Tuesday, January 21, 2025

589. వృద్ధాప్యం

 

వృద్ధాప్యం




• సహజంగా  మనకి   తెలిసిన వృద్ధాప్యం అంటే ముసలి తనం.   అంతకు మించి వేరే అర్దం, భావం మనకు తెలియదు.  మనం పుట్టిన తరువాత, చివర అనుభవించే  వయసు యొక్క  దశ ను   వృద్ధాప్యం అంటాం.  కానీ వాస్తవానికి వృద్ధాప్యం అంటే నిజమైన అర్దం ముసలి తనం కాదు.


  వృద్ధాప్యం  అంటే   వృద్ధి + ఆప్యం.

  వృద్ధి  అనగా   శుభకరం గా పెరిగినది (Growth ) లేదా అభివృద్ధి అయినది (Developed ) అని అర్థం.

  ఆప్యం అనగా జలమయం అని అర్థం.


• బాగా పెరిగినది జలమయం కావడం వృద్ధాప్యం.

 అనగా ఎదిగిన మనిషి జలమయం అవవలసిన తరుణం అనేదే  వృద్ధాప్యం  అనే పదం  యొక్క వాస్తవ   సూక్ష్మార్థం.


 చనిపోయిన తరువాత మనిషి ని దహనం చేసి అస్థికలు చివరకు నదిలోనే కలుపుతారు . అదే జలమయం.


• మనిషి కి   మరణం అంటే భయం.  అంగీకరించ లేడు. ఎందుకంటే  బ్రతుకు మీద తీపి. ఎన్ని బాధలు పడుతున్నా,  అనారోగ్య సమస్యలు, ఇబ్బందులతో ఉన్నా,   వయసు మీరి పోయి   ఊపిరి  ఆడని స్థితిలో ఉన్నా సరే   మరణం అంటే భయం.  మరణాన్ని అంగీకరించడు.

  ఒకవేళ  ఏనాడైనా  నేను చనిపోతే బాగుణ్ణు అని మాట  వరుసకు పైకి  ఎప్పుడైనా  ఎక్కడైనా అనినా గానీ,  ఆమాట మనస్ఫూర్తిగా లోపలి నుంచి మాత్రం రాదు.

   కానీ వృద్ధాప్యం అనే మాట,  ఏం చెపుతుంది అంటే నీ దేహం   జలమయం  కావలసిన  సమయం ఇది, తెలుసుకొని   సిద్ధమై  ఉండు  అని చెపుతుంది.


• కొన్ని సార్లు   ఇటువంటి పదములకు  సంబంధించిన వాస్తవ  అర్థం    మనిషి   తెలుసుకోవడం   మరియు అభ్యసించడం వలన ,  మనసు మానసికంగా సిద్ధం అయి,   సన్నద్ధం గా  అంగీకార ప్రదం గా అవుతాం. వృద్ధాప్య   దశకి  వచ్ఛాక , నా దేహం ఇక జలమయం. ఆ దశలో   నేను   ప్రస్తుతం  ఉన్నాను   అనే వాస్తవం స్పృహ లో   బలంగా   ఉంటే   మనిషి శరీరం వదిలే సమయంలో   యాతన ఉండదు.  అంటే మరణాన్ని సంతోషంగా  ఆహ్వానించడం  జరుగుతుంది. అది సహజం గా ఉంటుంది.   ఎలా అంటే,  పండిన కాయ చెట్టు నుంచి   దానంతట  అదే  సహజంగా  ఏ నొప్పి లేకుండా   రాలిపోయిన  విధంగా  ఉంటుంది.  ఇది తిరిగి  మనిషి  సుఖవంతమైన   జన్మ  పొందడానికి తొలి  మెట్టు.


• అలా   కాకుండా   ఆ వయసు లో    ఇంకా   భీతి, మమకారం,   వ్యామోహం   ఇంకా  ఏదోక భౌతిక వ్యాపకం పట్టుకొని  వేలాడడం   ఉదాహరణకు డబ్బు, బంధాలపై   ప్రీతి వంటివి  కనుక ఉంటే,    పండిన కాయ   బలవంతంగా   త్రుంచి వేయబడుతుంది. త్రుంచి  వేసేటప్పుడు  పెనుగులాట,  నొప్పి తప్పదు.


• అంటే దీని అర్థం …. ఆత్మ,    శరీరం  వదిలి సహజంగా   సంతోషంగా  వెళితే   మరలా  మంచి  శరీరం తో   జన్మ తీసుకుంటుంది.  అలా   కాకుండా  ఆత్మ   శరీరం పట్టుకొని   ఇంకా వేలాడుతాను   అంటే యాతన తప్పదు.

  వృద్ధాప్యం అంటే    Green signal for Death, Be ready for any time అని భగవంతుడు చెప్పిన  సత్యం. 


• ఈ వృద్ధాప్యం తో    మన కుటుంబం లో,  సమాజం లో ,  బంధువుల లో   అనేకులు   జీవనం సాగిస్తారు. (మనం కూడా).   వృద్ధులు  కొన్ని  విధాలు గా బలహీనం గా   ఉంటారు.  వారికి   తప్పని సరిగా  కుటుంబీకులు  మరియు  సాటి మనిషి తోడు గా నిలవాలి,   వారితో  నిత్యం కొంత సమయం గడపాలి. వారిని సంతోష పరచాలి.  వృద్ధులు మరియు పసి పిల్లలు  వద్ధ   పాజిటివ్ ఎనర్జీ (శుభ శక్తి) ఉంటుంది. ఎందుకంటే  వీరి మనసు లలో  కల్మషం  అనేది నిలిచి ఉండదు.   వీరి  శుభాశీస్సులు  పొందడం మిగిలిన వారికి,   తర  తరాల వారికి    శ్రేయస్కరం.

• నేటి కాలంలో   వృద్ధులను  తమ  పిల్లలు పట్టించుకోని   తల్లి తండ్రులు  కోకొల్లలు.   వారిని చూడ లేక   వృద్ధాశ్రమాలలో  ఉంచుతున్నారు. ఇది మహా పాపం.   మనం ఏది ఎలా చేస్తే   అదే తిరిగి మనకు వస్తుంది.   మనల్ని  పసితనం లో  మన  తల్లి తండ్రులు  ఎంత ప్రేమ గా   సంరక్షణ చేసే  వారో గుర్తు చేసుకుని,   అదే విధంగా  వృద్ధులైన  తల్లి తండ్రులను సంరక్షించాలి.   మనం చిన్న పిల్లలు గా  ఉన్న సమయంలో   తల్లి తండ్రులను  ఎలా విసింగించామో  అలా కొన్ని సార్లు   వృద్ధులు  కూడా విసిగిస్తారు.  ఇది ఒక  మానసిక  అనారోగ్యపు సమస్య,   అది అర్దం  చేసుకోవాలి   కానీ వారిపై కసురుకో  కూడదు.


• ఇదంతా   ఒక వాస్తవిక  మానసిక  అవగాహన కలిగించే   సదుద్దేశంతో  మాత్రమే రాయడం జరిగింది. కానీ  ఎవరిని భయభ్రాంతులకు,  అభద్రత  భావానికి గురి  చెయ్యడానికి  కాదు.


  ఓం నమఃశివాయ 🙏

  ఓం శాంతి 

  యడ్ల శ్రీనివాసరావు 21 Jan 2025, 11:30 PM .





No comments:

Post a Comment

589. వృద్ధాప్యం

  వృద్ధాప్యం • సహజంగా  మనకి   తెలిసిన వృద్ధాప్యం అంటే ముసలి తనం.   అంతకు మించి వేరే అర్దం, భావం మనకు తెలియదు.  మనం పుట్టిన తరువాత, చివర అ...