Thursday, May 20, 2021

55. పితృ కార్యం .... కాకి

పితృ కార్యం... కాకి
 ( మూలం : స్వీయ అనుభవం నా మిత్రులతో పంచుకున్నది.)



• అశోక్... కాకి గురించి చాలా మంచి అంశాన్ని పోస్ట్ చేసినందుకు థాంక్యూ .

• ఈ సందర్భంలో తప్పనిసరిగా నాకు ఒక విషయాన్ని కాకి గురించి  పంచుకోవాలని అనిపిస్తుంది .  చదువుకున్న మన లాంటి వాళ్ళము కొన్ని  విషయాలను మూఢనమ్మకాలు గా అనుకుంటూ ఉంటాం . ఒకటి మనం మేధావులం అని అనుకోని ఒప్పుకోకపోవడం  కావచ్చు , లేదా ఆ విషయాన్ని అర్థం చేసుకునే జ్ఞానం మనకు లేకపోవచ్చు . ఈ విషయంలో నాకు కళ్ళు తెరిపించే సంఘటన ఒకటి జరిగింది . 2019 Oct 3 వ తేదీన మా నాన్నగారు కాలం చేశారు. మూడవ రోజున చిన్న కార్యక్రమం చేస్తూ ఆయన అస్థికలు గోదావరి లో నిమజ్జనం చేసిన తర్వాత , ఆయనకు ఇష్టమైన ఆహార పదార్థాలు గోదావరి ఒడ్డున ఒక  ఆకు లో పెట్టాము.

• నేను  ఈ process అంతా  చూస్తున్నా..మనసులో మాత్రం ఇదంతా నిజమేనా ఆయన కాకి రూపం  లో తిరిగి ఆయనకి నచ్చనవి తింటారా ? అని చాలా logical గా , ఒక రకంగా తర్కంగా , ఇది ఎంతవరకు నిజమో చూద్దాం అని ఆలోచిస్తున్నాను.  ఆ ఆకులో,  ఆమ్లెట్, చారు అన్నం, స్వీట్, పప్పు, చికెన్, బిరియాని, పెరుగు, మటన్, పెట్టి ఒక 20 అడుగుల దూరంలో నిలబడ్డాం.

• మా నాన్నగారికి ఆమ్లెట్, చారు అన్నం, స్వీట్  బాగా ఇష్టం . ఇంట్లో కూడా భోజనం పెడితే ముందు ఆమ్లెట్ తినేవారు. ఆ సమయంలో అక్కడ నిలబడి నేను మనసులో ,భగవంతుడు ఉండటం నిజమే అయితే , ఇదంతా నిజం అయితే, వచ్చిన కాకి మొదట ఆమ్లెట్, తరువాత చారు అన్నం, తర్వాత స్వీట్ తినాలి , అని నేను మనసులో అనుకుంటూ పక్కనే ఉన్న మా మావయ్య తో, ఈ విషయం చెప్పి,  ఎంతవరకు ఇవన్నీ నిజమో చూద్దాం అన్నాను.

• అప్పటి వరకు ఒక్క కాకి కూడా లేని ఆ చోటులో , ఐదు నిమిషాల తర్వాత   సుమారుగా  ముప్పై కాకులు వరకు గుంపుగా వచ్చాయి.  ...చాలా ఆశ్చర్యం అనిపించింది . ఆ ఆకు కి మూడు అడుగుల దూరంలో కాకులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. నాలో ఒక తెలియని టెన్షన్ మొదలైంది  . ఒళ్లంతా వేడెక్కుతున్నట్టు , కాళ్లు వణుకుతున్నట్లు అనిపిస్తుంది .....ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ కాకుల  గుంపులోంచి , ఒకే ఒక కాకి ముందుకు వచ్చి ఆకు వైపు తీక్షణంగా ఒక నిమిషం చూసి ,  ఆమ్లెట్  తిన్నాది., తర్వాత అదే కాకీ చారు అన్నం , ఆ తర్వాత స్వీట్ తిని వెనక్కి వెళ్ళి పోయింది. ...ఆ తరువాత మిగిలిన కాకులన్ని  గుంపుగా ఆకు పై వాలి అన్ని పదార్థాలు తిన్నాయి . నాకు కళ్ళలోంచి నీళ్ళు తిరిగాయి . ఇదంతా ఈరోజు యాదృచ్చికంగా జరిగింది అని అనుకోవటానికి ఎంత మాత్రం వీలు లేదు . ఏదైనా మనకి కొన్ని స్వయంగా అనుభవాలు జరిగితేనే కొన్ని నమ్ముతాం  .

• మనం భగవంతుడిని విశ్వసించినా, ప్రార్థన చేస్తూ ఉన్నా మనలో ఉన్న అంధత్వం ఏదో ఒక మూల ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది . కానీ అదే భగవంతుడు మన వైపు ఒక్కసారి చూడడం మొదలు పెడితే మనలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటాయి . అందుకు చేయవలసినది ఒకటే శరీరము వేరు, ఆత్మ వేరు అని తెలుసుకోగలిగే జ్ఞాన స్థితి కలిగి ఉండటం .


YSR 8 May 21  3 30 pm

Wednesday, May 19, 2021

54. మనిషి కి దుఃఖం యోగమా... శాపమా

మనిషికి దుఃఖం యోగమా.... శాపమా



• పదిలం   పదిలం 
  మనసు  పదిలం ... మాట పదిలం.
• మెండైన  మనుషులకి
  నిండైన మనసు   కలిగిన వారెందరో.

• మనసు   మదన పడితే  
  మనిషివి  కాలేవు.
• మనిషివి   కాలేనపుడు   
  నిశి తోనే ,  నిశి లోనే (చీకటి)   జీవన పయనం.

• నిశిలో    నీ .. వు ...
  ఎంత  అందంగా   ఉంటావో   తెలుసా ...
• నిశి లో   కనిపించేవి   
  నీ ... లో ... చీకటి  కోణాలు.

☀️☀️☀️☀️☀️

• ఏ ... ఏం ... పాపం  చేసిందని 
  దుఃఖాన్ని   అసహ్యించుకుంటావు.

• బాహ్య  సమాజానికి 
  నిన్ను  పరిచయం చేసింది  నీ జన్మము అయితే ...

• నిన్ను   నీకు  పరిచయం   చేసేది  
  నీ  లోని   దుఃఖమే .
  అది   ఏనాడైనా  గమనించావా.

• నీ  లోని   సంతోషం  
  నిన్ను  ఊర్ధ్వం లోని   స్థాయి  స్థానాన్ని
  (external higher status,  position)     
  సమాజంలోని   నలుగురికీ   చూపిస్తే ...

• నీ లోని    దుఃఖం  
  నీ అంతర్ముఖ   పాతాళంలోని
  (Internal in depth personality)   
  కేంద్ర  బిందు స్థానం   నీకు చూపిస్తుంది.

☀️☀️☀️☀️☀️

• రెండు నేత్రాలతో   చూడడమే   
  బ్రతుకు  కాదు , 
  జీవితం   అంతకన్నా  కాదు .
  నీ పుట్టుకతో   మూసుకుపోయిన  
  మనోనేత్రం తో   (త్రినేత్రం)  సాధన  చేసి చూడు.
  నువ్వు ఏమిటో ... 
  నీ చుట్టూ ఉన్న వలయాలు ,
  ఏమిటో  స్పష్టంగా  కనిపిస్తాయి.

• అనుభవించు ,  అనుభవించు ,  
  తనివితీరా   అనుభవించు , 
  నీ లోని   దుఃఖాన్ని .
  దుఃఖం లోని   ధ్రృడత్వాన్ని   స్పృశిస్తే ,
  నీ అంత ధీరుడు ,  
  వీరుడు  ఉండడు ,   ఈ విశ్వంలో.

• కలవర  పడినంత   మాత్రాన 
  నీ కంటిలోని  వెలుగు   ఏమీ   కనుమరుగై పోదు.

• నీ  ఆలోచనలే    అలలైనపుడు ,
  కలలే   నీ జీవితం  మైనపుడు  ,
  చొరబడే   కడలి లా ...
  నీ కంటూ ఒక పౌర్ణమి ,    
  అమావాస్య   చీకట్లను   చీల్చుకుంటూ 
  దివ్యమైన   వెన్నెలతో   వస్తుంది.

☀️☀️☀️☀️☀️

• చెయ్   దుఃఖంతో   స్నేహం  చెయ్ ,
  దుఃఖాన్ని   ప్రేమించు ,
  నీ లో   జ్ఞాన జ్యోతిని   వెలిగిస్తుంది.
  కానీ,  దుఃఖానికి  మాత్రం  బానిసవి   కావద్దు.

• దుఃఖం  నీ లోని  శక్తిని   హరించడానికి  రాలేదు. 
  అది  నీ లో శక్తిని  సమన్వయం   చేయడానికి
  వచ్చింది,   నిశితంగా  గమనించి  చూడు. 

• సంతోషం ,  దుఃఖం   రెండు  ఒకటే .
  కానీ  అది గమనించ  లేకపోవడమే 
  నీ లోని "మాయ".

• ఆ  నీలకంఠు డే   
  గరళాన్ని   కంఠంలో  దాచుకుని ,
  దుఃఖాన్ని   దిగమింగి,  
  మౌన ముద్ర తో   లయ కారకుడయ్యాడు.
  ఏ  ఇది   నీకు  ఆదర్శం  కాదా .


యడ్ల శ్రీనివాసరావు  15 May 2021.



Tuesday, May 18, 2021

53. నా కోసం...ఓ మనసు

                   నా కోసం...ఓ మనసు



• సముద్రంలా గంభీరంగా ఉంటావు ...బాధలన్నీ నీలోనే దాచుకుంటావు.
• సెలయేరులా  స్వచ్ఛంగా చలాకీగా నీ స్నేహందిస్తావు.
• పర్వతంలా ఉన్నతమైనది నీ వ్యక్తిత్వం….
• ఆకాశంలా నిర్మలమైనది నీ మనసు …..
• ఏ ఉరుములు మెరుపులు నిను తాకలేవు.
• ఎడారిలో పూసిన మంచు పుష్పం నువ్వు….
• వేడిమి నువ్వు భరిస్తూ చల్లదనాన్ని మాకు పంచి ఇస్తావు.
• మంచి గంధానికి చల్లగాలి తోడైనట్టుంటుంది నీ స్నేహపరిమళం.
• ఎన్నో రంగులు... మరెన్నో సుగంధాలతో పూసింది నీ కవితా వనం ...అది అలసిన  మా మనసులకు పన్నీటి జల్లు.
• నీ కవితా గుచ్చం లో  , ఇది ఒక గడ్డిపువ్వు అనుకో....   


May 19 21

Friday, May 14, 2021

52. వ్యక్తిత్వం

వ్యక్తిత్వం




• మాట మంచిదైతే మర్యాద నిస్తుంది .
• మర్యాద సక్రమమైనదైతే గౌరవం తెస్తుంది.
• గౌరవం నిండుగా ఉంటే వ్యక్తిత్వం ఉన్నతమవుతుంది.
• ఉన్నత వ్యక్తిత్వం సత్ప్రవర్తనకు మాత్రమే సాధ్యం.
• సత్ప్రవర్తనకు మూలం వినయం, సహనం.
• వినయానికి, సహనానికి బీజం పరిమళమైన ఆలోచనలు.
• ఈ పారిజాతపు లక్షణాలన్నీ పరిమళమైన ఆలోచనాపరులందరి సొంతం.


YSR 14 May 21 8:30 pm.

Sunday, May 9, 2021

51. అమ్మకు వందనాలు

 🙏అమ్మకు వందనాలు 🙏

• అమ్మలను కన్న మా అమ్మ  ఆనంద రూపిణీ.
• అండ పిండ బ్రహ్మాండమ్ముల  క్షేత్ర స్వరూపిణి.
• సృష్టి కి మూలం నీవు.
• ప్రతిసృష్టి  కి మూలం నీవు.
• ప్రకృతిలోని  పులకరింతలు  నీ పరవశానికి  ప్రతిరూపాలు ... జగత్ జననీ.
• నిర్జీవాని కి   జీవం పోసే వసుధరణివి.
• జీవాన్ని నిర్జీవం చేసే  శత్రు సంహారి కాళికవి.
• శక్తికి బీజమైన భైరవి ...నీ దేహమంత  ఈ విశ్వంలో  అణువంత  భాగ్యులం  తల్లీ.
• క్షేత్రమున కానరాని దేదమ్మ నీ కంటికి.
• ప్రేమను పంచే పరమేశ్వరి .....కరుణ చూపే కాదంబరి ...లాలించే నీలాంబరి.
• నీ ఆగ్రహానికి  భీతిల్లే  నీ బిడ్డలం ....నీ అనుగ్రహం తోనే ఊపిరి పోసుకున్నాం.
• మూర్ఖత్వంతో ముదిరిన మా మస్తిష్కాలకి నీ మననం తో మురిపించు తల్లీ... ఓ జ్ఞాన ధాత్రి .
🙏🙏
క్షేత్రము = సమస్తము, విశ్వము, శరీరము.
మస్తిష్కము = మెదడు
మననం = జపించుట, ధ్యానం, పదే పదే తలచుట.

YSR 09 May 21 3:00 pm.

Monday, May 3, 2021

50. శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా

 
శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా ఆయనకు అంకితమిస్తూ 


* మీ ఆలోచనలే ఆయుధాలుగా 
* జీవం లేని జీవికి మీ మాటలే శ్వాస యై
* మీ ఊపిరే ఊరికి మేలుకొలుపై
* మీ మనసే సమాజానికి దిక్సూచి యై
* రాతి బాటంత దృఢత్వం మీ భావం 
* పర్వతాలను కరిగించే మీ పదముల పదును
* కత్తి  కాని  కలం మీ  ఆవేశం 
* రాజసాలకే  గోరీలు కట్టే మీ రాతలు 
* మా గుండెల్లో శాశ్వతమైన స్థానం మీ ప్రస్థానం
* ఉదయించే సూర్యుడు కూడా ఎదురు చూసేవాడు మీ రాతల కోసం
* ఆడంబర మే అసూయపడే  మీ నిరాడంబర మే నిలువెత్తు రూపం మీ వ్యక్తిత్వం . అది ఈ సృష్టికే తలమానికం . 
 🙏🙏🙏
YSR 1 May 21 3:30 pm

49. గుర్తింపు - మనిషికి వరమా - శాపమా - యోగమా - రోగమా


• 😎గుర్తింపు (Recognition) - మనిషికి వరమా -  శాపమా - యోగమా - రోగమా.🤔

• నా అంతర్ముఖ ప్రయాణం లో స్పష్టం గా కనిపించిన ఒక అంశం. 

• Recognition గుర్తింపు మనిషి జీవితంలో పుట్టిన దగ్గర నుండి పోయేవరకు చాలా ప్రాముఖ్యత తో కూడిన అంశం . అదే విధంగా మనిషి మానసిక  స్థితిని, జీవితాన్ని నిర్ణయించి శాసించే అంశం .


• బాల్యంలో ఊహ తెలిసిన నాటి నుండి  గుర్తింపు కోసం తపన ప్రారంభమవుతుంది . అది ఇంట్లో , బంధుమిత్రులలో  , బడిలో ఇలా ప్రతి చోటా చదువులో ఆటల్లో, గురువులతో , మాట తీరుతో , ప్రవర్తనతో, పోటీ వాతావరణంలో,  వేషధారణతో ఇలా ఎన్నో రకాల మార్గాలలో, తనను తాను బహిర్గతం చేసుకుని ఒక చిన్న గుర్తింపు కోసం మనిషి మనసు ఆరాటపడుతుంది .  జీవిత గమనంలో ప్రతి ఒక్కరికి ఇది చాలా సహజమైన ప్రక్రియ . ఈ  "గుర్తింపు" అనే అంశం  ద్వారా మనిషి మానసిక సంతోషం పొందుతూ ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటాడు. అదేవిధంగా  అభివృద్ధి చెందాలని ఆశిస్తాడు.

🌿🌿🌿🌿🌿

• బాల్యం నుండి కౌమరం లోకి వచ్చినపుడు "గుర్తింపు" తన దిశను మార్చుకుంటూ  , అందంగా ఆకర్షణీయంగా కనబడాలని,  వ్యతిరేక లింగ జాతి పట్ల  పరస్పర "గుర్తింపు" కోసం పరి విధాల ఆలోచనలు చేస్తూ , బహిరంగంగా చెప్పకపోయినా అంతర్గతంగా మనసు నిరంతరం  ఏదోఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది .


• యవ్వనంలో జీవిత స్థిరత్వం  పొందిన తర్వాత మనిషి తన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలని, ధనం బాగా సంపాదించాలని, కుటుంబ అవసరాలను తీర్చుకోవాలని, అనేక కోరికలతో కూడిన ప్రయాణం అలసి సొలసి ఉంటుంది.  మధ్య వయసుకు వచ్చిన మనిషికి జీవితంలో చాలా త్యాగాలు కూడా ఉంటాయి. అయినా మనిషి మనసు నిరంతరం కోరుకునేది "గుర్తింపు" ద్వారా మానసిక వికాసం.  మధ్య యవ్వనంలో , స్థిరపడిన తర్వాత పేరుప్రఖ్యాతులు సంపాదించాలి, సమాజం కోసం ఏదైనా చెయ్యాలి, తోటి వారికి సహాయ పడాలి, నాయకుడిగా ఎదగాలి  , నేనేంటో అందరికీ తెలియాలి ఇలా,  మనిషి తన సహజమైన అవసరాలకు,   తన సాధారణ  జీవితానికి భిన్నంగా  ఆలోచిస్తూ "గుర్తింపు" కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. కాస్త నిశితంగా ఆలోచిస్తే ఈ "గుర్తింపు" అనేది మానవ జీవితంలో ఒక భాగం మాత్రమే.  కొందరికి తాము కోరుకున్న  గుర్తింపు లభించినందుకు దానిని సఫలీకృతం చేసుకొంటారు. అంతవరకు బానే ఉంటుంది  . మరికొందరికీ ఈ "గుర్తింపు" అనేది ఒక వ్యసనంగా చేసుకొని దానికి బానిసలు గా తయారవుతారు. అందుకోసం తమ వ్యక్తిత్వాన్ని వదులుకొని, అడ్డదారులు తొక్కుతూ, ఒక మానసిక రోగి లా తయారై, చివరికి తమ ఉనికిని కోల్పోతారు. ఉదాహరణకు అప్పటివరకు ఎంతో విలాసవంతమైన  లేదా ప్రాముఖ్యత తో కూడిన జీవితం గడిపిన రాజకీయ నాయకులు, ప్రముఖులు, తమకున్న అధికారం, హోదా, సదుపాయాలు అన్నీ కోల్పోయాక , సర్వం కోల్పోయినట్లు అవమానభారంతో ఆత్మన్యూనతతో  జీవితాన్ని వదిలేసుకుంటారు. 

🌿🌿🌿🌿🌿

• మరికొంతమంది పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది జీవితంలో ఏనాడు ఎంత ప్రయత్నించినా ఏ గుర్తింపు దొరకక అడ్డదారులు తొక్కుతూ , సంతోషంగా ఉన్న సాటి వారిని హింసిస్తూ , వారికి లభించని ప్రాముఖ్యత ఇతరులకు లభిస్తుందని అసూయతో దిగజారుతూ , లేనిపోని అభాండాలు, నిందలు  వేస్తూ మానసిక రోగుల  (psycho) వలే ప్రవర్తిస్తూ ఉంటారు . వీరి జీవితం అంతా నీతిమాలిన తనం తోనే ఉంటుంది.  

ఇదే రకమైన విధానంలో అంటే వ్యక్తిగత  గుర్తింపు లభించని కొంతమంది తమ సాటి బంధుమిత్రులలో, తమ పొరుగు వారి లో  తమను తాము చూసుకుంటూ సంతృప్తి పొందుతూ ఒక మంచి ఆకర్షణ శక్తితో సంతోషంతో ఉంటూ ఉంటారు .

💦💦💦💦💦

• ఒక్క మాట చెప్పాలంటే ఈ "గుర్తింపు" అనేది ఒక  "మాయ".

• మనిషి చేసే కర్మలో భాగంగా ప్రకృతి మరియు భగవంతుడు సహజసిద్ధమైన గుర్తింపు ఇస్తూ ఉంటాడు. ఆ గుర్తింపు మంచి అయినా లేక చెడు అయినా కావచ్చు . "గుర్తింపు"  లభించడం అనేది కర్మ ఫలితం లో భాగమే కానీ...."గుర్తింపు"  కోసమే కర్మలు చేయడం అనేది దౌర్భాగ్యం, అమానుషం.  గుర్తింపు కోసమే  మనిషి జీవించడం అనేది ఒక మానసిక చపలత్వం.

☀️☀️☀️☀️☀️

• నీటి బుడగ లాంటి మనిషి జీవితానికి,  ఎన్ని అలంకారాలు చేసినా,  ఎన్ని మెరుగులు దిద్దినా, ఎన్ని రంగులు వేసినా  అది తాత్కాలికమే. 

• మనిషికి నిజమైన గుర్తింపు అనేది  "ఆ మనిషి జీవించి లేక పోయిన తరువాత కూడా  ఎంతోమంది  మనసుల్లో  నివసిస్తూంటారు" . అది అసలు సిసలైన శాశ్వతమైన " గుర్తింపు ".  ఇది ప్రయత్నిస్తే దొరికేది కాదు . భగవంతుడు నిన్ను కారణభూతుడు గా నిర్ణయించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఇచ్చేది , తిరిగి తీసుకునేది భగవంతుడే.

• మనిషి ఔనన్నా, కాదన్నా అంతర్మథనం లో ప్రతీ దశలో గుర్తింపు కోసం సకలవిధాల యత్నాలు చేస్తునే ఉంటాడు. ఎందుకంటే అది మానసికమైన లక్షణం. ఏనాడైతే ఈ లక్షణానికి  అతీతవుతాడో , వారే చరిత్రలో చిరకాలం నిలిచి పోతారు. ఉదాహరణకు శ్రీ శ్రీ గారు, శ్రీ పొట్టిశ్రీరాములు గారు, శ్రీ కందుకూరి గారు ఇలా ఎంతోమంది మేధావులు నేటికి  ఎంతో మంది మనసుల్లో బ్రతికే ఉన్నారు. వీరు చేసిన కర్మలు(కార్యక్రమాలు) ఫలితం ఆశిస్తూ చేసినవి కావు. 

• అందుకే ఓ మనిషి నీ గురించి నువ్వు తెలుసుకో, ఈ సృష్టిలో  నీ స్థానం,  బాధ్యత ఏమిటో గుర్తించుకో,  అదే నీకు భగవంతుడు ఇచ్చిన చెదరని చెరగని  "గుర్తింపు".

యడ్ల శ్రీనివాసరావు 3 May 2021 11:30 am.



761. గురువు - జ్ఞానం మనిషి కి అవసరమా?

గురువు . . . జ్ఞానం మనిషి కి అవసరమా?   గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః    గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై  శ్రీ గురవే నమః  • భగవంతు...