Thursday, April 17, 2025

624 . గోదారి బంగారం

 

 గోదారి  బంగారం




• దినచర్యలో  భాగంగా నే  యధావిధిగా   సాయంత్రం 5 గంటలకు ,  సరస్వతి ఘాట్ లో   వాకింగ్ కి వచ్చాను.    గేటు దాటి  ఘాట్ లోనికి   అడుగు పెడుతూనే,   రోజూ కంటే  కూడా  ఈ రోజు మనసు లో    ఏదో   కొత్త గా  సంతోషం గా   అనిపిస్తుంది. కారణం మాత్రం తెలియదు .

• సమయం సాయంత్రం 5:05 నిమిషాలు అయింది. ఘాట్  అంతా ఖాళీ గా  ఉంది.   ఘాట్ ఫ్లాట్ ఫాం పై మౌనం గా  నడుస్తున్నాను.  కానీ   ఏదో  తెలియని సంతోషం  నన్ను  తాకుతూ ఉంది.   చిన్న  పిల్లలు ఆటలు    ఆడేటప్పుడు  మైమరచి  సంతోషం పొందుతూ  ఉంటారు.  నా మనసు లో  ఎందుకో అలా అనిపిస్తుంది.  కానీ  చుట్టూ  వాతావరణం అంతా  సాధారణంగా నే ఉంది . . .  ఏంటో నా పిచ్చి, అని నాలో  నేనే నవ్వుకుంటూ వాకింగ్  చేస్తున్నాను .


• అలా  ఘాట్ పై  నడుస్తూ,  నడుస్తూ   దృష్టి ని ఒకసారి   గోదావరి పై   మళ్లించి   చూస్తే,  ఒక్కసారిగా సంతోషం  రెట్టింపు అయింది.   సూర్యుడు అస్తమించడానికి   సిద్ధం అయ్యే ముందు,   తన వర్ణాన్ని   పసిడి  ఛాయలోకి   మార్చుకున్నాడు.  

ఆ బంగారు   కాంతిలో   గోదావరి   సహజమైన స్వర్ణాభరణం  వలే   మిలా మిలా మెరుస్తుంది. ఎప్పుడూ చూసే  గోదావరే   కానీ,  ఈ సమయంలో మాత్రం   రోజూ  ఉన్నట్లుగా   మాత్రం అనిపించడం లేదు.   కాసేపు  అలా   నిలబడి,  మిలమిలాడే గోదావరి ని    తదేకంగా చూస్తుంటే ,  అకస్మాత్తుగా గోదావరి పై    వీచే గాలుల   ఉధృతి పెరిగింది.   ఆ గాలుల   ఉధృతి కి   అలలు   వేగంగా   ఉరకలు మీద ఉరకలు  వేసుకుంటూ,    అప్పటి వరకు లేని  అతి పెద్ద శబ్దం చేస్తూ  ఒడ్డు ను  పడి పడి తాకుతున్నాయి.


• ఆ అలల ను   చూస్తూ,   వాటి శబ్దం వింటుంటే . . . అవి నన్ను తాకాలని,   ఆ శబ్దం  నాకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు   నా మనసు కి   పదే పదే అనిపిస్తుంది.

  అయినా  నా పిచ్చి గాని,   కవితా  హృదయం తో ఆలోచిస్తే   ప్రతీది ఇలాగే  అతిగా  ఉంటుంది, అని నాలో నేనే నవ్వుకున్నాను.   కానీ, నిత్యం లేని ప్రత్యేకత ,   ఈ రోజే   ఎందుకు ఇలా నాకు అనిపిస్తుంది  అనే ప్రశ్న కి సమాధానం  నాలో లేదు , నాకు ఎవరు చెపుతారో  కూడా తెలియదు . 

• తిరిగి  మరలా  వాకింగ్  ప్రారంభించాను. ఐదు నిమిషాల తరువాత   గాలి  వేగం  మరింత పెరిగింది. ఘాట్ లో  చెట్లు,  పూల మొక్కలు   శబ్దం చేస్తూ విపరీతంగా  ఊగుతున్నాయి.   ఆ గాలి  నన్ను తాకుతూ  ఉంటే,   కళ్లు చిన్నవి గా   చేసి చూడాల్సి వచ్చింది.   నా ఒంటి పై   డ్రెస్   రెపరెపలాడుతూ ఎగురుతుంది.

• ఈ వాతావరణం  అంతా   నేను  వచ్ఛిన  అరగంట లోపు   అందంగా   మారిపోయింది.  ఇది చాలా సంతోషం ఇస్తుంది   అనే దాని కంటే,  ఈ పసిడి ఛాయ గోదావరి,   రోజూ కానరాని  ఈ అలల ఉధృతి శబ్దం,  చెట్లు  నుంచి వీచే గాలి,   ఈ ప్రకృతి  నాకు ఏదో చెప్పాలని   ప్రయత్నిస్తుంది  అని  మనసులో బలంగా   అనిపిస్తుంది  . . .   కానీ  చెప్పాలనుకున్నది ఏమిటో  నాకు   ఆ నిమిషం లో  తెలియదు .


• మరో   అరగంట    వాకింగ్  చేసాను.   సుమారు 6 గంటల  సమయం  అయింది.   వాతావరణం ఇంకా అలానే  చల్లగా   గాలులతో ఉంది.  సూర్యుడు అస్తమించడానికి  సిద్ధం అయ్యాడు.   వాకింగ్ అయిన తరువాత,   ఘాట్ లో   సిమెంట్ బల్ల పై కూర్చుని , గోదావరి ని    చూస్తూ  ఏంటో ఈ రోజు ఇంత ప్రత్యేకం గా ఉంది అనుకున్నాను.


• ఇంతలో   ఎవరో ,   ఒక యువతీ యువకుడు సుమారు  26 సంవత్సరాలు ఉంటాయి,   వచ్చి నా పక్కనే  ఉన్న   సిమెంట్ బల్ల పై    కూర్చున్నారు. అప్రయత్నంగా నే   నేను   వారిని చూసాను.   వారు చాలా సాధారణంగా,  మధ్యతరగతి  కంటే  దిగువ స్థితి లో   ఉన్న  సహజ  వస్త్రధారణలో ఉన్నారు. వారిద్దరి  మధ్య  సంబంధం ఏమిటో తెలియదు కానీ మౌనం గా   కూర్చున్నారు.  చూడడానికి మరీ అందం గాను లేరు,   అలా అని  అంద విహీనంగాను  లేరు.


• నాలో  ఏదో తెలియని  వైబ్రేషన్ మొదలైంది. అక్కడి నుంచి లేచి,  వెళిపోదాం   అనుకున్నాను  కానీ, వాతావరణం   ఆహ్లాదకరంగా   ఉండడం తో లేవ లేకపోయాను.

• దాదాపు పావుగంట సమయం వరకు వారిద్దరూ మౌనం గా నే   ఉన్నారు.   ఆ తర్వాత,    అతను ఆమెకు    అస్తమిస్తున్న   సూర్యుడి ని  చూపిస్తూ, వేగం గా    తన   చేతులతో   సౌంజ్ఞ లు చేస్తూ,  చేతి వేళ్లను   లెక్కకడుతూ    ఆతృతతో    వివరిస్తున్నాడు.

 ఆ తర్వాత   గోదావరిని,   అలలు ను   చూపిస్తూ చాలా వేగంగా   తన చేతి సిగ్నల్స్ తో, అభినయం చేస్తూ వివరిస్తున్నాడు.   ఆమె పట్టరాని   సంతోషంతో, పెద్ద కళ్లు చేసుకొని    అతని సౌంజ్ఞ లను  అర్దం చేసుకుంటూ,  తిరిగి  ఆమె ఏదో  సౌంజ్ఞ లతో  అతనికి వివరిస్తుంది.

• వారిద్దరి  మధ్య సంబంధం  ఏమిటో తెలియదు కానీ,   వారిద్దరూ  మూగ వారు,   చెవిటి వారు అని కొంత  సమయం  తర్వాత  నాకు అర్థం అయింది. వారి పై  జాలి కలగడం లేదు.   వారు నాకు ఏదో తెలియ చేస్తున్నట్లు అనిపించింది.  వారి ఆత్మ విశ్వాసం   నాకు   సంతోషం కలిగించింది .


• ఆ ప్రదేశం లో  వారి  చుట్టూ  ఎవరు ఉన్నారు  అనేది  కూడా   కనీసం   గమనించ కుండా , మైమరచి అతను  ఆమెకు  ఆ గోదావరి   ప్రకృతి,  ఆ సమయంలో   వీచే గాలిని ,  శబ్దాన్ని   కళ్లకు కట్టినట్టు ఆమెకు  వివరిస్తున్నాడు.    ఆమె  నవ్వుతుంది, మధ్యలో  కొన్ని సార్లు  చప్పట్లతో   తన సంతోషం వ్యక్తం  చేస్తుంది.   అక్కడ  ఆ సమయం అంతా వారి హవ భావాలతోనూ,   మౌన భాష తోను   , అభినయాలతోను   నిండి పోయింది . . . సరిగా అదే సమయంలో,   ఎక్కడి  నుంచో   రెండు  కాకులు వచ్ఛి వారికి  రెండు   అడుగులు  సమీపంలో వాలి , వారినే చూస్తున్నాయి .


• ఒక పది నిమిషాలు  తర్వాత,  అతను తన భుజానికి   ఉన్న సంచిలో  నుంచి   ఒక  పొడుగు పుస్తకం    తీసాడు.

అప్పటివరకు   నేను    వారిని   కొంచెం బిడియం గా చూసి  చూడనట్టు గా   చూస్తున్నా సరే,   ఈ సారి ఆగలేక   పూర్తిగా వారి వైపు తిరిగి  వారినే చూడడం మొదలు   పెట్టాను.


• అతను   మెల్లగా   ఆ పుస్తకం తెరిచి,   ఒకో పేజీ ఆమెకు   చూపిస్తున్నాడు.  ఆమె  తన రెండు చేతులు తన బుగ్గల పై  పెట్టుకుని,  ఆసక్తి గా చూస్తోంది . 

 నాకు ఒక్కసారిగా ఒళ్లు జలదరించింది. 

 ఆ పేజీలలో ,   అతను   అప్పటి  వరకూ  ప్రత్యక్షం గా  ఆమెకు చూపించిన   గోదావరి,  సాయంకాలం సూర్యుడు,   అలలు,   గోదావరి బ్రిడ్జి ,   ఘాట్ ,   సిమెంట్ బల్ల పై వారు  కూర్చున్న విధానం  అంతా  కూడా   ఒక పేజీ తరువాత   మరొకటి   పెన్సిల్   ఆర్ట్   డ్రాయింగ్స్  రూపం లో    ఇది వరకే  వేసి    ఉన్నవి    ఆమెకి   చూపిస్తున్నాడు.   అవి తాను  వేసానని  ఆమెకు మూగ భాషలో చెపుతున్నాడు .

 ఆమె  మరింత ఆశ్చర్యం గా  అతని ని , ఆ స్కెచెస్ ని  ,  తేరిపార   చూస్తుంది.


 అదంతా   చూస్తున్న నాకు,  అసలు  అక్కడ ఏం జరుగుతుందో,  అసలు  అదంతా ఏంటో కూడా అర్దం కావడం లేదు.


• సమయం  6:30 గంటలు అయింది.  ఇంకా చీకటి పడలేదు.   వెలుగు స్పష్టం గానే ఉంది. ఘాట్ లోకి జనం వస్తూ వెళుతున్నారు.


• నాకు  ఆ యువకుడి తో  మాట్లాడాలని అనిపించింది,   కానీ అది  ఎలా  సాధ్యమో తెలియక మౌనం గా నే    చూస్తూ, గమనిస్తున్నాను.   అంత సమయం ఉన్నా  వారు  ఒకరిని  మరొకరు   కనీసం చేతులతో  కూడా తాకలేదు.   వారి మధ్య ఉన్న సంబంధం  ఎటువంటిదో   కూడా   నాకు అర్ధం కాలేదు.


• కానీ   ఒకటి  మాత్రం  అర్దం అయింది,  అతను తాను   గీసిన గోదావరి  ప్రకృతి  దృశ్యాలను, ఆమెకు డైరెక్ట్ గా  లైవ్ లో  చూపిస్తూ ,   వర్ణించడానికి అక్కడికి   ఆమె తో   వచ్చాడు  అని.  వారిద్దరూ మూగ,   చెవిటి వారు అని.


🌹🌹🌹🌹🌹


• ఒక ఐదు   నిమిషాలు తరువాత,   ఆమె తన హేండ్ బాగ్ లోనుంచి,   పింక్  కలర్  💗  హృదయం ఆకారంలో  ఉన్న  చిన్న  ప్లాస్టిక్ భరిణి  తీసింది. ఆమె ఆ భరణి లో   నుంచి   కుంకుమ తీసి,  అతని నుదుట బొట్టు   పెట్టింది.    

ఆ  హృదయ భరణి ని   ఆమె అతని   చేతిలో పెట్టి, తన చేతిని పైన  ఉంచింది.   మాటలు రాని  ఆమె తన   ప్రేమను చాలా   అద్బుతం గా  అతనికి వ్యక్తపరిచింది .  అప్పుడు  నాకు అర్ధం అయ్యింది. ఆ సమయం  ,   వారి ప్రేమను   వ్యక్తపరచు  కోవడానికి ప్రకృతి  వారికి  కల్పించిన   సందర్బం అని.   అందుకు నేను సాక్షి గా ఉన్నాను అని.

అదంతా  చూస్తున్న  నాకు  గుండె వేగం పెరిగింది. కానీ అదంతా అక్కడ చాలా సహజంగా జరిగింది.


• నేను రెండు గంటల క్రితం ఘాట్ లో కి వచ్చేటప్పుడు,   ఈ రోజు   ఏదో   ప్రత్యేకంగా అనిపిస్తుంది   అన్న మాట కి ,   కారణం అప్పుడు తెలిసింది .

• ఎందుకో తెలియకుండా నే ,   నా కళ్లలో తడి అనిపించింది .  సమయం  7 గంటలు కావస్తోంది.  లేచి , బంగారు  గోదారి నుంచి   వెను తిరుగుతూ . . . 

 ఈ రోజుల్లో   మాటలు వచ్చి ,    ప్రేమించు కునే వారు ఎందరో   తమ  అతి తెలివి తోనో   లేక అమాయకత్వం  తోనో    లేక    అహం తోనో    లేదా మనసు లతో    ఆటలాడే    విధానం   తోనో   ఒకరి పై మరొకరు   ప్రేమను   సవ్యంగా    వ్యక్తం   చేయలేని ఎందరో    మానసిక   వికలత  కలిగిన వారి  కంటే కూడా,   ఆ యువతీ యువకుడు  చాలా ఉన్నతంగా అనిపించారు .   బహుశా  ఇది వారికి   ప్రకృతి ఇచ్చిన ఆశీర్వాదం  అనుకుంటా. 

 ప్రేమ కి మనసే ఒక భాష అనిపించింది.


🌹🌹🌹🌹🌹


• కేతువు కి  మొండెం  మాత్రమే ఉంటుంది.  తల,  కళ్లు ఉండవు ,  మాటలు రావు.   అంటే  కేవలం హృదయం, స్పందనల తో  మాత్రమే కేతువు  విశ్వంలో   సమస్త   ప్రకృతి తో   అనుసంధానం అవుతుంది,   చీకటిని   స్పష్టం గా చూస్తుంది, బొమ్మలు గీస్తుంది ,  రాతలు రాస్తుంది. …..

• కళ్లు , మాటలు  రెండు  కూడా  నిలకడగా ఉండవు . అవి    మోసం చెయ్య గలవు .    హృదయం మాత్రం మోసం చెయ్యదు .   ఒకవేళ   హృదయం మోసం చేస్తే మరణం తో సమానం.   అదే కేతువు గొప్ప తనం. వారిలో   నాకు కేతువు  యొక్క శక్తి , మరియు ప్రేమ కనిపించింది. 


ఆ యువతి యువకుడి కి  ఈ రచన అంకితం.


యడ్ల శ్రీనివాసరావు 16 APR 2025 , 10:00 PM.








No comments:

Post a Comment

695 . కొడుకా ఓ కొడుకా !

  కొడుకా    ఓ     కొడుకా ! • కొడుకా  ఓ  కొడుకా  !   కొడుకా  ఓ  కొడుకా  ! • అమ్మవారి   కంటే    ముందు   నీ   అమ్మను   కొలువ  రా  . . .  • పండ...