పల్లె వాసుల కృతజ్ఞతలు
మూలం : 1980 ల కాలం. అది బాగా వెనుకబడి కరువు కాటకాలు తో ఉన్న గ్రామం. ఒక యువతి ఆ గ్రామంలో ఉపాధ్యాయురాలు గా వచ్చి , పల్లెకు, ప్రజలకు, పిల్లలకు సేవ చేసి, చైతన్యం నింపి వెళ్ళింది. కృతజ్ఞతలతో , నేడు పల్లె వాసులు, పల్లె యాసతో…..
• నీ ఊరు పేరు ఏదమ్మీ
నీ జాగ లోగిలి ఏడమ్మీ
నీ ఊరు పేరు ఏదమ్మీ
నీ జాగ లోగిలి ఏడమ్మీ.
• నాడు ...
ఒంటరిగా వచ్ఛినావు
ఒంటె లాగ నిలిచి నావు.
ఒంటరిగా వచ్ఛినావు
ఒంటె లాగ నిలిచి నావు.
• ఈ పల్లె బూజు దులిపి
పసుపు అద్ధినావు
పట్టం కట్టినావు.
• ఏ తల్లి బిడ్డ వో చెల్లెమ్మ
నీకు బుణమై ఉంటిమి కదమ్మా.
ఏ తల్లి బిడ్డ వో చెల్లెమ్మ
నీకు బుణమై ఉంటిమి కదమ్మా.
• గొడ్ల సావిడ్లోన గడిపినాం .
గంజి కోసం గొంతు ఎండ బెట్టినాం .
• గుక్కెడు నీళ్ళ కు
గుక్కెడు నీళ్ళ కు
సుక్కలు సూసినాం .
• మా బతుకు పండక ఎండినాం
కరువు తీరక అప్పులు సేసినాం
• బానిస లై దొరల
బానిస లై దొరల
కాళ్లను కుక్క లల్లే నాకినాం.
• ఏ తల్లి బిడ్డ వో చెల్లెమ్మ
నీకు బుణమై ఉంటిమి కదమ్మా
ఏ తల్లి బిడ్డ వో చెల్లెమ్మ
నీకు బుణమై ఉంటిమి కదమ్మా.
• నాడు ...
ఒంటరిగా వచ్ఛినావు
ఒంటె లాగ నిలిచి నావు.
• ఈ పల్లె బూజు దులిపి
పసుపు అద్ధినావు
పట్టం కట్టినావు.
• మన్ను లో దొర్లేటి కూనల కి
మన్ను లో దొర్లేటి కూనల కి
మందలు కాసేటి మందికి
మందలు కాసేటి మందికి
అచ్చులు సెప్పావు చెల్లెమ్మా
అచ్ఛరాలు దిద్ధించావు కదమ్మా.
• నువ్వు నాటిన విత్తులు
రుక్సాలు అయినాయి.
పూలు పలముల సేత
సంసారాలకు నేడు నీడ నిత్తన్నాయి.
• నాడు కల్లు తాగిన
పిల్లల సేత కలం పట్టించావు
నేడు సర్కారు కొలువు లో
జీతగాళ్లు గా సేసినావు.
• నీ సేతి సలవతో
నీ సేతి సలవతో
ఆడోలి ఆపద లెన్నో తీసేసినావు
మూఢనమ్మకాలను
మూఢనమ్మకాలను
ముక్కు పిండి విదిలించి నావు.
• నేడు
నిను సేరి నీ బుణం తీర్సాలంటే
నీ ఊరు తెలియకుండే
నీ జాడ తెలియకుండే
• ఏ తల్లి బిడ్డ వో చెల్లెమ్మ
నువ్వు ఏడ ఉన్న
సల్లంగ ఉండాలి మాయమ్మా …
మా ఊరి మైసమ్మ.
సల్లంగ ఉండాలి మాయమ్మా …
మా ఊరి మైసమ్మ.
యడ్ల శ్రీనివాసరావు 15 March 2023 8:00 PM.
No comments:
Post a Comment