Friday, March 31, 2023

333. మౌనం మాటాడుతుంది ☘️ చీకటి చూస్తుంది

 

మౌనం మాటాడుతుంది ☘️ చీకటి చూస్తుంది



• అవును… మౌనం మాటాడుతుంది…. వినిపించడం లేదా … ఒక గంట సేపు ప్రశాంతంగా ఎవరు లేకుండా, నిర్మలమైన ప్రదేశం లో కూర్చుని ఏకాంతంగా ఉన్నప్పుడు, గమనించండి మౌనం ఎంత చక్కగా మాటాడుతుందో. ఆ మాటలలో స్పష్టత ఎంత బావుంటుందంటే మళ్లీ మళ్లీ వినాలనిపించేంతగా ఉంటుంది. సాధారణంగా ఎక్కువ శాతం మనుషులు. మౌనంగా ఉండరు, ఉండలేరు గాని, ఒకసారి ప్రయత్నించి చూస్తే మౌనం యొక్క శక్తి ఏమిటో తెలుస్తుంది.

• మనసు లో ఏ అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మౌనం మాట్లాడడం మొదలెడుతుంది. అలాంటి సమయంలో మౌనం ఎప్పుడూ కూడా మనకు ఇష్టమైన వారి గురించి చెపుతుంది.

• అందులో అమ్మ, నాన్న, రక్త సంబంధీకులు, భార్య భర్తలు, స్నేహితులు, ప్రియులు, పిల్లలు వీళ్లందరి గురించి చెపుతుంది. ఒక విషయం గమనించారో లేదో…. మౌనం మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా సార్లు తెలియకుండా మనలో మనం నవ్వుకుంటాము. చిరునవ్వుతో ఉంటాము. చుట్టూ చూస్తే ఎవరు ఉండరు. అదే మౌనం యొక్క మహత్తరం.

• మౌనం కొందరికి జ్ఞాపకాలను తెరుస్తుంది … కొందరికి జ్ఞాపకాలను ఆహ్వానిస్తుంది … మరి కొందరికి జ్ఞాపకాలను మరచిపోయేలా చేస్తుంది.

• మౌనం లోనే ప్రతి మనిషి తనకు తాను ఏంటో నిజాయితీగా తెలుసుకుంటాడు. కరెక్ట్ గా చెప్పాలంటే తనలో దాగి ఉన్న మనిషి తో మాట్లాడి తన గురించి తాను సత్యం తెలుసుకోగలుగుతాడు. బహుశా అందుకే నేమో మహ యోగులు ఎప్పుడూ మౌనంగా ఉండేవారు.

• మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించండి … మనిషి మౌనంగా ఉన్న సందర్భం లో , సమయం గడిచే కొద్దీ ప్రకృతి , ప్రకృతి లో ఉన్న పక్షులు, పువ్వు లు, చెట్లు, ఆకులు, నదులు అద్బుతం గా మాట్లాడడం మొదలు పెడతాయి. ఏవో చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి మరియ ఇంకా వీటన్నిటికీ కూడా తెలుసు, మనిషి ప్రకృతి లో భాగమే అని. కానీ మనిషే నిత్యం ఏదో గందరగోళం సృష్టించుకుంటూ తన దృష్టి ని పూర్తిగా వ్యాపకాలు, కార్య కలాపాలు మీద పెడుతూ తనను తాను మరచి పోయి, ప్రకృతి ని గమనించడు.

• మనిషి ఎంత మౌనంగా ఉంటే అంత గా ప్రకృతి మనసు విప్పి మాట్లాడుతుంది. ఈ మాటలకు శబ్దం ఉండదు అంతకు మించి అనుభవాలు, కనుపాప లో దృశ్య రూపం ఉంటుంది. ఇది కల అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీరు వంద శాతం నిశ్చలమైన మౌనం తో ఉన్నప్పుడు మీతో మీరు గాని, లేదా ప్రకృతి మీతో గాని ఏదైనా మాట్లాడితే అది వంద శాతం అతి తక్కువ సమయంలో అనుభవం తో సహ నిజం అవుతుంది. అదే మనిషి మౌనానికి ఉన్న అతీంద్రియ శక్తి.


  ☘️☘️☘️☘️☘️☘️


• చీకటి చూడడం ఏమిటి … చాలా విచిత్రం గా ఉంది కదా…. అవునండీ వంద శాతం నిజం. ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది. మనిషి కనులు తెరిస్తే వెలుగు. కనులు మూస్తే చీకటి. కానీ మనిషి లో ఉన్న కనులు తెరిచినా, మూసినా చూస్తూనే ఉంటాయి. ఇది నిజం. కనులు తెరిచి నపుడు వెలుగు లో ఎంత చక్కగా ప్రపంచం కనిపిస్తుందో,. కనులు మూసినపుడు చీకటి లో అంత కన్నా అద్బుతం గా , సూక్ష్మ మైనవి ఎన్నో కనిపిస్తుంటాయి.

• ఒక మనిషి ప్రశాంతంగా, ఏకాంతంగా నిద్రపోకుండా కనులు మూసుకుంటే అంతా చీకటి మయం అయిపోతుంది. అలా కొంత సమయం గడిచే సరికి, ఆ చీకటి లో స్పష్టం గా ఎన్నో ఎన్నెన్నో కనిపిస్తూ ఉంటాయి. భవనాలు, మనుషులు, ఉద్యానవనాలు, పని చేసే ప్రదేశాలు, నదులు, ఎడారులు,  రంగులు, జలపాతాలు, లోయలు, ఆకాశం, భూమి, గ్రహాలు, పాలపుంతలు, పరిచయం లేని ఎందరో మనుషులు స్పష్టం గా కనిపిస్తారు. కొన్ని సార్లు భగవంతుడు కూడా.

• ఇదంతా ధ్యానం అనుకుంటారేమో… పొరపాటున కూడా కాదు. ఎందుకంటే ధ్యానం అంటే కనులు మూసి దృష్టి ని భృకుటి స్థానం పై ఉంచడం. కానీ ఇక్కడ అలా కాదు, మెలకువ స్థితిలో ఉండి కేవలం కళ్లు మూసుకుని అలా రిలాక్స్ డ్ గా ఉండడం.

• అంటే చీకటి కూడా మనిషి కి చక్కగా అన్నీ చూపిస్తోంది. కానీ చీకటి లో, చీకటి తో లేదా చీకటి గా ఉన్న సమయంలో మనిషి లోని కనులు బయటకు కాకుండా, అంతర్గతం గా చూడడం మొదలు పెడతాయి. చాలా మంది అనుకుంటారు అంధులు ఏమీ చూడలేరు అని. కానీ అంధులు మనం వెలుగు అని దేనినైతే అంటామో దానిని చూడలేరు. కానీ వారికి చీకటి చాలా చాలా స్పష్టంగా అన్నీ చూపిస్తుంది. ఎలా అంటే మనిషి కి పంచ కర్మేంద్రియాల మీద ఆధారపడి జీవిస్తాడు. ఈ కర్మేంద్రియాలు అన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. ఒక కర్మేంద్రియం లో ఒక లోపం ఉన్నా మిగిలిన కర్శేంద్రియాలు ఆ లోటు ను అంతర్గతం గా పూరిస్తాయి. ఉదాహరణకు కళ్లు లేని వారికి చెవులే కళ్లులా పనిచేస్తాయి. గమనించారో లేదో అంధులు కూడా చిత్రాలు గీసిన సందర్బాలు చరిత్ర లో ఉన్నాయి.

• అందుకే …. చివరి గా చెప్పేది ఏమిటంటే మౌనం చక్కగా మాట్లాడుతుంది. అలాగే చీకటి చక్కగా చూపిస్తుంది, చూస్తుంది. 

ఇదంతా ఎప్పుడూ ఒక మనిషి లో జరుగుతుంది అంటే, మనిషి తనకు తాను ఒక శక్తి అని అర్దం అయినపుడు. ఇంకా చెప్పాలంటే ఒక సరియైన జాగురుకత తో (perfect continuous ness) తో ఉన్నప్పుడు.

బహుశా దీనిని  6th sense లో ఒక భాగం అని కూడా అనుకోవచ్చేమో.


యడ్ల శ్రీనివాసరావు 1 April 2023 , 1:00 am









No comments:

Post a Comment

490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...