Thursday, May 30, 2024

507. జీవిత స్వరం


జీవిత స్వరం



• సత్యమెన్నడు    సతో  ప్రధానం

  నిత్యమెన్నడు    అమోదనీయం.


• రేగుతున్న    అలజడులే 

  మనిషి కి     రజో  ప్రధానం.

• ఎగిసిపడు     ఉద్వేగాలే 

  మనసు కి    తమో  ప్రధానం.


• సత్యమెన్నడు    సతో  ప్రధానం

  నిత్యమెన్నడు    అమోదనీయం.


సంబంధాల లో    “సం”   ఉన్నదా

  ఆత్మీయత  లో    సుఖం   దాగున్నదా ?

• అనురాగం  లో    శాంతి     ఉన్నదా.

  అనుబంధాల లో   సత్యం    దాగున్నదా ?

• ఉన్నది   అంతా    నటనే

  ఆ నటన కు   వేదిక    జీవితం.


• సత్యమెన్నడు    సతో   ప్రధానం

  నిత్యమెన్నడు   అమోదనీయం.


• మనిషిని   మనిషి     తాకే   కాలమిది.

  మనసును  మనసు   సాకే   సమయ మేది ?

• విలువ   లేని       బ్రతుకులకు

  వెలుగు  నింపెనా   ఆస్తి పాస్తులు.

• ఆకలి     కోరికలే      ఆశల    హరివిల్లు

  మాయా  మోహలే    జీవన   పొదరిల్లు.


• సత్యమెన్నడు    సతో  ప్రధానం

  నిత్యమెన్నడు   అమోదనీయం.



సతో   =   సామరస్య గుణం

రజో   =   కోరికల ప్రేరణ గుణం

తమో  =   హింసాత్మక గుణం.

సం     =    నిజాయితీ.


  యడ్ల శ్రీనివాసరావు 

  30 May 2024 , 10:00 PM.



Wednesday, May 29, 2024

506. సందేశం

 

సందేశం



• కాలానికి     కాలునికి

  కట్టుబడిన దీ    జన్మ …

  కారణములు    చూపక

  శరణు కోరునదే   సత్కర్మ.


శరీరమున్నపుడే

  సాధన ములు   యోగ ములు …

  ఒక్క ఘడియ   విడువకు

  ఓర్పుతో   మరి   నేర్పుతో.


• లౌకికమే     వ్యాపకం 

  సంసారమే  సాగరం …

  భక్తికి క        చోటెక్కడ

  జ్ఞానాని కి     దారెక్కడ 

  ముక్తిమాట   ఊసెక్కడ.


• ఉన్న కొన్ని     రోజులు

  ఊసుల    సావాసాలు ...

  వెళ్లి పోవు   ముందు  మాత్రం 

  దేవుని కొరకు    వేవేల  వెతలు.


• నిన్ను  నమ్మి    నీకిచ్చిన

  కాలాన్ని    వాడుకో …

  విలాసాలు   కులాసాలు

  కుదించు   కత్తిరించు.


• శివుడెన్నడు   నిను కోరడు

  శరణు వేడ    స్మరణ చేయ …

  బుద్దినెరిగి    కొలిచినచో 

  కాపు కాచు   నా  భవుడు.


 🙏ఓం నమః శివాయః.

 

యడ్ల శ్రీనివాసరావు 

29 May 2024 , 11:00 PM.




Tuesday, May 28, 2024

505. కలుపు తీసే వాడు

 

కలుపు తీసే వాడు


• కలుపు   తీసే వాడు   కాలుడు

  కలిమి    చేసే వాడు    కేదారుడు.


• ముక్కంటి     ఎరుగని 

  మనిషి   మనసు   ఉందా‌ …

• బుద్ధి లో   దాగున్న    మాయ

  భైరవుని కి   తెలియ  కుందా …


• మౌనం గా    ఆటలే   ఆడుతాడు 

  ధ్యానం లో   పాటలే   పాడుతాడు 

• నిను  చూసిన    నాడు

  నిను   చూసిన   నాడు

  నిలదీసి

  నీ లోని   కర్మలు    కడుగుతాడు‌.

  నిను   మేలి ముత్యం గా   చేస్తాడు.


• కలుపు    తీసే వాడు    కాలుడు

  కలిమి      చేసే వాడు     కేదారుడు


• తీసిన   కలుపు     కంఠం లో   దాస్తాడు 

  ఆ గరళాన్ని    నీలిదేహంతో    మోస్తాడు.

• నిను   పావనం   చేసి

  నిను    పావనం  చేసి

  తాను   సంబరా   పడతాడు.


• కలుపు   తీసే వాడు   కాలుడు

  కలిమి     చేసే వాడు    కేదారుడు.


• ఏమివ్వగలవు   నువ్వు

  ఓ మనిషి    ...   

  ఆ శివుని కి    ఏమివ్వగలవు .

• నీ మన  సివ్వగలవా 

  నీ బుద్ధి లో   చోటివ్వగలవా.


యడ్ల శ్రీనివాసరావు 

29 May 2024 ,  2:00 AM .




Monday, May 27, 2024

504. శివ అఘోరి

 

శివ అఘోరి


• విజృంభ   డుంబ   హేరంభ

  ఢమ ఢమ   ఢమరుక    ప్రజ్వల

• ఓంకార    హ్రీంకార    పంచాక్షరీ

  ప్రమధ   గణ   సేవితా.


• సరళ   సుస్వర    మృదు పాళీ

  సంకట హర    విరసిత  కేళీ

• నటరాజ    నాట్య   రవళీ

  ఆనంద   పరవశ   హోళీ


• రంజితా  కాలే   కంఠిత

  భస్మ లేపిత   నిశాచర   కామిత

• నిర్వికల్ప  నిరాకార   సాకార  నిఘాడ

  నియంత   నిశ్చల    నిర్మిత


• ఝం ఝం ఝం   ఝటాఝూట

  గంగై బంధిత    కపాల మాల

• కంఠే తాల్చిత  ఘోర  

   ఘోర  అఘోర  రూపితా   ౹౹శివా౹౹


🙏ఓం నమః శివాయః 🙏.


యడ్ల శ్రీనివాసరావు 

28 May 2024 6:00 AM


Friday, May 24, 2024

503. కాంక్ష – ఆకాంక్ష

 

కాంక్ష – ఆకాంక్ష



• కాంక్ష, ఆకాంక్ష వినడానికి ఒకేలా అనిపించినా భావం, అర్దం లో చాలా తేడా ఉంటుంది. ఇది గమనించడం కొంచెం కష్టం.


• కాంక్ష అంటే కోరిక. ఒక వ్యక్తి తన స్వయం సంతృప్తిని నెరవేర్చుకోవడం చేసే ఆలోచన కాంక్ష. ఈ కాంక్ష లో ఒకింత ఆశ, స్వార్థం ఉంటాయి. ఇది ఆ వ్యక్తి, నెరవేర్చుకోవడం కోసం తన మనసు లో బలమైన సంకల్పం చేస్తాడు. కార్యాచరణ చేస్తాడు. కాంక్ష లో బలమైన లోతు ఉంటుంది. కోరిక నెరవేర్చుకోవడం అనేది, ఎప్పుడూ వ్యక్తి యొక్క శారీరక మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటాయి.

• మనిషి తన పరిధి కి, శక్తి కి లోబడి నపుడు కోరికలు సహజంగా నే , ఏ ఇబ్బందీ లేకుండా నెరవేర్చు కుంటాడు. కానీ తన శక్తి కి మించినపుడే కాంక్ష, ఆకాంక్ష లనేవి ఉత్పన్నమవుతాయి.


• కాంక్ష నెరవేరాలంటే కొంత సమయం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో మనిషి తన కాంక్ష నెరవేరుట కోసం దేవుని ఎదుట ప్రార్థన కూడా చేస్తాడు. కాంక్ష అనేది లోతైనది, బలమైనది. దీని కోసం తగు రీతిలో ఆలోచన అవసరం. తన శక్తి కి మించిన శక్తి యొక్క సహాయం అవసరం. ఆ శక్తి దైవం కావచ్చు లేదా దెయ్యం కావచ్చు. అంటే పాజిటివ్ లేదా నెగెటివ్ ఎనర్జీస్.


• ఒక మనిషి తన కాంక్ష ను నెరవేర్చుకోవడం కోసం, దైవ అనుగ్రహం (పాజిటివ్ శక్తి) ఉంటే సులభంగా నెరవేరుతుంది. లేని పక్షంలో ఆ వ్యక్తి ఏదొక దారిలో అంటే అపసవ్య దారుల్లో నైనా ప్రయత్నం చేసి తన కాంక్షను తీర్చుకుంటాడు. ఎందుకంటే ఇది స్వయం తన కోసం, తన అనుభూతి, తృష్ణ, ఆనందం కోసం. ఇలా చేయక పోతే తన మనసు అంగీకరించదు.


• ఇకపోతే ఆకాంక్ష ఇది ఒక వ్యక్తి బలమైన సంకల్పం తో , ఇతరుల కోసం కోరుకునే కోరిక . ఇది ఎక్కువగా అన్ని బంధాలలో కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక తల్లి తన కొడుకు కలెక్టర్ కావాలని , కొడుకు చిన్న తనం నుంచి అంటే ఎంతో కాలం నుంచి కోరుకుంటూ ఉంటుంది. ఇది ఆకాంక్ష. ఇందులో ఆ కొడుకు కు కలెక్టర్ కావాలని లక్ష్యం ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు.


• మరి ఇటువంటి ఆకాంక్షలు ఇతరుల కోసం చేసేవి నెరవేరుతాయా …. లేదా…. వీటిలో కొన్ని విషయాలు అంతర్లీనంగా ఉంటాయి.


• ఇందులో మొదటి అంశం…. ఒకరి కి మంచి జరగాలి అనో లేదా ఉద్యోగం రావాలనో లేదా మరేదయినా సరే మనం ఆకాంక్షిస్తే, అదే కోరిక ఎదుటి వ్యక్తి లో కూడా ఉండాలి. ఎందుకంటే మన ఆకాంక్ష లో ఉన్న శక్తి కి, ఎదుటి వ్యక్తి కోరుకునే విషయం కూడా matching అవ్వాలి కానీ opposite గా ఉండకూడదు. అప్పుడు రెండు ఎనర్జీస్ కలిసి ఆకాంక్ష తీరే దిశగా పయనం చేస్తాయి.

• రెండవది

• మన ఆకాంక్ష లో ఉండే సంకల్ప శక్తి, ఎదుటి వ్యక్తి మానసిక శక్తి కంటే ఎక్కువగా ఉంటే ఆ ఆకాంక్ష నెరవేరే దిశగా పయనం చేస్తుంది.

• మూడవది

• మనం ఇతరుల ఆకాంక్ష నెరవాలని నిజమైన చిత్తశుద్ధి ఉంటే, మన సంకల్పం లో నిజాయితీ ఉంటే తప్పనిసరిగా మనలో పవిత్రతా శక్తి ఉండి తీరాలి. ఎందుకంటే ఒకరికోసం కోరిక కోరుకున్నప్పుడు,. ఆ కోరిక నెరవేర్చగలిగేది కేవలం భగవంతుడు మాత్రమే. అటువంటప్పుడు మనలో పవిత్రత ఎంత ఉంది అనేది భగవంతుడు తప్పకుండా చూస్తాడు.


• పవిత్రత అంటే శారీరక పవిత్రత కాదు. మానసిక పవిత్రత. శారీరక పవిత్రత అనేది, కలియుగంలో మానవ జన్మ తీసుకున్న ఎవరికీ ఉండదు. ఎందుకంటే మనిషి జన్మ తీసుకున్న విధానమే పూర్తి అపవిత్రం. స్త్రీ పురుషుల రజో, తమో తత్వంతో చేసే శారీరక వాంఛల కలయికతో , తద్వారా జరిగే ప్రక్రియ లో , గర్భంలో 9 నెలలు మలమూత్ర ద్వారంలో శిశువు అనుభవించేది గర్భ జైలు శిక్ష. ఇదంతా నరక యాతన తో కూడుకున్నది. ఈ శరీరం అపవిత్రతని సూచిస్తుంది. ఈ విధంగా జన్మ తీసుకోవడాన్ని కుకవంశావళి అంటారు.


• అదే విధంగా మాంసాహారం, మద్యపానం సేవించడం వలన కూడా పూర్తిగా శరీరం గా అపవిత్రతకు లోనై ఉంటుంది. కానీ మనిషి జన్మ తీసుకున్న తర్వాత మనసు లో ఈర్ష్య ద్వేషం, వికారాలు లేకుండుట, నిస్వార్థం, ప్రేమ, వంటివి స్వచ్చత గా ఉంటే అది మానసిక పవిత్రత అవుతుంది.

• సత్య త్రేతా యుగాలలో జన్మలు గర్భం ద్వారా కాకుండా చూపు యొక్క శక్తి ద్వారా జరిగేది. దీనిని ముఖవంశావళి అంటారు. ఇక్కడ అందరూ దేవతలే. వీరంతా పరమ పవిత్రులు. కాల క్రమేణా వీరు , తమ ఆత్మ శక్తి కోల్పోయి , వికారాలకు వశం అయి ద్వాపర, కలియుగాలలో మానవులు గా తిరిగి జన్మ తీసుకుని అజ్ఞానులు గా అవుతారు.

• అసలు విషయం లోకి వస్తే…. మనిషి మానసిక పవిత్రత కలిగి ఉండి, ధర్మం తప్పని సరిగా ఆచరిస్తే నే , ఇతరుల పట్ల తమ ఆకాంక్ష నెరవేరుతుంది. …. లేకపోతే ప్రతిఒక్కరూ తమ గొప్ప కోసం, తమ మంచి చూపించు కోవడం కోసం, సునాయాసంగా ఇతరుల కోసం , పోయేది ఏముంది లే అని కోరికలు, ఆకాంక్షలు కురిపిస్తారు.

• అదే విధంగా ఆశీస్సులు, అక్షింతలు వేయడం వంటివి కూడా, నేటి కాలం చాలా మంది మొక్కుబడిగా చేసే పనులు. ఆశీర్వచనం ఇవ్వాలంటే మనసు లో పవిత్రమైన సంకల్ప శక్తి ఉండాలి. అక్షింతలు వేసి దీవించడం అంటే, దేవుడు నీకు శుభ దీవెనను ఇవ్వమనే అవకాశం కల్పించాడని మనసు లో తలచి, ఆ సమయంలో అక్షింతలు వేస్తే, వారికి శుభం జరుగుతుంది… అలా కాకుండా ఏదో మొక్కుబడి వ్యాపకాలతో, ఏదో ఆలోచనలతో దీవెనలు ఇస్తే అది వృధా, ఫలితం ఉండదు సరికదా నెగెటివ్ ఎనర్జీ అంటుకుంటుంది. అందుకే దిష్టి హారతి తీస్తారు.

• ఇవి అన్నియు యదార్థాలు. నిధానంగా ఆలోచిస్తే తెలుస్తుంది.

• మనలో ఆలోచనలను శుభ్రం చేస్తే కలిగే లాభం మనకే. నలుగురి కోసం నటిస్తూ జీవిస్తే నష్టపోయేది మనమే.

• స్వయం తమ కోసం కాంక్ష కలిగి ఉండడం మంచిదే.

• అదే విధంగా ఒకరి మంచి కోసం శుభ సంకల్పం తో, ఆకాంక్ష కలిగి ఉండడం మంచిదే.

• కానీ ఒకరి మెప్పు కోసం , మనం మంచి వారిగా నిరూపించు కోవడం కోసం ఆకాంక్షలు కోరుకుంటే, అవి ఎన్నడూ నెరవేరవు.

• కానీ ఒకటి మాత్రం సత్యం. ఆకాంక్ష కోరుకుంటే, మన మనసు లో పవిత్రతా శక్తి ఎంత ఉందో, మనకు మనమే శోధించాలి.

• అష్ట సిద్ధులలో సంకల్ప సిద్ధి ఒకటి. అది కలిగి ఉంటే ఆకాంక్షలు నెరవేరుతాయి. సంకల్ప సిద్ధి అనుగ్రహానికి నిత్యం గణపతి మరియు ఆంజనేయస్వామి ఆరాధన చేయాలి.


 యడ్ల శ్రీనివాసరావు 

 24 May 2024, 2:00 PM



Thursday, May 23, 2024

502. బుద్ధ పౌర్ణమి

 

బుద్ధ పౌర్ణమి



• గొంగళి     సీతా  చిలుకయిన  రోజు

  కంబళి    తొలగి  సృష్టి లో   వెలుగునిండిన  రోజు.

• అజ్ఞానం   మరుగయిన రోజు

  జ్ఞానం       ఉదయించిన రోజు.


• అదే అదే    సిద్దార్దుడి   పుట్టినరోజు.

  అదే ఇది    నేటి   బుద్ధ పౌర్ణమి రోజు.


• నాడు    పౌర్ణమి   చంద్రుడు  విరిసాడు.

  బుద్ధుని లో     పూర్ణ బుద్ధిని   నింపాడు.


• రాజభోగాలు    విడిచాడు.

  ఒంటరి    బాటసారి    అయ్యాడు.

  మరణమనే    ప్రశ్న తో   మహర్షి గా  మారాడు.


• అదే అదే    సిద్దార్దుడి   పుట్టినరోజు

  అదే ఇది    నేటి బుద్ధ   పౌర్ణమి రోజు.


• అనుభవాలనెన్నో    ఆకళించు కున్నాడు.

  తన మన పర     భేదము నెంచ కున్నాడు.


• చీకటి   పయనం   చేసాడు.

  సత్యాన్వేషి గా      మారాడు.

  మౌనమనే   దీక్ష తో    విశ్వ శక్తి ని  పొందాడు.


• అదే అదే   సిద్దార్దుడి   పుట్టినరోజు

  అదే ఇది   నేటి బుద్ధ   పౌర్ణమి రోజు.


• కందమూలాలు    తిన్నాడు.

  అహింసను   రూపుమాపాడు.


• ధ్యానమనే యోగంతో   

  ఆత్మ జ్ఞానం  బోధించాడు.

• శాంతి  అనే ధర్మం తో   

  బౌద్ద మతం  స్థాపించాడు.


• లోక కల్యాణమై    దైవగురువైనాడు

  గౌతమ  బుద్ధుడు …

  సిద్ధి నొందినాడు   సిద్ధార్థుడు.


  23 May 2024. 4:00 pm.

 యడ్ల శ్రీనివాసరావు.


Wednesday, May 22, 2024

501. ఏమిటి నీ ఆలోచన

 

ఏమిటి  నీ  ఆలోచన ...



• రేపటి  మాపులలో   చీకటి  రాదని

  నిన్నటి  రాతిరి  చెప్పిందా !

• వెన్నెల  మబ్బులలో   వెండి  దాగుందని

  మిన్ను   కురిసిందా !

• ఏమిటి   నీ  ఆలోచన !!


• అక్కరకు   రాని

  అక్కున    చేరిన

  ఆత్మ బంధమే    ఆవస్యమా !

• కాదని   వీడని

  విడదీయలేని   విరహమే  వైరాగ్యమా !

• ఏమిటి నీ ఆలోచన !!


• ఊసుల  భాసలలో    ఆశా పాశం

  విరిసేనని   శ్వాస చెప్పిందా !

• ఊహల రాతలలో   వీణా నాదం

  పలికేనని  జీవన  రాగం  పాడిందా !

• ఏమిటి  నీ  ఆలోచన !!


• సఖ్యత లేని

  నవ్యత తోని

  స్నేహ బంధమే   అవసరమా !

• ఏ ఎండకు    ఆ గొడుగనే 

  నినాదమే    జీవన   తంత్రమా !

• ఏమిటి   నీ   ఆలోచన !!



యడ్ల శ్రీనివాసరావు.

 22 May 2024 , 10:00 am


Monday, May 20, 2024

500. కృతజ్ఞతలు

 

కృతజ్ఞతలు



• కృతజ్ఞతలు శివయ్యా 🙏. కేవలం నీ స్మరణ తో , ఈ ఆత్మ ఈ రోజు కి  చిన్నపాటి ఈ 500 రచనలు రాయగలగడం ఏనాటి సుకృతమో లేక మిగిలి ఉన్న కర్మో అనిపిస్తుంది. ఈ రచనల వలన ఎవరికి ఏ, ఉపయోగం ఉంటుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఆత్మ సంతృప్తి లభించింది.

• అసలు ఆలోచిస్తే ఇదంతా చాలా చాలా విచిత్రం. ఊహకు కూడా అందని విషయం. ఏ మాత్రం సాహిత్యం, రచనా శైలి, భాషా పరిజ్ఞానం తెలియని నేను ఇవి ఎలా రాయగలిగానో,  నాకే తెలియదు, అర్దం కాదు.

• చిన్నగా 2020 మే 1 వ తేదీ న ఆరంభించిన ఈ బ్లాగు, నేడు దేశంలో ,  అదే విధంగా 100 కు పైన వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారు ఈ రచనలను చదువుతూ , ఒక సాధారణ మైన ఈ బ్లాగు కి 40,000 పైన వీక్షణలు వచ్చాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది … నేను నమ్మేది ఒకటే … ఇదంతా శివుని ఆశీర్వాదం తో, సహాయం తో సాధ్యం అయింది అని. ఎందుకంటే, ఏదీ కూడా కావాలని, ఆశించి, ప్రయత్న పూర్వకంగా నేను మొదలు పెట్టలేదు.




• ముఖ్యంగా, ఈ సందర్భంలో ఒక స్నేహితుడు, మరియు ఒక స్నేహితురాలి కి నేను కృతజ్ఞతలు 🙏 తెలియ చేసుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల తరువాత, స్కూల్ రీ యూనియన్ సందర్భంగా బాల్య మిత్రుల అందరి కోసం , స్కూల్ అనుభవాలను ఒక script గా రాసి present చేయడం జరిగింది. ఈ రీయూనియన్ ఫంక్షన్ కి పైన చెప్పిన స్నేహితుడు, మరియు ఆ స్నేహితురాలు కూడా వీలుకాక అటెండ్ కాలేదు….. కొద్ది రోజుల తర్వాత ఆ స్నేహితుడు, మరియు ఆ స్నేహితురాలు ఒకరికి తెలియకుండా మరొకరు విడి విడిగా నేను రాసిన script , వాట్సాప్ గ్రూప్ లో చదివి చాలా చాలా బాగుంది అని ప్రోత్సహించారు. నా రచనా శైలి ప్రత్యేకం గా ఉందని, కధలు ఆర్టికల్స్ రాయమని చాలా ప్రోత్సహించారు. నేను వారితో ఒకటే చెప్పాను… నాకు అసలు రాయడం రాదు, ఏదో స్కూల్ మీద ఉన్న ప్రేమ కొద్ది, బాల్య స్మృతులు గుర్తున్నవి , యదార్థాలు మాత్రమే రాసాను. కధలు రాయాలంటే ఊహించి రాయాలి, పాత్రలచేత రక్తి కట్టించాలి. ఆ డ్రామాలు నాకు సాధ్యం కాదు అని వారితో చెప్పాను. ఎందుకంటే నిజ జీవితంలో నేను చాలా Bad Actor ని, Drama Action చేతకాక మనుషుల తో ఎన్నోఇబ్బందులు పడుతూనే ఉంటాను. అయినా సరే, వారు ఇద్దరూ ఎందుకో పట్టు వదలకుండా ప్రోత్సాహం ఇచ్చారు. నువ్వు రాయగలవు , నీలో టాలెంట్, skill ఉంది అనేవారు.

• నాకు ఊహించి రాయడం చాతకాదు అని చెప్పి నా సరే, వారు చెప్పిన విషయం ఏమంటే యదార్ధం గా చూసినవి రాస్తే , అవే రచనలు గా అవుతాయి అని చెప్పారు. …. ఇదంతా నాకు చాలా విచిత్రం గా అనిపించేది. ఎందుకంటే నాకు సాహిత్యం రాదు, ఎలా రాయాలో తెలియదు, ఏ అంశం రాయాలో తెలియదు, ప్రాశ , యాస తెలియదు. ఏది ఎలా కనెక్ట్ చేయాలో అసలు తెలియదు. ఎందుకంటే నేను కధలు, నవలలు చదవడం వంటివి ఏనాడూ అలవాటు లేదు.

• ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, అసలు ఆ స్నేహితుడు, స్నేహితురాలు నాలో ఏం చూసారు 🤔, ఎందుకు ఇంతగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అని చాలా ఆలోచించే వాడిని…..

• కొద్ది రోజుల తరువాత తెలిసిన విషయం, సమాధానం ఏమంటే, నా స్నేహితుని కొడుకు వయసు 15 సంవత్సరాలు, అప్పటికే ఆ అబ్బాయి famous English poet , popular writer in English articles, dramas. ఆ అబ్బాయికి ఒక బ్లాగ్ కూడా ఉంది.

• అదే విధంగా నా స్నేహితురాలికి , ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి కూడా మంచి English writer, writers forum లో సభ్యురాలు. ఇంగ్లీష్ లో మంచి novel రాసింది, అది Singapore publication వాళ్లు Amazon లో సేల్ కి ఉంచారు. (ఈ విషయాలు చాలా కాలం తర్వాత తెలిసాయి.)

• అప్పుడు అనిపించింది, బహుశా నా స్నేహితుడు, స్నేహితురాలు కి రచనలు, సాహిత్యం అంటే విపరీతమైన ఇష్టం.  రాయడం అనే  కళాతృష్ణ వారి  పిల్లల్లో  గమనించి ప్రొత్సాహం ఇచ్చారు.  వారికి ఉన్న  ఆ అనుభవ దృష్టితో నే   నన్ను  కూడా ప్రోత్సహించారు అని  తెలిసింది .   నిత్యం శివుని ఆరాధించే నాకు, తరువాత అసలు విషయం అర్దం అయింది,   ఇదంతా నా జీవితంలో  శివుడు రాసిన Drama  Script   అని.

• ఈ సందర్భంగా నా స్నేహితుడు కి, స్నేహితురాలు కి …. నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏 తెలియ చేసుకుంటున్నాను.  

 🌹🌹🌹🌹🌹🌹

• ప్రారంభించిన    మొదట్లో   మూడు, నాలుగు ఆర్టికల్స్ ఏదో సరదాగా నా స్పృహ తో రాసాను. కానీ ఆ తరువాత నుండి నేటివరకు రాస్తున్న తొంభై శాతం ఆర్టికల్స్   నా consciousness కి   చెందినవి ముమ్మాటికీ కావు.   ఎందుకంటే ఏది ఎందుకు ఎలా రాస్తున్నానో,  రాసానో నాకు తెలియదు,  అర్దం కాదు. ఎక్కువ గా అర్దరాత్రుళ్లు నిద్రలో మెలకువ వచ్చేది… అప్పటికప్పుడు కనిపించింది, అనుభవం అయినది , ఏదో ఆవహించినట్లు    అతి తక్కువ క్షణాల్లో రాసే వాడిని. రాస్తూ ఉన్న సమయంలో ఏదో శక్తి ఆవహించినట్లు ఉండేది. … చెప్పాలంటే నేడు ఈ శరీరంతో పొందని అనుభవాలను, నా  స్పృహ లో లేని  భావోద్వేగాలను రాయడం జరిగింది.  విచిత్రం ఏమిటంటే ఏ అంశానికి సంబంధించినది అయినా సరే ఏదో అనుభవం ఉన్నట్లు రాయడం జరిగింది. రాస్తూ ఉంటే ,  ఎత్తు నుంచి నీరు పల్లం వైపు జారుతున్న వేగం గా  అక్షరాలు  చేతినుండి  జారేవి. 

అప్పుడప్పుడు, రాసిన ఈ ఆర్టికల్స్ చదివి, ఎవరు రాసారో గాని చాలా బాగా రాశారు అని నాలో నేను అనుకునే వాడిని. నా consciousness కి అవన్నీ , నేను రాసినవి గా అనిపించేవి కావు. నేటికీ అనిపించవు. ఎందుకంటే నేను, కవి, రచయిత ని కాదు.  

• కాలక్రమేణా నాకు నా తండ్రి శివుడు ధ్యానం ద్వారా అన్ని విషయాలు అర్దం చేయించాడు, రాసిన రచనలు అన్నీ నా శరీరం కాదు, నాలోని ఆత్మ రాసింది అని తెలిసింది.

• గడిచిన అనేక జన్మల ద్వారా, నా ఆత్మ లో నిక్షిప్తం అయిన స్మృతులు మరియు ఆ యా జన్మలలో అర్ధాంతర మరణం వలన పరిపూర్ణం కాని , కర్మలు అని అనుభవం అయింది. పూర్తి కాని కర్మలు రాతలు గా వచ్చాయని, అదే ఈ జన్మలో నా తలరాతని అర్దం అయింది.

• దీనికి శివుడు ఒక ఆధారం కూడా చూపించాడు… ఏమంటే జన్మ జాతకం లో శని కేతు గ్రహాలు కలయిక వలన , ఆ సమయం వచ్చినప్పుడు ఆత్మ జాగృతం అవుతుందని, subconscious activate, జన్మ కుండలిలో  5th house activate అయి జన్మాంతర జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని, పూర్వ జన్మల్లో మిగిలిన కర్మలు పూర్తి అవుతాయని, శని కేతువులు కలిసి ఉండడం వలన విశిష్ట మైన రచనా శైలి ఇస్తారని తెలిసింది. అంతే కాకుండా , కేతువు కి ఎదురుగా ఉన్న రాహువు విదేశీ కమ్యునికేషన్, పబ్లికేషన్ ఓవర్ మీడియా కి సహకరిస్తాడని, higher level of spiritual knowledge ఇస్తాడని astrology books లో చదివాను. 

• నేడు ఇదంతా పేరు కోసం, గుర్తింపు కోసం రాస్తున్నది కాదు. అదే విధంగా ఎవరిని ప్రభావితం చేయడానికి, నమ్మకం కలిగించడానికి కూడా కాదు. ఎందుకంటే ఆ అవసరం నాకు లేదు.    పేరు, కీర్తి,   high education,   superior job,  ధనం,  హోదా అన్నీ కూడా ఒక స్థాయి లో పూర్తిగా ఇది వరకే అనుభవించడం జరిగింది, వాటి experiences అన్నీ కూడా స్పష్టంగా నాలో నేటికీ నిలిచి ఉన్నాయి.  ఇక మిగిలింది, చేయవలసింది ఒకటే , ఆధ్యాత్మిక ప్రయాణం, మనసా వచసా  కుటుంబ మరియు సమాజానికి    సేవ చేయడం మరియు శత్రు సంహారం చేయడం.…  శత్రు సంహారం అంటే వికారాలైన ఈర్ష్య, ద్వేషం, అసూయ, స్వార్థం, వ్యంగ్యం, కామం, మాయ మాటలు చెప్పడం వంటి చెడు గుణాలు. అవి నాలో ఉన్నా సరే, నాతో కలిసి   నా చుట్టూ  ఉన్న వారిలో  ఉన్నా సరే … సంహరించడం నా కర్తవ్యం.  ఇదే నా శేష కర్మ.

• నేడు రాస్తున్న ఈ విషయం అంతా, నా ఆత్మ సాక్ష్యం కోసం. … రేపు ఈ శరీరం విడిచిన తరువాత ఈ సాక్ష్యం భూమి మీద ఉండడం కోసం. ఎందుకంటే మళ్లీ జన్మ లో ఏ బంధాలకు నోచుకోని నేను , జన్మతః యోగి సన్యాసి గా పుట్టే నేను,   ఈ భూమి పై విడిచిన ఆనవాలు ఏదో ఒక రోజు చూస్తాను.

• కష్టం బాధ లో ఉన్నప్పుడు ఎవరైనా ఆదుకుంటే, సహాయం చేస్తే బాగుండు అని దేవుని కోరుకుంటాం, తోటి మనుషుల నుంచి సాయం  ఆశిస్తూ ఎదురు చూస్తాం. ఆ సహాయం అనేది ఒక మాట కావచ్చు, మనసులో ప్రేమ కావచ్చు,  అవసరానికి ధనం కావచ్చు, శరీరం తో  కూడా ఉండి చేయవలసిన పని కావచ్చు,   ఇంకా ఆరోగ్యం నయం చేసే హీలింగ్  శక్తి   ఏదైనా కావచ్చు ….. 

కానీ మనలో ఉన్న వికారాలను దేవుడు గాని  లేదంటే గురువులు గాని, అనుభవం ఉన్న తోటి మనుషులు ఎవరైనా  సరి చేయాలని  ప్రయత్నిస్తే  మాత్రం అంగీకరించం,  సహించం.  సరికదా  తిరిగి  ప్రతిఘటిస్తూ ,  ఎదుటి వారిపై దాడి చేయడానికి ఎంతకైనా దిగజారి ప్రవర్తిస్తాం. ఎందుకంటే మనలో అహంకారం, బుద్ధి లో మాయ ఆవహించి ఉండడం వలన. అందుకే ఇది కలి మాయా కాలం అయింది.

• మానవ జన్మ కి ప్రతీ బంధం ఒక ప్రతిబంధకం. మరియు బుణం. జీవిస్తూ ఉండగానే, ఈ బుణం తీర్చుకునే మార్గం తెలుసు కొని, ఎవరికి ఏది బుణమో అది తిరిగి ఇచ్చేస్తే , బంధవిముక్తి లభిస్తుంది. బంధీలు గా మానసిక రోదనతో జీవించే యాతన తప్పుతుంది. ఇదే మనిషి కి మోక్షం.

వైరాగ్యం  అంటే  సత్యం, నిజం  అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అంతే గాని  బాధ్యతలు వదిలి వేయడం కాదు .... ముందో , వెనకో  పుట్టిన ప్రతి మనిషి  జన్మాంతరాలలో వైరాగ్యం  అనుభవించి తీరవలసిందే.   ఎందుకంటే మాయతో కలిసి జీవించ గలిగేది  ఎవరైనా కొంత కాలం మాత్రమే. 


ప్రతి మనిషికి కంటికి  , బయటకు  కనిపించే తన జీవితం కేవలం యాభై శాతం మాత్రమే.  ఇది Already దేవుడు రాసి ఉన్న  డ్రామా అనుసారం  జరుగుతుంది. దీనిని ఎవరూ మార్చలేరు, ఆఖరికి  భగవంతుడు కూడా.

అదే విధంగా  కంటికి కనిపించని , లో లోపలి తన జీవితం మిగిలిన యాభై శాతం ఉంటుంది. దీనిని భగవంతుడు చెప్పిన విధంగా   విని , తనను తాను తెలుసుకొని,  ఆచరించడం వలన  తన జీవితాన్ని , తల రాతను  తానే  మార్చుకునే అవకాశం ఉంటుంది.


యడ్ల శ్రీనివాసరావు  20 May 2024, 11:00 pm.


Saturday, May 18, 2024

499. నిశ్శబ్దం - చీకటి

 

నిశ్శబ్దం - చీకటి



• వెలుగు లో కూర్చుని వెలుగుని ఆనందించ గలగడం అనేది అమాయకత్వం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వెలుగు ఎవరికైనా కేవలం కొంత సమయం మాత్రమే భరించగలిగే ఆనందం ఇస్తుంది. ఆ తర్వాత ఆ వెలుగు లో ఉన్న కాంతి శక్తిని, మనిషి మనసు గ్రహించలేదు .

• చీకటి లో ఉండి వెలుగు ను ఆస్వాదించ గలగడం చాలా అద్బుతం గా ఉంటుంది. ఎంత సమయం చీకటి లో ఉన్నా సరే వెలుగును చూస్తూ ఆస్వాదించవచ్చు. ఇది మనసుకి ఆహ్లాదం మరియు అనంతమైన సంతోషం. ఉదాహరణకు రాత్రి పూట ఆరుబయట చీకటిలో కూర్చుని ఆకాశం వైపు చూస్తుంటే చందమామ, నక్షత్రాలు , వాటి నుంచి వచ్చే కాంతి ప్రతి మనిషి మనసును రంజింప చేస్తుంది. అనేక మానసిక ఆందోళనల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇది చీకటి యెక్క శక్తి, గొప్ప తనం.


• ఈ చీకటి లో నే అసలు సిసలైన సృష్టి నడుస్తుంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు. ఈ విశ్వం లో ప్రకృతి మొత్తం చీకటి లో నే జాగృతం అవుతుంది. అంటే మేల్కొంటుంది. అసలు సిసలైన మార్పు transformation ఈ సమయంలో నే జరుగుతుంది. ఉదాహరణకు మొక్కలు, పువ్వులు , పంటలు వంటివి రాత్రి చీకటి లోనే పరిణామం చెంది ఎదుగుతాయి.  అదే విధంగా   మానవ సృష్టికి   బీజ ఫలదీకరణం కూడా చీకటి లోనే, రాత్రి సమయంలో నే జరుగుతుంది. ఇంకా రాత్రి, చీకటి సమయం లోనే జీవుల కణజాలం అభివృద్ధి చెంది పెరుగుదల సంభవిస్తుంది. ఈ చీకటి సమయంలో నే ప్రకృతి తన పనిని తాను సమర్థవంతంగా చేస్తుంది.

• మనిషి కి మాత్రం ఎందుకో  చీకటి అంటే భయం. ఈ భయం అనేది మానసిక ఆందోళన. చీకటిని త్వరగా అంగీకరించలేడు.

• చీకటి లో దాగి ఉన్న అద్భుతమైన శక్తి నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దం లోనే సృష్టి ఆవిర్భావం జరుగుతుంది. ఈ నిశ్శబ్దం ఎంతో మేధస్సుని, విశ్వ శక్తి ని, ఆరోగ్యాన్ని తరంగాల రూపంలో ఇస్తుంది.

• మనిషి మౌనం గా ఉండడం వలన క్రమేపీ ఆలోచనలు తగ్గి మనసుకి చీకటి ఆవరిస్తుంది. ఈ చీకటి లో నుంచే నిశ్శబ్దం అనుభవం అవుతుంది. ఈ నిశ్శబ్దం లో ఉండే శక్తి గ్రహించడం ద్వారా దైవం దిశగా దారి కనపడుతుంది. అందుకే యోగులు, మునులు, ధ్యానులు మౌనం గా, ఏకాంతం గా ఉండడానికి ఇష్టపడతారు.


• అకస్మాత్తుగా  ఎవరైనా చీకటి లోకి వెళితే కళ్లు కనిపించవు. అంతా అంధకారం, అయోమయం, భయం పుడుతుంది, గందరగోళం గా ఉంటుంది. కానీ కొంత సమయం తర్వాత కొంచెం చిన్నగా  కళ్లు చీకటిని ఛేదించడం ప్రారంభిస్తాయి.  క్రమేపీ కొంత సమయం తర్వాత చీకటిలో కూడా కళ్లు  కొంత మేరకు స్పష్టం గా చూడడం ఆరంభిస్తాయి. వెలుగు లో ఉంటూ వెలుగు చూసే కళ్లకంటే , చీకటి లో ఉంటూ చీకటిని చూసే కళ్లు చాలా గొప్పవి. వెలుగు లో ఉండి చీకటి ని చూడలేం, కానీ చీకటి లో ఉంటూ చీకటిని, వెలుగు ను కూడా చూడగలం.

• కాసేపు , మనకు తెలిసిన ఈ చీకటిని మనిషి జీవితంతో సరిపోల్చి చూస్తే చాలా వాస్తవాలు అర్ధం అవుతాయి.

• చీకటి అనేది మనిషి యొక్క దుఃఖం.  నిందలు, అవమానాలు, సమస్యలుగా భావిస్తే …. ఎంత ఎక్కువ గా వీటిని మనిషి అనుభవించగలడో అంతగా శక్తి వంతుడై, ఓర్పుతో వీటిని అధిగమించి అసలైన సంతోషం పొందగలడు.  భాదలు, నిందలు, అవమానాలు మనిషి ని కృంగదీస్తాయి, అంధకారంలో కి నెట్టెస్తాయి. …. కానీ మనిషి కి అసలు సిసలైన మార్పు వీటిలో నుంచే ఆరంభం అవుతుంది. ఇటువంటి వారి మనసు పునాది చాలా బలంగా ఉండి, ఎటువంటి ప్రతికూల స్థితులైనా ఒంటరిగా, ధైర్యం గా, నిజాయితీగా ఎదుర్కోగలరు.


• చీకటి అనేది బాహ్య ప్రపంచం లోనే కాదు, మనిషి అంతరంగం లో కూడా అలుముకొని ఉంటుంది. దీనిని ప్రేమించడం, అర్దం చేసుకోవడం చేస్తే అనంతమైన వెలుగుకి  దారి కనిపిస్తుంది. ఉదాహరణకు అందరికీ మంచి చేసే ఒక మనిషి,  చేయని  పనులకు అవమానాలు పడి,   తన అనుకున్న వారి చేసిన నమ్మకద్రోహనికి   బలై ,   ఈర్ష్య  అసూయ పరుల  మాటలకు  నిందలు పడి    సమాజానికి,  అన్ని బంధాలకు దూరం  అయితే    అది ముమ్మాటికీ ఆ మనిషి యొక్క అదృష్టంగా భావించాలి.   అటువంటి మనిషి ఏనాడూ,  బంధువులకు , స్నేహితులకు, సమాజానికి  దూరమయి  పోయానని బాధ పడనవసరం లేదు.  ఆ సమయంలో ఆ మనిషి కి ఆవహించిన చీకటి అందరినుంచి దూరం గా తీసుకెళ్ళి,   ఎవరో గాని చేరలేని  చూడలేని వెలుగుని చూపిస్తుంది.  బహుశా ఆ వెలుగు దైవం అయి ఉండవచ్చు,  లేదా మరేదయినా కావచ్చు.  అంటే ఇక్కడ గమనిస్తే చీకటి అనేది ఒక మనిషి కి ఎంత మేలు చేసిందో తెలుస్తుంది.


• ఇటువంటి సమయంలో ఆ మనిషి మొదట కృతజ్ఞతలు తెలియ చేయవలసింది, తనను దూరం చేసుకున్న బంధువులకు, స్నేహితులకు, సమాజానికి. వీరే కనుక   ప్రతి కూలతలు,  ప్రతి బంధనాలు సృష్టించక పోతే   ఆ మనిషి గుంపులో  గోవింద లాగ అలాగే ఉండిపోతాడు …… అంటే , మనిషి ఒక ఆలోచన సమర్థవంతంగా చేయగలిగితే  తనకు కలిగిన  ప్రతికూల  పరిస్థితులలో  దాగి ఉన్న లాభం గ్రహించవచ్చు.  మేలు పొందవచ్చు.  

ఎప్పుడైనా సరే ఒకటి కోల్పోయాం, కోల్పోతున్నాం అంటే మరొకటి లభిస్తుంది అని అర్థం. కాకపోతే  కోల్పోయిన దాంట్లో గాని లేదా లభించిన దాంట్లో గాని మనకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా అనేది సూక్ష్మం గా, సమర్థవంతంగా తెలుసుకో గలగాలి.


• ఈ ప్రపంచంలో ప్రతి మేధావి, ఏకాంతాన్ని, చీకటి నే ఇష్టపడతారు. ఎందుకంటే ఏకాంతం లో నెగెటివ్ ఎనర్జీస్ తో   సహచర్యం  చేయ వలసిన  అవసరం  ఉండదు . అదే విధంగా   చీకటిలో   అంటే రాత్రి సమయంలో  తమ మేధస్సుని ఉపయోగించుకోవచ్చు.  దీనికి ఆధ్యాత్మిక కారణం కూడా ఉంది. రాత్రికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనసు. రాత్రి చేసే పనిలో చంద్రుని నుంచి వెలువడే శక్తి, మనసును చైతన్యం చేస్తుంది.


• చీకటి లో రాత్రి చేయ వలసినవి  మంచి పనులు. రాత్రి పదిగంటలు దాటిన తరువాత అమ్మవారి కి పూజ చేసి చూడండి, మంచి ఫలితాలు శక్తి వస్తుంది. అదే విధంగా రాత్రి రెండు గంటల సమయం నుండి ధ్యానం చేసి చూడండి, డైరెక్టుగా విశ్వానికి, విశ్వశక్తి కి కనెక్ట్ అవుతారు. అదే విధంగా రాత్రి చదువుకున్నది త్వరగా గుర్తు ఉంటుంది. ఎక్కువ శాతం శుభ ముహూర్తాలు రాత్రుళ్లు ఉంటాయి. ఎందుకంటే రాత్రి లో చీకటి ఉంటుంది. చీకటి లో నిశ్శబ్దం రాజ్యం ఏలుతుంది. ఈ నిశ్శబ్దం నుంచే నారాయణుడు మరియు నరుడు స్వదర్శన చక్రం తిప్పుతారు.

• మనిషి తనలో, తన చుట్టూ ఉన్న విజ్ఞానాన్ని గ్రహిస్తే, మనసు లో వాటికి కొంచెం చోటు ఇస్తే ఏనాడూ మనిషి స్వతహాగా ఆందోళన పడే అవసరం రాదు.

వ్యర్థం ఆలోచించే కంటే, మనిషి తన మానసిక శక్తి ని ధ్యానం ద్వారా పెంచుకుంటే సమస్తం వశం అవుతుంది, పరవశం పొందుతాడు.


యడ్ల శ్రీనివాసరావు 18 May 2024 , 1:00 AM.


Tuesday, May 14, 2024

498. మనసా తెలుసా

 

మనసా తెలుసా 



• మనసా   మనసా

  ఇది  నీకు  తెలుసా.

• మదిలో   కలిసే

  సుధ ఏమిటో  తెలుసా.

• ఇది  తెలియక   కలవరమై 

  వ్యధ  కిచ్చావు   అలుసు.


• మనసా   మనసా

  ఇది   నీకు తెలుసా.


• సుధ  కలిసిన  మది లో

  జరిగేది  ప్రేమకు  అభిషేకం.

• సుధ   నిండిన   ఎద లో

  వెలిసేది   ప్రేమ  మందిరం.


• మరణం లేని   ప్రేమ కు

  మననమే     ఊపిరి.

• తనువు లేని  ఆత్మ లో   

  ప్రేమ  కాదెన్నడు   ఆవిరి.


• మనసా    మనసా

  ఇది   నీకు  తెలుసా.

• మదిలో  కలిసే

  సుధ   ఏమిటో    తెలుసా.


• హృదయం లో   విరిసింది    ఓ కమలం.

  మనసు ని   చేసింది   ప్రేమ  సరోవరం.

• ఆ  కమలం   ఓ దైవం.

  ఆ సరోవరం   ఓ స్వర్గం.


• మనసా మనసా

  ఇది నీకు తెలుసా.

• మదిలో కలిసే

  సుధ ఏమిటో తెలుసా.

• ఇది తెలియక కలవరమై 

  వ్యధ కిచ్చావు అలుసు.


సుధ = అమృతం.


యడ్ల శ్రీనివాసరావు 15 May 2024  2:00 AM.



497. ప్రేమ భాష్యం

 

ప్రేమ భాష్యం 



• ప్రేమ అనేది ఒక మానసిక శక్తి  లోనుంచి  వెలువడే అత్యద్భుతమైన ఔషధం. కొందరు ఈ ప్రేమను మనుషుల పై చూపిస్తారు. మరికొందరు జంతు, మూగ జీవులపై చూపిస్తారు.  ఇంకొందరు ప్రకృతి పై చూపిస్తారు, మరికొందరు భగవంతుని పై చూపిస్తారు.

• ప్రేమ అంటే ఒక ఇష్టం.  కొన్ని సార్లు ఈ  ప్రేమ,  మోహం గాను తదుపరి కామం గాను మారుతుంది. ఇటువంటి ప్రేమ కాలక్రమేణా పరిమితం(limited) అయిపోయి స్వార్థం గాను  మారుతుంది. కొన్ని సార్లు అదే ప్రేమ త్యాగం గా మారి దశ దిశలా అనంతం గా (endless) వ్యాపిస్తుంది.    ప్రేమ ను వర్ణించడం అంటే గాలి ని బంధించడం వంటిది.


• ప్రేమ స్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ప్రేమంటే ఇంతే, ఇలాగే ఉంటుంది అని కూడా చెప్పలేరు.   ఉదాహరణకు ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య విడదీయరాని ప్రేమ ఉంది అనుకుంటే …. ఆ స్త్రీ , తల్లి గా మారే సమయంలో తన మనసు లో ప్రేమ యొక్క అనుభూతి, భావం మారిపోతుంది. భర్తకు సర్వస్వం అర్పించిన ఆమెకు తన ప్రేమ లో చీలిక వస్తుంది.   ఎలా అంటే బిడ్డ స్వయం గా తల్లి గర్భంలో, ప్రతి అవయవం తో 9 నెలలు ముడిపడి, ఆ తల్లి శ్వాస నే బిడ్డ కూడా గర్భంలో పంచుకుంటుంది . ఇది ఆ తల్లి  బయటకు వర్ణించలేేేేదు   , కానీ ఆ బిడ్డ స్పర్శకు తల్లి అప్పటి వరకు భర్త నుండి ఏదైతే బాహ్య పరమైన ప్రేమ పొందిందో, అదంతా క్షీణిస్తుంది....    ఎందుకంటే భర్త అనే జీవి బయట తయారై వచ్చిన వాడు. కానీ బిడ్డ మాత్రం స్వయం గా , తన లో లో భాగమై తయారైన జీవి. ఈ విషయం గమనిస్తే ప్రేమ అనేది ఎలా మారుతుందో అర్దం అవుతుంది.

• భర్త తన ప్రేమ లో అంతర్భాగం గా భార్యని స్పృశిస్తాడు, పసిబిడ్డ కూడా తన ప్రాణం కోసం, జీవ మనుగడ కోసం తల్లి శరీరం స్పృశిస్తుంది. ఇదంతా సృష్టి ప్రతిసృష్టి లో అంతర్భాగం.  

• ఈ విషయం సూక్ష్మం గా ఆలోచిస్తే సృష్టి లో ప్రేమ అనేది ఎన్ని విధాలుగా రూపాంతరం చెందుతూ ఉంటుందో అర్థం అవుతుంది. అందుకే అంటారు ప్రేమను అభివర్ణించలేం అని. కొందరు ప్రేమ ను శారీరక అంశం గా భావిస్తారు. మరికొందరు అదే ప్రేమ ను మానసికంగా భావిస్తారు.   ప్రేమ కోరిక కలిగిస్తుంది, కోరిక తీరుస్తుంది,   కోరిక నుంచి విముక్తి నిస్తుంది. 

• ప్రేమను సరిగా అర్థం చేసుకుంటే … ప్రేమ లభించినపుడు సంతోషం, ఆనందం ఉంటుంది. అదే ప్రేమ దొరకనపుడు కలిగే బాధ లో మానసిక పరిపక్వత ఉంటుంది. ఈ పరిపక్వత అనేది మనసు ఉన్నత స్థితి పొందేందుకు దోహదం అవుతుంది. …. ప్రేమ, ఆత్మలో ఉన్న మనసు కి సంబంధించినది.  మనిషి ఒకే ఆత్మ తో జన్మ జన్మలుగా శరీరాలు, రూపాలు, ఆకృతులు  మారుస్తూ  ఉంటాడు.   కానీ ప్రేమ అనే ఔషధం పొందినప్పుడు కలిగే అనుభూతి, అనుభవం, మాధుర్యం సృష్టిలో ప్రతి జీవాత్మ కి ఒకే విధంగా ఉంటుంది.

• నిస్వార్థంగా ప్రేమించండి …. జీవించండి …. కల్మషాలు, మానసిక రుగ్మతలు తొలగుతాయి. మనిషి జన్మించడానికి మరణించడానికి మధ్య వారధి ప్రేమ. ప్రేమలో భాగం గా ఇవ్వవలసింది ఇస్తుంటే పొందవలసింది పొందుతూనే ఉంటారు. ప్రేమలో  త్యాగం ఉండొచ్చు అలాగే ఉండకపోవచ్చు. ప్రేమ పంచక పోయినా, పొందక పోయినా జీవికి విముక్తి కలగదు.


యడ్ల శ్రీనివాసరావు 14 May 2024 , 11:00 pm.







Sunday, May 12, 2024

496. మార్పు శాశ్వతమా ?

 

మార్పు   శాశ్వతమా ?


• పుట్టిన ప్రతి మనిషిలో కాలంతో పాటు అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులే జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి.

• ప్రతి ఒక్కరికి ప్రత్యక్షం గా కంటికి కనిపించేది వయసు, తద్వారా శరీర రూపం లో జరిగే మార్పు. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ శరీర రూపాంతరాలు ప్రతి దశలో బయటకు కనిపిస్తూనే ఉంటాయి.  కానీ ప్రతి దశలో మనిషి శరీరాన్ని నడిపించేది కంటికి కనపడని మనసు. మనసు అంటే హృదయం లో నుంచి పుట్టే  ఆలోచన.

• మరి ఈ ఆలోచనలు అనేవి మార్పు చెందుతూ ఉంటాయా ? అంటే తప్పని సరిగా మారుతూ ఉంటాయా ? అంటే అవును మారుతాయి. మనసు లో మార్పులు బయటకు కనిపించేవి కావు. కానీ ఇవి చాలా శక్తివంతమైనవి గాను అలాగే బలహీనం గాను కూడా ఉంటాయి.

• ఒక మనిషి ని   చూడడానికి అందంగా లేదా విహీనంగా ఇతరులకు కనిపించవచ్చు. కానీ ఆ మనిషి మనసులో సముద్ర గర్భం అంత లోతైన బాధ ఉండొచ్చు లేదా ఆకాశం అంత , పరిధి లేని ఆనందం దాగి ఉండొచ్చు. ఈ విషయం స్వయం గా ఆ మనిషే తన మనసు ని పూర్తిగా అర్దం చేసుకోలేడు.  ఎందుకంటే పరిస్థితుల ప్రభావం వలన మనసులోని ఆలోచనలలో కలిగే మార్పులు ముందుగా ఊహించలేడు.  కాలం, పరిస్థితులతో పాటు సహజం గా అలా మార్పులు సంభవిస్తున్నాయి అనుకుంటాడు తప్పితే తనకంటూ ఒక మనసు ఉందనే స్పృహ తో కూడిన సూక్ష్మ విషయాన్ని గ్రహించలేడు.

• ఒక పరిపక్వత వచ్చే వరకు తనకంటూ ఒక మనసు ఉందనే విషయాన్ని అంతర్గతం గా ఫీల్ అవలేడు. అంటే తనకు అంటూ ఒక మనసు ఉందనే విషయం చాలా మందికి స్పృహ తెలియకుండానే జీవితం చాలా వరకు యాంత్రికంగా గడిచిపోతుంది.

• ఆహారం శరీరాన్ని పోషిస్తుంది. ఇది సహజమైన యాంత్రిక చర్య. మరి మనసు ని  ఏం  పోషిస్తాయి అంటే ప్రేమ. ఈ ప్రేమ లో కోరికలు, ఇష్టాలు, ఆశలు, నమ్మకాలు  ఉంటాయి. ఇవి ప్రతి మనిషి కి ఉంటాయి. కానీ వీటిని గుర్తించగలిగే వివేకం అందరికీ ఉంటుందా అంటే సమాధానం చెప్పలేం. ఎందుకంటే కొన్ని తరాల మనుషులు తమ కోరికలు, ఆశలు, ఇష్టాలు, ప్రేమ అనేవి సమాజం, కుటుంబ పరిస్థితుల ప్రభావం వలన అనాది నుంచి అణగదొక్కబడి, తమకు మనసు అనేది ఒకటి ఉంది అనే విషయం వారి స్పృహ లో లేక, గ్రహించలేక , ఇతరులు చెప్పిన విధంగా  ప్రభావితం అయి  జీవితం గడిపిన వారు ఎందరో ఉన్నారు. ఇటువంటి వారికి తమకు అంటూ హృదయం, ఇష్టాలు ఉన్నాయని జీవిత చరమాంకంలో తెలుస్తుంది. మరి ఈ చరమాంక దశలో మనసు లో మార్పులు సంభవిస్తే ? , ఈ జీవితం ఒకసారే, అనుకున్నది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని అనిపిస్తే ? ఇప్పటి వరకు నా మనసును  నేను గుర్తించ  లేేేదు  అనిపిస్తే?   ఇకనైనా నా మనసు కి  కావల్సింది  నేను ఇవ్వాలి అనిపిస్తే ?  మనసు స్వేచ్ఛ కోరుకుంటే ?…… ఒక అంతర్యుద్ధం, తిరుగుబాటు మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ మార్పు అనేది సంభవించబోతుంది కాబట్టి.

• ఇదంతా ఎందుకు అంటే మనసు అనేది మార్పు చెందడం ప్రారంభిస్తే, తనకు నచ్చిన విధంగా మారుతుంది. ఇది బయటకు కనపడదు. ఒక మనిషి యొక్క మనసు ని దేవుడు కూడా ముందుగా ఊహించలేడు.

• ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం, స్థిరం కాదు. మార్పు అనేది సహజం. అది శరీరానికైనా, మనసుకైనా. శరీరం అయితే మార్పు చెందుతూ ఏదోఒక రోజు శాశ్వతం గా నశించి పోతుంది. ఒక సారి పుట్టిన  మనిషి ఆకారం, రూపం తో  తిరిగి అదే విధంగా ఈ భూమి మీద పుట్టదు.  కానీ మనసు మాత్రం ఎన్నటికీ నశించదు, అది ఆత్మ లో నిక్షిప్తం అయి, ఎప్పుడూ శరీరాలు మారుతూనే ఉంటుంది. మనసు కొన్ని సార్లు కింద పడుతుంది, లేస్తుంది, నవ్వుతుంది, ఏడుస్తుంది, తేలికగా ఉంటుంది మరలా అంత లోనే బరువెక్కుతుంది .…. కాకపోతే ఒకటే , ఎవరి మనసు ని వారు మాత్రమే అర్దం చేసుకోవాలి, సముదాయించు కోవాలి , ఎందుకంటే ఒకరి మనసు మరొకరికి ఎన్నటికీ అర్దం కాదు కనుక.

• మనసు తన శరీర భారాన్ని ఎంతైనా మోయగలదు. కానీ శరీరం మాత్రం మనసు భారాన్ని కొంత పరిధి వరకే మోయగలదు. మనసు యొక్క భారం ఎక్కువైతే శరీరం నిర్వీర్యం అయిపోతుంది. అందుకే మనసు ని ఎప్పుడూ తేలికగా ఉంచుకోవాలి. ఎవరి మనసుని వారు ప్రేమించుకో గలగాలి.

• మనసు పూర్తిగా లొంగేది కేవలం ప్రేమ కు మాత్రమే. ఈ సృష్టిలో ప్రేమ కోరుకోని జీవి ఉండదు. ఆ ప్రేమ ఎటువంటిది అయినా సరే.

• ఆలోచనలు అనేవి మనిషి లో రెండు భాగాలలో జనియిస్తాయి. ఒకటి మెదడు, రెండవది మనసు , హృదయం. మెదడు లో పుట్టే ఆలోచనలు ఎంత సేపు లాభ నస్టాలు బేరీజు వేస్తాయి. ఈ మెదడు ఆలోచనల వలన మనిషి కి ఎప్పుడూ సుఖం, శాంతి, సంతోషం అనేవి ఉండవు సరికదా ఏ నాడైనా అవి లభిస్తే కేవలం కొన్ని నిమిషాలు లేదా గంటలు మాత్రమే.

• కానీ హృదయం లో అంటే మనసు లో నుంచి పుట్టిన ఆలోచనలు మెదడు ద్వారా అమలు పరిచినపుడు లాభమైనా నష్టమైనా కలిగే సంతోషం అద్బుతం గా ఉంటుంది. ఎందుకంటే హృదయం ఎప్పుడూ కోరుకునేది, ఇచ్చేది ప్రేమ మాత్రమే.

• మార్పు అనేది నిరంతరం మనిషి అంతరంగం లో జరిగే అద్భుతమైన ప్రక్రియ. ఏదీ శాశ్వతం కాదు అనేది నిజం.  మనసును వదిలేస్తే తేలుతుంది, ఎగురుతుంది ,  కింద పడుతుంది,   లేస్తుంది, ….. కానీ బలవంతంగా కట్టి పడేస్తే కకలావికలం అయి ప్రమాదానికి గురి అవుతుంది.

• ఆలోచనలు ఎలా మారినా, ఎవరి మనసు వారి చేతిలోనే ….  

మానసిక మైన  మార్పు  అనేది  ఒకరి వలన  తమ  చుట్టూ ఉన్నవారిలో  కలగడం  అసంభవం.  ఒకవేళ అలా అనిపిస్తే  అది   భ్రమ మాత్రమే.

ఎప్పటికైనా   మార్పు  సంభవించేది,   సంభవించ  వలసింది  కేవలం నీ లోనే  .... నీ లో లోనే.  అప్పుడే  నీ చుట్టూ  ఉన్న వారిలో  మార్పు జరిగినట్లు  నీకు  అనిపిస్తుంది.   

ఎవరికీ  వారే  స్వయం  పరివర్తన  చెందుతారు ... చెందాలి కూడా. 


యడ్ల శ్రీనివాసరావు 12 May 2024. 6:00 pm.


Wednesday, May 8, 2024

495. అర్పితం


అర్పితం


• పూస ను    కాను

  పూస ను    కాను

  నీ హారం లో   పూస ను  కాలేను.

• పూవు ను   కాను

  పూవు ను   కాను

  నీ మాలలో   పూవు ను   కాలేను.


• నీ   ఆజ్ఞాకారి నైనా  భాగ్యం

  భాగ్యం

  అదియే   ఈ జీవికి   భాగ్యం.


• జన్మలెన్నో     ఎత్తాను

  కర్మలెన్నో      చేసాను

  తుదకు తెలుసుకున్నాను

  నీవే   నా తండ్రి  వని ...

  నీ మాటను   శిరసావహించాలని.


• అక్షత    నైతి

  అక్షత    నైతి

  నీ కంట నీటి   రుద్రాక్షత  నైతి.

• భస్మము   నైతి

  భస్మము   నైతి

  నీ ఒంటి పూసే   భస్మము  నైతి.


• నీ కంఠగరళ   బిందు  నైన మోక్షం

  మోక్షం

  అది యే  ఈ అల్పికి  మోక్షం.


• పూజలెన్నో   చేసాను

  వేదనలెన్నో  భరించాను

  తుదకు   తెలుసుకున్నాను

  అవి  నా కర్మల   గుహ్య గతి   అని.

  అవి  కరిగేది     నీ స్మృతి  తోనే  అని.


• పూస ను    కాను 

  నీ  హారం లో   పూసను  కాను.

  పూవు ను   కాను

  నీ  మాలలో   పూవు ను కాను.

• అక్షత       నైతి

  నీ  కంట నీటి     రుద్రాక్షత  నైతి.

  భస్మము     నైతి

  నీ  ఒంటి పూసే   భస్మము  నైతి.



అక్షత = విరిగినది, జారినది.


యడ్ల శ్రీనివాసరావు 8 May 2024 10:00 pm


Saturday, May 4, 2024

494. Failures Are Accurate Winners

 

Failures Are Accurate Winners


• అపజయం అనే పదం వినగానే ప్రతి మనిషి లో కలిగేది ఒక భయం, మానసిక ఆందోళన. మనిషి ఏదైతే కోరుకుంటాడో అది పొందక పోవడం, దేని కోసం అయితే ప్రయత్నించి విఫలం అవుతాడో అదే అపజయం, ఫెయిల్యూర్.

• ఏదైనా ఒక విషయం లో అనగా, ఒక వ్యాపారి తనకు జరిగిన నష్టం లో,    ఒక విద్యార్థి పరీక్షలలో , ఒక వ్యక్తి ఉద్యోగ ప్రయత్నం లో,   ఒక ప్రేమికుడు ప్రేమ లో ఇలా  ఎన్నో జీవిత అంశాలలో    మనిషి కి అపజయం కలిగినపుడు లేదా ఫెయిల్యూర్ గా మిగిలినపుడు మనిషి మనసు పడే బాధ వర్ణనాతీతం. ఆ సమయంలో  ప్రపంచం అంతా ఒకవైపు, తానొక్కడే మరో వైపు అన్నట్లు అయిపోతుంది.   ఒంటరి తనం ఆవహిస్తుంది. ధైర్యం నశిస్తుంది. ఆత్మన్యూనత  ( inferiority complex) భావం వేధిస్తుంది. అంతా చీకటి కమ్మేసినట్లు ఉంటుంది. ఈ  ప్రపంచం మనల్ని చూసి వెక్కిరిస్తూ న్నట్లు అనిపిస్తుంది. సొంత మనుషులు పైకి మాములుగా ఉన్నా లోలోపల మాత్రం అసమర్థుడు గా ముద్ర వేస్తారు.


• ఇదంతా  అతి సహజంగా చాలా మందికి తమ జీవితాలలో ఏదొక వయసు లో, ఏదొక సమయం లో తప్పకుండా ఎదురయ్యే పరిస్థితి .  కాస్త ధృడమైన మనస్తత్వం కలిగిన వారు తమ జీవితం లో వచ్చిన ఫెయిల్యూర్స్ ని    మౌనం గా ఎదుర్కొంటారు. కాస్త సున్నిత మనస్తత్వం కలిగిన వారు మాత్రం డిప్రెషన్ లోకి వెళ్లి మానసికంగా అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. ఈ స్థితి మితిమీరిన  కొందరు ఆత్మహత్యలు  కూడా   చేసుకుంటారు.


• చాలా మంది మనుషులు,  జీవితం పట్ల అవగాహన లేని వారు, సంకుచిత స్వభావం కలవారు పైన చెప్పిన విధంగా అపజయాల వలన సర్వస్వం కోల్పోయిన వారిగా క్రుంగి మిగిలి ఉంటారు. కానీ ఇలా ఉండడం ముమ్మాటికీ తప్పు.


• మనం ఎంత కష్టపడినా విజయం దక్కడం లేదు  సరికదా అపజయం అనేది ఒకసారి కాదు, రెండు మూడు నాలుగు సార్లు వస్తుంది అంటే అంత అదృష్టం ఆ మనిషి కి ఇంకొకటి లేదు. అవును ఇది నిజం.

• ఎందుకంటే ఒక మనిషి తీక్షణంగా ఒక విజయం కోసం ప్రయత్నం చేసే సమయంలో తనలో ఉన్న సర్వ శక్తులను అది సాధించు కోవడం లో రాత్రింబవళ్ళు వినియోగిస్తాడు.    ఈ స్థితిలో విజయం దక్కలేదు అంటే తన యెక్క శక్తి తో, తన జీవితంలో అంతకు మించి ఏదో గొప్ప విజయం వరించ బోతుంది అని అర్దం. ఆ సమయం తనకు ఇంకా ఆసన్నం కాలేదు అని అర్థం. తన శక్తి భవిష్యత్తులో మరింత రెట్టింపు అవబోతుంది అని అర్దం.

• ఉదాహరణకు ఒక విద్యార్థి ఎన్ని సార్లు అయినా ఉత్తీర్ణుడు కాలేక పోతున్నాడు అంటే, భవిష్యత్తు లో పెద్ద వ్యాపార వేత్త అయి పదిమంది కి ఉపాధి కల్పిస్తాడు. ఒక వ్యక్తి తాను అనుకున్న ఉద్యోగం సాధించ లేకపోతున్నాడు అంటే అంతకు మించి మరో స్థాయి ఉన్న ఉద్యోగం దేవుడు తన కోసం సిద్దం చేసి ఉంటాడని అర్దం. ఒక మనిషి తన ప్రేమ లో విఫలం అయ్యాడు అంటే ఆ ప్రేమ వలన పొందే, ఏదో ఆపద తప్పింది అని అర్దం. ఒక నటుడు అవమానాలు, ఎదుర్కొంటున్నాడు అంటే గొప్ప నటుడు గా మారబోతున్నాడు అని అర్దం.


• ప్రతి మనిషి కి తన జీవితంలో భాధ కలిగించే అంశానికి ప్రక్కనే ఒక ఉపశమనం దాగి ఉంటుంది. కానీ మనిషి ఈ ఉపశమనం గ్రహించలేక దుఖిస్తాడు. చీకటి అనుభవించే వాడు ఎన్నటికి చీకటి లో ఉండిపోకూడదు.   ఆ చీకటి ని చీల్చే శక్తి పొందే ఆలోచన చేయాలి.   అప్పుడే వెలుగు లో ఉన్న నిజమైన ఆనందం ఆస్వాదిస్తాడు.


• ఈనాడు జీవితం లో విజయం సాధించాం అని చెప్పే వారిని ఒకసారి తట్టి చూడండి, వారు ఎన్ని ఫెయిల్యూర్స్ తరువాత ఒక గొప్ప విజయం సాధించ గలిగారో వారి మాటల్లో చెపుతారు. అపజయం ఎరగకుండా విజయం సాధిస్తే , ఆ విజయం లో పొందే ఆనందం , ఆత్మ సంతృప్తి అనేది మనసు కి అనుభవం కాదు. చెప్పాలంటే ఆ విజయం లోని సంతోషం పూర్తిగా ఆస్వాదించ లేరు. మనిషి కి విజయం అనేది ఎలా ఉండాలంటే, ఎడారిలో చెప్పులు లేకుండా, దాహం తో నడిచి నడిచిన తరువాత ఒకచోట చల్లని నీరు దొరికితే కడుపు నిండా తాగితే, ఎలా ఉంటుందో అలా ఉండాలి. నూటికి 98 శాతం విజయం సాధించిన వారి పరిస్థితి ఇదే.


• అపజయాలు అనేవి మనిషిని మరింత పటిష్టంగా చేయడానికి , కష్టం విలువ తెలియ చేయడానికి మాత్రమే వస్తాయి. ఎందుకంటే అపజయం, కష్టం తెలిసిన వాడే సాటి మనిషిని, అర్దం చేసుకొని సహాయం చేయగలడు.


• జీవితంలో గాని, మరే ఇతర అంశాలలో గాని ప్రయత్నం చేసి ఓడిన వారు ఎప్పుడూ దురదృష్టవంతులు కారు. వీరు తమ జీవితం లో ఏదొక దశలో తప్పని సరిగా విజయం సాధిస్తారు. ఇటువంటి వారే తమ అనుభవాల ద్వారా ఎంతో మందిని తీర్చి దిద్దితారు. మరెందరికో ఆదర్శం అవుతారు. దీనిని మించిన విజయం ఏముంటుంది. మంచి ఆటగాడిని తయారు చేసే గురువు బహుశా ఏనాడూ బహుమతులు నోచుకోక పోవచ్చు. కానీ గెలిచిన ఆటగాడు మరియు కోచ్ ఇద్దరూ విజయం సాధించినట్లే. నిజమైన ఆధ్యాత్మిక గురువు సన్యాసి వలే ఏకాంతం గా జీవిస్తాడు. కానీ తన జ్ఞానం తో ఎంతో మంది లో పరివర్తన కలిగిస్తాడు, సన్మార్గం లో పెడతాడు. ఇది కాదా విజయం.


• విజయం అనేది, ఎప్పుడూ నీ ఒక్కడి లో కాదు ఉండాల్సింది …. పదిమంది లో నీ విజయం ప్రతిబింబం గా ఉంటేనే అది చిరస్థాయిగా చరిత్ర లో నిలిచిపోతుంది.


• అపజయాలు, అవమానాలు, నిందలు అనేవి మనిషి వ్యక్తిత్వాన్ని మరింత అందంగా, ధృడంగా, గొప్ప గా తీర్చి దిద్దే అంశాలు. ఇవి నీ చుట్టూ ఉన్న వారికి కాకుండా నీకు మాత్రమే కలుగుతున్నాయి అంటే వారందరి కంటే ఉన్నతమైన స్థితి కి , గొప్ప విజయానికి అతి చేరువలో నువ్వు ఉన్నావని అర్దం. కానీ కావాల్సింది ఒక్కటే. ఓర్పు, సహనం, మనోధైర్యం.


• ఈ రచన  మోటివేషన్ కోసం  కాదు. ఇవి  నిజాలు. ఈ నిజాలను తెలుసు కోవడం వలన ఎంతోమంది, ఎన్నో విషయాలు తెలుసుకో గలుగుతారు, తమ మనోధైర్యం తో ముందుకు సాగుతారు అనే సదుద్దేశంతో మాత్రమే.


చీకట్లో నే  నక్షత్రాలు కనపడతాయి. 

వైఫల్యాల్లో, అపజయాల్లో , కష్టాల్లో నే  సత్యం తెలుస్తుంది.



యడ్ల శ్రీనివాసరావు, 4 May 2024, 9:00 PM.


Friday, May 3, 2024

493. స్థితి - గతి


స్థితి - గతి



• అలలై    పొంగెను   అంతరంగం

  కలలై     సాగెను    జీవన రాగం.


• ఆశల     హరివిల్లు    ఆకాశం లో

  ఊహల  పొదరిల్లు   కీకారణ్యం లో


• ఏకాంతం   ఓ   కౌశల్యం.

  అది   మనోభిరాముని  చేరు  మార్గం.

• మౌనం    తో     సహవాసం.

  అది పరమాత్ముని  చేరు  సత్సంగం.


• తనువు ని    మరచి న     

  పొందేది     ఆత్మానందం.


• అలలై    పొంగెను    అంతరంగం

  కలలై       సాగెను    జీవన రాగం.



• వలలై       అల్లును     బంధాలు

  మోహలై    జల్లును    అనురాగాలు.


• దుఃఖాల   చీకట్లు    ఈ ప్రపంచం లో

  మోసాల    ఇక్కట్లు   ఈ మాయ లోకం లో


• సమూహల  కలయిక   ఓ   కాలక్షేపం.

  అది  ఎన్నో  సమస్యలకు   శ్రీకారం.

• మాటల   తో    అభినయం.

  అది  నటన లో    ప్రావీణ్యం .


• ఆధీనం   లేని   మనసు

  చివరకు   పొందేది   ధీనం .


• వలలై     అల్లును    బంధాలు

  మోహలై  జల్లును    అనురాగాలు.



కౌశల్యం = నైపుణ్యం


యడ్ల శ్రీనివాసరావు 3 May 2024, 9:00pm.


Thursday, May 2, 2024

492. ప్రణయ గీతం

 

ప్రణయ గీతం 



* Male

* Female 


• ఏదో   ఏదో    ఉన్నది

  అది  నాలో  నీలో  ఉన్నది.

• అది   ఏమిటో

  నాకు  తెలియకున్నది 

  మరి   నీ కైనా   తెలుసా …


• అదే   అదే   అంటున్నది

  నాలో  నేనే  కంటున్నది

  అది  ఏమిటో   అర్దం   కాకున్నది  …


• కలవరమెరుగని   ఇది

  కదలక   నిలిచి   ఉంది.

• ఊసులు  చెప్పని   ఇది

  ఊహలు   విడువక   ఉంది.


• అనుభవమెరగని   ఇది

  అనుభూతి  యై    ఉంది.

• కనులతో  చూడని   ఇది

  కౌగిలిలో    కలిసి    ఉంది.


• ఏదో   ఏదో    ఉన్నది

  అది  నాలో   నీలో  ఉన్నది.

• అది   ఏమిటో

  నాకు   తెలియకున్నది 

  మరి   నీ కైనా   తెలుసా …


• అదే   అదే   అంటున్నది

  నాలో  నేనే   కంటున్నది

  అది  ఏమిటో  అర్దం  కాకున్నది …


• ఈ సాయం    చెపుతున్నది

  అది

  ఒకటిగ  

  ఉండేది 

  రెండుగ  అయిందని.

• ఈ సమయం   అడుగుతున్నది

  ఆ

  రెండు  

  మరల 

  ఒకటిగ   ఎప్పుడని.


• ఈ  కాలం   చూస్తున్నది

  ఇదే దో    కొత్త గా.

• ఈ పయనం   పోతున్నది

  ఏదే దో    వింత గా.


ఏదో   ఏదో    ఉన్నది

  అది  నాలో   నీలో  ఉన్నది

  మరి   నీ కైనా  తెలుసా …


• అదే  అదే   అంటున్నది

  నాలో  నేనే   కంటున్నది

  అది  ఏమిటో  అర్దం   కాకున్నది …


యడ్ల శ్రీనివాసరావు  30 Apr 2024  1:00 pm .


613. పద - నది

  పద - నది • పదమే     ఈ   పదమే   నదమై   ఓ     నదమై    చేరెను    చెలి    సదనము. • ఈ  అలల  కావ్యాలు   తరంగాలు    తాకుతునే    ఉన్నాయి      ఎన్న...