Wednesday, March 22, 2023

330. నేను కరెక్ట్ - నేనే కరెక్ట్

 

నేను కరెక్ట్ - నేనే కరెక్ట్ .



• నేను కరెక్ట్. అవును నిజమే , నేనే కరెక్ట్.  మీ అందరి లోపల కాస్త అటు ఇటుగా నేను ఉన్నాను, కాబట్టి నేను కరెక్ట్.   నేను ఎప్పుడు ఎలా ఉన్నా,   ఏం చేసినా నేను కరెక్ట్.   నేను రెండు రకాలు గాా   మీ అందరిలో ఉంటాను.   పేర్లు అయితే వాటికి ఉన్నాయి.  నా రూపాలు మీకు కనిపించవు కానీ ,  నాకు ఉన్న శక్తి అమోఘం.  ఎందుకంటే నేను కరెక్ట్.  నేను నేనే కాబట్టి. నేను ఎవరో, నా రెండు పేర్లు ఏంటో చివరి లో చెపుతాను.


• గొప్ప విషయం ఏంటో తెలుసా …. నేను మీకు తెలుసు …. చాలా బాగా తెలుసు.  కానీ మీరే … మరేమో నన్ను అందరి ముందు దాచెస్తూ అమాయకంగా ఉంటారు. అయినా పరవాలేదు లే , ఎందుకంటే నేను మీ లో నే ఉన్నాను. అందుకే అనేది నేను కరెక్ట్ అని.


• నేను ఎప్పుడూ చక్కగా మంచి ఆహారం తింటాను. ఒక వేళ తినకపోయినా తిన్నట్లే ప్రవర్తిస్తాను.  ఇకపోతే నేను అద్బుతం గా అలంకరణ చేసుకుంటాను, రంగు రంగుల దుస్తులు తొడుగుతాను, ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు. వాహ్… అసలు ఒకటేంటి ఖరీదైనవి ఏదైనా క్షణం లో నా ముందు ఉండాల్సిందే. ఒకవేళ పైన నేను చెప్పినవన్నీ నాకు లభించిక పోయినా సరే అంతకన్నా దర్జా గా నేను ఉంటాను. ఎందుకంటే నేను కరెక్ట్ …. కాదు ఎలా ఉన్నా నేనే కరెక్ట్.


• నేను ఎప్పుడూ విలాసవంతమైన భవనాలు, రాజ మహల్ లో నివసిస్తాను. ఎందుకంటే నాకు ఆశ్రయం అక్కడ మాత్రమే దొరుకుతుంది. ఒకవేళ అలాంటి వైభవోపేతమైన నివాసయోగ్యాలు , నాకు దొరకక పోయినా పరవాలేదు చిటికెలో నేను సృష్టించు కోగలను. ఎందుకంటే , నాకు కావలసినది , దొరకనిది అంటూ ఏమీ లేదు. అందుకే అంటున్నా నేను కరెక్ట్ అని.


• ఏంటి… మీరు మరీ అంత అమాయకంగా చూడకండి. నాకు సిగ్గుగా అనిపిస్తుంది. ఇంకా నవ్వు వస్తుంది. ఎందుకంటే నేను మీ లో నే ఉన్నాను.


• ఇంకా నేను ఏం చేస్తూ ఉంటానో తెలుసా…. అందరి అవసరాలు తీరుస్తాను.  ఎందుకంటే  నా మీదే ఆధారపడి ఎందరో ఉన్నారు కాబట్టి.  ఇంకా ఈ ప్రపంచం లో కార్యకలాపాలు నడిపిస్తాను.  అహర్నిశలు కష్టపడతాను.  కష్ట పడినట్లు ఎక్కువ సార్లు కనిపిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను లేకపోతే ఏదీ జరగదు.   నేను లేకుంటే నా చుట్టూ ఉన్న సమాజం, కుటుంబం , పిల్లలు, స్నేహితులు, తోటి సాటి మనుషులు అసలు ఎవరూ కూడా సంతోషంగా జీవించ లేరు .… ఒక్క మాటలో చెప్పాలంటే నా గురించి వీళ్లంతా కొట్టుకు పడి సచ్చిపోతారు తెలుసా.


• నేను చాలా తెలివైన వాడిని. ఎంత తెలివైన వాడిని అంటే పెద్ద పెద్ద నిర్మాణాలకు కట్టించగలను, కూల్చగలను. ఎలాంటి వ్యాపారం అయినా చెయ్యగలను . ధనం పోగు చెయ్యగలను. అధిక వడ్డీ వ్యాపారం చెయ్యగలను. నాకు ధనం అంటే ప్రీతి. నేను అప్పులు భారీ గా చెయ్యగలను, ఆస్తులను ఆవిరి చెయ్య గలను. నిజాన్ని అబద్ధం గా , అబద్ధాన్ని నిజం గా కనికట్టు చేసి చూపించగలను.  నాకు అవసరం అనిపిస్తే ఎంతకైనా దిగజారి, కాళ్లు పట్టుకునే లా బ్రతిమాలాడుతాను   అంతలోనే  ఉన్నతంగా కనిపించే ప్రయత్నం చేస్తుంటాను.  నేను చటుక్కున మాటలు మార్చగలను.   నేను ఎవరికీ చిక్కను  దొరుకను,  కానీ నా అవసరాలు ఎలా తీర్చు కోవాలో నాకు తెలుసు. అందుకోసం ఒకోసారి  ఏడుస్తాను , ప్రాధేయపడతాను, మిమ్మల్ని పొగుడుతాను, బెదిరిస్తాను కూడా . నేనొక ఊసరవెల్లి ని  రంగులు మాార్చడం నా నైజం . ఒకవేళ  నేను  దొరికినా,  నా అమాయకత్వానికి  ఎవరైనా దాసోహం  కావలసిందే‌.  నేను లేకపోతే ఈ ప్రపంచం లేదు. నేను ఎలా ఉన్నా, నాకు నచ్చిన విధంగా దినదిన అభివృద్ధి చెందుతున్నా నని అనుకుంటూ ఉంటాను .  అందుకే నేను కరెక్ట్.


• నేను మాత్రం కరెక్ట్. నేను ఈ రోజు ఈ భూమి మీద ఉన్నవన్నీ అనుభవించడానికి , ఈ శరీరానికి తృప్తి నిచ్ఛే, రమించే సుఖాలను ఆస్వాదించడానికి ఉన్నాను. అందుకు కావలసిన ప్రయత్నాలు అహర్నిశలు చేస్తూనే ఉంటాను. నేను సృష్టి భోగం  అనుభవిస్తాను. అందులో నాకు  తన మన పర భేదం ఉండదు.  ఎందుకంటే నా దృష్టిలో వ్యతిరేక లింగం ఎప్పుడూ కూడా ఒక భోగ విలాస వస్తువు.  అన్నట్లు చెప్పడం మరిచాను, నా టాలెంట్ ఏమిటో తెలుసా, నేను మాటలతో రమించగలను. నటించగలను. సగం అర్దం అయి అవనట్లు మాటను మింగుతూ మాట్లాడ గలను..…… నేను మీ లో నే ఉంటాను, నన్ను మీరు గుర్తించలేరు, గుర్తించినా ఏం చెయ్యలేరు. ఎందుకంటే నేను చేసే ప్రతి పనిలోనూ మీరు ఉంటారు కాబట్టి. అందుకే నాలో చాలా తెలివి ఉంది అనేది. ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే, నేను కరెక్ట్.



• కానీ మీ లో  కొందరు నాకు స్థానం   ఇవ్వక  మెడ పెట్టి గెంటుతారు… పాపం పిచ్ఛివాళ్లు, ఎందుకు పుడతారో ఇలాంటి వాళ్లు. ఇటువంటి వాళ్లని చూసి జాలేస్తుంది,  కోపం వస్తుంది.  సరేలే   ఏదో రోజు నేను ఏంటో తెలుసు కుంటారు.

• ఎందుకంటే ఇలాంటి  పిచ్చి వారికి  దిక్కు లేక, బ్రతకడం చాత కాక , ఒక లక్ష్యం లేక , గమ్యం తెలియక, నిరాశ నిస్పృహలతో, శక్తి హీనులై , జీవితం లో అన్నీ వదులుకుంటూ, దేవుడు దేవుడు అనే పేరుతో ఏదో ఒక కారణం చూపిస్తూ , పూజ, జపం, ధ్యానం అని కాలక్షేపం చేస్తూ కాలయాపన చేస్తూ మానసిక రోగి లా ఏదో లోకం లో ఉంటారు. పైగా ఏదో అందరికీ హితవులు చెపుతున్నట్లు నటిస్తూ, పబ్బం గడుపుతుంటారు. వీరికి భాధ్యత ఉండదు. ఇటువంటి అసమర్థులకు అసలు నేను ఏంటో, నా లో ఉన్న గొప్ప తనం ఏంటో ఎప్పటికీ తెలుసుకోలేరు. కాని , ఇటువంటి వారిని నేను అంత తేలికగా వదిలి పెట్టను. ఎందుకంటే నా అడ్డా లో ఉంటూ భోగాలు, విలాసాలు అనుభవించకుండా కనిపించని దేవుడి జపం చేస్తే, నేనెందుకు కోరుకుంటాను.


మీకో విషయం చెప్పనా ... నేను కూడా అప్పుడప్పుడు దైవం  ముసుగు వేస్తాను.  మిమ్మల్ని  ఆకర్షించాలంటే నాకు ఇది కూడా అవసరమే. 


• ఏంటి అమాయకంగా చూస్తున్నారు. ఇంతకు నేను ఎవరో తెలుసా …

  ది    గ్రేట్  మాయ ( Delusion).

  ది    గ్రేట్  అహంకారం (Pride).

• ఇప్పుడు చెప్పండి , నేను మీకు తెలియదా… ఎవరి లోను నేను లేనా.  నన్ను ఎవరి లోను చూడలేదా.


• నేను అనేది అహం, మాయ అనే  అవతారాలు గా మనిషి లోపల  ఎంతో కొంత  శాాతం దాగి ఉన్నాయి. ఇది తెలుసుకో లేనంత వరకు ఈ “నేను” ఎలా ఉన్నా, ఏం చేసినా కరెక్ట్. ఎందుకంటే మనిషి లోని అహంకారం ఈ కలి కాలం లో మాయ లో చిక్కుకు పోయి ఉంది కాబట్టి.

( మూలం ప్రేరణ )

సాధారణంగా ప్రతీ మనిషి లోను అహం, మాయ అనేవి ఉంటాయి. ఇవి కొంత అజ్ఞానం, అమాయకత్వం, తెలియని తనం తో ప్రాధమిక స్థాయిలో ఉంటాయి. ఇటువంటి వారి వలన, వారికి మాత్రమే కొంత నష్టం జరుగుతుంది.  కొంత కాలం తర్వాత వారు ఏదో సందర్భంలో  తెలుసు కొని కనువిప్పు కలిగి మాయ, అహం నుండి  బయట పడతారు……

కానీ ఇంకొందరిలో ఈ మాయ, అహంకారం పరాకాష్ట లో ఉంటాయి. ఇది ధనం, స్థాయి, స్థితి , శారీరక మానసిక బలహీనతల వలన వస్తుంది. ఇటువంటి వారికి ఉన్న విపరీతమైన మాయ వలన వారే దానికి వశం అయిపోయి , వారిలో ఉన్న అహం కూడా గుర్తించలేక ఒక అజ్ఞానం తో ఇంటా, బయట సమాజం లో ఉన్న ప్రతీ ఒక్కరినీ చులకన భావం తో చూస్తూ, ఒక విధమైన దిగజారుడు తనంతో మనుషులను మాయ చేస్తూ, మాటలతో హింస పెడుతూ లోపల మానసిక రోగి గా బ్రతుకుతూ బయటకు మాములుగా జీవిస్తారు. ఇటువంటి వారు మనకు  పని  చేసే చోట,  బంధువులలో, స్నేహితుల లో,  సమాజం లో  అప్పపుడప్పుడు కనిపిస్తారు. వీరికి విచక్షణ అసలు ఉండదు.

ఈ అవ లక్షణాలు, గుణగణాల తో ఉన్న వారిలో కొంత మార్పు రావాలని ఆశిస్తూ మరియు ఇది చదివిన వారు, త్వరగా అటువంటి మనుషుల ను గుర్తించి జాగ్రత్త పడాలి అని అవగాహన కోసం అంతర్ దృష్టి తో రాసింది ఈ రచన.


ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 22 March 2023 10 :00 PM.














No comments:

Post a Comment

489. నేను ఉండలేను

నేను ఉండలేను • నేను ఉండలేను   నిను విడిచి    నేను  ఉండలేను.   శివ   నేను  ఉండలేను   నిను విడిచి    నేను ఉండలేను. • తలపు లో      కొలువైనాక ...