నీ జీవితం నీకు ఉపయోగపడుతుందా?
• అవును. నిజమే ...
• నీ జీవితం నీకు ఉపయోగకరంగా ఉందా? లేదా
• ఏదో జీవించాలి కాబట్టి జీవిస్తున్నా … అని అనిపిస్తుందా?
• నీ జీవితం నీకు ఉపయోగకరంగా లేకపోయినా ఇతరులకు ఉపయోగకరంగా ఉందా?
• ఈ ప్రశ్నలు అంతరంగం లో ఒకటి రెండు సార్లు మననం చేయడం వలన , మన స్థితి అదే విధంగా మనసు స్థితి ఎలా ఉందో స్పష్టం అవుతుంది.
🌹🌹🌹🌹🌹
• నీ జీవితం నీకు ఉపయోగకరంగా ఉందా?
అనగానే , సమాధానం ఉవ్విళ్లూరుతూ … అవును … అని నీ అంతరాత్మ, ఏ అరమరిక లేకుండా నిజాయితీ గా , సమాధానం చెప్పినట్లు అయితే నీవు చాలా భాగ్యవంతుడివి. ఈ సమాధానం నీకు నువ్వు చెప్పుకోవడం లో, ఏ ఒక్క విషయం లోనూ సంకోచం లేకుండా , రాజీ పడకుండా చెప్పగలగాలి. ఎందుకంటే ఇది నీ లో ఒక అనంతమైన సంతోషానికి నిదర్శనం అవుతుంది. ఇక్కడ, నువ్వు మానసికంగా ఇంకా ఉన్నత స్థితి పొందడానికి , నీ జీవితం నీకు చాలా సహాయం చేస్తుంది. ఈ స్థితి లో మనసు కి సుఖం, శాంతి, సంతోషం, సంతృప్తి నిరంతరం దొరుకుతున్నాయి అని అర్దం. ఈ స్థితి ద్వారా మనతో ఉన్న వస్తువులు, ధనం , మనుషులతో ఉన్న సంబంధాలు, భౌతిక పరిగణలను దాటి మన మనసు పొందవలసినవి పొందుతూ ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన యోగం.
🌹🌹🌹🌹🌹
• ఏదో జీవించాలి కాబట్టి జీవిస్తున్నా …
అనగానే మనసు లో ఒక మూల నిట్టూర్పు. ఇందులో సగం సంతోషం, సగం దుఃఖం ఉందని అర్దం. ఇంకా నెరవేర వలసిన కోరికలు, అవసరాలు మిగిలి ఉన్నాయి. మరియు ఉన్నదానితో సంతృప్తి కానరాని స్థితి ఇది. ఇక్కడ సంతోషం తో పాటు. నిరాశ, నిస్పృహ లు సమాన స్థాయిలో ఉంటాయి.
ఇక్కడ మనసు తన స్థితి లో ప్రతి క్షణం రాజీ పడుతుంది. అది అనుకున్నది సాధించలేక కనిపించని వెలితితో ఉంటుంది. ఇక్కడ జీవితం లో అనుకున్నది ఒకటయితే జరుగుతున్నది మరొకటి . కానీ రాజీ పడాలి కదా అనిపిస్తుంది. ఈ స్థితిలో బయటకు మాములుగా కనిపిస్తూ ఉన్నా మనసు తపనతో ఇంకా ఏదో ఏదో కావాలని వెతుకుతూనే ఉంటుంది. ఈ దశలో మనసు కి కేవలం విశ్రాంతి మాత్రమే దొరుకుతుంది. విశ్రాంతి అనేది తాత్కాలిక ఉపశమనం. ఈ స్థితి లో మనసు కి వస్తువులు , మనుషులు , భౌతిక అంశాల పట్ల ఆనురక్తి ఇంకా కొంత శాతం మిగిలి ఉంది అని అర్దం.
🌹🌹🌹🌹🌹
• నీ జీవితం నీకు ఉపయోగకరంగా లేకపోయినా ఇతరులకు ఉపయోగకరంగా ఉంది.
ఇది ఒక విధంగా కరెక్ట్ కాదు.
కానీ మరో విధంగా చాలా కరెక్ట్.
ఎలాగో చూద్దాం...
• మొదట ఇది ఏ విధంగా కరెక్ట్ కాదు…
ఈ స్థితి లో జీవితాన త్యాగం, వైరాగ్యం, నిర్లిప్తత, నిస్సహయత కనిపిస్తాయి. నా జీవితం నాకు ఎందుకూ ఉపయోగపడలేదు కనీసం ఇతరులకైనా ఉపయోగకారి గా, సహాయకారి గా ఉన్నాను అని అనుకోవడం లో , ఏమీ సాధించలేక తనలో తాను పూర్తిగా రాజీపడి జీవించడం అవుతుంది.
• నీకు నువ్వు ఉపయోగపడకుండా ఇతరులకు ఉపయోగకరంగా ఉంటే అది నీలో నిస్సత్తువని , అసంతృప్తిని నిరంతరం నీలో అంతర్లీనంగా ప్రస్పుటం అవుతుంది . ఇది చాలా సహజం. ఇతరులకు నువ్వు ఎంత సహాయకారిగా ఉన్నా, నీ లో ముమ్మాటికీ ఒక లోటు ఉంటుంది.
నీ పై నీకు స్వ ప్రయోజనం (స్వార్థం కాదు) ఉంటేనే నీ మనసులో సంతోషం, పరిపూర్ణత సిద్ధిస్తుంది.
నువ్వు మంచి వాడిగా ఉండాలి, కాని మంచి వాడి గా నిరూపించుకోనవసరం ఏ మాత్రం లేదు. ఎప్పుడైతే నీకు నువ్వు ఉపయయోగ కారి గా అవుతావో, అప్పుడు నీలో మంచితనం ఉన్నట్లయితే, సహజంగా నే అది ఎలాంటి మంచి అయినా సరే ఇతరులకు పంచుతావు.
• ఇతరులకు నువ్వు ఉపయోగి కారి గా అయ్యే ముందు నీకు నువ్వు ఉపయయోగ కారిగా, సంతోషంగా, సంతృప్తి కరం గా ఉండడం చాలా చాలా అవసరం..... సంతోషం, సంతృప్తి అనే భావనలు నీలో నిండుగా ఉన్నప్పుడు మాత్రమే, నీలో నిరంతరం మంచి శక్తి ఉద్భవించడం జరుగుతుంది. లేదంటే ఒకరోజు సంతోషం, మరో రోజు నిస్సత్తువ గా ఉండడం వలన నీకు నువ్వు ప్రయోజనకారి కాలేవు. ప్రయోజనకారి , ఉపయోగకారి అంటే నువ్వు చేసే చర్యలు, కార్యక్రమాలు ద్వారా సంతోషం పొందుతూ, నాకు ఏ వెలితి లేదు అనే సంతోషం మనసు లో భావించడం.
నీకు నువ్వు ఉపయయోగ పడుతుంటే, అంటే నిన్ను నువ్వు ఉద్ధరించు కుంటుంటే, సహజం గానే ఇతరులకు , తోటి వారి అవసరాలకు నువ్వు ఉపయోగకారి గా కాగలవు. “తనకు మాలిన ధర్మం చెడ్డది” అనే సామెత కి నిదర్శనం ఈ స్థితి .
• నీకు నువ్వు ఉపయయోగకరం కాక పోయినా ఇతరులకు సేవ చేయడం. రెండవ విధంగా , నువ్వు చాలా చాలా కరెక్ట్. …..
నీకు నువ్వు సంపూర్ణంగా గా అయినపుడు, అంటే కోరికలకు అతీతంగా అయినపుడు, ప్రత్యేకంగా నీ కోసం అంటూ ఏమీ సాధించ వలసిన అవసరం లేదు అనే పరిపక్వత కలిగినప్పుడు, నీకు నువ్వు ఉపయోగకారి గా కానవసరం లేదు. నీ కోసం నువ్వు పొందవలసినవి అన్నీ పొంది, గతంలో అనుభవించేసి ఉంటావు. ఇక ఇప్పుడు నువ్వు ఉన్నది, జీవిస్తున్నది ఇతరుల కోసం, ఇతరులకు సేవ చేయడం కోసం. ఈ స్థితి లో నీకు నీ గురించి అణువంత వెలితి కూడా నీ మనసు లో ఉండదు, సరికదా నీ సంతోషం అంతా పరోపకారం లోనే ఉంటుంది. చెప్పాలంటే ఇది దైవిక గుణం.
నువ్వు పరోపకారి గా అయ్యావు అంటే, నీకు నువ్వు అనంతమైన పుణ్యం జమ చేసుకోవడం ద్వారా చాలా మరింత ప్రయోజనకారివి అవుతున్నావు అని అర్దం. ఇక్కడ బాహ్య సంపదలు, ధనం, ఆస్తులు ఉండకపోవచ్చు కానీ అంతకు మించినవి నీలో జమ అవుతూ ఉంటాయి. దీనిని సహజ రాజయోగ స్థితి అంటారు.
🌹🌹🌹🌹🌹
నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ముందు నీ మానసిక సంతోషం ముఖ్యం. ఇది అంత సులభం గా దొరికేది కాదు. నిన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకుంటూ, సరి చేసుకుంటూ ఉంటేనే, నీకు కొన్ని సాధ్యం. అప్పుడు నీకు నువ్వు సమాధానం ధైర్యం గా, నిజాయితీగా చెప్పుకోవచ్చు.
నువ్వు ఎప్పుడూ ఇతరులను మోసం చేయడం చాలా చాలా సులభం. కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోవడం అంతకంటే చాలా సులభం. ఎందుకంటే నిన్ను నువ్వు మోసం చేసుకోవడం లో బాగా ఆరితేరినపుడే ఇతరులను సులభంగా మోసం చేయగలవు. అంటే దీని అర్థం, ఇతరులను మోసం చేయడం వలన నీకు పడే శిక్ష కంటే, నిన్ను నువ్వు మోసం చేసుకోవడం ద్వారా పడే శిక్ష అధికం మరియు అది వర్ణనాతీతం. ఈ శిక్ష భగవంతుడు కానీ ఇంకొకరు ఎవరో గాని మనకు వేయరు. ఎవరికి వారే వేసుకుంటారు. మరణం పొందే లోపు తప్పనిసరిగా ఈ విషయం అర్దం అవుతుంది.
• జీవితం లో సమయాన్నీ వృధా గా కాలయాపన చేయడం కంటే, మనన చింతన చేయడం ఉత్తమం. నేడు నీ గతి స్థితి మార్చి , నిన్ను పాతాళం లోకి నెట్టి వేయడానికి ఎన్నో సాధనాలు, సామాగ్రి , వికారాలు నీ చుట్టూ తక్షణం అందుబాటులో ఉన్నాయి. నువ్వు చేసేది తప్పో ఒప్పో కూడా నీ స్పృహ కి అర్దం కానటువంటి మాధ్యమాలలో నేటి నీ జీవనం గడుస్తుంది.
మనిషి అనే వాడు .... తనను తాను తెలుసుకునే ప్రక్రియ లో ఇదంతా ఒక భాగం. ...
ఇదంతా రాస్తూ ఉన్న వాడు యొక్క ఆలోచన మాత్రమే ఇది, ఈ రాసేవాడు కూడా ఇవన్నీ తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి దేనికీ అతీతుడు కాడు.
యడ్ల శ్రీనివాసరావు 10 Oct 2024, 9:30 AM.
No comments:
Post a Comment