Tuesday, October 14, 2025

699. మన నమ్మకాలు

 

మన నమ్మకాలు 


 మనం ఏది  విశ్వసిస్తామో  అదే సాధిస్తాం .

• జీవిత ప్రయాణంలోని నమ్మకాలన్నీ  ఎక్కడ నుండి వచ్చాయని మనం కొన్ని సార్లు ఆశ్చర్యపోతుంటాం ?  మనం సంతోషం, ప్రేమ, గౌరవం, కోపం లేదా ఒత్తిడి గురించి ఏది నమ్మినా అవి ఎక్కువగా మన సామాజిక స్థితి ఆధారంగా మనపై మనం తయారు చేసుకున్నవే .


• మనం ఎప్పుడైనా కాసేపు ఆగి, సరైనది అంగీకరించడానికి , సరికానిది వదిలేయడానికి  పరిశీలించామా ? 

ప్రతి పరిస్థితిని మన నమ్మకాలను బట్టి గ్రహిస్తుంటాము . మన ఆలోచనలు, భావాలు, వైఖరి, అలవాట్లు, వ్యక్తిత్వం మరియు  చివరకు మన భాగ్యం   మన  జీవనశైలి పై ఆధారపడి ఉంటుంది. దీని అర్థం, మన నమ్మకాల ఆధిపత్యం  ,  ప్రభావం మనం  ఇది వరకు తయారు చేసుకున్న ,  ప్రస్తుతం  చేసుకుంటున్న భాగ్యం పై  ఉంటుంది.

 మనం ఒక్క తప్పుడు నమ్మకాన్ని కూడా కలిగి ఉండకూడదు.

• సమాజం పరిమితం ( limited ) చేసే నమ్మకాలను వ్యాప్తి చేస్తుంది ఉదాహరణకు . . . కోపం అవసరం , విజయం సాధించడంలో ఆనందం ఉంది , ఒత్తిడి సహజం , వ్యక్తులు మరియు పరిస్థితులు నేను ఎలా భావించాలో  నిర్ణయిస్తాయి . . . మొదలైనవి.

• కోపం అవసరమని నమ్మి, కోపాన్ని పదే పదే ఉపయోగిస్తున్నాం . కాబట్టి మనం శాంతియుతంగా ఉండాలనుకున్నా  అది తాత్కాలికం అవుతుంది .

• కొత్త నమ్మకంతో ప్రయోగాలు చేయండి: కోపం హానికరం, ఏదైనా పనిని పూర్తి చేయించడానికి మార్గం ప్రేమయే . ఈ నమ్మకం ప్రేమ మరియు ఆనందాన్ని సహజం చేస్తుంది . తప్పుడు నమ్మకాల పొరలను సాధికారతతో  భర్తీ చేద్దాం.

• మనకు మనం గుర్తు చేసుకుందాం : నేను ప్రతి నమ్మకం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని, ప్రయోజనకరమైన వాటిని స్వీకరిస్తాను. నా నమ్మకాలన్నీ నన్ను సంతోషంగా, ఆరోగ్యంగా మరియు నా ప్రపంచంతో సామరస్యంగా ఉంచుతాయి.

• మనం చిన్నతనం నుండి ఎన్ని నమ్మకాలను స్వీకరిస్తూ జీవించామో  ఏనాడైనా కాస్త ఆగి పరిశీలించుకున్నామా ?

• మనం మన గురించి, ఇతరుల గురించి లేదా ప్రపంచం గురించిన నమ్మకాలను, వాటిని సొంతం చేసుకునే ముందు వాటి ప్రాముఖ్యతను తెలుసుకుంటున్నామా ?

లేదా

• మనం మన కుటుంబం , విద్య , సమాజం లేదా మన గత అనుభవాల ద్వారా మన మనస్సులో నింపిన నమ్మకాలను అంగీకరిస్తున్నామా ?

 మన నమ్మకాలే  మనకు పరమ సత్యాలు. నమ్మకాలను కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌ తో పోల్చవచ్చు. అవి మన జీవితాన్ని నడిపిస్తున్నాయి . మన ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తన లో , ఒక్క తప్పుడు నమ్మకం ఉన్నా అది చాలా హాని చేయగలదు. అందమైన జీవితాన్ని గడపకుండా మనల్ని అడ్డుకునే పరిమిత , తప్పుడు నమ్మకాలను మనం మనసులో పరిశీలించుకుని మార్చుకుందాం. కాసేపు కూర్చుని, మన స్వంత ఎదుగుదల, శ్రేయస్సు మరియు విజయానికి అడ్డంకులుగా ఉన్న నమ్మకాలను పరిశీలించుకుని తొలగించుకోవడానికి మన మనస్సును సిద్ధం చేసుకుందాం .

మనం ఒక నమ్మకం  పై దృష్టి   సారించినపుడు ఏ విధమైన. అలజడులు భయం లేని  విశ్వసనీయత సంతోషం మనసు లో  కలగాలి . 

మన జీవితాన్ని ఒక పరిశోధనాలయం (Reasearch Lab) గా  చూడగలిగినప్పడు , జీవితం లో  జరుగుతున్న  ప్రతి అంశం  ఒక  ప్రయోగం  గా  భావిస్తే  , లభించే ఫలితం ఒకొక్క కొత్తదనాన్ని  ఆవిష్కరిస్తుంది .



ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 13  Oct 2025  5:00 PM 


Friday, October 10, 2025

698. సత్సంబంధాలు _ నెగెటివ్ శక్తులు


సత్సంబంధాలు 


• సత్సంబంధాలు అంటే ఎప్పుడూ ఒకరితో ఒకరు కోపం, కలతలు చెందకుండా లేదా చిరాకు పడకుండా ఉండటం  కానే కాదు .

  సత్సంబంధం  అంటే కలత చెందిన దానిని మీరు త్వరగా  పరిష్కరించుకొని  తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం.


• ఒకరితో  వాదన , నమ్మక ద్రోహం  ,  ప్రవర్తన లో లోపం ,  సహించలేని మోసం జరిగిన తరువాత  మనం బాధపడి  నిరాశకు గురవుతాము .  ఎంతో  సమయం కోపం లేదా బాధతో ఉండటాన్ని మనం ఎంచుకుంటాము . మన బాధను  సమర్ధించుకొని , అది ఇతరులు చేసిన పొరపాటుగా భావించి వారు సరిదిద్దుకోవాలని ఆశిస్తాము .   కొన్నిసార్లు , వారితో ఇక  గతంలో వలే  ఉండలేమని కూడా భావిస్తాము. జరిగిన సంఘటన తో సంబంధం లేకుండా సాధారణ స్థితికి రావడానికి కేవలం 1 ఆలోచన మాత్రమే కావాలి .


కానీ మనస్సు ఇలా  ప్రశ్నించడం  మొదలు పెడుతుంది , దానికి సమాధానాలు ఇలా ఇవ్వండి.

1. అది వారి తప్పు అయినపుడు , నేను దీన్ని ఇప్పుడు  ఇలా ఎందుకు  పునరుద్ధరించు కోవాలి? 

ఎందుకంటే నా అహం కంటే నా సంబంధం ముఖ్యం కనుక . 

2.  ఇంత త్వరగా సమాధాన పరచడం ఎందుకు, కనీసం వారిని తమ తప్పును గ్రహించనివ్వాలి  కదా ? 

ఎందుకంటే గడిచిన ప్రతి క్షణం ఇరువురికి బాధను కలిగించి  మా సంబంధాన్ని బలహీనపరుస్తుంది.

3. నేను ముందు అడుగు వేస్తే ,  నేను బలహీనంగా  పరిగణించ బడతానేమో ?

క్షమించడం, మరచిపోవడం మరియు ముందుకు సాగడం అనేది  శక్తి , కనుక ఇరువురికీ నేను ఆ శక్తిని ఇస్తాను.

4. నేను తిరిగి సాధారణ స్థితికి వస్తే , వాళ్ళు కూడా అలాగే  తిరిగి  మారుతారా ?

వారు మారడానికి సమయాన్ని తీసుకోవచ్చు, కానీ నేను సాధారణ   స్థితికి వస్తే ,  మారే ప్రక్రియ ప్రారంభమైంది కనుక అతి త్వరలో వారు సాధారణ స్థితికి వస్తారు .

5.  నేను ఉపేక్షించబడతానా ? 

నేను చూపించే ప్రేమను, శ్రద్ధను ఇతరులు తక్కువ చేసి చూస్తే , అది నా అదృష్టం.  నేను వారిని ఎప్పుడూ ప్రేమిస్తున్నానని వారు నమ్మడానికి నేను వారికి ఒక కారణం ఇచ్చాను .

ఈ విధంగా  చాలా ప్రశ్నలు ఉండవచ్చు .

కానీ మన సంబంధమే మన ప్రాధాన్యత అని, తప్పొప్పులు కన్నా అందరి సంతోషం మనకు ముఖ్యం అని నిర్ణయించుకుంటే ప్రతి ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉంటుంది.

సత్సంబంధం  = సత్  +  సంబంధం 

సత్యం తో  నిజాయితీ ని  నింపుకొనే సంబంధం సత్సంబంధం 

అసత్యాలు ,  అప నమ్మకాలు ,  పొరపాట్లు    జరిగిన  విషయాలను  వాస్తవ స్థితి తో  అర్దం  చేసుకుంటూ  , సరిదిద్ది కుంటూ  అంగీకరించడం  జరుగుతూ ఉన్నప్పుడు  సత్సంబంధాలు సురక్షితంగా ఉంటాయి .

స్వయం యొక్క  అవసరాలు కంటే ,  ఇతరుల అవసరాలను  యధార్థ రీతిలో  గుర్తించి  కొనసాగించే  బంధం సత్సంబంధం.


Re - Lation . 

Re   = Again ,  Back  (తిరిగి , మరలా)

Lation  = The act of  bearing  ( భరించేది , మోయ గలిగేది ).

తిరిగి భరించేది , మరలా మోయ గలిగేది

Re - lation  .


💐  💐  💐  💐  💐  💐  💐  💐  💐


నెగెటివ్ శక్తులు


• నెగెటివ్ శక్తులు  గ్రహించకండి  :  

ఇతరుల  నెగిటివ్ శక్తిని   మనం వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు దానిని గ్రహించడం మరియు తిరిగి సృష్టించడం చాలా సులభం. 

ఇందుకు చక్కని ఉదాహరణ – టి.వి చూడటం , సినిమా లకు  ప్రభావితం అవ్వడం. వీటిలో ప్రదర్శించే   నటుల   నాటకీయ  ( డ్రామా )  జీవితాలలో ఇరుక్కుపోయి నటన లోని  భావోద్వేగ  స్థితులను చూస్తూ ఉన్నవారు  అవి నెమ్మదిగా  తమలోనికి   గ్రహిస్తుంటారు .  

ఆ తరువాత , వారు తమ దైనందిన  నిజ జీవితంలో అడుగు పెట్టినప్పుడు ,  నిర్ణయాలు తీసుకోవడంలో, ఇతరులను చూసే దృష్టి  కోణంలో  మునుపటి టి.వి ,  సినిమా  డ్రామా ల  ద్వారా చూసి  స్వీకరించిన  నెగిటివ్ శక్తి    పని చేయడం ఆరంభం అవుతుంది . 

ఇలా కేవలం సినిమా, టి.వి నాటకాల లోని ప్రభావం మాత్రమే కాకుండా ,  నిజ జీవితంలో  సహచరుల  సాన్నిహిత్యం లో  మెలిగే సమయం లో ఒకరి యొక్క నెగెటివ్ శక్తి తెలియకుండా నే గ్రహించడం కూడా అనేక సార్లు జరుగుతుంది.  


• నెగెటివ్ శక్తులు  చూపించకండి  : 

మనం  ఒకరి నుంచి స్వీకరించిన నెగెటివ్ శక్తి ని  తిరిగి వారికి  పంపితే ఏమవుతుంది ? 

వారు తిరిగి మనకు పంపుతారు  . 

అప్పుడు మనమేం చేస్తాము ? 

మళ్ళీ తిరిగి వారికి మనం పంపుతాము . 

ఇలా జరుగుతూనే ఉంటుంది . దీనినే సంబంధాల గడియారపు లోలకం ,  డింగ్ డాంగ్ అంటారు. 

ఇలా ఎంత కాలం జరుగుతుంది ? 

కుటుంబాలలో  జీవితాంతం కొనసాగుతుంది .  కార్పొరేట్ ఆఫీసు లలో  అయితే  కొన్ని సంవత్సరాలు జరుగుతుంది .  


• నెగెటివ్ శక్తులు  మార్చండి  : 

మనందరికీ శక్తిని  మార్చగల  సత్తా ఉంది. 

పిల్లవాడు తన కోపాన్ని తల్లిపై చూపిస్తే తల్లి తిరిగి కొడుకుపై కోపాన్ని చూపిస్తుందా ? 

లేదు, పిల్లవాడి అప్పటి మూడ్‌ను అర్థం చేసుకుని, ఆ నెగిటివ్ శక్తిని స్వీకరిస్తుంది , దానిని మారుస్తుంది, తిరిగి  సానుభూతి ,  ప్రేమ , ఆధారము వంటి సుగుణాలతో  అతనికి  ఇస్తుంది. 

ఇలా మనం  మన  పిల్లలతో   చేయగలిగినప్పుడు  ఇతరులతో ఎందుకు చేయలేము ? 

ఈ నెగిటివ్ చక్రాన్ని ఎవరో ఒకరు ఆపాలి కదా. లేకపోతే ఈ నెగిటివ్ శక్తి అలవాటుగా మారి దానినే ఇస్తూ ఉంటాము. 

బంధాలు ఏవైనాకానీ  , మనం ముందుగా మారి , ఇతరులకు పాజిటివ్ శక్తిని పంపుదాము .   అప్పటికి ఇతరులలో  నెగెటివ్ శక్తి అలానే ఉండి , ఆ శక్తి  వలన  కలుషిత  స్థితి  అధికం  అవుతున్న వేళ  ,  సంతోషంగా శాశ్వతం గా  వారికి బిందువు (పుల్ స్టాప్) పెడదాం .


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు  10 Oct 2025 , 3:00 PM 




Tuesday, October 7, 2025

697 . Life is not a Failure

 

Life is not a Failure 



• Life is not a failure to anyone. Life is a Lesson to everyone.


• జీవితం ఎప్పుడు ఎవరికీ కూడా అపజయం ఇవ్వదు. జీవితం అందరికీ పాఠాలు నేర్పిస్తుంది . అపజయం అనేది కేవలం ఒక భావన మాత్రమే. అనుకున్నది జరగలేదని, సాధించలేదని ఆలోచనలతో ప్రేరేపితమైన ఒక మానసిక భావన అపజయం. ఇది కేవలం అంతర్గత దృక్పథం. ఈ భావన లోనుంచి బయటకు వచ్చి చూసినపుడు ఎంతో విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది.

• జీవితం ఎప్పుడు ఎవరిని ఓడించదు, అపజయాన్ని కలిగించదు. జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఆ పాఠాలు అర్దం చేసుకోవడం లో అనుభవం కొరవడి విఫలం కావచ్చు, అంత మాత్రాన జీవితం లో ఓడిపోయాం అని అనుకోవడం, అవివేకం తో కూడిన అమాయకత్వం.

• జీవితం నేర్పే పాఠాలు నేర్చుకోవడానికి సహనం ఓర్పు అవసరం . ఈ ఓర్పు సహనం అలవడినపుడు అసలు అపజయం అనే పదానికి అర్థం ఉండదు. సరికదా ప్రతి అంశం పైన అర్దం చేసుకునే దృష్టి, అవగాహన పెంచుకునే ఏకాగ్రత పెరుగుతుంది. ఇది చివరకు నీ అంతర్గత స్వభావం అనే డిక్షనరీ లో అపజయం అనే పదాన్ని పూర్తిగా తుడిచి వేస్తుంది . అనగా ఆ పదం యొక్క అర్దం స్పృహ లో లేకుండా చేస్తుంది .


• బాహ్య ప్రపంచంలో మన చుట్టూ ఉన్న వ్యవహారాలు, ధోరణుల లో కొన్ని సార్లు అనుకున్న ది సాధించలేక పోవడం వలన అపజయం పొందినట్లు భావిస్తాం . ఇది ఒకరి మానసిక పరిస్థితి ని బట్టి వారిపై ప్రభావం చూపించడం జరుగుతుంది. దీనికి అపజయం అనే పదం అలంకరించే బదులు , ఈ సంఘటన నాకు ఏదో తెలియని విషయం తెలియచేస్తుంది అని పరిశీలిస్తే అద్భుతమైన రహస్యాలు తెలుసుకోవచ్చు . దీనినే కొందరు మహారధులు అంటుంటారు , జీవితం నిరంతరం పాఠం అని. తద్వారా కలిగేది అపారమైన అనుభవం .

• ఉదాహరణకు ఒక ఆటలో తర్ఫీదు పొందిన రెండు జట్లు A, B ఆటగాళ్ళు ఉంటారు. A జట్టు విజయం సాధించింది అని అంటారు. అలా అని B జుట్టు విఫలం అయింది అని కాదు . B జట్టు ఇంకా ఏదో నేర్చుకో వలసినది ఉంది అని అర్దం.

• ఇదే AB జట్లు మరో రోజు ఆడితే B జుట్టు గెలిచిందని అంటారు. అంటే A జుట్టు విఫలం అయింది అని కాదు.  ఇక్కడ గమనించవలసినది కాలం అనే ప్రయాణం లో కొన్ని సార్లు అనుకున్నది సాధించాం అదే విజయం అనుకుంటాం. కానీ కాలం అనుకూలించక సాధించలేకపోతే అదే అపజయం గా భావిస్తాం. జయపాజయాలు సహజం. ఈ రెండింటి మధ్య ఉత్పన్నమయ్యే భావోద్వేగాన్ని స్థిరీకరించడం , జీవితం నేర్పించే అతి పెద్ద పాఠం .


• జీవితం చాలా విలువైనది . అందులో విఫలం సఫలం , దుఃఖం సంతోషం, మంచి చెడు , పాపం పుణ్యం ఇలా ప్రతీ అంశం తో జరిగే కర్మల అనుభవాలు నిరంతరం నేర్చుకోవడానికి మనం పుట్టాం . ఇది జన్మ జన్మలు చేస్తూ ఉండవలసిన నిరంతర చర్య.


జీవితం ఎప్పుడు ఎవరిని ఓడించదు అపజయాన్ని కలిగించదు.  జీవితాన్ని అనుభవిస్తున్న మనమే మన ఆలోచనల లోని  సమర్థత శక్తివంతం గా లేకపోవడం  మరియు  విధి విధాన లోపం  వలన అపజయం పొందినట్లు  భావిస్తాం .  మనం నేర్చుకోవడానికే  ఇక్కడ  ఉన్నాం,  అంతే కానీ  కుంగుబాటు (Depression) కి గురి అవడానికి గాని,  ఇతరులపై  అభియోగాలు మోపడానికి గాని , వ్యవస్థలను  వేలెత్తి చూపడానికి గాని లేము .  జీవితం ఒక ఆట. ఆటలో అన్నీ ఉంటాయి .  అవి సహజమైనవి గా  భావించి సానుకూల దృక్పథంతో ఉండాలి .


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 7 Oct 2025 , 11:00 PM.


Saturday, October 4, 2025

696. శివ శాంతి

 

శివ  శాంతి 


• శాంతి   స్వరూప    శశి వదన

  శాంతి    స్వరూప   శశి వదన .

• మా దేహం    నీ స్మృతి   సదనం

  మా ప్రాణం    శాంతి    కాముకం .


• నీ వాసం    పరంధామం .

  సూర్యచంద్రులు   చేరని   తేజోమయం .

• నీ స్థానం    నిర్వాణ ధామం .

  పవనగీతికలు   లేని   మౌన   సాగరం .


• క్షణము లో    చేరే     యోగము తో

  నీ   సన్నిధానం .

• తక్షణము   పొందే   ధ్యానము లో

  నీ   శక్తి  ధారణం  .


• శాంతి   స్వరూప     శశి వదన

  శాంతి   స్వరూప     శశి వదన

• మా దేహం    నీ స్మృతి  సదనం

  మా ప్రాణం     శాంతి   కాముకం .


• శివమను     స్వరం

  మన   బంధానికి   పాశం .

• తెలియక    ఈ  సత్యం

  ఎన్నో   భవబంధాలకు   వశం .


• నీ   మౌనం   మనోహరం

  అదే   మేలుకొలుపు   దివ్యాస్త్రం .

• నీ      జ్ఞానం    మనోవికాసం

  అదే   జీవనయానపు   రాజరికం .


• నీ  సహవాసం   దివ్యానుభూతం.

  అది  జన్మ  జన్మల    పుణ్యఫలం .

• నీ   స్నేహం       మధురానుభూతం 

  అది  వర్ణ కు రాని   అతీంద్రియ సుఖం .

  

• శాంతి    స్వరూప     శశి వదన

  శాంతి    స్వరూప     శశి వదన

• మా  దేహం    నీ స్మృతి    సదనం

  మా  ప్రాణం     శాంతి     కాముకం .


ధన్యవాదములు శివ బాబా. 🙏

మీ  కోసం రాయాలి  అని  మనసు  తపన పడుతున్న ఈ సమయంలో ,  ఏమి రాయాలో  తెలియక  ఆలోచనల శూన్యం తో  ,  చేతులు కదలడం లేదు . కానీ , నా  మనసు  ఈ క్షణం  రాయాలి అని ఒత్తిడి చేస్తుంది . కానీ రాసే శక్తి లేదు .

ప్రేమ తో  నోరు తెరిచి  మిమ్మల్ని అడిగిన ,  కొద్ది క్షణాలలో నే   మీరు ఈ  ఆలోచనలను  ధారణ చేశారు , ఇలా రాయించారు.  నా ఆర్తి ని  తీర్చారు .  ఇది మీ  శక్తి కి  , మన బంధానికి  నిదర్శనం అనడానికి , ఇంతకు మించి ఈ నిమిత్తమాత్రునికి  ఏం కావాలి   శివ బాబా. 

ధన్యవాదములు శివ బాబా. 🙏


కాముకం = కోరుకోవటం 

పరంధామం =  ఇహ లోకం కానిది . పర లోకము.

నిర్వాణధామం = వాణి లేని లోకం. నిశ్శబ్ద లోకం

పవనగీతికలు  = గాలుల అలలు

వర్ణ =  వర్ణించు , వివరించు 


యడ్ల శ్రీనివాసరావు 5 Oct 2025 9:30 AM.


Wednesday, October 1, 2025

695 . కొడుకా ఓ కొడుకా !

 

కొడుకా    ఓ     కొడుకా !



• కొడుకా  ఓ  కొడుకా  !

  కొడుకా  ఓ  కొడుకా  !


• అమ్మవారి   కంటే    ముందు

  నీ   అమ్మను   కొలువ  రా  . . . 

• పండుగలు     పబ్బాలు

  ఇంటి  అమ్మతోనే    కద  రా . . . 


• ఆ    అమ్మవారి    రూపమే

  నీ    అమ్మ   అని   తెలుసుకో  . . . 

• ముసలిదైన   గాని   ముగ్గురమ్మల

  మూలపుటమ్మగా   కొలచుకో  రా   . . . 

  కొడుకా  ఓ   కొడుకా  !


• పిండి పెట్టి  ఒళ్ళు నలచి   

  వండి  పెట్టి   వడ్డిస్తే  . . . 

• ఇంటివాడి   వైతివి   

  ఓ జంట  తోడు  వైతివి  రా .

• ఆలి    నీ   అంతరమై నా   కానీ 

  అమ్మ  నీ   ఆరాధన రా  .

• గర్భం లో    పంచింది   అమ్మ  ఊపిరి 

  దర్పం తో    దీనం గా   చూడకు రా .


• నీ కంటిలోన   నీరు   

  తుడిచేది   అమ్మ రా  . . . 

• నీ   వొంటిలోన   సత్తువను  

  సేర్చేది    నీ   అమ్మే రా .

  కొడుకా   ఓ   కొడుకా  !


• నీ గుండెలో   లేని   అమ్మ

  గుడి లోన   ఉండదు రా . . .

• గుడి లోన   అమ్మ కూడా

  ఒక   అమ్మకు   బిడ్డే  రా .


• ఇంటిలోన   అమ్మను   బొమ్మగా చూస్తావు

  గుడిలోన   బొమ్మను   అమ్మగా  కొలుస్తావు . 

• ఆకలేసిన   అమ్మకు   పస్తులు   వడ్డిస్తావు  

  గుడిలోన   బొమ్మకు  నైవేద్యాలు నివేదిస్తావు .


• వెతికితే    నీకు   వెయ్యి   దేవుళ్ళు . .

  ఆ . . . 

  వెతికితే    నీకు    వెయ్యి   దేవుళ్ళు . .

  దొరుకుతారు   గానీ

• నీ   కన్నతల్లి    సాటిరాదు   

  వేరెవరూ   ఈ    లోకములో . . . 


• తెలుసు   కో   రా   కొడుకా . . . 

  తెలుసు   కో 

  లేకపోతే . . .

  అమ్మ  పాణం  వదిలాక   . . 

  ఆ . . . 

  అమ్మ   పాణం   వదిలాక . . 

  నువు   పెట్టే    పిండా  కూడు 

  కాకులు   కూడా   

  ముట్టవు రా  . . .  ముట్టవు రా .

  

• తెలుసు కో  రా   కొడుకా . . . 

  తెలుసు కో 

  ఇప్పుడు   కాకపోతే   ఇంకెప్పుడు  రా . . .

  కొడుకా   ఓ   కొడుకా   !

  కొడుకా   ఓ    కొడుకా !


ఓం శాంతి . . . ఓం నమఃశివాయ 🙏 


🌹 🌹 🌹

అమ్మలకు . . . 

అమ్మలను  కన్న   పెద్దమ్మ కు  

వందనములు  🙏

అందరికీ  విజయదశమి శుభాకాంక్షలు 🙏.

💐 💐 💐


తులసి రామకృష్ణ  , యడ్ల శ్రీనివాసరావు .

1 Oct  2025 .   10:00 PM 




Monday, September 29, 2025

694 . తలెత్తుకు జీవిద్ధాం

 

తలెత్తుకు జీవిద్ధాం 





• మనం ఈ భూమి మీద జీవించడానికి జన్మించాం. మన పాదాల కింద భూమి (నేల) ఉంది , తల పైన ఆకాశం ఉంది. మధ్యలో మనం ఉన్నాం . ఇది  అందరికీ  తెలిసిన విషయం .

• అయితే ఇక్కడ విశేషత ఏమంటే, ఉత్తములైన పెద్దలు, అనుభవజ్ఞులైన యోగ్యుల నుంచి ఒక మాట  వింటుంటాం, అది ఏంటంటే  " మనం జీవించినంత కాలం తలెత్తుకు బ్రతకాలి , తల దించుకుని కాదు "  అని.

దీని అర్థం , సమాజం లో అందరి చేత శెభాష్ అని  అనిపించుకునే లా  గౌరవం గా బ్రతకాలి  అని  అనుకుంటాం . తప్పులేదు . ఇది చాలా మంచి విషయం.

కానీ ఇందులో ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉందని  మనకు తెలియదు .


• మానవుని  మూలాల లోకి వెళితే,  ప్రతి మనిషి కి (ఆత్మ కి) తప్పకుండా భగవంతుని తో (పరమాత్మ తో) , తండ్రి పిల్లల సంబంధం ఉంది. కానీ మనం నేడు ఈ మాయా లోకం లో జీవిస్తూ ఉండడం వలన మన మూలమైన యధార్థ సంబంధాన్ని పూర్తిగా మర్చిపోయాం. భగవంతుడు అంటే వేరు, అని అనుకొని భక్తి తో  పూజిస్తాం .  కానీ భగవంతుని తో మనకు ఉన్న గత సంబంధం వలనే (తండ్రి, పిల్లలు) మనం కొలుస్తున్నాం  అనే విషయం పూర్తిగా మర్చిపోయాం .


• మరి భగవంతుడు (పరమాత్మ ,తండ్రి ) ఎక్కడ ఉన్నారు? అంటే . . . ఆకాశం , ఆ పై సూక్ష్మ లోకం దాటి ఉన్న పరంధామం లో. (కొందరు దీనినే పరలోకం అంటారు). ఇదంతా యధార్థ మైన సత్యం అని మన ఆత్మ కి  ముందే  పూర్తిగా తెలుసు .

అందుకు  నిదర్శనం , మనం ఏ కులము , ఏ మతము , ఏ వర్ణము , ఏ జాతి వారిమైన  సరే , భగవంతుని తలంచు కునేటపుడు , తలని పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఓ భగవంతుడా అని తలచుకుంటాం . ఇంకా . . .  భగవంతుడు పైన ఉన్నాడు అన్నీ చూస్తుంటాడు అనే మాట కూడా అంటుంటాం . ( అవునా ? . . .  కాదా ? ఒకసారి ఆలోచించండి. ) కానీ ఈ రెండు చర్యలు , మన శరీర స్పృహ ద్వారా జరగవు. మన ఆత్మ స్పృహ తో జరుగుతాయి. ఎందుకంటే ఆత్మ కి మాత్రమే మన మూలం తెలుసు.  కానీ , నేడు మన లోని ఆత్మ స్పృహ కి , శరీర స్పృహ కి మధ్య అనుసంధానం (కనెక్షన్) లేకపోవడం వలన శరీర స్పృహ కి తెలియకుండా నే , మన ఆత్మ చాలా చర్యలు చేస్తూ ఉంటుంది.   

ఇందుకు ఉదాహరణ  కొన్నిసార్లు  అసాధారణం అనుకున్న పనులు ,  శక్తి కి మించిన పనులు చాలా సులభంగా   చేసేసి   ఆశ్చర్యం తో అంటుంటాం  . . . 

" ఏమో నాకే తెలియకుండా అంతా అలా చేసేశాను ,  

నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు అసలు తెలియదు.  కానీ , అలా ఎలా చెప్పానో నాకు అర్దం కావడం లేదు.

నాకు ఆ సమయంలో శక్తి ఎలా వచ్చిందో తెలియదు . కానీ ఆ శక్తి, నిత్యం నాతో ఉండేది మాత్రం కాదు.

ఇది  ఇదివరకే  ఎప్పుడో  అచ్చం  ఇలాగే జరిగినట్లు అనిపిస్తుంది .

ఇదంతా నాకు తెలుసు,  నేను ఇదంతా ఎప్పడో చూశాను. నాకు ఈ ప్రదేశం కొత్త గా అనిపించడం లేదు . 

నేనే ఇదంతా చేశానా ? నమ్మలేకున్నాను " 

అని  మనలో మనం ఇలా రకరకాలుగా వివిధ సందర్భాలలో  అనుకోవడం జరుగుతుంది. ఇదే  ఆత్మ శక్తి .


☘️  ☘️ ☘️ ☘️ ☘️ ☘️

ఇక  మొదటి  విషయానికి  వస్తే . . . 

• భగవంతుడు , పరమాత్మ శివుడు నివసించే స్థానం  పరంధామం ,  ఇదే మన (ఆత్మల) స్వస్థానం .  ఇహ లోకంలో  మనం శరీరం విడిచిన (చనిపోయిన ) 13 రోజుల తరువాత ,  తండ్రియైన పరమాత్మ  శివుని వైపు మన ఆత్మ చూస్తుంది . శివుని వద్దకు మరియు  ఆత్మ  స్వస్థానం అయిన పరంధామం వెళ్ళడానికి  ఆత్మ  ప్రయత్నం చేస్తుంది .   

కానీ , అనేక జన్మలు గా  భూమి పై ఆత్మ చేసిన కర్మలు లెక్కలు  ఇంకా పెండింగ్ ఉండడం , బుణానుబంధాలు లెక్కలు  పెండింగ్  ఇంకా భూమి పై  మిగిలి ఉండడం వలన  , మరియు ఆత్మ  పూర్తిగా  సంపూర్ణ పవిత్రత శక్తి  సాధించ లేకపోవడం వలన  తిరిగి శరీరం తీసుకొని జన్మిస్తుంది.  ఆత్మ కి శరీరం ఉంటేనే  కర్మలు  లెక్కాచారం  పూర్తి చేసుకోవడానికి సాధ్యం అవుతుంది .  ఇదే  మనిషి  జనన మరణ చక్రం లోని  సూక్ష్మ రహస్యం .


• తలెత్తుకుని బ్రతకాలి అని ఎందుకు అంటారు . అంటే  ,  ఏనాడైతే  పైన  ఉన్న పరమాత్మ ను మరువకుండా  నిత్యం మనసు తో  చూస్తూ ధ్యానిస్తూ  స్మృతి  చేస్తూ  ఉంటావో,   నీలో అణగారిపోయిన  నీ మూల స్వభావాలు , సంస్కారాలు అయిన  . . . 

ప్రేమ - శాంతి , పవిత్రత ‌- జ్ఞానం , సుఖం - ఆనందం , శక్తి  అయిన ఏడు దివ్య గుణాలు  తిరిగి నీ  ఆత్మలో నిండు కుంటాయి .

ఈ గుణాలు నీ లో  నిండి ఉన్న నాడు ఈ భూమి పై దుఃఖం లేకుండా, పవిత్రం గా, ధర్మం గా, సంతోషంగా , గౌరవం గా జీవించిన నాడు శివుని వద్దకు  వెళ్తావని , తలెత్తుకు బ్రతకాలి అంటారు . ఇదే  ఇందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం .


• అంతేకానీ అందరూ ఊహించినట్లు  ధనం , ఉద్యోగం,  పేరు,  హోదా,  కీర్తి  సంపాదిస్తే తలెత్తుకుని జీవించడం అని అనుకోవడం చాలా  అమాయకత్వం.  ఎందుకంటే  ఇవన్నీ తాత్కాలికం .  ఇందుకు నిదర్శనంగా ఎన్నో  ఉదాహరణలు చెప్పుకోవచ్చు .  దేశానికి అధినేతలు గా చలామణి అవుతున్న వారికి సర్వ సౌఖ్యాలు, ధనం , కీర్తి , పేరు అన్నీ ఉన్నా  చాలా నీచాతి నీచంగా  ప్రవర్తిస్తూ బహిరంగంగా బ్రతుకు తున్నారు (అమెరికా , పాకిస్థాన్ అధ్యక్షులు  . . .  ఇంకా మరెందరో  నిత్యం  మన  కళ్ళ ముందు ఉన్న వారు కూడా . . . )

అందుకే  ధనం , అధికారం , కీర్తి  , పేరు సంపాదించిందిన   మనిషి    ,  ఎంతటి  స్థాయి వారైనా సరే  బుద్ధి  సరిగా లేకపోతే , పవిత్రత శక్తి లేకపోతే  సుఖం  శాంతి  లేక , నిత్యం ఒత్తిడి తో నిద్ర లేక , మానసిక హింస అనుభవిస్తూ , అందరిని  హింసిస్తూ , బయటకు చెప్పుకోలేక  నరక యాతన తో జీవించ  వలసి వస్తుంది . ప్రస్తుతం నేడు , ఈ లోకంలో ఇదే జరుగుతోంది . 


• ఇక రెండో విషయం . . .

తలదించుకునేలా జీవించ వద్దు అని ఎందుకు అంటారు ?  . . . తల దించుకుంటే కనిపించేది నేల, భూమి, భౌతిక ప్రపంచం . ఇందులో శరీర భారం, మాయ , దుఃఖం , విలాసాలు , కామ వికారాలతో  పాటు  ఈ నేల మీద ధర్మాన్ని అతిక్రమించేవి  ఎన్నో పుష్కలంగా ఉన్నాయి .  ఇవి మన పాదాల కింద  ఉన్న ఈ భూమి మీద మాయా రూపం లో  ఉంటాయి .  వీటన్నింటి  వలన సంతోషం ఆనందం లభిస్తున్నాయి అని అనుకుంటాం , కానీ  అవి నీటి బుడగలా  అల్పకాలికం మాత్రమే ఉంటాయి .  ఇవి మనిషి ని  ఆకర్షిస్తూ తలదించుకొనేలా చేసి  పతనం చేస్తాయని,  క్రమేపీ బలహీనుడి గా  అయి  , మనిషి ( ఆత్మ ) మరింత క్షోభకు గురవుతాడని  అని సూక్ష్మార్థం .

ఇవన్నీ మనిషి మనసు వెనుక జరిగే  నిత్య సత్యాలు  .


• మనిషి జీవించడానికి  ధనం,  ఆహారం , గృహం , ఆరోగ్యం,  వసతుల  సౌఖ్యం , మంచి  మానవ సంబంధాలు  అత్యంత అవసరం . వీటి సంపాదన కోసం  మనిషి  మంచి బుద్ధి తో కృషి చేయడం అవసరం. 

కానీ ,  వీటి   కోసం  మాత్రమే  కేవలం మనిషి జన్మించినట్లు , యాంత్రికంగా  తనను  తాను మరచి , అర్దం లేకుండా  జీవించడం వలన  చివరికి  ఆత్మ కి మిగిలేది  క్షోభే .  ఎందుకంటే  శరీరం ఎలాగో బూడిద అవుతుంది. ఆత్మ కి మరణం లేదు. ఆత్మ  మరలా ఇవే స్వభావ సంస్కారాల తో  తిరిగి మరో  జన్మ ఎత్తుతుంది .  


మనిషి కి   అంతరం లో   ఉండే  బలమైన ఆధ్యాత్మిక శక్తి    మాత్రమే   బాహ్య  ప్రపంచంలో  సజావుగా   జీవించడానికి కావలసిన   భౌతిక శక్తి ని  సమతుల్యం చేస్తుంది .   లేనిచో , నేటి  ప్రపంచంలో  విస్తరించిన  మాయకు (బలహీనత లకు) మనిషి  లోని  భౌతిక శక్తి  పెరుగుతూ ఉన్నట్లుగా అనిపించినా చివరకు పూర్తిగా నిర్వీర్యం అయిపోతాడు .

మనిషి  ఈ విషయం  స్వయంగా  తాను అనుభవ పూర్వకంగా  గ్రహించడానికి  కొన్నిసార్లు ,  అనేక జన్మలు కూడా పట్టవచ్చును.


• తలెత్తుకుని జీవిద్ధాం . మన మూలాల లో ఉన్న శివ పరమాత్ముని బుద్ధి తో స్పృశిద్ధాం.  మానసిక బలవంతులు గా అయి  భౌతిక జీవనం లో  ఉండే  మాయా బలహీనతలను  జయిద్ధాం .  

ఇదే మనిషి తనపై  తాను విజయం సాధించడం .  తలెత్తుకు తిరగడం.


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏.

యడ్ల శ్రీనివాసరావు 29 Sep 2025 1:00 PM


Friday, September 26, 2025

693.దృఢత్వం - సానుకూలత

 

దృఢత్వం మరియు సానుకూలత


• మన జీవితంలో వేసే ప్రతి అడుగులో మనం ఎంత దృఢంగా ఉంటున్నాము, ఆ దృఢత  శక్తిని ఉపయోగించి అనేక ఆటంకాలను ఎలా అధిగమిస్తున్నాము అన్నది చాలా ముఖ్యమైన మరియు ప్రభావ వంతమైన  విషయం.

అయితే కొన్నిసార్లు మనం ఈ విషయానికి సరైన ప్రాముఖ్యతను ఇవ్వము. విశ్వాసం పర్వతాలను కదిలించగలదు , విశ్వాసం అంటే జీవితంలోని ప్రతి అడుగులో  దృఢమైన సంకల్పం అని అంటారు.   నెగెటివ్ నుండి ,  అనవసరమైన ఆలోచనల నుండి నేను దూరంగా ఉంటాను అని మీతో మీరు చెప్పుకోవడమే విశ్వాసం. 

అలాగే , ప్రతి పరిస్థితిలో, కష్టాలను అధిగమించే సమయాలలో అవసరమైన సానుకూల ఆలోచనలను మనసులో నింపుకుని విజయాన్ని సాధించడమే విశ్వాసం.


• ప్రతికూల పరిస్థితుల  గాలులు  ఎంత తీవ్రంగా  ఉన్నాగానీ , బాహ్య పరిస్థితి కన్నా , నా ఆంతరిక మానసిక స్థితి  గొప్పది  అన్న నమ్మకంతో  బలంగా  ఉండటమే దృఢత.

మనం దృఢం గా ఉంటే,  పరిస్థితి  బలహీనపడి తక్కువ సమయంలోనే అది వెళ్ళిపోతుంది. కనుక , పరిస్థితితో   ఎన్ని రకాలుగా పోరాడాలి అన్నది ముఖ్యం కాదు ,  మీ ఆత్మ బలంతో , మీరు కోరుకున్న  విధంగా  కష్టంలో వచ్చే దృశ్యాలను  మార్చడం  ముఖ్యం. 

చాలాసార్లు మనం కోరుకున్నట్లుగా పరిస్థితులు ఉండవు,  మనకు కావలసిన విధంగా మరల్చుకోవడానికి   మనం  ముందుగా బాహ్యంగా పోరాడుతుంటాం . ఒక్కోసారి మనం గెలవవచ్చు ,   ఒక్కోసారి గెలవకపోవచ్చు , ఇందుకు కారణం మనకు సరిపడేంత ఆత్మ బలం లేకపోవడమే. ఇందుకు మరో ముఖ్య కారణం, మన ఆంతరిక స్థితి, మనలో  దృఢత  బలంగా లేకపోవడమే .  అందువలన , స్వయాన్ని  శక్తివంతమైన  స్థితిలోకి   తీసుకురావాలి.  

శక్తి అంటే బాహ్య శక్తి కాదు. ఆంతరిక శక్తితో మనసును శక్తివంతంగా చేసుకుని కష్టాల ప్రభావానికి మనసును దూరంగా ఉంచాలి. బాహు బలం కన్నా , ఆయుధ బలం కన్నా , హోదా బలం కన్నా  మనో బలం చాలా గొప్పది. మనో బలం కష్టాలను అనతి  కాలంలోనే మార్చివేసి వాటిని సానుకూలంగా మార్చగలదు.

ఏదైనా చిన్న పెద్ద సమస్య  వచ్చినప్పుడు , అది  సమస్య కాదు ,  ముందుకు వెళ్ళేందుకు పరీక్ష . ఆధ్యాత్మిక  శక్తి  మనసు కి  తోడైతే  ఆ సమస్య ను  ఆట బొమ్మ వలే  ఆడుకోవచ్చు .


 ☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️ 


• దృఢత్వం ఒక మానసిక బలం , ఇది ఎంతోకొంత  మనందరిలో ఉంటుంది . దీనిని మనం ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు . ముందుగా,  నేను దృఢంగా అవ్వాలి, నేను ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలి, నేను నా ఆంతరిక వ్యక్తిత్వాన్ని దోహదపరుచుకోవాలి , నేను జీవితంలో   ప్రతి క్షేత్రంలో  విజయాన్ని పొందాలి అని గుర్తించాలి. 

దృఢత్వం  ఏకాంతాన్ని (Isolation) ఇష్టపడుతుంది , ఒంటరితనాన్ని (Aloneness) కాదు .  ఏకాంతం ద్వారా  పంచభూతాలతో  మమేకమై  విశ్వ శక్తి తో అనుసంధాన క్రియ సూక్ష్మ స్థితిలో  జరుగుతుంది .

వీటితోపాటు జీవితంలో ఉండవలసిన ఇతర ఉద్దేశాలు – అందరితో  ప్రేమ ,  గౌరవం తో ఉండటం  ,  అందరి గురించి మంచిగా ఆలోచించడం ,  నా బంధాలను మరింత చక్కగా, శాంతియుతంగా మరియు ఆనందమయంగా చేసుకోవడం , మంచి వృత్తిని ఏర్పరచుకోవడం . నా జీవిత పాత్రను మరింత సానుకూలంగా మలచు కోవడం  వంటివి. 

ఇవి మన జీవితంలోని వివిధ దశలలో ఉండవలసిన వివిధ లక్ష్యాలు మరియు ఉద్దేశాలు. వీటిని సాధించడానికి భౌతికంగా ఏదో ఒకటి చేయడంతో పాటు  ముందుగా  మన లోపల బలమైన దృఢమైన సంకల్పం ఉండటం అవసరం .

• మానసిక దృఢత్వం లేకుండా , బాహ్యంగా మనం ఎన్ని చేసినా  ఆశించిన లక్ష్యాన్ని విజయవంతంగా సాధించలేము . ఎందుకంటే , మన లక్ష్యాన్ని సాధించే దిశలో చేసే ప్రయాణ మార్గంలో మనకు ఆటంకాలు ఎదురవుతాయి . ఆటంకాన్ని చూసిన మరుక్షణం దానిని దాటగలిగే ఆత్మ శక్తి  మనలో లేకపోవచ్చు . ఆశ , ఓర్పు , దృఢత్వం నిండిన ఆత్మ శక్తి మనసులో ఆలోచనలుగా , భావాలుగా  ఉండాలి. 

కనుక,  ధృఢత   ప్రారంభం అనేది మన మనసులో  జరగాలి . దృఢత్వం  కఠినత్వం గా  ఇనుము వలే కాకుండా  మృదుత్వం తో రబ్బరు వలే ఉండాలి .  చాలా చాలా జాగ్రత్తగా, దృఢత్వం వైపుగా మన అడుగులు పడాలి, దృఢత్వం మన కర్మలలో కనిపించాలి. అప్పుడు ఈ దృఢత్వం క్రొత్త అవకాశాలను తెరిచేందుకు తాళం చెవి అవుతుంది, ఇది మీరు ఆశించిన విజయ గమ్యానికి  తీసుకువెళ్తుంది .  

దృఢత్వం లోని పరిణితి . . . మౌనం , ఏకాంతం , స్థిరత్వం , శాంతి , సుఖాలను  ఆహ్వానిస్తుంది . మనసు లో  వ్యర్థాలను , మలినాలను ,  అంతర్గత శత్రువులను  శాశ్వతం గా తొలగిస్తుంది .  

దృఢత్వం అనేది   ఒక  కారణ భూతం గా (Purposeful )  ,  యోగదాయకం గా  (Fruitfulness) ,  ప్రాప్తుల  ఖజానా గా (Beneficial)  ఉండాలి .  అంతే కానీ  మూర్ఖత్వం , మొండితనం (Rudeness) గా  కారాదు .

ధృడంగా  ఉండడం వలన  స్వీయ  రక్షణ కలిగి  ఉంటాం .   సంబంధ  సంపర్కాలలో  బలహీనత  నొంది  ఉన్న  వారికి   మన ద్వారా  సహయత ,  రక్షణ  చేకూరుతుంది .

కానీ  దృఢత్వం  లోపించిన నాడు , మనలోని  బలహీనతల తో పాటు గా ,  సహచరుల    బలహీనతలు మరియు  నెగెటివ్ ఎనర్జీ  ప్రభావం  మనం  అనుభవిస్తాం .  

ద్వేషము తో   ఎవరినీ  జయించలేము .  మౌనం, శాంతి  ప్రేమ  తో  ప్రపంచాన్ని జయించవచ్చు  .  అందుకు నిదర్శనం  రమణుల వంటి ఎందరో భారత యోగులు . 

జీవితం అనే సాగరం లో ,  సత్యమైన  నావ  తుఫానుల ఆటుపోట్ల కు ఒడిదుడుకులకు  లోను కావచ్చు , కానీ మునగదు . తీరం  తప్పకుండా చేరుతుంది .  అదే , సత్యమైన నావ కలిగి ఉండే దృఢత్వం లో మహత్యం.


గులాబి  మొగ్గ పిందె గా  ఉన్నప్పుడు కంటే ఎదుగు తూ . . .    ఉన్న సమయం లో,  సమీపంలో ఉన్న   ప్రతి ముల్లు   పదే పదే  గుచ్చుతూ హింసిస్తాయి . ఒకసారి  ఆ మొగ్గ  పువ్వుగా   వికసించిన మరుక్షణం , చుట్టూ ఉన్న అవే ముల్లులు   గులాబీ యొక్క  సౌందర్యం  ఆస్వాదిస్తూ  రక్షణ  అవుతాయి.  


ప్రతి  మనిషికి తెలియని , తన    యధార్థ స్వరూపాన్ని   తెలియచేసేది  కేవలం శివుడు మాత్రమే . ఎక్కడైతే  ఈశ్వరుడు ఆరాధించ బడుతూ ఉంటాడో అక్కడ  శుభం ఉంటుంది .

యడ్ల శ్రీనివాసరావు 26 Sep 2025 , 11:00 pm .


788. పెరుగుట - వృద్ధి

  పెరుగుట - వృద్ధి  ఒక వృక్షం బాగా పెరిగింది అంటే వృద్ధి చెందింది.  శాఖోపశాఖలుగా కొమ్మలు విస్తరించి, పండ్లు , పూలు , సేద తీరేందుకు నీడ ఇస్తు...