Sunday, April 6, 2025

616. శరణుచ్ఛు వాడు

 

శరణుచ్ఛు వాడు


• శిల లో    లేడు    శివుడు . . .

  శిల లో     లేడు .

• శరణుచ్ఛు      శివుడు

  శిలలో      లేడు .


• నీ జననం లో     తండ్రి యై 

  జన్మాంతరాలు   విడువక   ఉన్నాడు.

• పాప గా    లాలిస్తూ

  కనుపాప గా     ప్రేమిస్తాడు .

• శయ్య న       నీడవుతాడు .

  నీ   మరణ శయ్య న    తోడుంటాడు .


• శిల లో    లేడు    శివుడు . . .

  శిల లో    లేడు.

• శరణుచ్ఛు     శివుడు

  శిలలో     లేడు .


• ఆలోచన లలో    శివుడు  ఉంటే

  అంబరం     ఎక్కుతారు .

• ఆదమరచి   ఉంటే    మాయకు

  ఆహారం    అవుతారు .


• నీ   ఈతి  బాధలన్నీ    చేసిన

  కర్మల   ఫలితాలు .

• అవి   శివుని    యోగాగ్ని   తోనే

  హారతి     అగును  .


• అడగనిదే    అమ్మ

  అన్నము   పెట్టునా .

• పిలవనిదే    శివుడు

  పిల్లలకు    పలుకునా .


• శిల లో     లేడు   శివుడు . . .

  శిల లో    లేడు.

• శరణుచ్ఛు      శివుడు

  శిల లో     లేడు.


• కనులకు    కానరాని    శివుడు

  మనసుకి    మధురానుభూతి  నిస్తాడు .

• స్పర్శ కి      తాకలేని      శివుడు

  దేహాన్ని    పరవశింప    చేస్తాడు .


• శివ   నామ    స్మరణం

  సుఖ   శాంతుల    సంగమం .

• శివ   గీతా    సారం

  పాప   పుణ్యాల  జ్ఞానం .


• శిల లో    లేడు   శివుడు . . .

  శిలలో      లేడు .

• శరణుచ్ఛు     శివుడు

  శిల లో     లేడు .



శరణుచ్ఛు = రక్షణ ఇచ్చు

శయ్య  =  నిదుర, పడక 


యడ్ల శ్రీనివాసరావు   2  Apr 2025 6:00 AM


Saturday, April 5, 2025

615. సుపదం

 

సుపదం



• ఈ పదం    . . .   ఈ పదం

  ఓ    సుపథం .

• సత్య   శోభ    వికసితం 

  జీవాత్మ ల     అమృతం .


• ఈ పదం    . . .    ఈ పదం

  ఓ    సుపథం .

• విశ్వ మాత    ఆభరణం

  సాధన తో       సౌలభ్యం .


• పదనిసల కు    పల్లవి   కాదు   కానీ

  గాయనం తో

  ఇది    పరమ  పదం   . . .   పరమ  పదం .

• గారడీలు   చేయని     గాండీవం

  గురి తో     చేరును    గమ్యం .


• ఈ పదం    . . .    ఈ పదం

  ఓ    సుపథం .

• గారెలంత      మధురం

  పలుకుట   కిది    పాయసం .

• నిప్పు   లాంటి    నిజాలకు 

  ఇది   ఒక   శపథం   . . .   శపథం .


• ఈ    పదం

  మనసు   గతి కి    సదనం

  మధన     స్థితి కి    ఔషధం .


• ఈ     పదం

  శాంతి   నింపు     వదనం

  విశ్వం లో   వ్యాపించిన   తరంగం .


• ఈ పదం    . . .    ఈ పదం

  ఓ.  సుపథం .



సుపదం = స్పష్టమైన పలుకు , మంచి పదం

సుపథం = దివ్య మార్గం.

గాండీవం = అర్జునుని విల్లు.

శపథం = ప్రతిజ్ఞ.

సదనం = గృహం.

వదనం = ముఖ వర్చస్సు.


యడ్ల శ్రీనివాసరావు 1 APR 2025 , 9:00 PM.



Friday, April 4, 2025

614. సంతోషం – ఆనందం – ఎక్కడ ఎలా మనిషి కి శాశ్వతం ?

 

సంతోషం – ఆనందం – ఎక్కడ ఎలా 

మనిషి కి శాశ్వతం ?




• ఈ   ప్రపంచంలో   మనిషి   జీవించడానికి,  తన జీవితంలో   ఏది ఉన్నా  లేకపోయినా   ఒకటి మాత్రం తప్పకుండా  కావాలి .   అదే ఆనందం సంతోషం.  ఇది మనసును  ఉల్లాసంగా  ఉత్సాహంగా  శక్తి వంతం గా ఉంచుతుంది.   ఈ ఆనందం  అనేది  పొందలేని వారికి దాని  లోటు  ఏమిటో   తెలుస్తుంది.

• కానీ   ఈ ఆనందం కోసం  మనిషి  ప్రతీ చోటా తన స్పృహ లో   ఉన్న ఆలోచనలతో   నిత్యం   అనేక మార్గాలు   వెతుకుతూనే   ఉంటాడు.   ఎందుకంటే మనిషి కి   ఏది ఎంత  ఉన్నా సరే,   ఈ సంతోషం ఆనందం   అనేది    స్థిమితంగా,   స్థిరంగా   ఎక్కడా దొరకని   పరిస్థితుల్లో,   నేటి కాలం   ప్రతి మనిషి కి గడుస్తుంది  అనేది   పరమ సత్యం.

• సంతోషం,  ఆనందం కోసం,  శాంతి కోసం  కొందరు దేవాలయాలకి  వెళ్తారు.   కొందరు  ధనం వెచ్చించి పార్క్ లు ,  బీచ్ లు,   సినిమా లు,  విహర యాత్రలు చేస్తారు.   కొందరు  నచ్ఛిన  మనుషుల తో  కాలక్షేపం చేస్తూ  ఆనందం పొందాం ,  పొందుతున్నాం  అనే భ్రమ లో ఉంటారు.   కొందరు   ఏదొక వికారం, వ్యసనం,   మత్తు లో   మునుగుతూ   ఆనందం గా ఉన్నట్లు  తాత్కాలిక   అనుభూతి   పొందుతూ ఉంటారు.

• దేవాలయం   నుండి  తిరిగి ఇంటికి  రాగానే ఆ ప్రశాంతత,   ఆనందం,  శాంతి  ఆవిరి అయిపోతుంది. ఎందుకంటే  దేవాలయం లో  ఉండే  వాయుమండలం ఇంటిలో   ఉండదు.   అలాగే  తీర్ద యాత్రలు ,  విహర యాత్రలు,  సినిమాలు   వలన  తాత్కాలిక  ఆనందం లభిస్తుంది. వాటి  నుంచి   తిరిగి   ఇంటికి  రాగానే   మరలా  అదే పాత  మానసిక స్థితి.   ఇక తోటి,  సాటి మనుషుల తో చేసే  పిచ్చాపాటి  వ్యర్ద  కబుర్లు ,  కాలక్షేపం తో పొందేది   ఆనందం, సంతోషం   అనడం   కంటే కూడా దుఃఖం  అనే విషయం   క్రమేపీ   కొన్ని రోజులు తరువాత  వారితో   ఏదొక వివాదం,  అభిప్రాయ భేదం  వచ్ఛిన  తరువాత  స్పష్టం గా  అర్దం అవుతుంది.   అసలు  ఎవరైనా  ఒక మనిషి   కల్మషం, అపవిత్రత ,  వికారాలు  కలిగి ఉన్నప్పుడు  మరొకరికి సత్యమైన  ఆనందం,  సంతోషం  ఎలా పంచగలడు …. ఆలోచించండి.

• పైన  చెప్పిన  వీటన్నింటి ద్వారా   మనిషి  పొందే ఆనందం  శాశ్వతం  అయితే  కనుక  ఏ మనిషి  కూడా   ఈ లోకం లో   దుఃఖం  అనే మాట  కనీసం ఎరుగడు.   కానీ   నేటి కాలంలో  ఎవరిని పలకరించినా,   ఎలా ఉన్నారు  అని  అడిగితే నటిస్తూ,   నవ్వుతూ  . . . బాగున్నాను  అని  మాట వరుసకు  అంటారు కానీ,   అది  మనసు  లోతుల్లో నుంచి  అణువంత   కూడా రాదు.   కొంత  సమయం వారితో  గడిపితే ,  వారి  మాటల్లోనే  వారి  దుఃఖం, అసహనం,  సమస్యలు   ఏమిటో  వ్యక్తం చేస్తారు.

• మనిషి కి  మనసు  లోతుల్లో   నుంచి  వచ్చే సహజమైన  ఆనందం  మరియు  సంతోషం  స్థిత ప్రజ్ణత తో   ఉంటుంది.  దానిని  ఆ మనిషి   తన మాట,   ముఖ కవళికలు ,   నవ్వు తో  వ్యక్తపరిచడం  కంటే   కూడా ,   మౌనంతో నే   సహజ సిద్ధమైన  ఉనికి  ( వైబ్రేషన్స్ )   ద్వారా   ఆ వ్యక్తిలో  నిండి ఉన్న ఆనందం,  సంతోషం  ఎదుటి వారిలో సహజంగా  అనుభవం అయిపోతూ ఉంటుంది.  దీనినే  ఆరా మరియు   హీలింగ్  ఎనర్జీ  అని కూడా అంటారు. ఇది ఒక అద్భుతం.


డబ్బు వెచ్చిస్తేనే  ఆనందం దొరుకుతుందా ? 

  మరి డబ్బు లేని వారి పరిస్థితి ఏమిటి ?.

• అసలు నేడు మనిషి కి దొరుకుతున్న ఆనందం అంతా శాశ్వతం అయితే కనుక . . . కొత్త పుంతలు తొక్కుతూ , కొత్త మార్గాలు వెతుకుతూ , ఆనందం కోసం   ప్రయత్నాలు,  ప్రణాళికలు (plans) వేయ వలసిన అవసరం , స్థితి  ఎందుకు?

• ఆనందం అనేది   వెతికితే   దొరికేది   కాదు , డబ్బు ఖర్చు చేస్తేనో   లేక  డబ్బు తో   కొంటేనో   లభించేది అంత  కన్నా కాదు.   అలాగే  మనుషుల  సహచర్యం, సాంగత్యం వలన  లభించేది కూడా కాదు.  మనిషి తన బాధలు,  సమస్యలు,  దుఃఖం నుండి తప్పించుకునేందుకు  తాత్కాలికంగా  ఉపశమనం పొందేందుకు   ఆనందం , సంతోషం అనే  ముసుగులో  ఈ రకరకాల  విన్యాసాలు,  పార్టీలు చేస్తూ  ఉంటాడు.   

ఆ కాస్త సమయం  అయిపొయాక  మరలా  కధ మొదటికే వస్తుంది. లక్ష రూపాయలు ఖర్చు చేసి ఎదో తీర్ద యాత్రలు , విహార యాత్రలు  చేసి తిరిగి వచ్చిన తరువాత   అక్కడ  పొందిన  ఆనందం ఆక్షణం వరకే మరియు   నాలుగు రోజుల కి  అనవసరంగా  లక్ష రూపాయలు  ఖర్చు చేసాను  అనే  ఆలోచనే మిగులు తుంది . ఇది మానవ నైజం .


• దీనంతటికీ  కారణం మనిషి కి,  ఆనందం, సంతోషం అంటే  ఏమిటో యధార్థంగా   తెలియక పోవడమే.


• ఆనందం అనేది   మనసు యొక్క భావోద్వేగం.  ఇది ధనం వలన ,  చుట్టూ ఉండే  పరిస్థితుల  వలన , వ్యక్తుల వలన   దొరికేది కాదు.  ఒకవేళ  దొరికింది  అని  ఎవరైనా అనుకుంటూ   ఉన్నా సరే   అది ముమ్మాటికీ  క్షణభంగురం ,  తాత్కాలికం.


• మనసు యొక్క స్థితి  స్థిమితంగా,    స్థిరంగా, శాంతంగా,  వాస్తవికత లో  ఉంచుకో గలిగితే ప్రతి మనిషి కి అనుక్షణం,  నిత్యం పరమానందమే . దీనికి నయా పైసా   ఖర్చు ఉండదు.   ఏ మనిషి తోను కాలక్షేపం  చేయనవసరం లేదు.  ఏ ప్రదేశాలు  తిరగ నవసరం  లేదు.   ఎవరి సాంగత్యం పై  ఆధారపడ వలసిన  అవసరం ఉండదు.


• మతి స్థిరం గా లేనప్పుడు,   మనసు  భ్రమిస్తూ ఉంటుంది.  ఆలోచనలలో  గందరగోళం ఏర్పడుతుంది.  దానితో   సమస్యల  వలయం  ఏర్పడుతుంది.  తద్వారా   ఆనందం  సంతోషం కరువు  అవుతుంది.  తదుపరి చెడు కర్మలు  చేయడం జరుగుతుంది.   మనిషి   జన్మ జన్మలు గా కొన్ని  కుసంస్కారాలకు  అలవాటు పడి పోయి,  అవే ఆలోచనలతో   కొట్టుమిట్టాడుతూ   ఉంటాడు.  కానీ వాటి నుంచి  పూర్తిగా బయటకు వచ్చి  ఆలోచన చేసిన నాడు,    తన పట్ల తనకే  నవ్వు వస్తుంది. ఎందుకంటే  తాను ఎంత  అమాయకంగా  ఇన్నాళ్లు ఉండిపోయాను అని.


• శాశ్వతమైన ఆనందం అంటే . . .

  నిత్యం మనిషి తనలో తాను రమించడం. (రమించడం అంటే అద్వితీయమైన స్థితి.)

  మౌనం గా ఉంటూనే ప్రకృతి ద్వారా తన ఆలోచనలలో ఉన్న శక్తి ని నలువైపులా విస్తరింప చేయడం.

  కేవలం  తన దృష్టితో  సమస్తాన్ని ఆనంద సాగరంలో ముంచడం.


• కల్మషం లేని జీవులతో , కలుషితం కాని ప్రకృతి తో అనుసంధానం అవడం వలన శక్తి తో కూడిన ఆనందం లభిస్తుంది.

  అనగా చిన్న పిల్లలు, మూగ జీవాలు. కోకిల రాగం , కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు , నదీ తీరాలు, పంట పొలాలు, వెన్నెల రాత్రులు, పూల వనాలు, పుష్పాలు, సాయం సంధ్య, సూర్యోదయం, నీటి అలలు, ఇసుకలో నడవడం, పక్షులతో సంభాషించడం, పచ్చని గడ్డిలో సేద తీరడం , ఆకాశం లో మేఘాలను తదేకంగా చూడడం , సంగీతం వినడం వంటివి మనిషి ఏకాంతం గా, ఒంటరిగా చేస్తూ ఉంటే మనసు కోల్పోయిన ఆనందం, సంతోషం , శక్తి  తిరిగి పొందుతూనే ఉంటుంది. ….. ఇలా చేయడం సాధ్యం కాకపోతే, కనీసం ఏకాంతం గా, ఒంటరిగా కూర్చొని కళ్లు మూసుకుని ప్రశాంతంగా వీటన్నింటినీ నిత్యం ఊహించుకున్నా చాలు, తెలియని సంతోషం, ఆనందం, శక్తి మనసు పొందుతూ ఉంటుంది.


• ఓ మనిషి  . . .  ఆనందం, సంతోషం  అనేవి ఎక్కడో ఎక్కడో   లేనే లేవు.  అవి నీ లోనే . . . నీ లో లో నే . . . నీ మనసు  లోతుల్లో నే  విస్తారంగా   అనాదిగా కప్పబడి పోయి ఉన్నాయి.   నిన్ను నువ్వు ఒకసారి బాగా తవ్వుకుని,   నీ లోని  వ్యర్ధాన్ని  ఏరి  పారేసిన నాడు,  నీ లో   నిక్షిప్తమై   ఉన్న   అనంతమైన శాశ్వతమైన   ఆనంద  నిధులు  బయటపడతాయి. అవి నీకు,  నీ చుట్టూ ఉన్న వారికి  మరియు ప్రకృతి కి,   విశ్వానికి  ఉపయోగం అవుతూ సహ యోగం చేస్తాయి.

• ఓ మనిషి . . . తాత్కాలిక సుఖాలు, విలాసాలు అనబడే  వాటి కోసం  ఇంకా ఎంతకాలం  అని ధనం, సమయం,  జీవితం ,  కాలం ,  జన్మలు  వృధా చేసుకుంటావు  . . .  నిన్ను  నువ్వు  మోసం చేసుకొని నువ్వు  సాధించేది  ఏమిటి .


• శాశ్వతమైన ఆనందం సంతోషం పొందడం కోసం అసలు  నీ వెవరో  నువ్వు తెలుసుకో.  నువ్వు గతంలో ఏం చేసినా ,  ప్రస్తుతం ఏం  చేస్తున్నా  సరే  నిన్ను నువ్వు  నిజాయితీగా అంగీకరించడం నేర్చుకో. ఇతరుల లోపాలు  ఎంత సూక్ష్మంగా చూడగలవో  అదే విధంగా  నీ లో  లోపాలను  స్పష్టం గా చూడడం నేర్చుకో.   ఎందుకంటే  నీ లోపాల పై  ఏదొక రోజు నీకే అసహ్యం వేసినప్పుడు,   వాటి మూలాలను   వేర్ల తో తీసి పడేసిన నాడు   నువ్వు వికసించే  కమలం లా తయారవుతావు.

  ఆ రోజు … ఆ రోజు … ఆనందం, సంతోషం రెండు కూడా వెతుక్కుంటూ వెతుక్కుంటూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి.


• దీని అంతటి కోసం …. నిత్యం కొంత సమయం , శివ పరమాత్మ (సృష్టి కర్త శివుడు) తో ఏకాంతంగా , నిజాయితీగా   అనుసంధానం  అవడం తప్పని సరిగా అవసరం.   చేసిన పాప కర్మలు ఆయనకు చెప్పడం చాలా అవసరం. తిరిగి ఆ పాప కర్మలు చేయకుండా ఉండడం అవసరం. పశ్చాతాప స్థితి పొందడం అత్యంత  అవసరం.   మనసు లో మలినాలు తొలగితే నే   శాశ్వతమైన  ఆనందానికి  అర్హత లభిస్తుంది.


  యడ్ల శ్రీనివాసరావు  30 Mar 2025. 12:30 AM.




616. శరణుచ్ఛు వాడు

  శరణుచ్ఛు వాడు • శిల లో    లేడు    శివుడు . . .   శిల లో     లేడు . • శరణుచ్ఛు      శివుడు   శిలలో      లేడు . • నీ జననం లో     తండ్రి ...