Sunday, October 9, 2022

252. ప్రేమ పాశం

 

ప్రేమ పాశం



• ప్రేమ సృష్టి లో అధ్బుతమైన పదం. మనిషిని బట్టి , వయసుని బట్టి , అనుభవాన్ని బట్టి ప్రేమ పై అభిప్రాయం మారుతూ ఉంటుంది.

• ఒక తల్లి తన పిల్లల పై చూపించే వాత్సల్యం, ఒక తండ్రి తన పిల్లల పై చూపించే రక్షణ, ఒక భక్తుడు భగవంతుని పై చూపించే ఆరాధన , యుక్త వయసులో యువతీ యువకుల తొలి ఆకర్షణ , భార్య భర్తలు అలకలలో చిలిపి తనం, దాంపత్య జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొని పండిపోయిన అనుభవాలు తో వృద్ద దంపతుల మధ్య అనురాగం, ఇలా ఎన్నో రకాలుగా ఒకే పేరు తో ఉన్న ప్రేమ వివిధ దశల్లో వివిధ రకాలుగా మనుషులకు అనుభవం అవుతుంది.

• అసలు ప్రేమ అంటే అర్దం ఏంటి ? ప్రేమ ఎందుకు పుడుతుంది ? మరి ఈ ప్రేమ యెక్క ఫలితం సంతోషమా లేక బాధ ? ఇలా అర్ధం కాని ప్రశ్నలు ఎన్నో ప్రతీ ఒక్కరికీ ఉంటుంటాయి.

•  నేడు ఈ  ప్రేమ అర్దం, తీరు ఒక్కొక్కరి ఒక్కోలా కనపడుతుంది.

• ప్రేమ అంటే ఒక స్త్రీ పురుషుల ఆకర్షణ అని , మనిషి తన శారీరక అవసరాల కోసమే కావాలనుకునే స్థితి అన్నట్లు నేడు సినిమాలు, మీడియా ప్రభావం వలన చాలా మంది కి అనిపిస్తుంది. కనిపిస్తుంది.

  కానీ,

• ప్రేమ అనేది ఒక మానసిక స్థితి, మనసు కి సంబంధించినది అనేది ఎంత మంది కి అర్ధం అవుతుందో తెలియదు.

• ఒక పరిణితి, అవగాహన లేని వారు ప్రేమ ను శారీరక అంశం గానే భావిస్తారు. ఇది ఒక చపలత్వ బుద్ధి కి నిదర్శనం. అందచందాలు , హావభావాలు , బాహ్య సొగసులు చూసుకొని శారీరక వాంఛల కోసం కలిగేది ప్రేమ కాదు. అది ఆకర్షణ, మోహం, కామం.


• ప్రేమ ఎప్పుడూ కూడా ఒక మానసిక అంశం. మనసు ల మధ్య చిగురించే మానసిక బంధం. రెండు మనసుల ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరుచులు, కష్టనష్టాలు, సుఖదుఃఖాలు, నమ్మకం, విశ్వాసం, నిజాయితీ   ఇలా  పరస్పరం  ఎన్నో గుణగణాలను ఎంతో అర్దం చేసుకొని ఇద్దరు ఒకటిగా అయినపుడు మాత్రమే ప్రేమ పుడుతుంది. ఆ తదుపరి దశలో సృష్టి రీత్యా శారీరక బంధం అనేది ఏర్పడితే ఏర్పడుతుంది లేకపోతే లేదు.

• ఈ విషయం కూలంకషంగా అర్దం చేసుకోలేక పరిపక్వత లేని ఆలోచనలతో, తొందరపాటు చర్య లతో ప్రేమించుకుంటున్నాం అనే భావన చాలా మంది కలిగి ఉంటారు. అంతే వేగంగా విడిపోయి ఒకరినొకరు దూషించుకుంటూ మోసపోయామని బాధపడతారు.

• ప్రేమ అనేది ఇద్దరి మధ్య , రెండు వైపుల ఉంటేనే పరిపూర్ణం అవుతుంది.  ఒకరికి ప్రేమ ఉండి , మరొకరికి లేదంటే, లేేేదా   ప్రేమించిన వారితో కలిసి జీవించలేదు అంటే అది  తప్పనిసరిగా  కర్మ బంధము  మరియు  బుణానుబంధం గా భావించాలి.

• స్వచ్చమైన ప్రేమ ఎప్పుడూ కోరుకునేది, పంచేది ఒకటే సంతోషం. ప్రేమ సఫలం అయినపుడు రెండు జీవుల మధ్య ఆనందకరమైన శక్తి ఉత్పన్నమవుతుంది. ఇది మనిషి మెదడులో జరిగే ఒక రసాయనిక చర్య. ఈ రసాయనిక చర్య ద్వారా హార్మోన్ ఉత్పత్తి జరిగి మనసు స్పందించడం జరుగుతుంది. అందుకే ప్రేమ ద్వారా ఆనందం పొందుతూ ఉంటారు.

• ప్రేమ అంటే ఒక్కమాట లో చెప్పాలంటే ఇవ్వడం. మనిషి తన నుంచి ప్రేమించిన వారికి ఇస్తూ ఉంటాడు. అది ఆనందం, సంతోషం, ఇంకా ఏదైనా కావచ్చు. ఇవ్వడం అనేది ఇరువురి లోను ఉండవలసిన అంశం. అప్పుడే మనుషుల మధ్య ప్రేమ ఆరోగ్యకరం గా ఉంటుంది.

• కాని దురదృష్టవశాత్తు కొందరు మనుషుల లోని స్వార్థ బుద్ది , అహం తో మనసు లో చిగురించిన సున్నితమైన ప్రేమ తో అంతర్గతంగా లెక్కలు వేయడం మొదలు పెడతారు. అప్పుడే ప్రేమికుల మధ్య సమస్యలు మొదలవుతాయి.

• నిజమైన ప్రేమ కి తనకి కావలసిన ఆనందం దక్కినా దక్కక పోయినా ఎదుటి వ్యక్తి కి మంచి కోరుకుంటూ,  సంతోషం ఇస్తుంది. అది ప్రేమ యెక్క గొప్ప తనం.

• ప్రేమ ఎప్పుడూ సమస్యలు సృష్టించదు,  సమస్యలు కోరుకోదు. ఈ ప్రేమ ను అర్దం చేసుకోవాలంటే మనిషి కి పరిణితి కావాలి.  సాధారణంగా ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుని సొంతం అయితేనే ప్రేమ ఫలించింది అని లేకపోతే ప్రేమ విఫలం అని అనుకుంటారు.  కానీ అది తప్పు,  ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత మనిషి పై అభిప్రాయం మారిపోయి , చీటికి మాటికి ఎన్నో కలహాలు సృష్టించుకున్న వారి  ప్రేమ సఫలం అయింది అని ఎలా అనుకోగలం. ఇలా ఉన్నవారిని ఎంత మంది ని చూడడం లేదు.

• ప్రేమించుకునే వారు ప్రేమ తో తమ జీవిత మాధుర్యం అనుభవించాలి అనుకుంటారు. తొలినాళ్ళలో ఒకరి కోసం మరొకరు పుట్టినట్లు గా అనుకుంటారు. కానీ కాలం గడిచే కొద్దీ అభిప్రాయ భేదాలు రావడం విడిపోవడం కొందరిలో చూస్తుంటాం. ఒకరికి నచ్చినట్లు మరొకరు లేరని , లేదా తమ స్వతంత్రం కోల్పోయినట్లు ఫీల్ అవుతారు. ఇక్కడి నుంచే లోపల ఉన్న అహం బయటకు వచ్చి విడిపోవడం జరుగుతుంది.

• అందుకే పరిణితి లేని ప్రేమ బంధాలు నిలబడవు. ప్రేమ,  త్యాగం కోరుకున్నప్పడే జీవంతో ఉంటుంది. త్యాగం అంటే మనిషి ని వదులుకోమని కాదు. అహం వదులు కోమని అర్దం. అహంకారం వలనే ఎటువంటి వారి లో నైనా ప్రేమ విఫలం అయ్యేది. అదే విధంగా త్యాగ గుణం వలనే ప్రేమ సఫలం అయ్యేది. ఇది అర్దం చేసుకునే వారు అదృష్టవంతులు.


• సాధారణంగా మనుషుల జీవితాల లో ఏ వయసు లో, ఏ సమయంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి ఎవరికి తెలియదు ఒక్క భగవంతుడి కి తప్ప.

కొందరికి వివాహం చేసుకున్న సమయానికి కనీసం ప్రేమ అనే మానసిక అనుభూతి కూడా తెలియదు. కానీ జీవిత ప్రయాణంలో భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమికులు గా అవుతారు. మన తాతలు, తండ్రులు , ముందు తరాల వారందరూ ఈ కోవలో ఉన్నవారే. మరి ఆ కుటుంబ వ్యవస్థ లు  ఎంత విజయవంతంగా ఉండేవో  మనకి బాగా తెలుసు.


• కొందరు బాగా ప్రేమించుకుని పరిస్థితులను బట్టి పెళ్లి చేసుకోలేక దూరం అయి మరొకరితో జీవితం పంచుకునే వారుంటారు. ఇది  చాలా బాాధాకరం. ఇటువంటి వారిలో కొందరు,   ఏం చేస్తాం నుదుటి రాతలో రాసి పెట్టిలేదు అని సమాధాన పరుచుకొని కాలక్రమేణా , వారు గతంలో ప్రేమ నుంచి పొందిన అనుభవాన్ని త్యాగనిరతి తో జీవితం లోకి వచ్చిన వారికి ను పంచిపెడతారు. ఎందుకంటే నిజమైన ప్రేమకు తెలిసింది పంచడమే. నాకు దొరకక పోతే ఏమయింది, ఇవ్వడం తెలుసు కదా అనుకుంటారు. ఇది నిజంగా  చాలా మంచి ఆలోచన.

• కానీ చాలా మంది అనుకునేది, ఇదేం ప్రేమ ఒకరిని ప్రేమించి ఇంకొకరి కి ఎలా పంచుతారు , మోసం, వంచన కదా అని అనుకోవచ్చు.

ప్రేమించి పెళ్లి చేసుకోనంత మాత్రాన ఒంటరిగా ఉండాలనుకోవడం, అదేదో సర్వం కోల్పోయిన విధంగా జీవితం వృధా చేసుకోవడం అమాయకత్వం.  ఈ జీవితం నిరంతరం  మార్పు,  రూపాంతరం చెందుతూనే ఉంటుంది. మనిషి కి వయసు ఎలా ఆగకుండా ఎలా మారుతూ ఉంటుందో  అలాగే  జీవితం లో మార్పులు కూడా ఆగకుండా సంభవిస్తూనే ఉంటాయి. జీవితంలో జరిగే ప్రతీ దానిని అంగీకరించడం నేర్చు కోవాలి.  ఎందుకంటే  నీ లో  మార్పు తెచ్చుకోకపోతే,  నువ్వే వెనకబడతావు కానీ  కాలం గాని, నీ చుట్టూ ఉన్న వారు గాని నీ కోసం ఆగిపోరు.  ఎందుకంటే ఇక్కడ ఎవరి జీవిత ప్రయాణం వారిది.


• ప్రేమ కి స్వార్థం తెలియదు,  వాస్తవం తెలుస్తుంది. కామానికి స్వార్థం తెలుస్తుంది,  వాస్తవం తెలియదు. అదే ప్రేమ, కామం రెండింటి మధ్య ఉన్న తేడా. స్వార్థం, వాంఛ అనేవి మనిషి లో గుణాలు. వాటిని ప్రేమ కు ఆపాదించడం అవివేకం.


• ప్రేమించడం అనే మాట కి అసలు అర్దం  పంచడమే కానీ తిరిగి  పొందుతున్నామా లేదా అనేది కాదు. ఇటువంటి గొప్ప గుణం స్త్రీ ల లోనే కనిపిస్తుంది. ప్రేమ తత్వాన్ని పురుషుడు కంటే స్త్రీలలో ఎక్కువగా ఉండే విధంగా  ప్రకృతి లో సృష్టించబడింది. ఎందుకంటే  స్త్రీ కి  ప్రతి సృష్టి చేయగల అదృష్టం ఉంది. అందుకే స్త్రీ ప్రేమ లో  త్యాగ నిరతి ఉంటుంది. పురుషుడు ప్రేమ లో స్వభావ రీత్యా కొంత స్వార్థం ఉంటుంది. అవునన్నా కాదన్నా ఇది నిజం.


• మరికొందరి పరిస్థితి  ప్రేమించిన వారితో పెళ్లి జరగనప్పుడు  వేరొకరిని పెళ్ళి చేసుకుని , ఒక వైపు కాపురం చేస్తూ మొదటి వారిని మర్చిపోలేక దుఃఖం అనుభవిస్తూ ఉంటారు. ఇది ఏ జన్మ లోనో చేసిన చెడు కర్మకు ఫలితం. ఈ దుఃఖం తో కొందరు జీవితాంతం యాతన అనుభవిస్తూ ఉంటారు.  ఇలా ఉండడం వలన  కాలక్రమేణా మానసికంగా బలహీన పడి  ఆరోగ్యం కోల్పోవలసి వస్తుంది. 


• పరిస్థితుల రీత్యా ప్రేమికులు విడిపోతే జీవితం త్యజించమని ఎక్కడా ఎవరూ ఎప్పుడూ చెప్పలేదు.

• ప్రేమ లో ఎప్పుడూ దైవత్వం ఉంటుంది. ప్రేమ ఎప్పుడూ దుఃఖం కోరుకోదు. మోసపూరితమైన ప్రేమ ఒకరిలో కలిగి ఉన్నప్పుడే వారికి  దుఃఖం తిరిగి వస్తుంది.

• ప్రేమించడం నేరం కాదు. ప్రేమించండి కాని ప్రేమకు బానిసలుగా కాకండి. ఎందుకంటే బానిస కి ఎప్పుడూ మిగిలేది దుఃఖం. సంతోషం తో కూడిన ప్రేమ ను పంచండి. ప్రేమిస్తే ధైర్యం చెయ్యండి. కష్టం అయినా నష్టం అయినా కలిసి ఉండండి. ఎందుకంటే నిజమైన ప్రేమ కి  సర్దుకు పోయే గుణం సహజంగా ఉంటుంది.

ప్రేమించుకున్నాం , ప్రేమిస్తున్నాం  అనుకునే వారు ఎవరైనా సరే ముందు ప్రేమ అంటే ఏంటో అర్దం చేసుకోండి. అప్పుడు మనుషులు అర్దం అవడం మొదలవుతారు. 

పైశాచిక వికారాలను ప్రేమగా భావించకండి.

• జీవితం లో  మన చుట్టూ జరుగుతున్న ప్రతీ సంఘటనలకు మనమే కారణం అవుతాం. అది అర్దం చేసుకోలేక చుట్టూ బలహీనంగా కనిపించే వారిపై, లేదా కాలం పై నిందలు వేస్తుంటాము. ఈ ఒక్క విషయంలో సత్యం తెలుసుకుని అంగీకరిస్తే , మనిషి తన జీవితంలో ఏది కోల్పోయినా సరే దుఃఖపడడు. నిత్యం ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే మనిషికి తెలుసు తన కర్మకి తానే బాధ్యుడిని అని.

• ఈ విశ్లేషణ ఎందుకంటే ఎవరు దేని వలన , ఎవరి వలన దుఃఖం అనుభవించకండి. అలాగే దుఃఖం పంచకండి. దుఃఖం పంచితే పది రెట్లు తిరిగి అనుభవించ వలసి వస్తుంది. ఇది సత్యం.

• ఆనందంగా బ్రతకడం అంటే కోట్లాది రూపాయలు, బంగాళా లు, కార్లు, విలాసాలు, తోటి బంధువు ల తో లెక్కలేసు కొని నాకు బోలెడు ఆస్తి పాస్తులు ఉన్నాయి అని  గొప్ప గా ఫీల్ అవడం  ఇవి కాదు.  ఇవి తాత్కాలిక భ్రమతో కూడిన సుఖాలు మాత్రమే. ఇది ఒక అజ్ఞానం. 

మనసు లో నిత్యం వెలిగే ఆత్మజ్యోతి తో , అనాది గా పాతుకుపోయిన  మనిషి లోని వికారమైన గుణాలను దగ్దం చేసుకోవడం ద్వారా మనసు తేలికపడే స్థితి పొందడం సంపూర్ణ మైన ఆనందమయం. ఇది జ్ఞానం.

నీకు నువ్వు ఎవరో అర్దం అవుతున్నప్పుడే ఈ స్థితి కి బాట పడుతుంది.


మనిషి ఏం చేసినా నిజాయితీగా ఏదొక రోజు ఆత్మ ద్వారా పరమాత్మకు సమాధానం చెప్పి తీరవలసిందే. తప్పించుకోవడం అసాధ్యం.


ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 9 Oct 2022 5:00 AM.


No comments:

Post a Comment

491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...