ఆలోచనల కోణం
• ప్రతి మనిషి యొక్క నడక, ప్రవర్తన పూర్తిగా ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. అటువంటప్పుడు మనిషి అనుక్షణం తాను చేసే ఆలోచనలను గమనించ గలుగుతున్నాడా … తన ఆలోచనల లో వాస్తవం ఎంత, స్పెక్యులేషన్ ఎంత అనే నిజం తన స్పృహ లో ఉంటుందా.
• నీ ఆలోచనలు నీ కోణం లోనే ఉంటున్నాయా … లేక ఆ పరిధి దాటి, వేరే కోణం లో ఆలోచించ గలుగుతున్నావా? ఎందుకంటే నీ ఆలోచనలు నువు చూస్తున్న దృష్టి తో ఉంటే కనుక , నీ చూపు దృష్టి ఎంతవరకో అంతే నీ ఆలోచన. ఇందులో అంతా కరెక్ట్ అని అనుకుంటే , భంగపాటు తప్పదు.
• నీ ఆలోచనలు వేరే కోణం లో, మరో కోణం లో ఉన్నప్పుడు మాత్రమే సత్యం, వాస్తవం గ్రహించగలవు.
• ఉదాహరణకు నేల పై నిలబడి ఒక సాధారణ కొండను చూస్తే, కొండ ఎత్తుగా కనిపించవచ్చు కానీ కొండ మీద ఏమేమి ఉన్నాయో తెలియవు.
కానీ అదే నేల పై నిలబడి , కాసేపు కళ్లు మూసుకుని, నేను ఇప్పుడు ఈ కొండపై నిలబడి ఉన్నాను, అనే బలమైన సంకేతం నీ మనసు కి ఇచ్చినప్పుడు, కొండపై ఉన్న అణువణువు స్పష్టంగా కనిపిస్తుంది, తెలుస్తుంది.
దీని కోసం కొండ ఎక్కనవసరం లేదు. కేవలం దృష్టి కోణం మార్చుకుంటే సరిపోతుంది.
• ఇక్కడ దృష్టి కోణం అనేది ఊహ కాదు. నువ్వు ఇదివరకే ఎన్నో కొండలు గత జన్మల లో గాని, ఒక ప్రయాణంలో గాని, టి.వి సినిమా లలో కానీ చాలా స్పష్టం గా చూసి ఉంటావు. కాకపోతే అది నీకు అనవసరం అని మరచిపోతావు అంతే.
• అదే విధంగా, నీవు ఇది వరకే ఎన్నో జన్మలు ఎత్తావు. ఎన్నో అనుభవాలను చవిచూసావు. కానీ ఒక జన్మ నుంచి మరొక జన్మ కి రాగానే అవి మర్చిపోతున్నావు. …
కానీ కొన్ని సార్లు, ఇదే విషయం పై చాలా మంది కి ఇలా అనిపిస్తూ ఉంటుంది...
ఈ సంఘటన ఇది వరకే ఎప్పుడో జరిగిపోయినట్లు, ఇంతకు ముందు ఎప్పుడో ఒక అంశం లో అనుభవం పొంది మాస్టర్ గా అయినట్లు అనిపిస్తుంది. …
అవును అది నిజం. గత జన్మల లో అనుభవాలతో నువ్వు ప్రావీణ్యం సంపాదించిన అంశాలు, నేటి జన్మలో అవి నీకు సునాయాసంగా అనిపిస్తాయి.
• చెప్పాలంటే, ప్రతి మనిషి జన్మ జన్మలు గా ఎన్నో ఎన్నెన్నో అంశాలలో అనుభవం, ప్రావీణ్యం సంపాదించి ఉంటాడు. వీటిని టాలెంట్స్ అని కూడా అంటారు. కానీ నేటి సమయ కాలం లో, అంటే ఈ లోకంలో ప్రస్తుతం కంటికి కనపడే దాని గురించే చూస్తూ ఆలోచిస్తూ ఉండడం వలన, నీలో దాగి ఉన్న అనుభవాలను నీ కోసం నీవు ఉపయోగించుకోలేక అయోమయ స్థితిలో ఉంటున్నావు.
• మరి, నా హిడెన్ టాలెంట్స్ నాకు ఎలా తెలుస్తాయి అనుకుంటే …. రోజూ కొంత సమయం నీతో నువ్వు ఏకాంతం గా ఉండు, ఎవరి గురించి ఆలోచించ వద్దు. ఇంకా నీలో నువ్వు కొంత మాట్లాడం నేర్చుకో. … ఇది పిచ్చి తనం కాదు. నిన్ను విశ్వానికి అనుసంధానం చేసే దివ్యమైన విధానం. కానీ ఈ సమయంలో పూర్తిగా నిర్జనంగా ప్రశాంతంగా ఉండాలి.
• మనిషి, … నీవు ఒక శక్తి వి. ఆ విషయం మరచి, అది ఆలోచన చేయకుండా, ఈ మాయ లోకం లో పడి నిన్ను నువ్వు మర్చిపోయి , నువ్వు శక్తి కోసం ఇతరులపై లేదా సాధనాల పై ఆధారపడుతున్నావు.
• నీ లో అనేక జన్మల అనుభవం , అనేక అంశాల ప్రావీణ్యం నిధి వలే దాగి ఉంది. ఒక్కసారి దానిని, నేటి నీ జీవనానికి ఉపయోగించుకో , నువ్వు గొప్ప స్థితికి వెళ్లినా వెళ్లకపోయినా మాత్రం నీ ప్రస్తుతం ఉన్న స్థితి లో మంచి మార్పు వస్తుంది. …
• ఇదంతా కేవలం ఆలోచనల తో జరిగే అభ్యాసం. ఇకనైనా నీవు ఇప్పటి వరకు ఆలోచించే కోణం నుంచి ఒకింత పక్కకు జరిగి, లేదా ఎదురుగా వెళ్లి మరో కోణం లో ఆలోచించడం అలవాటు చేసుకో. ఇలా చేయడం వలన మూఢ నమ్మకాలు తొలగుతాయి, వాస్తవం తెలుస్తుంది.
• తెల్లని కాంతి ఒక ప్రిజం లో ప్రసరించేటపుడు, సప్త వర్ణాలుగా మారుతుంది. అదే విధంగా నీవు ఆలోచించే ఆలోచనలను ముందు శూన్య స్థితి వరకు తీసుకువెళ్ళు (అంటే మౌనం గా కళ్లు మూసుకుని, ఏ ఆలోచన లేకుండా ప్రతీ రోజు ఒక అరగంట గడపడం) అప్పుడు అక్కడ నుంచి, గత జన్మల అనుభవాలతో నిల్వ ఉన్న ఆలోచనలు ప్రేరేపితం అయి, నీకు నీలో మరో కోణాన్ని పరిచయం చేస్తాయి. శూన్యం ద్వారా ఆరంభమైన ఆలోచనలు సత్యమైనవి. నీ లోని అవకతవకలను నీకు స్పష్టం గా తెలియచేస్తాయి. నిన్ను నీ గమ్యానికి సులభంగా , తెలివిగా చేర్చేవి గా ఉంటాయి.
• మనిషి… ఒకసారి ఆలోచించు, ఈ జన్మలో నీవు 40, 50, 60 సంవత్సరాల వయసు తో ఎన్నో అనుభవాలు పొంది ఉంటావు. అదే నీవు, ఇదివరకే ఇలాంటి ఎన్నో జన్మలు తీసుకొని ఉన్నావు, అంటే నీ వయసు ఎన్ని వందల సంవత్సరాలో ఒకసారి ఆలోచించు… దానిని బట్టి, నీకు నీ జీవితం, భవిష్యత్తు పట్ల నీకు ఎంత అనుభవం ఉందో ఆలోచించు….
ఆలోచిస్తే పోయేది ఏమీ లేదు.
• అంతా, నీ లోనే, నీ తోనే ఉంచుకొని అయోమయం గా , ఏమీ తెలియని తనంతో ఉన్న నిన్ను చూస్తుంటే బాధగా అనిపిస్తుంది.
యడ్ల శ్రీనివాసరావు
13 Jan 2025. 8:00 AM.
Tirumal express …
on the way to my school.
This is Saturn Ketu scenario.
No comments:
Post a Comment