నాయకుల సభలు సమావేశాలు మనుషులు
• మనుషుల ను పోగుచేసు కోవడం కంటే మనసులను పోగుచేసి సేవ , సహాయం చేయ గలగడం ఎంతో ఉన్నతమైన పురుషార్థం.
• మనుషుల ను పోగుచేసి సహాయం చేయడం అనేది తాత్కాలిక భౌతిక చర్య. ఇది మనుషుల అవసరాలను కొంచెం తీర్చడం అవుతుంది . కొన్ని రోజుల తరువాత ఆ మనిషి కి సహాయం మరలా మరలా అవసరం అవ్వచ్చు. ఈ విధం లో చేసే సహాయం శాశ్వత పరిష్కారం గా ఉండదు. ఇది ఒక తాత్కాలికం. ఇందులో మనిషి లో ని శరీరానికి ప్రాముఖ్యత ఇచ్చి సహాయం చేయడం జరుగుతుంది.
• సహాయం చేస్తాం అనే పేరు తో, మనుషులను పోగుచేసు కోవడం అనేది ఒక ఉల్లాసం, ఒక స్వప్రయోజనం మరియు తాత్కాలిక కాలక్షేపం తో కూడిన ఆనందం మాత్రమే. దీని కోసం సహాయం చేస్తాను అని చెప్పే మనిషి , ఇతరులకు ఎన్నో రకాలుగా మాటలు, కబుర్లు, ప్రయాస, ధనం ఖర్చు పెట్టడం, ఎదుటి వారికి తగినట్లు నటించడం వంటివి ఎన్నో జరుగుతాయి.
ఉదాహరణకు రాజకీయ నాయకులను చూస్తే మీటింగ్ లకు జనాన్ని పోగేయడం, వారికి కావలసిన ఆహారం, మత్తు పానీయాలు, రాను పోను రవాణా సదుపాయాలు కల్పించడం, ప్రజలను దేవుళ్లు గా భావించడం …. కానీ, సభ పూర్తి అయ్యాక నాయకుడు తమ విశిష్టత ను ఫౌటోలు, వీడియో ల ద్వారా మీడియా లో ప్రచారం చేసుకుంటూ, తానే చాటుకోవడం పరిపాటి. దీని వలన నాయకుడి కి తన లక్ష్యం, అవసరం తీరుతాయి. లోపాయికారీ తో ఉన్న కోరికలు , వాటికి పునాదులు వేసుకోవడం జరుగుతాయి. కానీ హాజరైన మనుషుల, అవసరాలు, కష్టాలు ఏ మాత్రం తీరవు. సరికదా నాయకుడు పంచిన ఆహారం, ధనం, మద్యం తో ఆ పూట కాలక్షేపం అవుతుంది.
• నిజానికి ఇదే నాయకుడు లేదా నాయకుడి లా ఫీల్ అవుతున్న వ్యక్తి వద్దకు వెళ్లి, ఏ మనిషి అయినా తమ కష్టం చెప్పుకొని సహాయం అర్దిస్తే ఫలితం శూన్యం. ఒకవేళ నాయకుడు నిజంగా సహాయం చేసినా, ఒక వెయ్యి మంది లో ఒకరికి మాత్రమే చేసి అందరికీ చేసినట్లు మాట్లాడుతారు. ఈ నాయకులు మనుషుల ను చాలా చాలా అమాయకులు అనుకుంటారు.
• అదే విధంగా ఈ సభలు, సమావేశాలకు ఆనందం గా హాజరైన మనుషులు కూడా నిదానం గా తమ అమాయకత్వానికి కాస్త ఆలస్యంగా చింతిస్తారు. ఎందుకంటే అదంతా ఒక మాయ అని, ఆ మాయలో తెలియక భాగస్వామ్యలం అయ్యాం అని, చెప్పాలంటే నాయకుడు యొక్క అవసరానికి తమను గొర్రెలు గా ఉపయోగించుకున్నాడు అని.
ఔనన్నా కాదన్నా ఇది నిత్యం సమాజం లో మన చుట్టూ జరుగుతున్నదే. ఇది నాయకులు, రాజకీయ పార్టీల లోనే కాదు …. చిన్న పెద్ద సభా సమావేశాలు నిర్వహించే చోట తరచూ జరిగుతూ ఉండేదే.
☘️☘️☘️☘️☘️☘️☘️
• మనసు ఉండేది మనిషి ఆత్మలో. ఆత్మలో ని మనసు శాశ్వతం, నాశనం లేనిది . జన్మాంతరాలకు కూడా సహయోగం ఇచ్చేది.
మనసు కూడా చాలా మంది కి బలహీనం అవుతుంది. ఆత్మ తన శక్తి కోల్పోయినప్పుడు ఇలా జరుగుతుంది. అదే మనసు కి దుఃఖం గా మారుతుంది.
మరి ఇటువంటి మనసులకు పోగుచేసి సేవ చేయడం అంటే , ఆ మనసు లో శక్తి వంతమైన ఆలోచనలు నింపడం తద్వారా మనిషి తనకు తాను నిలబడే లా చేయగలగడం. ఇది చాలా చాలా అత్యున్నతమైన పురుషార్ధం. ఈ సేవ ప్రేమతో, నిజాయితీ నమ్మకం తో కూడి ఉంటుంది మరియు సేవ చేసిన వారికి శాశ్వతమైన ఆత్మానందం లభిస్తుంది.
ఒక మనసు కి సేవ , సహాయం చేయడం అంటే మనిషి ని శాశ్వతం గా నిలబెట్టడం.
• దీని కోసం సేవ చేసే మనిషి తన మనసులో మంచి ధ్యాన సంకల్పం చేస్తే చాలు. సంకల్పం లోని మంచి ఆలోచన, ప్రకృతి తో మమేకం అయి శక్తి గా మారి సేవ జరుగుతుంది, తద్వారా సాటి బలహీనమైన మనసు బలోపేతం అయి, శక్తి పొంది తన అవసరం తానే తీర్చుకుంటుంది.
• ఈ సేవ చెయ్యడం కోసం మనుషులను పోగు చేయనవసరం లేదు, వెతక వలసిన అవసరం అంత కన్నా లేదు.
• ఎందుకంటే ఆ సేవ పొందడానికి అర్హత ఉన్న బలహీనమైన మనుషులు (ఆత్మలు), సహజం గానే , ప్రకృతి లో ఉన్న పంచభూతాల సంకేతాల ద్వారా, వారికి కాలం సహకరించినపుడు, బలశాలి ఆత్మ కలిగిన వారి నుంచి సేవ సహాయం పొందుతారు. తద్వారా వారు కూడా శక్తి వంతులై మరికొందరికి తమ శక్తి తో సేవ చేస్తారు. దీని వలన పుణ్యం పురుషార్థాలు జమ అవుతాయి.
• ఉదాహరణకు ఆశ్రమాలు, ఛారిటీ సంస్థలు , మనోధైర్యం కలిగించే కౌన్సిలింగ్ సెంటర్లు నిర్వహించే వారు మనతో, మన ఇంటి పక్కనే ఉన్నా, సమయం వచ్చే వరకు, వారు ఎవరికి అంతగా తెలియరు. ఎందుకంటే వారికి ప్రచారం చేసుకోరు సరికదా, ఎంతసేపు సేవ ఏ విధంగా చెయ్యాలి అనే కార్యాచరణ లో నే ఉంటారు. నిజమైన సేవ చేసే వారు ఏనాడూ స్వప్రయోజనాలు, ప్రచారాలు ఆశించరు. మనిషి తనకు అవసరమైన సందర్భాల్లో స్వయంగా తానే వెళతాడు వీరి దగ్గర కు.
• నేటి సమాజంలో గమనిస్తే నాయకులు గా చలామణి అయి చరిత్రలో నిలిచిన వారి కంటే కూడా, ఫలితం ఆశించకుండా సేవ చేసిన సేవాదారులు, మరియు నాయకుడిగా ఉంటూ నిస్వార్థంగా సేవ చేసిన వారు మాత్రమే చరిత్రలో చిరస్థాయిగా నేటికీ నిలిచిపోయారు. అటువంటి గొప్ప వారు నేడు జీవించిలేకపోయినా వారి ఆదర్శాలు, భావాలు నేటికీ జీవిస్తూ దార్శనికత ఎందరికో ఇస్తుంటాయి. ఉదాహరణకు మదర్ థెరిస్సా, అబ్రహం లింకన్ (నాయకుడు) వంటి వారు ఎందరో.
• దేహం ఎన్నో లోభాలు, ప్రలోభాలకు వశం అవుతుంది. ఆత్మలో ఉన్న మనసు కేవలం స్వచ్ఛత, శక్తి, పరిపూర్ణత కోరుకుంటుంది.
• మనిషి లో దేహం, ఆత్మ రెండు ఉంటాయి.
• ఏనాడైతే ఆత్మను గ్రహించి మనసు ను ఆధీనంలో ఉంచుకో గలిగిన మనిషి కి విజ్ఞత కలుగుతుంది. తద్వారా ప్రలోభాలు, కాలక్షేపాలు, వృధా తత్వం కంటే తన జీవిత పరమార్థం తెలిసుకోగలిగి సేవాభావం తో తనను తాను సంస్కరించుకొని, ఇతరులకు సేవ చేయగలుగుతాడు.
• మనుషులు నిజంగా అమాయకులే …. కానీ వారు జీవిత కాలం అలా ఉండరు. ఏదొక రోజు మనుషుల కి జ్ఞానోదయం అవుతుంది.
• అప్పుడు నాయకులు మనుషుల ను గమనించి తమ తీరు మార్చుకొని సేవాధారులు గా అయి మనసులకు సేవ చేస్తారు ….. చిరస్థాయిగా నిలిచిపోతారు.
• నాయకుడు అంటే దేశానికో, రాష్ట్రానికో, ప్రాంతానికో కానవసరం లేదు. మన సమాజంలో, మన కుటుంబాలలో, మన స్నేహితులలో, మన ఆఫీస్ కార్యాలయాల్లో, నిత్యం మన చుట్టూ ఉంటూ నాయకత్వ లక్షణాలను చూపిస్తూ మనలో మనతో ఉండే వారు, ఎంతో మంది ఉంటారు.
• అదే విధంగా బలమైన ఆత్మశక్తి శాలులు అంటే మన తల్లి తండ్రులు, రక్త సంబంధీకులు, మంచి స్నేహితులు, ఉపాధ్యాయులు, గురువుల లో ఎంతో మంది సేవాతత్పరత కలిగి ఉన్న వారు ఉంటారు.
యడ్ల శ్రీనివాసరావు 17 March 2023 10:00 AM.
No comments:
Post a Comment