Thursday, April 24, 2025

630. లోపాలు . . . శిక్షలు

 

లోపాలు . . .  శిక్షలు



• మనుషులు అసలు ఏ లోపం లేకుండా ఎవరైనా ఉంటారా? … ఉండరు. ప్రతీ మనిషి లో ఏదొక లోపం ఉంటూనే ఉంటుంది. ఈ భూమి మీద ఏ మనిషి కూడా పెర్ఫెక్ట్ కాదు. ప్రతి మనిషి ఏదొక పొరపాటు, తప్పు తెలిసి తెలియక చేస్తూనే ఉంటాడు. అది తెలుసు కోకపోతే  కాల క్రమంలో మనసు కి మనిషి కి  అదే శిక్ష అవుతుంది.

 

 మరి, మనిషి తన లోపాలను తెలుసుకో గలడా? సరిదిద్దు కోగలడా ? అంటే, తప్పకుండా జీవిత కాలం లో, ఏదొక వయసు లో , సమయం లో,  సందర్భంలో తప్పక తెలుసుకుంటాడు.

  ఎలా అంటే, ఏ రోజు అయితే  తనకు కాలం సహకరించదో ,  అనుకున్నవి పదే పదే ప్రయత్నించినా జరగవో,  అదే విధంగా ఏదోక  నష్టం ,  లోటు సంభవించిన సందర్భాల లో , ఆలోచించడం మొదలు పెడతాడు. తాను ఎక్కడ పొరపాటు చేశాను, నా లో లోపం ఏమిటి, ఎందువలన నేను అనుకున్నవి జరగలేదు. ఇలా… ఇలా మనసు లో ప్రశ్నలు వస్తాయి, దీనిని అంతర్మధనం అంటారు. ఇది ప్రతి మనిషి కి అవసరం. దీని వలన ఎప్పుడూ వేగం గా కళ్లతో ముందుకు ఆలోచించే మనిషి, నెమ్మదిగా అంతరంగం లో హృదయం తో ఆలోచించడం మొదలెడతాడు.

  సరిగ్గా ఈ సందర్భం లోనే, తాను చేసిన పొరపాట్లు, తప్పులు , తన లోపాలు తనకూ స్పష్టం గా కనిపిస్తాయి. ఇది చాలా మంచిది . . .  ఎందుకంటే ఎవరైనా మన లోపాలను ఇతరులు చెపితే అంగీకరించం . సరికదా,  వారిలో లోపాలు చెపుతాం. ఎందుకంటే అహం . . .   మన లోపాలు కాలం, పరిస్థితుల ద్వారా మనకు తెలిసినప్పుడు వాటిని అంగీకరించడం , తరువాత వాటిని అధిగమించడం కోసం ప్రయత్నం చేస్తాం.


• మనిషి తాను చేసిన తప్పులు, పొరపాట్లు స్వయం గా తెలుసు కో గలగడం  ఒక ఎత్తు అయితే, వాటిని సరిచేసు కో  గలిగి  తిరిగి అవే పొరపాట్లు చేయకుండా ఉండగలగడం అనేదే ఛాలెంజ్.  

ఎప్పుడైతే మారాలి అని మనిషి అనుకుంటాడో , అప్పటి వరకూ ఒక ఒరవడి కి అలవాటు అయిపోయిన బుద్ధి సహకరించదు, పైగా మనసు తో యుద్ధం చేస్తుంది .

• ఈ యుద్ధం మనసు లో లోపల ఎలా ఉంటుంది అంటే, ….

1. హ . . .  ఈ లోకంలో మనుషులు అందరూ ఇంతే, ఎవరు తప్పులు చేయకుండా ఉన్నారు.

2. నేను నిజాయితీగా ఉండి ఎవరిని ఉద్ధరించాలి .

3. అయినా నా లోని లోపాలు ఎవరు చూసొచ్ఛారు.

4. నేను ఇలా ఉంటే ఎవరికైనా నష్టమా ?

5. నా జీవితం నాఇష్టం  నేను ఉన్నంత వరకు ఇలాగే హాయి గా ఉంటాను . 

  ఇలా అనేక ప్రశ్నల తో  బుద్ధి   మనసు తో కలిసి యుద్ధం చేస్తుంది . . .  పాపం ఇక్కడ బుద్ధి తప్పు కూడా ఏమీ ఉండదు,  ఎందుకంటే ఎన్నో జన్మలు గా బుద్ధి అలా ఆలోచిస్తూ  ఒక  సంస్కారం గా తయారు అయిపోయింది . అందుకే మార్పు ఒక్కసారిగా జరగాలంటే  బుద్ధి నుంచి  ఏ మాత్రం  సహకారం లభించదు.   దీనినే బలహీనత అని అంటారు. ఇంకా మాయ అని కూడా అంటారు.


• నిజానికి  మనిషి గురించి  చెప్పాలంటే చాలా అమాయకుడు.  ఎందుకంటే తన  మనసు లోపల    ఏ  ఆలోచనల  మెకానిజం ,  ఎలా నడుస్తుందో తెలియదు.  ఇందులో కాలం యొక్క పాత్ర చాలా ప్రాధాన్యం కలిగి ఉంటుంది  అని కూడా అసలు ఊహించలేడు .

  నిజానికి మనిషి లో లోపాలు, తప్పులు, పొరపాట్లు అనేవి సహజంగానే జరుగుతూ ఉంటాయి . కానీ వాటిని అదే పనిగా చేసుకుంటూ పోతే తనకు, తనతో ఉన్న వారికి కూడా ఏదొక దశలో చేటు కలుగుతుంది.


• పూర్వ కాలంలో గురువులు,  అనుభవజ్ఞులైన వారు తోటి సాటి వారిని  సరిదిద్ది  జ్ఞాన యుక్తం గా చేసే వారు.  అది లోక కళ్యాణం కోసం,  మంచి గృహస్థం కోసం,  మంచి సమాజం కోసం . . . కానీ నేటి కాలంలో ఆ పరిస్థితి లేదు.

• భూమి పై పుట్టిన ప్రతి మనిషి కి తాను జన్మించడం వెనుక ఒక అర్దం , ఒక బలమైన కారణం ఉంది అని కూడా చెప్పి , అర్దం చేయించే గురువులు నేడు లేరు. ఒకవేళ ఉన్నా విని అర్దం చేసుకునే నాధులు లేరు.


  శిక్షలు


• నేడు మనిషి  స్పృహ కి తెలుసో  తెలియదో గాని ఈ కాలంలో  చాలా శిక్షలు అనుభవిస్తూ నే  ఉన్నాడు. చూడండి . . .  ఒక మనిషి చనిపోతే స్వర్గస్తుడు  అయ్యాడు   అంటారు  లేదా స్వర్గానికి వెళ్ళాలని ప్రార్దన చేస్తారు.  అంటే చనిపోక  క్రితం వరకు ఆ మనిషి నరకం లోనే (ఈ భూమి) జీవించాడు  అని మనమే తెలియకుండా అంగీకరిస్తున్నాం . అంటే ఈ భూమి పై జీవనం నరకం. నరకం అంటే తప్పకుండా శిక్షలు ఉంటాయి కదా. 


• నేడు మనిషి కి శిక్షలు ఎలా ఉన్నాయి అంటే, బయటకు చెప్పుకోలేని అనేక శారీరక మానసిక రోగాలు ,  ఆసుపత్రుల హింస ,  ధనం ఉండి అనుభవించే సమయం లేకపోవడం ,  తినే ఆహారం విషతుల్యం ,   ఒంటరి గా  ఉండలేక పోవడం .  నిద్ర లేకుండా సంపాదన కోసం కష్టపడడం.  స్థాయి కి మించిన కోరికలు.  అన్నీ ఉన్నా అసంతృప్తి , వెలితి.    కష్టం చెప్పుకోవడానికి నమ్మకమైన వారు లేకపోవడం. ఆపదలో ఆదుకునే వారు లేక దుఃఖితులు గా కావడం.   పిల్లల్లో మానసిక ఒత్తిడి తో కూడిన చదువులు ‌. సంతానం ఉండి కూడా వృద్ధ తల్లి తండ్రులు అనాధలుగా  ఉండడం . . .  ఇలా ఇలా కంటికి కనిపించి , కనిపించని శిక్షలు ఎన్నో నేడు ప్రతి మనిషి అనుభవిస్తూ నే ఉన్నాడు.

• అందుకే . . . ఓ అమాయకమైన మనిషి మేలుకో, నిన్ను నువ్వు తెలుసుకో. నీ ధర్మం ఏమిటో ఆచరించు. నీవు పరిమళ పుష్ప సమానం అయితే విశ్వం నిను తన కౌగిట్లో లాలిస్తుంది.


  కొసమెరుపు


• ఈ రచన చదివిన వారికి , రాతలు రాసినంత సులువు కాదు, మనిషి మారడం అంటే అనిపించవచ్చు. కానీ మార్పు తోనే ఈ రాతలు ప్రాణం పోసుకున్నాయి అనే వాస్తవం తెలిస్తే విశ్వం తన కౌగిట్లో ఎలా , ఏమిచ్చి లాలిస్తుందో ప్రత్యక్షం గా అర్దం అవుతుంది. ఏ మనిషి నైనా సాధారణం నుంచి అసాధారణం చేయగలిగేది విశ్వ శక్తి మాత్రమే.


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 24 April 2025 8:00 PM


No comments:

Post a Comment

695 . కొడుకా ఓ కొడుకా !

  కొడుకా    ఓ     కొడుకా ! • కొడుకా  ఓ  కొడుకా  !   కొడుకా  ఓ  కొడుకా  ! • అమ్మవారి   కంటే    ముందు   నీ   అమ్మను   కొలువ  రా  . . .  • పండ...