రక్త సంబంధం
• మంచి సాంప్రదాయ విలువలతో పెరిగిన రాజేష్ ఊరు విజయవాడ. తల్లి తండ్రుల తో పాటు రాజేష్ కి ఒక అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. అందరికీ వివాహాలు అయి జీవితం లో బాగా స్థిరపడ్డారు . రాజేష్ తండ్రి , రక్త సంబంధం యెక్క విలువలు , కష్టసుఖాలు , ప్రాముఖ్యతను ముగ్గురు పిల్లలకు బాగా తెలిసేలా పెంచాడు. అందువలన అందరికీ పెళ్లిళ్లు అయినా సరే ఆప్యాయత అనురాగాల తో ఉండేవారు . కుటుంబం అంటే ఇలా ఉండాలి, రక్త సంబంధాలు అంటే ఇలా ఉండాలి అని చూసే వారందరికీ అనిపించేది.
• రాజేష్ కి ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగం, మంచి సంపాదన తో పాటు అందమైన గుణవతి గల భార్య సుమతీ, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వారిద్దరూ డిగ్రీ లు చదువుతున్నారు.
రాజేష్ ఎప్పుడూ కూడా తన ఇద్దరి పిల్లలకు తన అన్న , చెల్లెలు తో తాను ఎంత ఆనందంగా గొప్ప గా పెరిగాడో వివరిస్తూ , ఒక కుటుంబం అంటే అందరిదీ ఒకే రక్తం కాబట్టి, అది మరచి పోకూడదని …. అదే విధంగా, మీరు కలిసి జీవిత కాలం ఉండాలని తన పిల్లలు ఇద్ధరికి సందర్భానుసారంగా చెపుతూ ఉండేవాడు.
🌹🌹🌹🌹
• ఒక రోజు రాజేష్ ఆఫీస్ కి కారులో వెళుతుండగా , ఏక్సిడెంట్ అయి పెద్ద ప్రమాదం జరిగింది. రాజేష్ ని హాస్పిటల్ లో జాయిన్ చేసారు. అప్పటికే కోమా లోకి వెళ్లి పోయాడు. గాయాలు అయి రక్తస్రావం అయి చాలా రక్తం పోతుంది .
వెంటనే విషయం తెలుసుకున్న భార్య సుమతీ, కొడుకు, కూతురు హడావిడిగా హాస్పిటల్ కి వచ్చారు.
డాక్టర్లు , రాజేష్ కోమా పరిస్థితి వివరించి, వెంటనే రక్తం 6 బాటిల్స్ వరకూ ఎక్కించాలని చెప్పారు. రాజేష్ ది blood group పేరు , Bombay Blood Group ( hh ) అని చెప్పారు .
వెంటనే సుమతీ , కొడుకు కూతురు తాము అంతా ఒకే కుటుంబం అని మా రక్తం ఎక్కించండి అని డాక్టర్ తో చెప్పారు. వారి ముగ్గురి రక్తం పరీక్ష చేయించగా …
భార్య సుమతి ది A Negative
కొడుకు ది Ab Negative
కూతురు ది B Positive
అని రిపోర్ట్స్ లో రావడం చూసి , రాజేష్ రక్తం తో తమ రక్తం తో సరిపోక దిగులు తో ఏం చేయాలో తోచక ఏడవడం మొదలు పెట్టారు.
• వెంటనే సుమతి రాజేష్ తల్లి తండ్రుల కు, రాజేష్ అన్న , చెల్లెలు కు విషయం పూర్తిగా తెలియచేసింది.
సుమతి మనసు లో అనుకుంటుంది వారంతా రాజేష్ రక్త సంబంధీకులు కావున వారిలో రాజేష్ కి కావలసిన బ్లడ్ గ్రూప్ తప్పకుండా లభిస్తుందని గ్రహించింది. వారంతా విజయవాడ , గుంటూరు, ఏలూరు లో నివాసం ఉండడం వలన ఒక గంట సమయంలో నే అందరూ ఆసుపత్రి కి చేరుకున్నారు.
ఆలస్యం చెయ్యకుండా రాజేష్ తల్లి , తండ్రి , అన్న , చెల్లి కూడా రక్తం ఇవ్వడానికి సిద్ధం అయి , శాంపిల్స్ పరీక్షకి పంపించారు.
• ఈ లోపు సుమతి అందరి దేవుళ్లకు మొక్కుతుంది .
తన కొడుకు కూతురు రక్తం , రాజేష్ రక్తం తో మేచ్ కాకపోవడం జీర్ణించుకోలేక పోతుంది. ఎందుకంటే తాను బయటి కుటుంబం నుంచి వచ్చినా సరే , పిల్లలు రాజేష్ రక్తం పంచుకుని పుట్టిన వారే కదా అని అనుకుంటుంది.
• ఒక అరగంట తర్వాత బ్లడ్ శాంపిల్ రిపోర్ట్స్ వచ్చాయి . సుమతి చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది . ఆ రిపోర్ట్ లో
రాజేష్ తల్లి ది B Negative
తండ్రి ది O Positive
అన్నయ ది AB Type
చెల్లెలు ది. A Positive
అని ఉండే సరికి , రక్త సంబంధీకుల ఎవరి రక్తం కూడా రాజేష్ కి మేచ్ కాకపోవడం తో సుమతి ఆశలు నీరు కారాయి.
• సుమతి కంగారుగా డాక్టర్ వద్దకు వెళ్ళి విషయం చెప్పగా , డాక్టర్ ఈవిధంగా చెపుతున్నాడు .
రాజేష్ ది చాలా Rare Blood Group అని, ఒక లక్ష మందిలో ఒకరికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉంటుందని, దాని పేరు Bombay Blood Group hh అని , ఆ బ్లడ్ బయట బ్లడ్ బ్యాంకు లో కూడా దొరకదని చెప్పాడు.
ఆ బ్లడ్ గ్రూప్ కలిగిన మనిషి ని వెతకడం తప్పా మరో అవకాశం లేదని, సమయం కూడా చాలా తక్కువ గా ఉందని చెప్పి , చివరగా ఒక మాట డాక్టర్ చెప్పాడు . తనకు ఉన్న నెట్వర్క్ మార్గాల ద్వారా , బ్లడ్ గ్రూప్ మేచ్ అయిన వారిని వెతుకుతాను, కానీ ఖర్చు బాగా అవుతుంది. దొరికితే అదృష్టం అన్నాడు.
• సుమతి, రాజేష్ తల్లి తండ్రి కుటుంబ సభ్యులు అందరూ కూడా చేసేది ఏమీ లేక హాస్పిటల్ రిసెప్షన్ లో కూర్చుని ఏడుస్తున్నారు. మనసు లో భగవంతుని ప్రార్ధిస్తూ ఉన్నారు .
🌹🌹🌹🌹
• సుమతి మాత్రం వీరందరికీ దూరంగా , హాస్పిటల్ రిసెప్షన్ హల్ లో ఒక మూల కూర్చుని బిగ్గరగా వెక్కి వెక్కి ఏడుస్తుంది. రాజేష్ అంటే ఆమెకు ప్రాణం. రాజేష్ లేని జీవితం తాను ఊహించుకో లేక పోతుంది.
ఆ సమయంలో , కాస్త దూరంగా అక్కడే కూర్చుని ఉన్న ఒక 45 సంవత్సరాల స్త్రీ , సుమతి వైపు చాలా సేపు నుంచి చూస్తూ గమనిస్తూ ఉంది .
చివరికి , ఆ స్త్రీ ఉండ లేక , సుమతి దగ్గరకు వచ్చి హిందీ లో , ఏమైంది ? ఎందుకు ఏడుస్తున్నారు ? అని అడిగింది.
సుమతి ఆ కంగారు లో తనకు వచ్చీ రాని హిందీ లో జరిగిన విషయం ఆ స్త్రీ కి చెప్పింది. వెంటనే ఆ స్త్రీ తాను రాజేష్ ను చూస్తానని అడుగగా , సుమతి ICU లో ఉన్న రాజేష్ ను ఆమె కి చూపించింది .
ఆ స్త్రీ కి, రాజేష్ ను చూడగానే , అకస్మాత్తుగా మనసు లో ఏదో తెలియని వైబ్రేషన్ తో కూడిన ఉద్వేగం అనిపించింది . ఆమె రాజేష్ ను చూసి కంట్రోల్ చేసుకోలేక పోతుంది . ఆమె కి రాజేష్ తో , ఏ బంధుత్వం లేదు. వెంటనే ఆమె , సుమతి తో హిందీలో నేను రక్తం ఇస్తాను, పరీక్ష చేయించమని కోరింది.
• నర్సు ఆ ఆమె బ్లడ్ శాంపిల్ తీసుకుని టెస్ట్ కి తీసుకు వెళ్లింది.
సుమతి అప్పుడు అడిగింది ఆమెను, మీరు ఎవరు అని.
ఆమె , రాజేష్ కుటుంబ సభ్యులు అందరి తోను ఇలా చెపుతుంది.
• నా పేరు ఊర్మిళ . మాది కోల్కతా. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం. నాకు 20 సంవత్సరాల వయసు లో పెళ్లి అయింది. నా పెళ్లి అయ్యే నాటికే మా మామగారు విజయవాడ లో బిజినెస్ చేస్తూ , ఇక్కడే సెటిల్ అయ్యారు. కానీ నా భర్త కోల్కతా లో బట్టల వ్యాపారం చేసేవారు. షాపు ఉంది.
మా పెళ్లి అయిన సంవత్సరం లోపునే , నా భర్త ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. నాకు పిల్లలు లేరు. నా భర్త చనిపోయిన నాటి నుండి, నా అత్తమామల సహకారం తో కోల్కత్తా లోని షాపు చూసుకుంటున్నాను.
నేడు మా మామగారికి అనారోగ్యం వలన ఈ హాస్పిటల్ లో జాయిన్ చేసారు. ఆయనను చూసేందుకు, ఇప్పుడు విజయవాడ వచ్చాను అని వివరంగా చెప్పింది.
🌹🌹🌹🌹
• ఇంతలో నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఊర్మిళ బ్లడ్ గ్రూప్ మేచ్ అయిందని, వెంటనే రక్తం తీసి రాజేష్ కి ఎక్కించాలని చెప్పింది . అది విన్న సుమతి కి, రాజేష్ తల్లి తండ్రులు కుటుంబ సభ్యులు అందరికీ ప్రాణం వచ్చినట్లు అయింది. వెంటనే ఊర్మిళ కి చేతులెత్తి నమస్కరించారు.
కొంత సమయం తరువాత, ఊర్మిళ రాజేష్ కి రక్తదానం చేసి వచ్చింది. . . . అదే రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళుతూ, ఊర్మిళ తన కళ్లలో నీరు తుడుచుకుంటుంది . ఎందుకంటే తన భర్తకు సరిగా రాజేష్ వయసు ఉంటుంది. బ్రతికి ఉండి ఉంటే, రాజేష్ లాగే ఉండేవాడు. అని గుర్తు చేసుకుంది.
• అదే రోజు రాత్రి హాస్పిటల్ లో సుమతి కళ్లు తుడుచుకుంటూ భగవంతుడు కి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటుంది. ఎందుకంటే ఊర్మిళ నిజం గానే దేవత అని, తమ కోసం భగవంతుడు పంపించాడు అని .
• అదే రోజు రాత్రి, రాజేష్ తండ్రి అంతు చిక్కని సందేహం తో సతమతం అవుతున్నాడు. రాజేష్ కి చుట్టూ ఇంత మంది రక్త సంబంధీకులు ఉన్నా సరే , ఎవరి రక్తం ఉపయోగపడలేదు , ప్రాణానికి సహయ పడలేదు . ఇక రక్త సంబంధం అనే మాట ఒక బూటకం, నాటకం . ఎవరో కనీసం తమ కుటుంబానికి ఏ సంబంధం లేని, తమ ఊరు , కులం, గోత్రం, భాష కానీ స్త్రీ యొక్క రక్తం సరిపోవడం ఏంటి అని అర్థం కాకుండా ఒక విధమైన అర్దం కాని బాధతో నలిగి పోతున్నాడు
🌹🌹🌹🌹🌹
• రక్త సంబంధాన్ని మించిన గొప్ప బంధం ఆత్మ బంధం అనేది ఒకటి ఉంటుందని ఎవరు ఎలా గ్రహించ గలరు .
రాజేష్ తల్లి తండ్రుల కి తెలుసా ?
రాజేష్ భార్య సుమతి కి తెలుసా ?
రాజేష్ అన్నాచెల్లెలు కి తెలుసా ?
రాజేష్ పిల్లలకు తెలుసా ?
ఏ సంబంధం లేని ఊర్మిళ కి తెలుసా ?
అవును , ఊర్మిళ కి తెలుసు. అచేతనంగా ఉన్న రాజేష్ ను చూడగానే ఊర్మిళ కి మనసు లోతుల్లో నుంచి వైబ్రేషన్ వచ్చింది . అందుకే తాను వెంటనే ఆలోచించకుండా రక్తం ఇస్తాను అంది .
రాజేష్, ఊర్మిళ గత జన్మల నాడు ఉన్న ఏదో అనుబంధం బుణం గా ఉండి పోవడం వలన, నేడు తిరిగి ఈ బుణానుబంధ కర్మ జరిగింది . ఇదే కర్మల రహస్యం.
• ఒకే కుటుంబం లో ఒకే రక్తం పంచుకుని పుట్టిన వారు, ఒకే రక్తం యొక్క గ్రూపు ఎందుకు కలిగి ఉండడం లేదు ? మరి అటువంటప్పుడు రక్తం తో కూడిన సంబంధం , రక్త సంబంధం అనే మాట కి అసలు అర్దం ఏమిటి ?
• ఒకే కుటుంబం లోని వారే ఒకరికి ఒకరు పరమ శత్రువులు వలే ఎందుకు ప్రవర్తిస్తూ ఉంటారు ? తల్లి తండ్రీ ,కొడుకు కూతురు, అన్నా చెల్లి , భార్య భర్త ఈ సంబంధాల మూలం, అర్దం ఏమిటి ?
• ఒకోసారి మనకు ముక్కు మొఖం తెలియని అపరిచితులు , లేదా కుటుంబ సభ్యులు కాని వారు , ఏ రక్త సంబంధం లేని వారు . . . బాగా ప్రేమను చూపిస్తూ వారి స్థాయిని మరిచి , స్థితి కి మించిన సహాయాలు చేసి , ఏమీ ఆశించకుండా వారి దారిన వారు మౌనం గా ఎందుకు వెళ్లి పోతారు ? ఇలా ఎందుకు జరుగుతుంది ?
ఇలాంటి వి మన జీవితంలో ఎప్పుడైనా జరిగాయా ?
• ఏ బంధం విశేషత ఎటువంటిదో ఆలోచించండి . . . మేల్కొనండి .
ఏ అనుబంధం ఎవరిని ఎలా తీరం దాటిస్తుందో ?
• కర్మల గతి గుహ్యం (రహస్యం) .
అది శివుని జ్ఞానం లో సూక్ష్మం .
పాఠకులకు మనవి . ఈ రచన ఒక అవగాహన కోసం మాత్రమే కానీ . . . ఎవరి బంధాలను . . . ఏ బంధాన్ని జడ్జి చేయమని చెప్పడానికి కాదు. ఎందుకంటే, ఏదైనా సరే స్వయం గా అనుభవం, అనుభూతి పొందినప్పుడు మాత్రమే సూక్ష్మాలు అర్దం అవుతాయి.
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏 .
యడ్ల శ్రీనివాసరావు, 6 AUG 2025 2:00 pm .