి ఆలోచిస్తే  చాలా  సంతోషంగా అనిపిస్తుంది. నాపై నాకు   నమ్మకం  పెరుగుతుంది.   గర్వంగా అనిపిస్తుంది.  ఈ గుణాల  గురించి ఆలోచించుకుంటూ,   నేను చాలా అదృష్టవంతుడివి అని,  నా మనసు తో  చెపుతూ  ఉంటాను. సంతోషపడిపోతూ  ఉంటాను . ఈ మంచి గుణాలు గురించి ఆలోచిస్తూ,   నేను చేసే  ప్రతి పని,  ప్రతి ఆలోచనలో  నేను   చాలా  కరెక్ట్  అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే  ఈ గుణాల  ద్వారా వృద్ధి చెందిన ఆలోచనలు, నాతో అలా చెపుతూ ఉంటాయి.


• నేను బాగా కష్టపడతాను ,   విశ్రాంతి లేకుండా ఉద్యోగం ,  వ్యాపారం  చేస్తాను.  ధనం విపరీతంగా సంపాదిస్తాను .  ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంటి పని, వంట , పిల్లల కారేజీ  అన్నీ  బాధ్యత గా చేస్తాను. అప్పుడప్పుడు  గుడికి వెళ్ళి నప్పుడు  యాచకులకు బిచ్చం వేస్తూ,  నాలో  దాన గుణానికి  మురిసి పోతుంటాను.

ఇంకా, నేను నా భార్య అవసరాలు / నా భర్త అవసరాలు  మరియు కుటుంబ అవసరాలు తీరుస్తూ, పిల్లల్ని   బాధ్యత   చక్కగా చూసుకుంటాను. ఎందుకంటే నేను చాలా మంచి వ్యక్తి ని.  పైగా  నాలో చాలా మంచి విశేష గుణాలు ఉన్నాయి.

నాకు దైవ భక్తి ఎక్కువ. నేను నిత్యం దేవుని పూజ చేయనిదే , గడప దాటను. ….

వీటన్నింటి వలన నాకు  నేనే సాటి  అని  ఫీల్ అవుతూ  ఉంటాను. ఇందులో తప్పు ఏముంది. అనుకుంటాను.


 కానీ  అసలు  విషయం  ఏమిటంటే….


ఇవన్నీ  చేయడానికి  … నేను లోపల ఎంతో శ్రమ పడవలసి వస్తుంది  ….. ష్… ష్… ష్…అబ్బా… ఎందుకంటే  ఇవన్నీ  చేసే  ముందు  నేను చాలా ఆలోచించి  ప్రవర్తించ వలసి వస్తుంది.  నేను బయట వారందరికీ  ఇలాగే కనపడాలి.  అలా కనపడితే  నే కదా,  నాకు  గౌరవం లభిస్తుంది.  ఈ గుణాలు  చూసే కదా, చుట్టూ ఉన్న వారు నాకు విలువ ఇస్తారు.


అదేంటో తెలియదు కానీ …. నాలో చెడు గుణాలు లేవా? … అని ఆలోచిస్తే అసలు మచ్చుకైనా , ఏమీ లేనట్లు అనిపిస్తాయి.  ఎందుకంటే నేను మంచి గా కనిపించడానికి,  నిరూపించు కోవడం  కోసం   చేసే ప్రయత్నం లో,   ఆ సాధన లో  నాకు  నాలో ఏ చెడు కనిపించదు,   నా స్పృహ కి కూడా తెలియదు. సమస్తం నాకు,  నాలో ఉన్నవన్నీ మంచి గుణాల లాగే అనిపిస్తాయి.

నేను  కుటుంబంతో,  సమాజం తో,  బంధువులతో, మిత్రులతో,   నేను ఎప్పుడూ మాట్లాడినా,  చాలా గొప్ప గా,  అద్బుతం గా,  నవ్వుతూ ,  వాళ్లని మురిపిస్తూ మాట్లాడుతాను.  అప్పుడు కూడా సాధ్యం అయినంత  వరకు మంచి  నడవడిక  చూపించడానికి శ్రమిస్తూ ఉంటాను.


నేను  వ్యాపారం చేసేటప్పుడు,  నిరంతరం అధిక లాభాలు   ఎలా అర్జించాలో  ఆలోచిస్తూనే , వస్తువులలో ఎవరూ గుర్తు పట్టకుండా సహజంగా నే , కల్తీ చేస్తుంటాను.  ఎందుకంటే  ఇది  నా వ్యాపార ధర్మం .   వ్యాపారం  బాగా పెరగాలని  నిత్యం  నా షాపులో  దేవుడికి  కొబ్బరికాయ   కొడతాను…. ఎందుకంటే నేను చాలా నిజాయితీ పరుడిని, సత్య వంతుడిని.


• నేను ఉద్యోగం చేస్తూ,  బిల్లులు పాస్ చేసేందుకు సహజంగా నే కమీషన్లు తీసుకుంటాను. లేకపోతే నా ఇంద్ర భవనం అప్పులు తీరడం కష్టం ….. ఆఫీస్ లో పని చేసి  బాగా అలసి పోయినప్పుడు  ఉపశమనం కోసం బార్ కి,  కొన్ని సార్లు మసాజ్ పార్లర్ కి కూడా వెళతాను.  లేకపోతే ఒత్తిడిని భరించలేను …. నేను స్వతహాగా ఏమంత  స్వార్దపరుడిని ,  కామభోగి ని  కాదు.


• రాత్రి  వరకు  సంపాదన లో  అలసి పోయి ఇంటికి రాగానే ,  తూటాల్లాంటి మాటలు , వ్యంగమైన మాటలు వింటుంటే, ఇంకా ఎంతకాలం భరించాలి ఈ చండాలం ,  శుభ్రంగా పైకి పోతే బాగుణ్ణు నాకు పట్టిన దరిద్రం వదులుతుంది. ఏంటో, అనుకోకుండా నే ఈ మాటలు నిత్యం మాములుగా  వస్తుంటాయి. …. నాకు సహనశీలత,   ఓర్పు  సహజం గా ఉంటాయి.


• అబ్బబ్బా …  రోజు   ఈ వంట చేయడం నా వల్ల కాదు.  వండి పెడితే శుభ్రంగా తింటూ, పేర్లు  పెడతారు.  వంట చేస్తే తెలుస్తుంది  ఈ కష్టం ఏంటో.  నేను కాబట్టి   ఇంకా  ఈ మాత్రం  అయినా  చేసి పెడుతున్నాను .….. భార్యను సరిగా చూసుకోవడం చేతకాదు గాని,  నీతులు చెపుతారు .…. 

కాసేపు పక్కింటి లో కుటుంబ విశేషాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. కొంచెం మనసు కి హాయి గా ఉంటుంది .….. 

కుతూహలం తో, స్నేహితులకు ఫోన్ చేద్దాం,  ఎవరొకరి గురించి,  ఏమైనా ఆసక్తి కరమైన విషయాలు తెలుస్తాయి .… 

అమ్మో,   టైం  7 అయిపోతుంది, టి.వి. సీరియల్ చూడాలి,  మిస్ అయితే   ఇంటింటి చీకటి బాగోతాలు  చూసే  అవకాశం  ఉండదు. …. 

నాకు అసలు ఈ  వ్యర్ద విషయాల  పట్ల  ఆసక్తి అసలు ఉండదు.  ఎదో కొంత  కాలక్షేపం కోసం  ఇరుగు పొరుగు తో,  అలా .. అలా...అంతే .….   నాకు కుటుంబ విలువలు అంటే ఎనలేని గౌరవం.


• ఏంటో గాని … దేవుని ముందు కూర్చుని పూజ చేస్తుంటే, నగలు, పట్టుచీరలు కనిపిస్తున్నాయి. దేవుడు కి ఇవంటే చాలా  ఇష్టం, అందుకే ఇవి నా కళ్లకు  కనిపించే లా  చేస్తున్నాడు.  వెంటనే అప్పు చేసైనా సరే  కొనాలి … నాకు పెద్ధ కోరికలు అంటూ ఏమీ ఉండవు. అసలు ఏం ఉన్నా లేకపోయినా చాలా సింపుల్ గా నే ఉంటాను.


• నేను చాలా మంచి వ్యక్తి ని ఎందుకంటే,  నేను  చాలా మందిని చూస్తుంటాను,   వాళ్లతో మాట్లాడుతుంటాను.   నేను  ఎప్పుడూ  నిజమే మాట్లాడుతూ ఉంటాను.  కాకపోతే  మనిషి ని బట్టి ఒకో విధంగా,  వాళ్లకు అనుకూలంగా ఉండేలా మాట్లాడుతూ ఉంటాను. అసలు చాలా మంది కి ఏం మాట్లాడాలో, ఎలా ఉండాలో కూడా తెలియదు.


ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కదా…. నేను ఒక ఆత్మ.  శరీరం ధరించిన  ప్రతీ   స్త్రీ,  పురుషుడు,  ఈ రెండు కానీ  వారిలో కూడా నేను ఉంటాను.  ఈ మాయ లోకం లో ,  నాకు సంబంధించినంత  వరకు నాలో  ఉన్నవన్నీ మంచి గుణాలే.   ఎందుకంటే, నేను ఏవిధంగా,  ఎలా ఉన్నా సరే,  నాలో చెడు ఉండదు . అదేంటో  తెలియదు  నాకు ఇతరులలో  చెడు మాత్రం తెలుస్తుంది.


🌹🌹🌹🌹🌹

 దసరా :  దస్ హరా

పది వికారీ గుణాలు    సంహరించడం



• సత్య, త్రేతా యుగాలు    రామ రాజ్య  పాలన ఉండేది.   ఇక్కడ రాముడు అంటే  అర్దం దైవీ గుణాలు,  మంచి తనం.   ప్రతి జీవుని లో   దైవీ  గుణాలు కలిగి ,  ఓర్పు,  సహనం,   ప్రేమ,  దివ్య దృష్టి,   ధారణా ,  రాజయోగం  వంటి ఎన్నో  అతీతమైన  దైవ శక్తులు  ఈ యుగంలోని  వారికి ఉంటాయి.   వీరు అన్ని  వేళలా సంతోషం తో ఉంటారు. వీరికి అసలు దుఃఖం అంటే ఏమిటో కనీసం తెలియదు.  ఈ యుగాలలో   జీవించిన   వారిని దేవతలు  అంటారు.   ముక్కోటి  దేవతలు అంటే  సత్య త్రేతా యుగంలో నివసించిన వారు.   వీరిని  దేవాత్మలు అంటారు .  నేడు   గ్రామ  దేవతలు గా  వీరినే  పూజిస్తున్నాము.


• ద్వాపర , కలియుగాల లో    రావణాసురుడి రాజ్యపాలన ఉంటుంది. రావణాసురుడు అంటే రాక్షస గుణాలు అయిన ఈర్ష, అసూయా, మోసం, అసత్యం, మోహం, కామం , అహం,  ద్రోహం  వంటి గుణాలతో  జీవులు ఉంటారు.  అసుర అంటే రాక్షస.   పాపాలు చేయటం  వలన  వీరిని పాపాత్ములు అంటారు.  వీరు నిత్యం ఈ యుగంలో దుఃఖం అనుభవిస్తూ ఉంటారు.


ప్రతీ  ఆత్మ   సృష్టి కల్పం (5000 సంవత్సరాలు) లో జన్మిస్తూ,   మరణిస్తూ   మొత్తం  84 జన్మలు తీసుకుంటుంది.  ఒకప్పుడు సత్య త్రేతా యుగాలలో దేవతలుగా ఉన్న దేవుని సంతానం గా ఉన్న ఆత్మలే (మనమే) జన్మలు  తీసుకుంటూ, తీసుకుంటూ బలహీనపడి   మన ఆత్మలోని   దైవ గుణాలు  శక్తిని పూర్తిగా కోల్పోయి …. ద్వాపర, కలియుగాలు  వచ్చేసరికి  వికారాలకు వశం అయి  రావణాసుర సంతానంగా మారి , తిరిగి జన్మించి  పరమాత్మ ను  పూర్తిగా  మరచి దుఃఖం తో  జీవిస్తూ ఉంటాం.

• రావణాసురుడు కి పది తలలు చూపిస్తారు. దాని అర్థం ఈర్ష్య, ద్వేషం, కామం, క్రోధం మోహం, లోభం, అహం, అసూయ, స్వార్థం, ప్రతీకారం . ఇవి కలియుగంలో  మనుషులలో రాను రాను పెరిగి వినాశనం మొదలవుతుంది (ప్రస్తుత కాలం). దీనికి గుర్తుగా దసరా ఆఖరి రోజున మైసూర్ లో పది తలల రావణాసురుడు బొమ్మ ను , ప్రతీ ఏడాది ఒక అడుగు చొప్పున పెంచుతూ బాణాసంచా తో దహనం చేస్తారు. ఇదంతా చప్పట్లు కొడుతూ వేడుకగా చూస్తారు గాని, ఇందులో సూక్ష్మం,   రాను రాను మానవుల లో వికారాలు పెరుగుతూనే ఉంటాయి, అనే విషయం శివుడు తన జ్ఞానం ద్వారా చెప్పే వరకు ఎవరికీ తెలియదు.

• ఒకప్పుడు దేవతలు గా ఉండే మనమే ఇప్పుడు అసురీ గుణాలతో జీవిస్తున్నాం. చెప్పాలంటే, నాటి మన  దేవతా  స్వరూపాలను  విగ్రహాలు గా  చేసి  తిరిగి  మనమే  నేడు ఆరాధన  చేస్తున్నాం. అంటే ఆత్మల మైన  మనం  శక్తి కోల్పోతూ  కోల్పోతూ దిగజారిపోయాం. 

అందుకే  ఒకప్పుడు మన ఆత్మలో ఉన్న పాత సంస్కారాలు అయిన దేవతా గుణాలు నేడు కూడా మనలో  ఉన్నాయి  అనుకుంటూ , భ్రమతో    చెడు సంస్కారాలతో,   మనల్ని మనం  మోసం చేసుకొని జీవిస్తున్నాం.


• ఇది మనం అంగీకరించిన, అంగీకరించ పోయినా  మన మూలాల లో  దాగి ఉన్న  పరమ సత్యం ఇది .


యడ్ల శ్రీనివాసరావు 14 Oct 2024, 9:00 pm






No comments:

Post a Comment

567. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...