కలియుగ కురుక్షేత్రం
• కురుక్షేత్రం ఎక్కడ జరిగింది అంటే, వెంటనే మనం అనుకునేది మహాభారతం లో అని. ఇంకా అది పాండవులకు, కౌరవులకు జరిగిన యుద్ధం అని అనుకుంటాం.
పాండవులు అయిదుగురు. కౌరవులు వంద మంది. వీరంతా కలిసి ఒక ప్రదేశంలో మహ సంగ్రామం చేశారు , అదే కురుక్షేత్రం. ఈ యుద్ధం జరగడానికి , జరగడం లో ఎన్నో నాటకీయ మలుపులు, ఎత్తులు, పై ఎత్తులు, అనేక మంది పాత్రలు , సంఘటనలు కధలు కధలు గా ఇమిడి ఉంటాయి.
• చివరికి ఫలితం ఏమిటి అంటే మంచి అనేది భగవంతుని శక్తి సహాయం తో విజయం సాధిస్తుంది , అదే పాండవ జయం. చెడు చివరికి ఓడిపోతుంది, అదే కౌరవ అపజయం. కానీ గమనిస్తే , మంచి కూడా చెడు కి ప్రలోభ మైన సందర్బం లోనే ఈ యుద్ధం ఆవిర్భవించింది అనేది ఇందులో సూక్ష్మం గా దాగి ఉన్న రహస్యం. దీనినే చదరంగం ఆట అంటారు.
• మంచి అంటే ధర్మ యుక్తం గా ఉండే ధర్మరాజుకు జూదం అనే బలహీనత వలన , భార్యను తనఖా పెట్టడం వంటి అనేక అంశాలు గమనార్హం.
• అంటే రామాయణ, భారతాలు స్తీ ప్రధాన భూమిక తో జరిగాయి. సహజంగా అందరూ తరచూ మాట్లాడే ఒక మాట , స్త్రీ వలన యుద్ధాలు జరుగుతాయి . సర్వ సంబంధాలు తగలపడిపోతాయి , వినాశనం జరుగుతుందని అంటారు. ఇలా మాట్లాడే వారి ఆలోచన అంత వరకే అని నా అభిప్రాయం. అంతకు మించి ఆలోచించడం వారికి తెలియక పోవచ్చు.
కానీ రామాయణ , భారత యుద్ధాల లో చివరికి ధర్మం విజయం సాధిస్తుంది. అందుకు ఆ స్త్రీ యే కారకత్వం మరియు మూలం , అనే విషయం ఎవరూ గ్రహించలేరు. ఇది వారి అవగాహన లోపం.
• కౌరవులు కూడా తనకు సోదరులే అని వారిపై యుద్ధం చేయనని అర్జునుడు అన్నపుడు సత్య యుగపు రాజకుమారుడైన శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత (శివ పరమాత్ముని జ్ఞానం) ఈ సృష్టి యొక్క మూల రచన.
చంపు వారెవరూ, చనిపోయే వారెవరు ధర్మం కోసం నీ కర్మ (పని) నువు చెయ్యి అంటూ శ్రీకృష్ణుడు, అర్జునునికి ఉపదేశించిన సందర్భం గీతా భోధన.
• కొందరు శ్రీకృష్ణుడే పరమాత్ముడు , భగవద్గీత యొక్క సృష్టి కర్త అని అనుకుంటారు. కానీ వాస్తవానికి విశ్వ సృష్టి కర్త శివుడు. ఆయన రచన అయిన భగవద్గీత ను శ్రీకృష్ణుడు తన దివ్య శక్తి తో బోధిస్తాడు. మరో విషయం గమనిస్తే , భగవద్గీత ను శ్రీకృష్ణుడు బోధించే వాక్యాల లో భగవానువాచ (భగవంతుడు చెప్పిన మాట) అంటాడు కాని, శ్రీకృష్ణ ఉవాచ అని అనడు. కేవలం “భగవంతుడు మాత్రమే నేనే భగవంతుడిని అని చెప్పగలడు”. అతడే శివుడు. పరమాత్ముడు. ఇది గమనించ వలసిన అంశం.
• ఇకపోతే కురుక్షేత్రం అంటే ఎక్కడో, ఎప్పడో జరిగింది కాదు. నేటికీ నిత్యం జరుగుతూనే ఉంది. మనిషి మనసే ఒక కురుక్షేత్రం , అనుక్షణం మనసు లో జరిగే యుద్దమే కౌరవ యుద్ధం.
• పాండవులు అంటే శరీరం యొక్క పంచ కర్మేంద్రియాలు. అవి నిర్వర్తించ వలసినది శరీర ధర్మం. శరీర భాధ్యతలు.
కర్మేంద్రియాలు ధర్మం యుక్తం గా ఆధీనంలో పని (కర్మ) చేస్తూ ఉండాలి. పంచేంద్రియాలు నియంత్రణ తో , నిగ్రహము కలిగి ఉన్న వారే దేవతా స్వరూపాలు(పాండవులు).
అవే కర్మేంద్రియాలు అధర్మ యుక్తమై నియంత్రణ , నిగ్రహం కోల్పోయి , ఆధీనంలో లేకపోతే వికర్మలు చేయడం జరుగుతుంది. ఆ వికర్మలే వికారాలు అయిన అసుర స్వరూపాలు (కౌరవులు).
• ధర్మం (ధర్మరాజు), దేహ బలం (భీముడు), బుద్ధి బలం (అర్జునుడు), ఓర్పు (నకులుడు) , సహాయం , సహయోగం (సహదేవుడు).
ధర్మం ఆచరించినపుడు కర్మేంద్రియాలు దేహాన్ని , బుద్ధిని ఆధీనంలో ఉంచి, ఓర్పు సహయతలు కలిగి ఉండడం జరుగుతుంది. ఇవి దేవతా లక్షణాలు. ఇదే పాండవ శక్తి సైన్యం.
• పంచ కర్మేంద్రియాలు.
నేత్రం - దృష్టి , చెవి - వినుట , నోరు , నాలుక - మాట, రుచి , నాసిక - శ్వాస , వాసన , చర్మం - స్పర్శ
🌹🌹🌹🌹🌹
• కౌరవులు. అనగా వికర్మలు (చెడు పనులు), వికారాలు. ఇవి వందరకాలు గా ఉంటాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యము, స్వార్దం, ఈర్ష్య, అసూయ , పైశాచికత్వం, మోసం , ద్రోహం, నయవంచన , అసభ్యత , కిరాతకం, దౌర్జన్యం, మానభంగం, దొంగతనం , అబద్ధం, నికృష్టం, వెకిలి చేష్టలు మాటలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. ఈ కౌరవులు అనే వికారాలు నిత్యం, అనుక్షణం మనిషి మనసు ని ఆకర్షిస్తూ ఉంటాయి, తిరిగి యుద్ధం చేస్తూనే ఉంటాయి.
• ఏ యే వికర్మలు , వికారాల ప్రభావం వలన ఏ నష్టం ఎలా జరుగుతుందో రామాయణం , భారతంలో పాత్రలతో చక్కగా కధలు కధలు గా వివరించడం జరిగింది. ఎందుకంటే, అది తెలుసుకోవడం వలన మనిషి అధర్మం గా ఉండకుండా ధర్మం ఆచరిస్తాడు అనే సదుద్దేశం. కానీ దురదృష్టం ఏమిటంటే వాటిని కేవలం కధలు గా వింటున్నారు, చూస్తున్నారు.
నిత్యం మనిషికి తన జీవితంలో జరిగేది కురుక్షేత్ర సంగ్రామం , రావణ యుద్ధం అని గ్రహించలేక పోతున్నాడు. అదే దురదృష్టం.
• అన్నింటికీ కారణం మనసు. మనసు ని పూర్తిగా ఆధీనంలో ఉంచుకోవటం అనేది సత్య యుగంలో పూర్తిగా , మరియు త్రేతా యుగములో కొంత కాలం వరకు జరిగింది. ఆ తరువాత ద్వాపర , కలియుగాల లో క్రమేపీ అది పూర్తిగా విఫలం అయింది. రాబోయే యుగాలలో ఇది ఇలా జరుగుతుంది అనే విషయం దివ్య శక్తి, జ్ఞానం తో గ్రహించిన ఆనాటి యోగులు , రాబోయే యుగాల లోక కళ్యాణం కోసం ఇవన్నీ పురాణ ఇతిహాసాలు గా పొందు పరిచారు.
• నేటి కాలంలో ప్రతీ మనిషి మనసు లో కురుక్షేత్ర యుద్ధం జరగడం లేదంటారా .... చెప్పండి.
ప్రతి ఇల్లు ఎంతో కొంత తరచూ ఒక రణరంగ మైదానం గా లేదంటారా? ... ఆలోచించండి.
ఒకే కుటుంబం లో ఉన్న భార్య భర్త, పిల్లలు, తల్లి తండ్రి , అత్త మామ , కోడలు మధ్య సఖ్యత లోపించి ఒకరంటే ఒకరికి పడక అశాంతి తో జీవనం గడుపుతున్న రోజులు ఇవి …… కాదనగలరా?.
ఏ ఒక్కరైనా మేము దీనికి అతీతంగా జీవిస్తున్నాం అని అనగలరా ?.... మనస్సాక్షి తో ఆలోచిస్తే తెలుస్తుంది.
వీటికి అలవాటు పడి పడి , చేసేది ఏమి లేక ఇదంతా సహజం, జీవితం అంటే ఇంతే లే , అనే మానసిక దృక్పథం (mind set) అలవాటు చేసుకొని ....
హ , లోకం లో అందరూ ఇంతే లే , ఇంత కంటే గొప్ప గా ఎవరుంటారు అని సరిపెట్టుకోవాల్సిన స్థితి నేడు మనిషి జీవితంలో నడుస్తుంది ..... కాదనగలరా ?...... మరి ఆలోచిస్తే , మన పూర్వీకులు మనలాగే ఇలాగే జీవించారా ?.
☘️☘️☘️☘️☘️☘️
• ఎవరైనా చనిపోతే స్వర్గస్తులైనారు అంటారు. అంటే దాని అర్థం స్వర్గానికి వెళ్ళాడు అని. అంటే అతడు బ్రతికి ఉన్నన్నాళ్లు నరకం లోనే జీవించాడు , చనిపోయాక స్వర్గానికి వెళ్ళాడు అనే కదా అర్దం.
ఇది నిజం , నరకం అనేది ప్రస్తుతం మనం జీవిస్తున్న, ఈ భూమి మీదే ఉంది. మనిషి తన స్పృహ కి (contiousness) తెలియకుండా నే, తన ఆత్మ (soul) ద్వారా ఆ సత్యాన్ని ఎన్నో సందర్భాలలో పలుకుతూనే ఉన్నాడు.
☘️☘️☘️☘️☘️☘️
• ఎవరైనా విపరీతమైన దుఃఖం, బాధ తో ఏడుస్తూ ఉన్నప్పుడు తెలియకుండా నే , నా కర్మ నా కర్మ అంటూ నుదిటి ని చేతితో కొట్టుకుంటారు. ఇది నిత్యం చాలా చోట్ల చూస్తుంటాం. గమనిస్తే , వారు తమ చేయి, భుజం, ఇలా మరే ఇతర భాగం లోను కొట్టుకోరు. ఎందుకంటే ఆత్మ ఉండేది నుదిటి మధ్య లో , ఈ విషయం మనలో ఉన్న ఆత్మ కి తెలుసు , కానీ మన శరీర స్పృహ కి తెలియదు ….. ఆ దుఃఖం తో తల బాదుకునే చర్య చేసేది ఆత్మే కానీ , మనిషి శరీరం కాదు. ఆత్మే అక్కడ దుఖిస్తుంది. ఏ మనిషి తాను దేహభిమానం విడవ నంతవరకు ఈ విషయాలను అర్దం చేసుకోలేడు మరియు గ్రహించ లేడు.
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 19 Jan 2025 , 10:00 PM.
No comments:
Post a Comment