ఇచ్ఛెస్తే పోలే
• “ ఇచ్ఛెస్తే పోలే ” ఇది చాలా బాగుంది కదా …. అవును ఎవరైనా ఏదైనా అడిగింది ఇచ్ఛెస్తే పోలే. మరి ఏది ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి , అసలు ఎందుకు ఇవ్వాలి. అసలు ఇవ్వాలంటే , ఇవ్వవలసినది మన దగ్గర ఉందా లేదా … ఒకవేళ ఉంటే ఇవ్వడానికి మనసు అంగీకరిస్తుందా లేదా … ఇదే కదా సమస్య.
• అవును. మనిషి జన్మ కు ఒక విధంగా మొత్తం సమస్య అంతా ఇదే .… ఏ ఇద్దరి మనుషుల మధ్య చూసినా వంద శాతం సమస్యల కి, మనస్పర్థల కి మూలకారణం ఒక్కటే. అది ఏంటంటే, ఒకరు ఆశించింది, ఒకరికి కావలసింది మరొకరి నుంచి లభించక పోవడం.
ఇలా ఆశించడం అనేదానికి కారణం ఒక మనిషి కి మరో మనిషి పై ఉండే “ ఆశ “ లేదా “ హక్కు “. ఇందులో ఆ బంధం, ఈ బంధం అనే ప్రసక్తి లేదు. సమస్త మానవాళి బంధాలలో ఇమిడి పోయిన , చెప్పాలంటే అనాదిగా అలవాటు పడిపోయిన ఒక మనిషి మానసిక తత్వ స్థితి ఇది .
ఇకపోతే మనిషి కి ఇది బలమా, బలహీనత అనేది నిర్ణయించడం కూడా కష్టం. ఎందుకంటే కావలసింది దక్కితే బలం, దక్కకపోతే బలహీనం.
ఎవరికైనా సరే దీనికి పూర్తి పరిష్కారం తో కూడిన ఏకైక సమాధానం ఒక్కటే “ ఇచ్ఛెస్తే పోలే ”.
• ఈ సృష్టిలో ప్రతీ మనిషి కి , తన జీవిత కాలంలో సాటి మనిషి నుంచి ఏదో ఒకటి కావాలి. అది సంతోషం, స్నేహం, ప్రేమ, ధనం, బానిసత్వం, సహాయం, కామం, కోరికలు, మోహం, కాలక్షేపం, గౌరవం, సుఖం, అవసరం తీర్చు కోవడం, మానసికంగా శారీరకంగా ఆధార పడడం … ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మనిషి కి, తన తోటి సాటి మనిషి నుంచి , ఏ బంధం లో ఉన్నా సరే ఏదోకటి తప్పని సరిగా కావాలి. బహుశా ఈ ప్రక్రియ సృష్టి లో ఒక భాగం అయి ఉంటుంది.
• కావలసినది మనిషికి దొరికితే చాలా ఆనందం, సంతోషం, సుఖం. అప్పుడు మనిషి లో అంతర్లీనంగా ఉండే అహం, తృష్ణ చల్లబడుతుంది. ఏదో సాధించిన విధంగా అనిపిస్తుంది. గాలిలొ తేలినట్టు ఉంటుంది.
• కానీ కావలసినది దక్కకపోతే ... మొదలవుతుంది ఇక్కడే అసలు సిసలు ఆరాటం, పోరాటం, అంతర్యుద్ధం. బహుశా అన్ని సమస్యలకు, ఎన్నో వివాదాలకు ఇదే మూలం.
• ఉదాహరణకు ఒక మనిషి ఒక వస్తువు ను కోరుకుంటే, అతనికి అది దక్కుతుందో లేదో అని తెలుసుకో గలడు. ఎందుకంటే తన దగ్గర ఉన్న వనరులు, ధనం, సంపదల తో అది తనకు సాధ్యమా కాదా అనే ఒక అవగాహన కలిగి ఉంటాడు.
• కానీ అదే ఒక మనిషి , మరో మనిషి నుండి ఏదైనా ఆశిస్తే, అంటే ప్రేమ, స్నేహం, ఆరాధన, సంతోషం, ఆనందం, బానిసత్వం, ధనం, సుఖం, శాంతి, ధైర్యం వంటివి…. దొరుకుతాయో, దొరకవో చెప్పలేం. ఎందుకంటే అది పూర్తిగా కర్మైక స్థితి తో ఆధారపడి ఉంటుంది.
• ఎందుకంటే ఏదైనా మనకు ఒకటి దొరకాలి, పొందాలి అంటే ముందు ఇవ్వడం నేర్చుకోవాలి.
• ఇవ్వడం అంటే మాయతో, నటనతో, బాధతో కాదు. నిజాయితీ తో, చిత్తశుద్ధితో ఏదైనా ఇస్తేనే, అది తిరిగి లభిస్తుంది .
• చాలా మంది మనుషుల మధ్య సంబంధాలు దీర్ఘకాలం సజావుగా లేకపోవడానికి ఇదే ఒక ముఖ్య కారణం. ఒక బంధం, సంబంధం మనుషుల మధ్య ఏర్పడిన కొత్త లో అన్నీ సజావుగా అనిపిస్తాయి. ఆరంభం లో అన్నీ బాగుంటాయి. ఒకరి కోసం మరొకరు ఏదైనా ఇవ్వగలుగుతారు, చెయ్య గలుగుతారు.
• కానీ కాలం గడిచే కొద్దీ మార్పులు సంభవిస్తాయి. ఎందుకంటే , ఆ తరువాతే అంతర్లీనంగా దాగి ఉన్న మనిషి లోపలి అసలు సిసలైన బుద్ది తో మనిషి మెల్లగా నెమ్మదిగా బయటకు వస్తాడు. ఇక్కడే ఒకరిపై మరొకరు లెక్కలు, బేరీజు వేసుకోవడం మొదలవుతుంది. బంధాలలో ఉన్న మనుషుల మధ్య ఈ స్థితి విపరీతానికి చేరకూడదు. అంటే ప్రతీ మనిషి తనను తాను బాలెన్స్ చేసుకోవాలి …. ఆశించడం కంటే ఇవ్వడం లో ఉన్న ఆనందాన్ని తెలుసుకోవాలి.
• అందుకే ఎవరైనా ఎప్పుడైనా ఇవ్వగలిగింది తమ దగ్గర ఉన్నప్పుడు “ ఇచ్ఛెస్తే పోలే “.
ఇవ్వడం అనేది ఎప్పుడూ నష్టం (loss) కాదు .
అది రెట్టింపు అయి తిరిగి తప్పక చేరుతుంది …
ఏదోక రూపం లో.
కానీ మనిషి కి జన్మ జన్మలు గా తన ఆత్మ లో ఏదైనా తీసుకోవడం , పొందడం అనే అలవాటు రికార్డు అయిపోయి ..... వదులుకోవడం, ఇవ్వడం అనేది అంత సులభం గా చెయ్యలేరు.
ఒకటి మాత్రం నిజం ... ఏదైనా ఇస్తున్నప్పుడు దాని ద్వారా సమస్యలు మొదలవుతాయి అనిపించినపుడు ఇవ్వక పోవడం మేలు. ఇచ్చే దాని వలన మేలు కంటే కీడు, అపకారం ఎవరికైనా సరే సంభవిస్తుందని అనిపించినపుడు కూడా ఇవ్వకపోవడం మంచిది....ఈ విషయం విజ్ఞత తో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు, ఏదీ మనతో రాదు అని తెలిసినపుడు .... చేతి పిడికిలి గుప్పెడు బిగించి , ఏం ప్రయోజనం ... నొప్పి తప్ప. అందుకే చేతి గుప్పెడు తో పాటు గుప్పెడు మనసు తెరిస్తే పోలే.... " ఇచ్చెస్తే పోలే ".
ఇదంతా మనిషి అంతర్లీనంగా, అంతర్గతం గా సూక్ష్మ దృష్టితో ఆలోచించు కోవలసిన ఒక ధృడమైన మానసిక స్థితి.
గమనిక : "ఇచ్ఛెస్తే పోలే" అనే పదం వ్యవహరిక భాష లో తేలిక గా ఉంటుంది అని ఒక ఈజ్ కోసం ఉపయోగించడం జరిగింది. అంతే కానీ తేలికపాటి భావం తో గాని, జాలి తో అనే భావజాలం తో దయచేసి ఆ పదం ముడి పెట్టవద్దు.
యదార్థ సూక్ష్మ భావం ఏంటంటే అది (Kindness, Mercy), దయ, కరుణ తో ముడి పడిన భావం గా స్వీకరించాలి. "ఇచ్ఛెస్తే పోలే".
🙏🙏
యడ్ల శ్రీనివాసరావు 1 Mar 2023 5:00 PM.
No comments:
Post a Comment